Homeఅంతర్జాతీయంచైనాతో 'సెమీకండక్టర్ చిప్' వార్... అమెరికా కీలక నిర్ణయం

చైనాతో ‘సెమీకండక్టర్ చిప్’ వార్… అమెరికా కీలక నిర్ణయం

స్మార్ట్‌ఫోన్ల నుంచి ఆయుధాల వరకు ప్రతి వస్తువులో కీలకంగా మారిన సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది.. దీంతో చైనా డామినేషన్ ను అడ్డుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం అమెరికా కొన్ని ఎగుమతులకు నియంత్రణ విధించింది..

అమెరికా సాఫ్ట్‌వేర్, టూల్స్ ఉపయోగించిన చిప్‌లను ప్రపంచంలో ఎక్కడ తయారు చేశారన్నది సంబంధం లేకుండా… ఆ కంపెనీలు చైనాకు ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి.

అమెరికా ఎందుకిలా చేస్తోంది…..దీనిపై చైనా వైఖరి ఏంటి..?

అగ్రరాజ్యం అమెరికా అన్ని రంగాల్లో ప్రపంచంలో తానే సాటి అని నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. స్మార్ట్‌ఫోన్ల నుంచి ఆయుధాల వరకు ప్రతి వస్తువులో కీలకంగా మారిన సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది.. దీంతో చైనా డామినేషన్ ను అడ్డుకునేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

అమెరికా టూల్స్, సాఫ్ట్‌వేర్‌ ను వాడుతూ చిప్‌లను తయారు చేసిన కంపెనీలు వాటిని చైనాకు ఎగుమతి చేసేందుకు వీలు లేకుండా కొన్ని ఎగుమతుల నియంత్రణలను అక్టోబర్ నెలలో వాషింగ్టన్ ప్రకటించింది. అమెరికా సాఫ్ట్‌వేర్, టూల్స్ ఉపయోగించిన చిప్‌లను ప్రపంచంలో ఎక్కడ తయారు చేశారన్నది సంబంధం లేకుండా ఆ కంపెనీలు చైనాకు ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. వాషింగ్టన్ తీసుకొచ్చిన ఈ చర్యల వల్ల చైనీస్ చిప్ కంపెనీలకు పనిచేసే అమెరికా పౌరులు, గ్రీన్‌ కార్డు హోల్డర్లపై కూడా ప్రభావం చూపుతుంది..

గ్రీన్ కార్డు హోల్డర్లు అమెరికా శాశ్వత నివాసితులు. ఆ దేశంలో పనిచేసేందుకు వారికి పూర్తి హక్కు ఉంటుంది.అమెరికాలోని ప్రతిభావంతులు చైనా కోసం పనిచేయకుండా కూడా ఈ చర్యలు అడ్డుపుల్లవేస్తున్నాయి. ఈ నియంత్రణల ద్వారా హై-ఎండ్ సెమీకండక్టర్ల అభివృద్ధి కూడా తగ్గనుంది.. అధునాతన చిప్‌లను సూపర్ కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిలిటరీ హార్డ్‌వేర్‌లలో వాడుతున్నారు.

చైనా సాంకేతికతను వాడుకోవడం ద్వారా తమ దేశ భద్రతకే ముప్పని అమెరికా చెబుతోంది. చైనా ద్వారా కొనుగోలు చేసిన సెన్సిటివ్ టెక్నాలజీలను మిలటరీ కార్యకలాపాలలో వాడకుండా నిరోధించేందుకు అమెరికా చేయగలిగిదంతా చేయడమే తన ఉద్దేశమని ఈ నిబంధనలను ప్రకటించే సమయంలో అమెరికా వాణిజ్య విభాగానికి చెందిన అండర్ సెక్రటరీ అలన్ ఎస్టెవెజ్ వెల్లడించారు..‘‘ముప్పును కలిగించే వాతావరణం ఎల్లవేళలా మారుతూ ఉంటుంది. ఈ సవాళ్లను పరిష్కరించుకునేందుకు మేము మా విధానాలను అప్‌డేట్చే సుకుంటున్నాం’’ అని అలన్ ఎస్టెవెజ్ తెలిపారు.

