Homeఅంతర్జాతీయంVivek Ramaswamy: ఎవరీ వివేక్ రామస్వామి? అగ్రరాజ్యం అధ్యక్ష పీఠంపైనే గురి!

Vivek Ramaswamy: ఎవరీ వివేక్ రామస్వామి? అగ్రరాజ్యం అధ్యక్ష పీఠంపైనే గురి!

ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలలో సైతం పెద్ద పెద్ద పదవులకు భారత సంతతికి చెందిన వారు పోటీ పడుతున్నారు. వారి ద్వారా ప్రజారంజకమైన పాలన అందుతోంది. చాలా దేశాలలో మనవారి ఘనత ఎల్లెడలా వ్యాపిస్తోంది. మొన్న మొన్నటి బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ విషయాన్ని తీసుకున్నా, నిన్నటి అమెరికా డిప్యూటీ ప్రెసిడెంట్ కమలా హారీస్ విషయాన్ని తీసుకున్నా అది స్పష్టంగా రుజువవుతోంది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అక్కడ కూడా మనవాళ్లు పోటీలో ఉన్నారు. నిక్కీ హేలీ సహా, వివేక్ రామస్వామి లాంటి వారు తెల్లవారితో సమానంగా ధీటుగా ప్రచారం మొదలుపెట్టారు. అమెరికా దేశం వలసల దేశం అక్కడెవరూ అమెరికా దేశస్థులు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వలసలు వచ్చినవారితో అమెరికా నిర్మితమైంది. అయితే తెల్లవారి ఆధిపత్యం కారణంగా కొన్ని వందల సంవత్సరాలుగా నల్లవాల్లను అణచివేసారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. నల్లవారు కూడా తెల్లవారికన్నా ధీటుగా రాజ్యపాలన చేస్తున్నారు. బరాక్ ఒబామా పరిపాలన అందుకు సాక్షంగా తీసుకోవచ్చు. అదే ఒరవడిలో ఇప్పుడు భారత సంతతికి చెందిన వారు కూడా అమెరికాను పాలించే అన్న వ్యవస్థల్లో, అన్ని విభాగాలలో మమేకమైపోయారు. ఈ నేపథ్యంలో వివేక్ రామస్వామి గురించి ఈ రోజటి ఇండెప్త్ లో మనం చూడబోతున్నాం..నిక్కి హేలీ తాను అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నానని ప్రకటన చేసిన తరువాత రామస్వామి కూడా రంగంలోకి దిగారు. తాను కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా పెద్ద ఎత్తున ప్రారంభమయింది. డొనాల్డ్ ట్రంప్ అయితే మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని గత ఏడాది కాలంగా ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ట్రంప్ తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఇక రిపబ్లిక్ పార్టీ నుంచి ఈసారి అధ్యక్ష పదవికి అనేక మంది పోటీ పడుతున్నారు. అందులో భారతీయ మూలాలనున్న యువకుడు రామస్వామి. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన వివేక్ రామస్వామి తాను కూడా అమెరికన్ అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు. వీరు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండాలంటేఅంతకు ముందు వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో నిలిచి గెలవాల్సి ఉంటుంది. ఇందుకోసమే అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన మూలాలున్న వ్యక్తి వివేక్ రామస్వామి. ఆయన వయసు కేవలం 37 సంవత్సరాలు మాత్రమే. రామస్వామి తల్లిదండ్రులు కేరళ రాష్ట్రానికి చెందిన వారు. గతంలోనే అమెరికాకు వలస వచ్చి ఒహియోలోని విద్యుత్తు ప్లాంట్ లో పని చేస్తూ స్థిరపడ్డారు. రామస్వామి తాను కూడా బరిలో ఉన్నట్లు ప్రకటించడంతో భారతీయ మూలాలనున్న వ్యక్తి అధ్యక్ష బరిలో ఉంటారని స్పష్టమయింది.

