Homeఅంతర్జాతీయంసైనికచర్య అంటూ సమర్థించుకున్న రష్యా !!!

సైనికచర్య అంటూ సమర్థించుకున్న రష్యా !!!

ఉక్రెయిన్ పై దండయాత్ర చేసి తాను చేసింది సైనికచర్య అంటూ సమర్థించుకున్న రష్యా ఇప్పుడు ఏం చేయబోతోంది.. చూస్తుండగానే ఏడాది పూర్తి చేసుకున్న యుద్ధంలో నిజంగా ఎవరు ఓడిపోయారు. ఎవరు గెలిచారన్న విషయం ఆసక్తి రేపుతోంది. ఉక్రెయిన్ ప్రస్తుత అధ్యక్షుడు ఒకప్పటి కమెడియన్ అయిన ఒలోదిమిర్ జెలెన్ స్కీ 2023లో తాము ఘన విజయం సాధిస్తామంటూ యధా ప్రకారం దేశ ప్రజలను ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. రష్యా సైనిక చర్యను ఖండిస్తూ, ఉక్రెయిన్‌ శాంతి ప్రణాళికపై ఐరాసలో ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అలా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్టు చేసి, 2023లో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

అలాగే సైన్యంలో ఉత్తేజం నింపేలా మాట్లాడారు. ఈ ఏడాది కాలంలో మేం విచ్ఛిన్నం కాలేదు. ఎన్నో అడ్డంకులను అధిగమించాం. మేం విజయం సాధిస్తాం. మాపై విరుచుకుపడుతున్న వారిని జవాబుదారీ చేస్తాం. ఉక్రెయిన్‌ ఈ ప్రపంచంలో స్ఫూర్తి కలిగించింది. ప్రపంచాన్ని ఏకం చేసింది’ అని సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. అలాగే ఏడాది కాలంగా తన దేశం ఎదుర్కొంటోన్న కన్నీళ్లను, సైనికులు పోరాటాన్ని వీడియో రూపంలో వెల్లడించారు. ‘ఫిబ్రవరి 24, 2022 ఆధునిక చరిత్రలో అత్యంత క్లిష్టమైన రోజు. ఆ రోజు మేం రష్యా దాడి వార్తతో నిద్రలేచాం.

అప్పటినుంచి ఇంతవరకు ప్రశాంతంగా నిద్రపోలేదు. ఆ రోజు నుంచి మేమంతా పోరాడాలని నిర్ణయించుకున్నాం. ఏడాది కాలంగా మేం ఎంతో దుఃఖాన్ని చూశాం. నమ్మకంతో ఐకమత్యంగా మెలిగాం. ఈ ఏడాది మేం అజేయులుగా మిగిలాం. 2023లో విజయం లభిస్తుందని మాకు తెలుసు’ అంటూ స్పూర్తిదాయక వ్యాఖ్యలు చేసారు జెలెన్ స్కీ.. చలికాలంలో కాస్త ఆగిన దాడుల్ని రష్యా మళ్లీ ఉద్ధృతం చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో పశ్చిమ దేశాల నుంచి మరింత మిలిటరీ సాయం అందుతుందని జెలెన్‌స్కీ ఆశిస్తున్నారు. ఇటీవల కీవ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పర్యటించి మరింత మిలిటరీ సాయానికి హామీ ఇచ్చారు.

ఆ వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నుంచి స్పందన వచ్చింది. అమెరికాతో అణు ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు పుతిన్‌ ప్రకటించారు. ఇది అణుభయాలను రేకెత్తిస్తోంది. అయితే రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఫెయిలయ్యారా… అసలు ఆయన టార్గెట్ ఏంటి అన్నది కీలకంగా మారింది. ఉక్రెయిన్‌పై దాడి చేయడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022 ఫిబ్రవరి 24న దాదాపు రెండు లక్షల మంది సైనికులను పంపారు. కొద్దిరోజుల్లో రష్యా సైన్యం కీయెవ్‌లోకి ప్రవేశించి యుక్రెయిన్ ప్రభుత్వం నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకుంటుందని భావించారు.

వరుస పరాజయాలు, ఒకానొక సమయంలో వెనక్కి తగ్గిన తరువాత, యుక్రెయిన్‌పై దాడి చేయాలనే పుతిన్ ప్రణాళిక విఫలమైందని స్పష్టమైంది. కానీ, ఈ యుద్ధంలో రష్యా ఇంకా ఓడిపోలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘ప్రత్యేక సైనిక చర్య’ను రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అతిపెద్ద యూరోపియన్ దాడిగా అభివర్ణిస్తున్నారు. అయితే, వాళ్లు దీనిని పూర్తి స్థాయి యుద్ధం అని పిలవడం లేదు. దీనిలో యుక్రెయిన్ అంతటా పౌరులపై కూడా బాంబు దాడులు జరిగాయి.

