Homeఅంతర్జాతీయంవీసా రుసుం పెంచామంటోన్న బైడెన్ సర్కార్ ..

వీసా రుసుం పెంచామంటోన్న బైడెన్ సర్కార్ ..

మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా .. ఇప్పటికే అమెరికా ప్రయాణ భారంతో అల్లాడుతోన్న వారికి .. వీసా రుసుం మరింత బరువును పెంచుతోంది.. ఏజెన్సీ నిర్వహణ కోసం .. రుసుం ధరలు పెంచినా, భారం మాత్రం ప్రతికూలమేనని వాదనలు వినిపిస్తున్నాయి.డాలర్ డ్రీమ్స్ .. కోసం కష్టపడేవారి నెత్తిన బైడెన్ సర్కార్ మరింత భారం మోపింది. వీసా రుసుం ధరలు పెంచి, వీసా పేరిట వాత వేస్తోంది. దీంతో అమెరికా వెళ్లాలంటే, మరింత భారమేనని నిపుణులు అంటున్నారు.

ఉపాధి కోసం అమెరికా వెళ్లే వారందరికీ తెలుసు H-1B వీసా విలువేంటో. దీనికోసం పడిగాపులు కాసే వారు కొందరైతే.. చిలుకూరు బాలాజీకి మెుక్కుకునే వారు మరికొందరు. అమెరికాలో నాలుగు రాళ్లు వెనకేసుకుందాం అనుకునే వారికి జో బిడెన్ ప్రభుత్వం వీటి విషయంలో అకస్మాత్తుగా ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఇది కేవలం సాఫ్ట్ వేర్ హౌత్సాహికులను మాత్రమే కాక దేశీయ టెక్ కంపెనీలకు కూడా పెద్ద భారంగా మారుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి.

చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్‌ను పర్యవేక్షించే ఏజెన్సీకి నిధులు సమకూర్చేందుకు ఉద్యోగ ఆధారిత వీసాల కోసం కంపెనీలు చెల్లించాల్సిన రుసుములను పెంచాలని అధ్యక్షుడు బిడెన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో H-1B వీసా కోసం ప్రాథమిక రుసుము 470 డాలర్లుగా ఉండేది. అయితే దీనిని మూడింతలు పెంచి 1,595 డాలర్లు చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వీసా కలిగిన వ్యక్తులు అమెరికాలో 6 ఏళ్ల పాటు నివసించటానికి అనుమతిని ఇస్తుంది. కేవలం H-1B వీసాల విషయంలో మాత్రమే కాకుండా ఇతర రకాలపై కూడా రుసుములను అమెరికా ప్రభుత్వం భారీగానే పెంచేసింది. ఈ క్రమంలో L-1 వీసాల రుసుమును 460 డాలర్ల నుంచి 1,958 డాలర్లకు పెరుగుతుంది.

US ఆధారిత ప్రాజెక్ట్‌లో కనీసం 9,00,000 డాలర్లు పెట్టుబడి పెడితే విదేశీ పెట్టుబడిదారులు US శాశ్వత నివాసితులు కావడానికి అనుమతించే EB-5 వీసా కోసం దరఖాస్తు ఖర్చు 3,675 డాలర్ల నుంచి 11,160 డాలర్లకు పెరుగుతోంది.యూఎస్ ఇమ్మగ్రేషన్ ఏజెన్సీ ప్రతి రెండేళ్లకు ఒకసారి తన రుసుము నిర్మాణాన్ని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ 2016 నుంచి అలా చేయడం లేదు. 2019లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త ఫీజుల సెట్‌ను అమలు చేయడానికి ప్రయత్నించింది.

అయితే అప్పట్లో ఫెడరల్ కోర్టు ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేసింది. 2020లో ప్రెసిడెంట్ ట్రంప్ ఆధ్వర్యంలో ఇమ్మిగ్రేషన్ దరఖాస్తులు తగ్గడం కొవిడ్-19 మహమ్మారితో సమానంగా ఉన్నందున ఏజెన్సీకి నిధుల సంక్షోభం ఏర్పడింది. అందుకే హెచ్‌1బి వీసాలతో సహా ఇమ్మిగ్రేషన్‌ రుసులము భారీగా పెంచుతూ బిడెన్‌ పరిపాలన యాంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధంచేసింది. యూఎస్‌ పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యుఎస్‌సిఐఎస్‌) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

తాజా ప్రతిపాదిత నియమాల ప్రకారం, హెచ్‌1బి వీసా దరఖాస్తు ఫీజు 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరుగుతుంది. అదేవిధంగా ఎల్‌-1 వీసా దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1385 డాలర్లకు పెంచింది. ఒ-1 వీసాల దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1055 డాలర్లకు పెంచుతూ ప్రతిపాదనలు చేసింది. హెచ్‌-2బి పిటిషన్‌ల రుసుము 460 డాలర్లనుంచి 1080కి పెంచబడింది. ఈ వీసా కేటగిరీలపై రుసుము పెంపుదల చట్టబద్దంగా అమెరికాలోకి ప్రవేశించాలని అనుకునే వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. పరోక్షంగా దేశంలోకి అక్రమ వలసలను పెరిగేందుకు దారితీస్తుందని భావిస్తున్నారు. సమాఖ్య నిర్దేశిత మానవతా కార్యక్రమాల విస్తరణ, వేతనాల పెంపుదల, అదనపు సిబ్బంది అవసరాలు, ఇతర ముఖ్యమైన పెట్టుబడులకు ఈ మార్పులను ప్రతిపాదిస్తుంటుంది. ఏజెన్సీ నిర్వహణకయ్యే ఖర్చులో దాదాపు 96శాతం ఇమ్మిగ్రేషన్‌ రుసుముల ద్వారానే పొందుతుంది. కాంగ్రెస్‌ నుంచి అధికారిక కేటాయింపులు నామమాత్రంగానే ఉంటుంటాయి. 2020లో కొవిడ్‌ కారణంగా కొత్త దరఖాస్తుల ఆదాయం గణనీయంగా తగ్గింది.

ఫలితంగా ఆదాయంలో 40శాతం తగ్గుదల నమోదైంది. క్షీణించిన నగదు నిల్వలు, తాత్కాలిక నియామకాల స్తంభన, శ్రామికశక్తి క్షీణత, ఫిర్యాదుల పరిష్కార సామర్థ్యం సన్నగిల్లడం వంటి పరిణామాలకు విరుగుడుగా వీసా దరఖాస్తుల రుసుమును భారీగా పెంచాలని ఫెడరల్‌ ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్‌-1బి అనేది వలసేతర వీసా. ఇది అమెరికా కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నిపుణులు అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది.

భారత్‌, చైనా నుంచి ఏటా 10వేల మందిని ఈ ప్రాతిపదికన అమెరికా టెక్‌ కంపెనీలు నియామకాలు జరుపుతుంటాయి. త్వరలో హెచ్-1 బీ వీసా ధరతో పాటు.. ఫీజు రుసుంను అగ్రరాజ్యం అమెరికా పెంచాలని నిర్ణయించడంతో ఈ వీసా దరఖాస్తులకు ఒక్కసారిగా మంచి డిమాండ్ పెరిగింది. దీనికి నిదర్శనంగా 2013 ఆర్థిక సంవత్సరానికి ఇచ్చే వీసాల కోసం గడిచిన నాలుగు రోజుల్లో ఏకంగా 22 వేల దరఖాస్తులు వచ్చాయి. కాగా, ఈ వీసాలను వచ్చే అక్టోబర్ నుంచి జారీ చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనరల్ కేటగిరిలో 65 వేలు, అడ్వాన్స్ డిగ్రీ కేటగిరిలో 20 వేల వీసాలను జారీ చేయనున్నారు. ఇప్పటికే గడిచిన రెండు సంవత్సరాల కంటే అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి.

2011లో మొదటి వారంలో కేవలం 5900 అప్లికేషన్లు రాగా, 2010లో కేవలం 4500 అప్లికేషన్లు వచ్చినట్టు ఏజెన్సీ ప్రకటించింది. భారతీయ ఐటి నిపుణులు అత్యధికంగా ఈ వీసాలను ఆశిస్తున్నారు. కార్యకలాపాలు కొనసాగించాలంటే…నిర్వహణ ఖర్చులు భరించాలంటే…ఈ మాత్రం ఫీజు పెంచక తప్పదని తేల్చి చెప్పింది..అమెరికా వెళ్లాలని కలలు కనే వారికి వీసా చిక్కులు ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. వెయిటింగ్ టైమ్‌ పెరుగుతున్న కొద్ది టెన్షన్ పెరిగిపోతుంటుంది.

ఈ మధ్య కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది. కొవిడ్ సంక్షోభ సమయంలో చాలా వరకూ యూనివర్సిటీలు మూత పడ్డాయి. భారతీయ విద్యార్థులకు అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. కొంత కాలంగా అన్ని యూనివర్సిటీలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఫలితంగా వీసాల అప్లికేషన్లు కుప్పల కొద్ది వచ్చి పడుతున్నాయి. చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు అమెరికా చొరవ చూపుతోంది. గతేడాది అత్యధికంగా 1,25,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు వెల్లడించింది.

ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ వెయిటింగ్ టైంని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేసింది. అంతకు ముందుతో పోల్చి చూస్తే…2022లోనే ఇండియన్ స్టూడెంట్స్‌కి ఎక్కువ వీసాలు ఇచ్చినట్టు వివరించింది. పలు దేశాల్లో కరోనా ఆంక్షలు ఎత్తివేయడం వల్ల అమెరికాకు వీసా దరఖాస్తులు వెల్లువెత్తాయని, అందుకే జారీలో కాస్త జాప్యం జరుగుతోందని తెలిపింది. తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల కూడా సమస్యలు ఎదురయ్యాయని చెప్పింది. కొద్ది రోజుల్లోనే వీసాల జారీ ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకుంటుందని హామీ ఇచ్చింది అగ్రరాజ్యం. రుసుము పెంపుదల వల్ల భారతీయులకు ఇమ్మిగ్రేషన్ ఖర్చుల భారం పెరగనుంది.

అయితే అదేసమయంలో యూఎస్ పౌరులుగా మారడానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తుల ధరలను స్థిరంగా ఉంచింది. యునైటెడ్ స్టేట్స్‌లో రక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి శరణార్థులు ఏమీ చెల్లించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. బైడెన్ సర్కార్ తాజా చర్యలతో అమెరికా వెళ్లాలని ఆశపడుతున్న వారికి అదనపు భారం తప్పదని ఆర్థిక వేత్తలు అంటున్నారు. అంతేగాక .. ఇతరత్రా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా అంచనాలు వినిపిస్తున్నాయి.

ఏజెన్సీ నిర్వహణ కోసం వీసా రుసుం పెంచామంటోన్న బైడెన్ సర్కార్ .. దీనివల్ల ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా గమనించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ ఇవాల్టి ఫోకస్ .. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img