Homeఅంతర్జాతీయంఉగ్రవాదంపై అమెరికా ద్వంద్వ వైఖరి!!!!

ఉగ్రవాదంపై అమెరికా ద్వంద్వ వైఖరి!!!!

ఉగ్రవాదంపై అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి గురించి ఇప్పటికి ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఇలాంటి వైఖరి అమెరికా ఇప్పుడే కాదు దశాబ్దాలుగా పాటిస్తోంది. ఓ అప్రకటిత అగ్రరాజ్యంగా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్టు వ్యవహరించడం ప్రపంచానికి కొత్త కాదు. ఇప్పు డు తాజాగా అమెరికా అవకాశవాద వైఖరిని బహిర్గతం చేస్తూ అగ్రరాజ్యం రష్యాతో కుదుర్చుకున్న ఒక ఒప్పం దం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులకు ఆయుధాల ను సరఫరా చేసిన విక్టర్‌ బౌట్‌ అనే ఆయుధ వ్యాపారి కొద్ది కాలంగా అమెరికా జైలులో ఉంటున్నాడు.

అవిభక్త సోవియట్‌ యూనియన్‌లో ట్రాన్స్ లేటర్‌గా పని చేసిన ‘బౌట్‌’.. ఆయుధ వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించాడు. అంతర్జాతీయ ఆయుధ వ్యాపారిగా పేరు సంపాదించాడు. అమెరికన్‌ భద్రతాదళాలకు చిక్కిన అతడు ప్రస్తుతం అమెరికా జైలులో ఉంటున్నాడు. అమెరికాకి చెందిన బాస్కెట్‌ బాల్‌ స్టార్‌ బ్రిట్నీ గ్రినెర్‌ని మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో రష్యన్‌ పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టారు. ఆమె గంజాయి తైలాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు.

గత ఫిబ్రవరి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు ఆమె విడుదల కోసం దేశంలో పలుకుబడి కలిగిన వారి నుంచి వచ్చిన ఒత్తిడులతో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ జోక్యం చేసుకున్నారు. అయితే, ప్రస్తుత యుద్ధంలో ఉక్రెయిన్‌ను అమెరికా సమర్ధిస్తోంది. ఆయుధాలను కూడా సరఫరా చేస్తోంది. అందువల్ల బాస్కెట్ బాల్ సెలెబ్రెటీ బ్రిట్నీ గ్రినెర్‌ను విడుదల చేయడానికి రష్యా నిరాకరించింది.

అప్పుడు అమెరికా సన్నిహిత దేశమైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌తో కలిసి రష్యాతో రాయబారం నడిపాయి. బ్రిట్నీ గ్రినెర్‌ను విడుదల చేయాలంటే అమెరికా జైల్లో మగ్గుతున్న బౌట్‌ని విడుదల చేయాలని రష్యా షరతు పెట్టింది. తన ప్రత్యర్ధులను లొంగదీయడానికి ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవడంలో రష్యాది అందెవేసిన చెయ్యి. ఇప్పటికే ఉక్రెయిన్‌లో అక్కడి భద్రతా దళాలకు చిక్కిన రష్యా సైనికులనూ, ఆర్మీ అధికారులను రష్యా ఇదే మాదిరిగా బేరసారాలు సాగించి విడిపించుకుంది.

మామూలు సైనికులు వేరు, ఉగ్రవాదులకు ఆయుధాలను సరఫరా చేస్తూ కరుడుకట్టిన నేరస్థునిగా పేరుమోసిన బౌట్‌ పరిస్థితి వేరు. అతన్ని రష్యా విడుదల చేయించుకున్న తీరు అంతర్జాతీయంగా యుద్ధ నిపుణులను కూడా ఆశ్చర్యంలో ముంచేసింది. సాధారణంగా ఇలాంటి నేరస్థులు యుద్ధ నేరస్థుల కింద పరిగణించబడతారు. బౌట్‌ ఉక్రెయిన్‌ యుద్ధంలో అక్కడి సమాచారాన్ని సేకరించి రష్యాకి అందజేస్తున్న సమయంలోనే అమెరికన్‌ ఇంటిలిజెన్స్‌ అధికారులకు చిక్కాడు. ఉక్రెయిన్‌లో అమెరికా ఇంటిలిజెన్స్‌ దళాలు తిష్ట వేసి తమ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయంటూ రష్యా కొంత కాలంగా గగ్గోలు పెడుతోంది. ఉక్రెయిన్‌ భూ భాగంలోకి అమెరికా, దాని మిత్ర దేశాల గూఢచారులు ప్రవేశించడం పట్ల రష్యా ఎన్నో సార్లు అభ్యంతరం తెలిపింది. అయినా అమెరికా లెక్క చేయలేదు. ఉగ్రవాదులకు ఆయుధాలను అందిస్తున్న సంస్థలు, వ్యక్తులకు అమెరికా సాయం చేస్తోంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.