అయితే, ఈ నియంత్రణలను చైనా ‘‘టెక్నాలజీ టెర్రరిజం’’గా అభివర్ణిస్తుంది. అయితే, దీనిపై చిప్‌లను తయారు చేసే తైవాన్, సింగపూర్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిప్‌ల గ్లోబల్ సప్లయి చైన్‌పై ఈ సంక్షోభం ఎలాంటి ప్రభావం చూపుతుందోనని భయపడుతున్నాయి. గత వారం రోజులుగా చిప్ సంక్షోభానికి సంబంధించి మూడు అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.. బైడెన్ కార్యాలయం వాషింగ్టన్ ‘ఎంటిటీ లిస్టు’లో మరో 36 చైనీస్ కంపెనీలను కలిపింది. దీనిలో చిప్ దిగ్గజ సంస్థ వైఎంటీసీ కూడా ఉంది. అంటే ఎంటిటీ జాబితాలోని కంపెనీలకు అమెరికన్ కంపెనీలు కొన్ని నిర్దేశిత టెక్నాలజీలను అందించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అంతేకాక ఆ అనుమతిని అంత తేలిగ్గా పొందలేవు.

ఈ ఆంక్షలను ప్రకటించిన తర్వాత, గత వారం యూకేకి చెందిన కంప్యూటర్ చిప్ డిజైనర్ ఆర్మ్ తన అధునాతన డిజైన్లను అలీబాబా వంటి చైనీస్ టెక్ది గ్గజాలకు అమ్మడం లేదని ధ్రువీకరించింది. అమెరికా, యూకే ఆంక్షల కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. తమ పరిధిలోని వర్తించే అన్ని ఎగుమతి చట్టాలకు, రెగ్యులేషన్స్‌కు కట్టుబడి ఉండేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్మ్ తెలిపింది..

సెమీ కండక్టర్లు, ఇతర సంబంధిత టెక్నాలజీల ఎగుమతులపై అమెరికా ఆంక్షలను ప్రవేశపెట్టడంపై ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా తన ఫిర్యాదును దాఖలు చేసింది. జనవరి 2021లో అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవిలోకి వచ్చిన తర్వాత అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా బీజింగ్ డబ్ల్యూటీవో దాఖలు చేసిన తొలి ఫిర్యాదు ఇదే. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ రంగాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఈ ఎగుమతి నియంత్రణలను దుర్వినియోగపరుస్తుందని డబ్ల్యూటీవో ఫిర్యాదులో చైనా ఆరోపించింది.

గ్లోబల్ ఇండస్ట్రియల్ సప్లయి చెయిన్‌లో స్థిరత్వానికి అమెరికా ఆంక్షలు ముప్పు కలిగిస్తున్నాయని బీజింగ్ పేర్కొంది.. దేశ భద్రతకు ముప్పు కల్గించే సమస్యలను పరిష్కరించేందుకు ట్రేడ్ బాడీ సరియైన వేదిక కాదని పేర్కొంటూ అమెరికా, చైనా ఆరోపణలను కొట్టిపారేసింది.అమెరికా దేశ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా తాము అధునాతన టెక్నాలజీల యాక్సస్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకున్నట్లు అమెరికా ఎక్స్‌పోర్టు అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన కామర్స్ అసిస్టెంట్ సెక్రటరీ థియా కెండ్లర్ తెలిపారు…

సుమారు 2,800 చైనా ఉత్పత్తుల ఎగుమతిపై అమెరికా ఆంక్షలు విధించినట్టు ఫిర్యాదులో తెలిసింది. కానీ, దీనిలో కేవలం 1,800 ఉత్పత్తులకు మాత్రమే అంతర్జాతీయ వాణిజ్య నిబంధనల కింద అనుమతిచ్చారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా వద్ద కేవలం 60 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ సమయం లోపల అమెరికా ఈ సమస్యను పరిష్కరించుకోలేకపోతే, చైనా ఈ కేసును సమీక్షించాలని ప్యానల్‌కు అభ్యర్థన పెట్టుకునేందుకు అనుమతి ఉంటుంది.
ప్రపంచ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో స్టీల్, అల్యూమినియంపై విధించిన అమెరికా టారిఫ్‌లను ఈ నెల ప్రారంభంలో డబ్ల్యూటీవో తోసిపుచ్చింది. అమెరికాకు చైనా విక్రయించే మూడింట రెండొంతుల ఉత్పత్తులకు ఈ టారిఫ్‌లు వర్తించాయి. అయితే డబ్ల్యూటీవో ఈ టారిఫ్‌లను తోసిపుచ్చడంపై అమెరికా సీరియస్ అయింది. డబ్ల్యూటీవో తీర్పును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. ఈ టారిఫ్ చర్యలను తాము తొలగించే ఉద్దేశ్యం లేదని తెలిపింది..

