మొన్నటికి మొన్న ఐక్యరాజ్యసమితి సమావేశాలలో పాల్గొని సందడి చేసిన కైలాస ప్రతినిధులు స్రుష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. నిజంగానే అక్కడో దేశం ఉద్భవించిందనీ, ఆ దేశానికి కరెన్సీ, సైన్యం, న్యాయవ్యవస్థ, పాలనావ్యవస్థ ఏర్పడిందని రకరకాలుగా వార్తలు షికారు చేసాయి. అయితే ఇంతటికి కారణభూతుడైన స్వామి నిత్యానందకు భారీ షాక్ తగిలింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ఒప్పందం రద్దు జరిగిందని వార్తలు వస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అలియాస్ ‘యూఎస్ కే’ అనే ఊహాజనిత దేశంతో గొప్పలు పోతున్న స్వామి నిత్యానందకు ఊహించని షాక్ తగిలింది.
అది కూడా అలాంటి, ఇలాంటి షాక్ కాదు..ఏకంగా అమెరికా నుంచి సదరు షాక్ తగలడం విశేషం. జనవరి 11న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు అమెరికాలో అతి పెద్ద నగరాల్లో ఒకటైన నెవార్క్ సిస్టర్ సిటీ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద కార్యక్రమాన్ని స్వామి నిత్యానందకు చెందిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస లైవ్ స్ట్రీమింగ్ చేసింది. దాని గురించి ఘనంగా ప్రచారం చేసుకుంది. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ‘యూఎస్ కే’ కు ఉన్న పేరు, దాని చుట్టు ఉన్న వివాదాల గురించి తెలుసుకున్న నెవార్క్ నగరం నాలిక కరుచుకుంది. స్వామి నిత్యానందకు చెందిన దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. ఇది జరిగి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికే నెవార్క్‌తో కుదిరిన ఒప్పందాన్ని కైలాస దేశం ఘనంగా ప్రచారం చేసుకుంటూనే ఉంది. అసలే అమెరికా ఇప్పుడు భారతదేశం తన మిత్రదేశం అంటూ చిలుక పలుకులు పలుకుతోంది. ఎందుకంటే 140కోట్లకు పైగా ఉన్న దేశ జనాభా కలిగిన భారత్ ఇప్పుడు ప్రపంచశక్తిగా ఎదుగుతోంది. ఆర్థికంగా సూపర్ పవర్ గా నిలబడుతోంది. పైగా భౌగోళికంగా కీలక ప్రదేశంలో ఉంది. రేపు చైనాను దాని స్థానంలో ఉంచాలంటే అమెరికాకు భారత్ లాంటి దేశం ఓ స్థావరంగా చూస్తోంది. ఇన్నాళ్లూ పాకిస్తాన్ ను ఆ ప్రయోజనాల కోసం వాడుకుంది అమెరికా. ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకే భారతదేశానికి కలిగి నొప్పులన్నింటినీ అమెరికా నొప్పులుగా చూస్తోంది.
అందులో భాగంగానే స్వామి నిత్యానంద ప్రహసనం కూడా అందులో చేరింది. తమ మిత్రదేశలో రెడ్ కార్నర్ నోటీసు అందుకుని తప్పించుకు తిరుగుతున్న వ్యక్తితో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు భారత్ గుర్తిస్తే మొదటికే మోసం అని గుర్తించి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిజానికి జరిగింది కూడా ఇదే. ఎందుకంటే అత్యాచారం, నిర్బంధం వంటి కేసులు ఎదుర్కొంటున్న నిత్యానంద 2019లో ఇండియా నుంచి పారిపోయాడు. అటువంటి వాడు ఓ ద్వీపం కొనుగోలు విషయంలో తమ దేశంతో అగ్రిమెంటు చేసుకోవడం ఓ న్యూసెన్స్ గా క్రియేట్ అవుతుంది. అందుకే వెంటనే సదరు ఒప్పందాన్ని బుట్టదాఖలు చేసిపడేసింది. ఆ విషయాన్ని ప్రకటన ద్వారా వెల్లడించడం జరిగిపోయింది.