సిరియాలో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటు దారులకు అమెరికా బౌట్‌ లాంటి ఆయుధాల కాంట్రాక్టర్ ద్వారా ఆయుధాలను అందిస్తోంది. యూఏఈ, సౌదీ సంయుక్తంగా నిర్వహించిన రాయబారం ఫలించింది. అటు బౌట్‌నీ, ఇటు బ్రిట్నీని పరస్పరం విడుదల చేసేందుకు యూఏఈ వేదికగా అంగీకారం కుదిరింది. యుద్ధ ఖైదీలను మార్చుకున్న తీరులో వారిరువురి మార్పిడి జరిగిపోయింది. సినిమా కథలా సాగిన ఈ రాయబారం విజయవంతం కావడంతో బిడెన్‌ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు.

యుద్ధ తంత్రాల్లో ఇలాంటివి మామూలేనని చెప్పుకోవచ్చు కానీ, ఉక్రెయిన్‌ యుద్ధం లేకపోయి ఉంటే నిజంగానే వీరిద్దరి మార్పిడి పెద్ద సమస్య అయిఉండేది కాదు. ఈ ఒప్పందం కుదిరేందుకు సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ జోక్యం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అమెరికా పౌరసత్వం కలిగిన ఖషోగీ అనే జర్నలిస్టు హత్య కేసులో యువరాజు సల్మాన్‌పై అమెరికాలో కేసు నమోదు అయింది.

సల్మాన్‌ సౌదీయువరాజు కాక ముందు ఈ కేసు నమోదైంది. అయితే యువరాజుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లభించిన ఇమ్యూనిటీ ద్వారా కోర్టులో హాజరు నుంచి తప్పించుకోగలిగారు. ఇందుకు బైడెన్ ఇతోధికంగా సాయపడ్డారు. నిజానికి దౌత్యనీతిలో ఒకరికొకరు సహకరించుకోవడం మామూలే. అయితే, ఉగ్రవాదులతో సంబంధాలున్న వారినీ, ఉగ్రవాదులకు ఆయుధాలను విక్రయిస్తున్న వారినీ ఇదే పద్దతిలో అమెరికా విడుదల చేయడం అగ్ర రాజ్యం ద్వంద్వ వైఖరికి ప్రత్యక్ష నిదర్శనం అని అంటున్నారు విశ్లేషకులు.. పాక్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీలో చైనా వెనకేసుకొచ్చిన ఉదంతాలు ఇంకా మన స్మృతి పథంలో ఉన్నాయి. చైనా, అమెరికాలు ఉగ్రవాద సమస్యపై పరస్పర విరుద్ధ వైఖరులను అనుసరిస్తుండటం వల్లనే ఉగ్రవాదం అంతం కావడం లేదు.

ఇది ఎంత మాత్రం దౌత్యనీతి కానేకాదు. అమెరికా చాలా సందర్భాల్లో తన ద్వంద్వనీతిని బహిర్గతం చేస్తూ వస్తోంది. అగ్రరాజ్యమనే అహంకారంతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే రీతిలో వ్యవహరిస్తోంది. నిజానికి పాకిస్తాన్ లో ఉగ్రవాదం ముషారఫ్‌ హయాం నుంచి.. అమెరికా అండతోనే పెరిగి పెద్దదైంది. అటు చైనా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులపై అంతర్జాతీయంగా ఆంక్షలు విధించకుండా ఐక్యరాజ్యసమితిలో నిర్మొహమాటంగా వారికే సపోర్ట్ చేసింది.

