Homeఆంధ్ర ప్రదేశ్విశాఖ రాజధానిగా ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందా ?

విశాఖ రాజధానిగా ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందా ?

దిల్లీ వేదికగా సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్టణం అని, త్వరలోనే తాను కూడా అక్కడకు షిఫ్ట్ అవుతున్నానని ప్రకటించారు. అయితే ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ మొదలైంది. వరుసగా పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. అది అలా అయితే ఇది ఎలా .. అబ్బే అది సాధ్యం కాదంటూ, కాదు సాధ్యమేనంటూ ఎవరికి వారు వాదనలు మొదలుపెట్టేశారు. ఆ విషయాలు ఏంటంటే… విశాఖపట్టణం రాజధాని అని సీఎం జగన్ ప్రకటించారు. ఆయన చెప్పాక ఇంకెవరు ఏం మాట్లాడతారు.

అదే జరుగుతుందని కొందరు నేతలు అంటుంటే, ఇదే సమయంలో ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. రాజధానికి వెళ్లాలంటే, అంతకు ముందు జరగాల్సిన వ్యవహరాలు అన్నీ ఆషామాషీ కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి కొందరు అవును అంటూనే, ముఖ్యమంత్రి రేంజ్ లో జగన్ వెళ్లి విశాఖపట్టణంలో కుర్చుంటే, మిగిలినవి వాతంతట అవే వస్తాయంటూ, పార్టీ నేతలు కొందరు ధీమాగా చెబుతున్నారు. అయితే కొందరు ఈ విషయానికి నిజమే అంటూనే అంత ఈజీనా అంటూ సందేహాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు.

సచివాలయం, అందులోని హెచ్ఓడీలు, వివిధ శాఖలు, దిగువ స్దాయి అధికారులు, సిబ్బంది, ఇలా అందరూ తట్టాబుట్టా సర్దుకొని, బెజవాడ నుంచి విశాఖపట్టణానికి వెళ్లటమా..అంటూ ఊహల్లోకి వెళుతున్నారు. రాజధాని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లడం పెద్ద ప్రాసెస్.. ఎన్నికల ముందు సీఎం ఈ ప్రాసెస్ ను అమలుచేయటం అంత ఈజీనా అంటూ కొందరు అధికారులు సైతం, తమను కలిసిన పార్టీ ముఖ్య నేతల వద్ద సందేహాలు వ్యక్తంచేస్తున్నారట. రాజధాని అంటూ విశాఖపట్టణానికి వెళ్లి అక్కడ నుంచి పని చేయటానికి ముందు కూడా కొన్నిసదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది.

ప్రధానంగా సీఎంవో అధికారులకు ఏర్పాట్లు జరగాలి, ఆ తరువాత సీఎంకు ప్రత్యేక సదుపాయాలు, భద్రత వంటి అంశాలు అత్యంత కీలకం.. ఇదేసమయంలో దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, వారికి అందాల్సిన సదుపాయాలు, ప్రోటోకాల్ వంటి తతంగాలు, అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రాన్ని గుర్తించే విధంగా వాతావరణం ఏర్పాటు చేయటం…ఇలా ప్రతిది సవాలే. ఈ నేపథ్యంలో జగన్ వ్యాఖ్యలు సర్వత్రా ముఖ్యంగా ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీంతో అసలు రాజధాని విషయంలో ఏం జరగుతోందోనన్న ఆసక్తి సర్వత్రా వెల్లువెత్తుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరోసారి విశాఖపట్టణానికి రాజధాని అని జగన్ చేసిన కామెంట్స్ తో ఏపీ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇప్పటికే ఏప్రిల్ నుంచి విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుందని వైసీపీ మంత్రులు, ముఖ్యనేతలు చెప్పినా.. తాజాగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో.. విశాఖ నుంచి పరిపాలన మొదలయ్యే సమయం దగ్గరపడిందనే విషయంలో క్లారిటీ వచ్చింది. దీంతో అక్కడ సీఎం నివాసం, సెక్రటేరియట్ వంటి ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ అంశంపై వైసీపీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. భీమిలి రోడ్డులోని భవనాలనే సెక్రటేరియట్‌గా వాడుకుంటామని ఆయన తెలిపారు. కోర్టు వివాదాలను పరిష్కరించుకుంటామని చెప్పారు. విశాఖ వస్తే సీఎం ఎక్కడ ఉంటారనేది సమస్య కాదని ఆయన వ్యాఖ్యానించారు. అనేక ప్రభుత్వభవనాలు అందుబాటులో ఉన్నాయని.. భీమిలి రోడ్డులోని ఖాళీగా ఉన్న ఐటీ కంపెనీలను ప్రభుత్వ భవనాలుగా వినియోగిస్తామని చెప్పారు. ఉడాకు సంబంధించిన భవనాలు కూడా ఖాళీగా ఉన్నాయని, ఏప్రిల్‌లోపే విశాఖ నుంచి పాలన కొనసాగుతుందని వివరించారు. మూడు రాజధానులపై తగ్గేదే లేదంటోంది ఏపీ ప్రభుత్వం.