దీంతో నిత్యానందుల వారి ఆనందం ఆవిరైపోయింది. ఒక కాల్పానిక దేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి తన కార్యకలాపాలు సాగిద్దామనుకున్న నిత్యానంద తన ప్రయత్నాలు విరమించుకోలేదు.
గత నెల జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు ఇద్దరు ప్రేక్షకులుగా హాజరయ్యారు. ప్రేక్షకులుగా ప్రశ్నలు అడిగి దాన్ని తమకు అనుకూలంగా మల్చుకున్నారు. యునైటెడ్ నేషన్స్ తమను గుర్తించిందని USK తప్పుడు ప్రచారం చేసుకుంది. నిత్యానంద వేధింపులకు గురవుతున్నారని, స్వదేశం నుంచి బహిష్కరణకు గురయ్యారంటూ USK ప్రతినిధిగా చెప్పుకుంటున్న విజయప్రియ చేసిన ప్రసంగాన్ని UNO మానవహక్కుల కమిషన్ కొట్టిపారేసింది. భారత్ పట్ల స్వదేశంలోనే కుట్రలు చేసేవారికి నిత్యానంద లాంటి వ్యక్తులు అవసరం. లేని విషయాలు ప్రచారం చేసి బురద చల్లడం ద్వారా ప్రతిపక్షాలకు ఊతంగా నిలవడం చేస్తుంటారు. ఆ మధ్య భారత దేశ ప్రధాని మోదీపై వచ్చిన బీబీసీ డాక్యుమెంటరీ వివాదం, మోదీపై జార్జ్ సోరోస్ చేసిన నిరాధార ఆరోపణలు, దేశంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు నిత్యానంద లాంటి వ్యక్తులు అవసరం. అందుకే వారికి ప్రచారం లభిస్తోంది.
ఇంతా చేస్తే నిత్యానంద ఏర్పాటు చేసుకున్న దేశం ఎక్కడుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. కాని తమ దేశానికి సొంత కరెన్సీ, సొంత పౌరసత్వం, సొంత ప్రభుత్వం ఎన్నో ఉన్నాయని ఆ దేశ వెబ్‌సైట్ ఘనంగా చెప్తోంది. నిత్యానంద ఫాలోవర్స్ మాత్రం కైలాస దేశం నుంచి విపరీతంగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. విదేశాలలో ఇలాంటి బూటకపు సంస్థల తరపున ప్రచారం చేసేందుకు విరాళాలు సేకరించేందుకు పలు సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. వాటి సహకారంతో నిత్యానంద తన కైలాస దేశానికి ప్రచారంతో పాటు విరాళాలు కూడా సేకరించే పనులు చేస్తున్నారు. పైగా ఆ సంస్థలు తమ ప్రచారంలో అంతర్జాతీయ ప్రతినిధులతో కలిసిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో షేర్ చేస్తూ ఉంటారు.
అందులో భాగంగానే ఇప్పుడో కొత్త కథను తెరపైకి తెచ్చారు. ఈక్వెడర్ దేశానికి సమీపంలోకి దీవుల్లో ఒకదాన్ని కొనుగోలు చేసి తన దేశాన్ని ఏర్పాటు చేశానని నిత్యానంద అంటున్నారు.
కాని తమ దేశ పరిసరాల్లో ఎక్కడా నిత్యానంద దేశం లేదని ఈక్వెడర్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇవన్నీ చూస్తుంటే ఎవరైనా సరే సొంతంగా ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇంత సులభమా అన్న అనుమానాలు తప్పకుండా వస్తాయి. నిత్యానంద వివాదాన్ని పక్కన పెడితే మన కంటూ ఒక దేశం లేదా రాజ్యం ఉండొచ్చా? అంటే ఉండొచ్చు. ఇప్పటికే కొందరు నిత్యానంద మాదిరిగానే సొంత దేశాలను ప్రకటించుకున్న వారు ఉన్నారు. ‘నా కంటూ ఒక దేశం… దానికి నేనే రాజు, నేనే మంత్రి’… ఇలా కలలు కనేవాళ్లు ఉన్నారు. అలా కన్న కలలను సాకారం చేసుకున్నామని చెబుతున్న వాళ్లు కూడా ఉన్నారు. దేశం అనగానే ముందుగా మీకు కొంత భూమి ఉండాలి. లక్షల, కోట్ల ఎకరాలు కాక పోయినా ఒక్క ఎకరం నేల ఉన్నా సరే..మీకు మీరు ఓ దేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే, అది.. ఈ ప్రపంచంలో ఏ దేశం అధీనంలో లేని భూమి అయి ఉండాలి. అప్పుడే, అక్కడ మీ జెండాను పాతి ఇది నా దేశం అని చెప్పుకోవచ్చు.