భారత్ తలపెట్టిన నిషేధపు తీర్మాణాన్ని చైనా వీటో చేసింది. దాంతో అక్కడ ఉగ్రవాదానిదే గెలుపైంది. మరి తన దేశంలో ఇలాంటివి సహిస్తుందా అంటే ససేమిరా లేదనే చెప్పాలి. బయటి దేశాల నుంచి ఉగ్రవాద చాయలు కూడా చైనాలో పడకుండా చూస్తుంది డ్రాగన్ కంట్రీ చైనా. ఇంతగా పాకిస్తాన్ కు సహకరించడం వెనుక చైనాకు తన ప్రయోజనాలు తనకున్నాయి. తన ఆర్థిక ప్రయోజనాలను చూసుకుంటూ సాయం అందిస్తోంది. పాకిస్తాన్ గుండా సీపెక్ రోడ్, కీలకమైన పోర్టులు సొంతం చేసుకునేందుకు ఉగ్రవాద నిర్మూలనకు తూట్లు పొడుస్తుండటం బహరింగ రహస్యమనే చెప్పాలి.

చెప్పుకోవడానికి మాత్రం ఇవన్నీ అగ్రదేశాలు..కానీ వాటి వ్యూహాలన్నీ సొంత ప్రయోజనాల చుట్టూరా తిరుగుతుంటాయి. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్దానికి పదినెలలు గడుస్తున్నా ఇంకా కొనసాగడానికి ప్రధాన కారణం అమెరికాయేనని చెప్పక తప్పదు. అక్కడ తన సొంత ప్రయోజనాలను చూసుకుంటోంది. ఉక్రెయిన్‌కు తాము మద్దతుగా ఉన్నామని చెప్పడమే కానీ ఆర్థిక అంశాల దగ్గరకు వచ్చేసరికి లాభాలు మీకు – భారాలు మాకా అని యూరప్ దేశాలు గుర్రుమంటున్నాయి. అగ్రరాజ్యం కదా అని అమెరికా వంత పాడుతూ దాని ఆదేశాలను పాటించి రష్యాపై ఆంక్షలు విధించినందుకు అవి నానా కష్టాలు పడుతున్నాయి. మొత్తంగా చూస్తే అనేక విధాలుగా అమెరికా బంధంలో చిక్కుకొని ఉన్నాయి.

ఉక్రెయిన్‌ పరిణామాలను చూస్తే ఐరోపా కంటే అమెరికాపెత్తనమే ఎక్కువగా కనిపిస్తోంది. యుధ్దం నివారించేందుకు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య చర్చలను అడ్డుకోవటంతో పాటు దీర్ఘకాలం కొనసాగేలా చూసింది అమెరికా. చివరకు పది నెలలపాటు యుద్దం కొనసాగిందంటే..ఇంత తీవ్ర పర్యవసానాలకు దారి తీసిందంటే అందుకు అమెరికాయే కారణం. భారీ ఎత్తున ఆయుధాలను ఆర్థిక నిధులను అమెరికా అందిస్తోంది. మరోవైపున రష్యా నుంచి చమురు తదితర దిగుమతులను నిషేధించి ఐరోపాను తమపై ఆధారపడేట్లు చేసుకుంది. గోడదెబ్బ చెంపదెబ్బ మాదిరి ఐరోపా దేశాలు ఉక్రెయిన్నుంచి వచ్చిన శరణార్ధుల భారంతో పాటు పెరిగిన చమురు, విద్యుత్‌ ధరల భారాలను అనుభవిస్తున్నాయి.

కరోనాకు ముందే తక్కువ వృద్ధి రేటుతో ఉన్న పరిస్థితి తరువాత మరింత దిగజారింది. దాని మీద ఇప్పుడు ఉక్రెయిన్‌ సంక్షోభంతో ద్రవ్యోల్బణం, ధరల భారాలతో ఆర్థిక రంగం కుదేలౌతున్నది. ఇది పాలకపార్టీల మీద వత్తిడితో పాటు జనాన్ని వీధుల్లోకి రప్పిస్తున్నది. మరోవైపు రాజకీయంగా అమెరికాతో స్నేహం కోసం కొన్ని దేశాలతో వైరం తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇప్పుడిప్పుడే వాస్తవాలు బోధపడుతుండటంతో సుభాషితాలు చెబుతున్న నాయకగణం నేల మీద నడిచేందుకు చూస్తున్నది. తాము చేయాల్సింది చేయకుండా వ్లదిమిర్‌ పుతినే అన్నింటికి కారణం అని చెబితే నమ్మేందుకు జనాలు కూడా సిద్దంగా లేరు.

Must Read

spot_img