రామస్వామి వివిధ పరిశ్రమలను నెలకొల్పి అమెరికాలో ప్రముఖ పేరు సంపాదించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షతో రామస్వామి గత ఏడాదే స్త్రైట్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థను స్థాపించారు. నిజానికి అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడతామని ప్రకటించిన ముగ్గురు రిపబ్లికన్లలో ఇద్దరు భారతీయమూలాలకు చెందినవారుండటం విశేషం.మనకు మొదటి నుంచి చూస్తే నిక్కీ హేలీ కొంత పరిచయమైన పేరే. కానీ, వివేక్ రామస్వామి గురించి చాలా తక్కువమందికి తెలుసు. వివేక్ ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించడంతో ప్రపంచం కళ్లన్నీ ఆయన వైపు తిరిగాయి. ఈ పోటీలో ఆయనకున్న అవకాశాలేంటి? అమెరికా సమజంలో వివేక్ మార్పు తీసుకురాగలరా? అన్న విషయాలపై చర్చ మొదలైంది. పారిశ్రామికవేత్త, రచయిత అయిన వివేక రామస్వామి వచ్చే ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు ఫిబ్రవరి 21న ప్రకటించారు. ఫాక్స్ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తన రాజకీయ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇది తన రాజకీయ రంగప్రవేశమే కాకుండా అమెరికన్లకు “కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమం” అని ఆయన అన్నారు. “ప్రజలను ఐక్యపరిచే ఉన్నతమైన అంశం లేనప్పుడు వైవిధ్యం అర్థరహితమని అంటారు వివేక్ రామస్వామి. వివేక్ ఒహియాలో జన్మించారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో చదువుకున్నారు. బయోటెక్నాలజీ వ్యవస్థాపకుడిగా కోట్లు సంపాదించారు. తరువాత, ఒక ఆస్తి నిర్వహణ సంస్థను స్థాపించారు. కార్పొరేట్ ప్రపంచంలో జాత్యహంకారం, వాతావరణ మార్పులపై “సూడో ఉదారవాద” భావనలతో విసుగు వస్తోందని వివేక్ చాలాకాలంగా గొంతెత్తి చెబుతున్నారు. ఈ ధోరణి వ్యాపారాన్ని, దేశాన్ని దెబ్బతీస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా, ఈఎస్‌జీ.. అంటే..పర్యావరణ, సామాజిక, కార్పొరేట్ గవర్నెన్స్ విధానాన్ని వివేక్ వ్యతిరేకించారు. ఒక కంపెనీ సమాజంపై, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్నదనే దానికి ఈఎస్‌జీ ఒక సూచికగా ఉంటుంది. అంతే కాకుండా, ఉన్నత విద్యలో రిజర్వేషన్ ఉండకూడదని, అమెరికా అర్థికంగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని వివేక్ అభిప్రాయపడ్డారు. వివేక్ అభిప్రాయాలను కొందరు రిపబ్లికన్లు మెచ్చుకుంటున్నారు. 2022 మధ్యంతర ఎన్నికల్లో న్యూ హాంప్‌షైర్ నుంచి సెనేట్‌కు పోటీ చేసిన రిపబ్లికన్ విక్రం శరమణి, వివేక్ అభిప్రాయాలతో ఏకీభవించారు.

వివేక్ అభిప్రాయాలు “ఆకట్టుకునేలా, స్పష్టంగా, ఆలోచనాత్మకంగా ఉన్నాయని” అన్నారు. అమెరికాను ఐక్యం చేయాలన్నదే తమ ఉద్దేశమని, విడగొట్టే ఆలోచనలు చేయడం లేదని విక్రం అన్నారు. “అమెరికాలో గుర్తింపు రాజకీయాలు వేళ్లూనుకున్నాయి. ఇవి ప్రజలను ఐక్యం చేయడానికి బదులు విభజనలు సృష్టిస్తున్నాయి. మనకున్న ఉమ్మడి అంశాల పైనే దేశ నిర్మాణం జరగాలని అంటారు విక్రం శరమణి. కాగా, మరికొందరు భారతీయ అమెరికన్లు ముఖ్యంగా డెమోక్రాట్లు వివేక్ రాజకీయ అభిప్రాయలతో విభేదిస్తున్నారు. ఆయన ప్రచారంలో లోతు లేదని భావిస్తున్నారు.