మీ వద్ద బాగా డబ్బు మూలుగుతూ ఉంటే ఏదైనా దేశం నుంచి ద్వీపాన్ని కొనుక్కోవచ్చు. ఆ ద్వీపాన్ని దేశంగా ప్రకటించుకోవచ్చు. అయితే అందుకు ఆ దేశం కూడా అంగీకరించాలి. లక్షల్లో జనాభా ఉండే చిన్నచిన్న ద్వీప దేశాలు కూడా ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఆ దేశ ప్రభుత్వాలు ఒప్పుకుంటే డబ్బు చెల్లించి వాటిని సొంతం చేసుకోవచ్చు. భూమి మీద దేశం ఏర్పాటు చేయడం కష్టంగా అనిపిస్తే నీళ్ల మీద కూడా జెండా పాతేయొచ్చు. అంతర్జాతీయ సముద్ర జలాలు ఏ దేశం అధీనంలోనూ ఉండవు. కాబట్టి, సముద్రంలో ఒక దీవిని కృత్రిమంగా ఏర్పాటు చేసి, దాన్నే దేశంగా ప్రకటించుకోవచ్చు. అయితే షరతులు వర్తిస్తాయి. ఆ ప్రదేశంలో శాశ్వతంగా నివసించే జనాభా ఉండాలి..
ఆ దేశానికి స్పష్టమైన సరిహద్దులు ఏర్పడాలి. అక్కడి ప్రభుత్వం ఇతర దేశాలతో సంబంధాలు నెరపగల సామర్థ్యం కలిగి ఉండాలి. సొంతగా నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగి ఉండాలి.
తగినట్లుగా రాజ్యాంగం రాసుకోవాలి. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, చట్టాలు, విధి విధానాలు ఉండాలి. దేశం అంటే ప్రజలు ఉంటారు. ప్రజలు ఉంటే వారికి తిండి కావాలి. తిండి కావాలంటే పని కావాలి. పని కావాలంటే ఆర్థికవ్యవస్థ ఉండాలి. కాబట్టి, ఆదాయం వచ్చే రంగాలను గుర్తించాలి. దేశానికంటూ ఒక కరెన్సీని ఏర్పాటు చేయాలి. మీ దేశాన్ని నలుగురు గుర్తించడం జరగాలి. మిమ్మల్ని ఆ దేశాధిపతిగా చూడాలి. అంతర్జాతీయంగా గుర్తింపు లేకపోయినా మీ దేశం మనుగడ సాగిస్తుంది. ఇక ఐక్యరాజ్యసమితిలో చేరాలనుకుంటే అందులో సభ్యత్వం కోరుతూ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాయాలి. ఆ తరువాత ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలి దాని మీద చర్చించి జనరల్ అసెంబ్లీకి సిఫారసు చేయాల్సి ఉంటుంది.
జనరల్ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందితే ఒక దేశానికి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం లభిస్తుంది. మరి ఇవన్నీ నిత్యానంద చేసాడా అంటే.. కొన్నింటిని చేసాడు.. మరికొన్నింటిని చేసినట్టుగా ప్రచారం చేసుకున్నాడు. ఈ కైలాస దేశం ఎక్కడ ఉందో స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలోని దీవుల్లో ఒకదానిలో ఉందని చెబుతున్నప్పటికీ.. నిత్యానంద తమ దేశ పరిసరాల్లోనే లేడంటూఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటించింది.