Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ఎవరికి నష్టం? ఎవరికి లాభం?

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ఎవరికి నష్టం? ఎవరికి లాభం?

ఏడాదిగా సాగుతున్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్నది చూస్తే ఏ దేశాన్ని చూసినా ఏదోరకంగా ఇబ్బందులు ఎదుర్కున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో తగ్గేదేలే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోన్న ఐరోపా దేశాలు సైతం అల్లాడుతున్నాయి. ద్రవ్యోల్బణం, జీవన వ్యయాలు పెరిగి ఆయా దేశాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కానీ ఒక్క దేశం మాత్రం అపారమైన లాభాలను చవిచూస్తోంది..అది మరెవరో కాదు..అగ్రరాజ్యం అమెరికా..

పోరు నష్టమే కానీ రెండు దేశాల మధ్య పోరులో ఎక్కడ చూసినా ఎవరో ఒకరు లాభం పొందుతూ ఉంటారు. అది ఆ దేశాలకు చెందిన వ్యాపారులు కావచ్చు.. కానీ నష్టపోయింది ఎవరని చూస్తే పక్కాగా ఉక్రెయిన్‌ ముందు వరుసలో ఉంటుంది. ఈ విషయం చెప్పనే అక్కర్లేదు. అందరికంటే ఎక్కువగా… అంచనా వేయటానికి కూడా అందనంత నష్టపోయింది ఉక్రెయిన్‌.

ఇంకా నష్టపోతూనే ఉంటుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రతీ దేశం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ప్రభావితమయ్యాయి. ఓ అంచనా మేరకు ఓవరాల్ గా లెక్కలు వేస్తే 1.6 ట్రిలియన్ డాలర్ల నష్టం జరిగింది. అయితే అందరినీ ఏడిపిస్తున్న ఈ యుద్ధం నుంచి లాభాలు గడిస్తున్నది ఎవరంటే అమెరికా కంపెనీలనే చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు. అందులో అనుమానం లేదు..వారి ఆయుధాల అమ్మకం లాభాలు కురిపిస్తోంది.

ఏడాది సమరంతో అమెరికా ఆయుధ, చమురు కంపెనీలు అత్యధికంగా లాభపడ్డాయి. యుద్ధం ఆరంభం నాటికి ఐరోపా దేశాలన్నీ చమురు, గ్యాస్‌ కోసం భారీగా రష్యాపై ఆధారపడ్డాయి. యుద్ధం మొదలుకాగానే రష్యాపై అమెరికా, మిత్రదేశాలు ఆంక్షలు విధించాయి. ఫలితంగా ఆయా దేశాలు క్రమక్రమంగా రష్యా నుంచి కొనకుండా ఇతర ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది. ఇది అమెరికా కంపెనీలకు వరంగా మారింది. కేవలం చమురే కాకుండా… అమెరికా ఆయుధ కంపెనీలకు కూడా ఈ యుద్ధం లాభాల పంట పండించింది. తమ ఇంధన అవసరాలకు అనేక ఐరోపా దేశాలు ఎల్‌ఎన్‌జీ కోసం రష్యాపై ఆధారపడేవి. ఆంక్షలతో ఆ సరఫరా తగ్గిపోయింది. ఆ స్థానాన్ని అమెరికా భర్తీ చేసింది. తమ దేశంలోని చమురు సంస్థలు ఉత్పత్తిని పెంచాయి.

ఎంతగా అంటే… 2022లో ఐరోపా ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో 41శాతం అమెరికా నుంచి వచ్చినవే. గతంతో పోలిస్తే అమెరికా ఎల్‌ఎన్‌జీ ఎగుమతులు 154 శాతం అధికంగా నమోదయ్యాయి. అమెరికాకు చెందిన మూడు ప్రముఖ చమురు కంపెనీలు ఒక్క 2022లోనే గతంలో ఎన్నడూ లేనంతగా 131.1 బిలియన్‌ డాలర్ల లాభాలు సాధించాయి. 2021తో పోలిస్తే ఇది రెట్టింపు. సౌదీ అరేబియాలోని కొన్ని కంపెనీలు కూడా పెరిగిన ధరలతో లాభాలు గడించాయి. ఇక అమెరికా ఆయుధ కంపెనీలకైతే ఉక్రెయిన్‌ యుద్ధం పండగలా మారింది. ఈ యుద్ధం కారణంగా దాదాపు అన్ని దేశాలు ముఖ్యంగా ఐరోపా దేశాలు తమ మిలిటరీ బడ్జెట్‌లను అనూహ్యంగా పెంచాయి. సరికొత్త ఆయుధాలను సమకూర్చుకోవటంపై దృష్టి పెట్టాయి. దీంతో 2022లో అమెరికా ఆయుధ కంపెనీల ఉత్పత్తుల విదేశీ అమ్మకాలు 51.9 బిలియన్‌ డాలర్లు పెరిగాయి.

అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 49% అధికం. ఒక్క ఉక్రెయిన్‌కే 27 బిలియన్‌ డాలర్ల విలువైన మిలిటరీ సాయం అందించటానికి అమెరికా ప్రభుత్వం ముందుకొచ్చింది. వీటికి తోడు… ఆహారోత్పత్తుల్లోనూ అమెరికా కంపెనీలు లాభాల బాట పట్టాయి. కరవు కారణంగా ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంటున్న ఐరోపా దేశాలతో పాటు, పలు ఆఫ్రికా దేశాలకు ఆహారోత్పత్తులను భారీగా ఎగుమతి చేసింది. ఈ రకంగా 2022లో అమెరికా గతంలో ఎన్నడూ లేనంత రీతిలో రికార్డు స్థాయిలో 196 బిలియన్‌ డాలర్ల విలువైన ఆహారోత్పత్తులను వివిధ దేశాలకు విక్రయించింది. అమెరికా ఆహారధాన్యాల కంపెనీ ఏడీఎం 26శాతం, కార్గిల్‌ 23శాతం లాభాలను నమోదు చేశాయి. ఆంక్షలు విధించి… రష్యాను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేయాలన్న అమెరికా, దాని మిత్రదేశాల ఎత్తుగడ యుద్ధ తొలి రోజుల్లో పెద్దగా పనిచేయలేదు.

2022లో రష్యా చమురు, గ్యాస్‌ ఎగుమతుల రాబడి తగ్గకపోగా 168 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. రష్యా కరెంట్‌ అకౌంట్‌లో 227 బిలియన్‌ డాలర్ల మిగులు నమోదైంది. రోజూ యుద్ధ ఖర్చు 300 మిలియన్‌ డాలర్లు..అంటే మన కరెన్సీలో ఇదెంతో తెలుసా..సుమారు 2వేల 483 కోట్ల రూ.లు..అయితే చమురు, గ్యాస్‌ అమ్మకాల ద్వారా రోజూ 800 మిలియన్‌ డాలర్లు…అంటే సుమారు 6వేల 622 కోట్ల రూ.లు రష్యా సంపాదిస్తోంది. ఐరోపా దేశాలకు నేరుగా అమ్మకాలు తగ్గినా… చైనా, భారత్‌, తుర్కియే తదితర దేశాల ద్వారా రష్యా తన అమ్మకాలను పెంచుకుంది. అదే సమయంలో… రష్యాపై ఆంక్షలు విధించిన బ్రిటన్‌, జర్మనీ తదితర ఐరోపా దేశాల ఆర్థిక పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా ఉండబోతోందని ఐఎంఎఫ్‌ అంటోంది. ఇప్పుడు చెప్పండి..యుధ్దంతో ఎవరు లాభపడ్డారు ఎవరు నష్టపోయారు.

Must Read

spot_img