విశాఖపట్టణం కేంద్రంగానే పరిపాలన కొనసాగిస్తామని పదే పదే స్పష్టం చేస్తోంది. విపక్షాలు అభ్యంతరం చెబుతున్నా.. అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఏపీ పరిపాలన రాజధాని విశాఖే అని.. అక్కడి నుంచే పాలన కొనసాగుతుందని వైసీపీ ప్రభుత్వం తెగేసి చెబుతోంది. తాజాగా ఏపీ ఐటీశాఖ మంత్రి అమర్‌నాథ్ మూడు రాజధానులపై కీలక వ్యాఖ్యలు చేశారు.మరో రెండు నెలల్లోనే విశాఖపట్టణం నగరం.. ఏపీ పరిపాలన రాజధాని అవుతుందని అన్నారు. అంతేకాదు పలు టెక్ కంపెనీలు కూడా ఏపీకి రానున్నాయని తెలిపారు.

పరిపాలన వికేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో.. మూడు రాజధానుల నినాదాన్ని వైసీపీ నేతలు బలంగా వినిపిస్తున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని.. అంటే సెక్రటేరియెట్ ఏర్పాటువుతుంది. అమరావతిని శాసన రాజధానిగా చేస్తారు. అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. ఇక కర్నూలులో న్యాయ రాజధాని చేయాలని చేస్తారు. అంటే ఈ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇలా మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు చేయడం వల్ల.. ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తోంది.

ఐతే ప్రభుత్వం తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అమరావతిలో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలనే పూర్తి చేయని వారు. మూడు కొత్త రాజధానులను ఎలా కడతారని విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే.. ఏపీకి రాజధాని లేకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగించి.. ఇతర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూడా ఇదే వాదిస్తోంది. ఇటీవలే ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ సైతం అమరావతికే జై కొడుతోంది. రెండు, మూడు నెలల్లో విశాఖ నుంచి పాలన అని ఉత్తరాంధ్ర మంత్రులు తరచూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే మూడు రాజధానుల అంశం కోర్టులో ఉందని ఇలా ఎలా ప్రకటనలు చేస్తారని ఇతర పార్టీల నేతలు స్పందిస్తున్నారు. కానీ ఇక్కడ మంత్రులు చెబుతున్నది రాజధానుల గురించి కాదు.. కేవలం పాలన గురించే. విశాఖ నుంచి జగన్ పాలన చేస్తారని చెబుతున్నారు.

అప్పుడు అది అధికారికంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకపోవచ్చు కానీ అనధికారికంగా అవుతుందని అంటున్నారు. చట్టపరంగా ఎదురవుతున్న అడ్డంకులకు కొత్త దారిలో పరిష్కారం వెదుక్కోవాలని జగన్ అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ మంత్రులు వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖలో ఏప్రిల్ నుంచి రాజధాని అని చెప్పడం లేదు. జగన్ పాలన చేస్తారని చెబుతున్నారు. గతంలో తాము వాదించినట్లుగా.. సీఎం పాలన ఎక్కడి నుంచైనా చేయవచ్చని.. ఎవరూ అడ్డుకోలేరని వారు వాదించవచ్చు.

సీఎం జగన్ రాజధాని నుంచే పరిపాలించాలని లేదు. అలాగని సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని కాదు.సీఎం జగన్ కర్నూలు లేదా విశాఖ నుంచి పరిపాలనచేస్తే ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. ఈ కోణంలోనే విశాఖ నుంచి ఆయన పరిపాలన చేయవచ్చని అంటున్నారు. విశాఖ రాజధానిగా పాలనపై ఇప్పటికే మంత్రులు స్పష్టత ఇచ్చారు. త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన సాగిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. వచ్చే రెండు మూడు నెలల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వాలన్నది మా కోరిక.

అది అవుతుంది కూడా. రాష్ట్ర ప్రజలు కూడా సమగ్ర అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. మరో రెండు, మూడు నెలల్లో ఇదంతా జరుగుతుందని అంటున్నారు. అయితే ఇదెంతమేరకు ఆచరణీయం అన్నదీ చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉండడం .. దీనిపై ఏకంగా సీఎం వ్యాఖ్యానించడం .. మరింతగా చర్చను పెంచుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Must Read

spot_img