ఆయన ఇస్తున్న హామీలేమిటి? వృద్ధులకు వైద్య సంరక్షణ గురించి పట్టించుకున్నారా? మౌలిక సదుపాయాలపై ఆయన ప్రణాళిక ఏమిటి?

ఆసియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ ‘ఏఏపీఐ’ విక్టరీ ఫండ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ శేఖర్ నరసింహన్ మాట్లాడుతూ, భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు రాజకీయాల్లోకి రావడం సంతోషకరమే కానీ, వివేక్ రామస్వామి ఆలోచనలలో తనకు నమ్మకం లేదని స్పష్టం చేసారు. అయితే శేఖర్ మొదటి నుంచి డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇస్తారనే వాదన ఉంది. ఆయన వివేక్ గురించి ఇంకా ఏమంటారంటే..వివేక్ ఒక వ్యాపారవేత్త, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ, ఆయన ఇస్తున్న హామీలేమిటి? వృద్ధులకు వైద్య సంరక్షణ గురించి పట్టించుకున్నారా? మౌలిక సదుపాయాలపై ఆయన ప్రణాళిక ఏమిటి? స్థిరమైన వైఖరి కనిపించలేదు. ఆయన విధానాలేమిటో స్పష్టంగా చెప్పలేదు” అన్నారు శేఖర్.

వివేక్ ప్రచారం “వాస్తవదూరమని, ఆచరణశూన్యమని” అన్నారు. మరోవైపు, రిపబ్లిక్ పార్టీకి మద్దతిచ్చే చాలామంది భారతీయ అమెరికన్లు వివేక రామస్వామి పేరే ఎప్పుడూ వినలేదని అంటున్నారు. వివేక చాలా ముందుగానే ఎన్నికలలో పోటీచేసున్నట్టు ప్రకటించడం మంచికే జరిగింది. లేకపోతే ఆయన గురించి ఎవరికీ తెలీదు. అధ్యక్ష పదవికి పోటీ చేసే ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. కానీ, ఆయనకు ఒక కచ్చితమైన వ్యూహం ఉండాలి. ప్రత్యేకంగా, భారతీయ అమెరికన్ల కోసం విధానాలు ఉండాలి. రిపబ్లికన్లలో ట్రంప్, డిసాంటిస్‌, హేలీ మధ్య రేసు ఉంటుందని భారతీయ అమెరికన్లలో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు అంచనా వేస్తున్నారు. అయితే ట్రంప్‌పై చట్టపరమైన ఆరోపణల చుట్టూ ఇంకా అనిశ్చితి నెలకొని ఉంది. ఆ స్థితిలో ఇంకొంతకాలం ముందస్తు పొత్తులకు వెళ్లకుండా వేచి చూడాలని అంటున్నారు విశ్లేషకులు.

ట్రంప్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తే, నిక్కీ హేలీకి సపోర్ట్ పెరుగుతుంది. ఎందుకంటే నిక్కీ దూకుడు, ప్రచార శైలి చాలా మందికి నచ్చుతోంది. భారతీయ అమెరికన్లలో రాజకీయ భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ భారతీయ మూలాలకు చెందినవారు చురుకుగా అమెరికా రాజకీయాల్లోకి రావడం పట్ల సంతోషంగా ఉన్నారు.ముఖ్యంగా గత మూడు ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగింది. ఈ ఎన్నికల్లో ఈ సంఖ్య ఇంకా పెరగడం, భారతీయ అమెరికన్లు తమంతట తాము ముందుకు రావడం పట్ల గర్విస్తున్నారు.

Must Read

spot_img