జపాన్, నెదర్లాండ్స్ దేశాలు కూడా చైనాపై ఎగుమతి ఆంక్షలు విధించేలా కనిపిస్తోంది. చైనీస్ మార్కెట్‌కు అధునాత ఉత్పత్తులను విక్రయించడాన్ని పరిమితం చేస్తూ జపనీస్, డచ్ కంపెనీలపై ఈ ఆంక్షలు తేనున్నారు. బీజింగ్‌పై అమెరికా మాదిరి ఆంక్షలు విధించేందుకు రెండు అతిపెద్ద చిప్ తయారీ పరికరాల సరఫరాదారులతో తాము చర్చలు జరిపినట్టు వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ జేక్ సులివాన్ తెలిపారు. ‘‘తాను ఇప్పుడు ఎలాంటి ప్రకటనలు చేయాలనుకోవడం లేదు’’ అని సులివాన్ వెల్లడించారు అమెరికా ఆంక్షలు కేవలం నిర్దేశిత చిప్ తయారీదారులకు మాత్రమే కాకుండా.. చిప్ తయారీ పరికరాలను రూపొందించే వారిపై కూడా ప్రభావం చూపనుంది. జపాన్, నెదర్లాండ్స్‌లో ఉన్న దిగ్గజ కంపెనీలు, తమ హై ఎండ్ మిషన్లను కొనుగోలు చేసే అతిపెద్ద కొనుగోలుదారున్ని కోల్పోనున్నాయి.

చైనాకు ఎగుమతులు చేయడంపై నెదర్లాండ్స్ ఆంక్షలు విధిస్తే… అని డచ్ చిప్ పరికరాల తయారీదారి ఏఎస్ఎంఎల్ హోల్డింగ్ ఎన్‌వీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ వెన్నింక్‌ ను ప్రశ్నించగా.. అమెరికా ఒత్తిడితో ఇప్పటికే 2019 నుంచి చైనాకు తమ అధునాత లిథోగ్రఫీ మిషన్లను విక్రయించడం డచ్ ప్రభుత్వం ఆపివేసిందని వెల్లడించారు.. ఏఎస్ఎంఎల్ ఇప్పటికే చాలా త్యాగం చేసిందన్నారు.

అయితే మార్కెట్లోకి వచ్చే సరికొత్త ఉత్పత్తులకు సపోర్టు చేసేందుకు మరింత అధునాత చిప్‌లను తయారు చేసేలా ఇప్పటికే చిప్ తయారీదారులపై తీవ్ర ఒత్తిడి ఉంది.ఆపిల్ కొత్త ల్యాప్‌టాప్‌లో 3 నానోమీటర్లను కొలిచే ఇండస్ట్రీ లీడర్‌ అయిన తైవాన్ సెమీ కండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ చిప్‌లను వాడనుంది.

అయితే అమెరికా తీసుకొచ్చిన ఈ ఆంక్షల వల్ల ఇతర చిప్ తయారీ దేశాలతో పోలిస్తే చైనా వెనుకబడనుందని అనలిస్టులు చెబుతున్నారు. అయినప్పటికీ, సెమీ కండక్టర్ల తయారీని తాము ప్రాధాన్యత రంగంగా తీసుకుని, ఈ రంగంలో తాము అద్భుత శక్తిగా అవతరిస్తామని చైనా బహిరంగంగా చెబుతోంది.. మరోవైపు
అమెరికా… చైనా చిప్ ఇండస్ట్రీని ఐసోలేట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అమెరికా సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి తయారుచేసిన చిప్ లను చైనాకు ఎగుమతి చేసేందుకు వీలు లేకుండా కొన్నింటిపై నియంత్రణలను విధించింది.. చైనాకు ఎగుమతి చేయాలంటే తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సిందేనని కండీషన్ పెట్టడంపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది..

Must Read

spot_img