దాదాపు 13 మిలియన్ల మంది యుక్రేనియన్లు వారి సొంత దేశంలో, విదేశాలలో శరణార్థులుగా మారవలసి వచ్చింది. 2022 ఫిబ్రవరి 24న పుతిన్ లక్ష్యం ‘యుక్రెయిన్ సైనిక శక్తిని నిర్మూలించడం, నాజీల నుంచి విముక్తి చేయడం’ అని, బలవంతంగా యుక్రెయిన్‌ను ఆక్రమించే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు. పుతిన్ 2014 నుంచి రష్యా మద్దతుదారులు ఆక్రమించిన తూర్పు యుక్రెయిన్ ప్రాంతాల స్వాతంత్య్రానికి ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు మద్దతు తెలిపారు. యుక్రెయిన్‌లో ఎనిమిదేళ్ల అణచివేత, మారణహోమం నుంచి తూర్పు యుక్రెయిన్ ప్రజలను కాపాడతానని పుతిన్ హామీ ఇచ్చారు. అయితే రష్యా వాదనకు వాస్తవంగా జరుగుతున్నదానికి పొంతన లేదు.యుక్రెయిన్‌లో నాటో స్థాపన చేయకుండా నిరోధించడం గురించి కూడా పుతిన్ మాట్లాడారు.

అధ్యక్షుడు పుతిన్ కొన్ని విషయాలను ఎన్నడూ బహిరంగంగా చెప్పలేదు. అయితే యుక్రెయిన్‌లో ఎన్నికైన ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించాలని ఆయన ఎల్లప్పుడూ కోరుకునేవారు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలియన్ స్కీ మాట్లాడుతూ ‘శత్రువు నన్ను తమ టార్గెట్ నంబర్ వన్‌గా ప్రకటించింది, నా కుటుంబం వారి రెండో లక్ష్యం” అన్నారు. అయితే జెలెన్ స్కీ అడ్వైజర్ వాదన ప్రకారం రష్యా సైన్యం అధ్యక్ష భవన సముదాయంలోకి ప్రవేశించడానికి కనీసం రెండుసార్లు ప్రయత్నించింది.యుక్రెయిన్‌ను నాజీలు ఊచకోత కోశారనే రష్యా వాదనకు ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ ప్రత్యేక దేశం అన్న ఉనికిని కొన్నాళ్లుగా నిరాకరిస్తున్నారు.

2021లో రాసిన ఒక సుదీర్ఘ వ్యాసంలో ‘తొమ్మిదో శతాబ్దం నుంచి యుక్రెయిన్, రష్యా ప్రజలు ఒక్కటే’ అంటూ పుతిన్ తెలిపారు. అయితే మొదటి నుంచి పుతిన్ సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అవడాన్ని అంగీకరించలేకపోయారన్నది నిజం. ముక్కలుగా విడిపోయిన దేశాలను మళ్లీ ఒక్క గొడుగు కిందకు తీసుకురావాలన్నది పుతిన్ వ్యూహం అని చెబుతున్నారు. అయితే ఎవరికైనా అనుకున్నది అనుకున్నట్టుగా జరగడం అన్నది అసంభవం.. అలాగే రష్యాకు కూడా ఇది వర్తిస్తుంది.

యుక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన నెల రోజుల తర్వాత రష్యా దళాలు కీవ్, చెర్నిహివ్ నుంచి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతో పుతిన్ తన వ్యూహాలలో మార్పులు చేపట్టారు. ఆ తర్వాత రష్యా ప్రధాన లక్ష్యం ‘డాన్‌బాస్‌ను విముక్తి చేయడం అని మార్చారు. తూర్పు యుక్రెయిన్‌లోని రెండు పారిశ్రామిక ప్రాంతాలైన లుహాన్స్క్, డోనోట్స్క్ లను డాన్‌బాస్ అని పిలుస్తారు. ఈశాన్యంలోని ఖార్కివ్, దక్షిణాన ఖేరాసన్ నగరం నుంచి రష్యా వెనక్కి వెళ్లవలసి వచ్చినప్పటికీ ఈ లక్ష్యాలలో ఎటువంటి మార్పు లేదు. రష్యా విజయం సాధించేలా కనిపించడం లేదు.

యుద్దభూమిలో వైఫల్యాల తరువాత రష్యా నాయకుడు గత సంవత్సరం సెప్టెంబర్‌లో యుక్రెయిన్‌లోని నాలుగు ప్రావిన్సులను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.ఆ ప్రాంతాలపై రష్యా పూర్తి నియంత్రణ కూడా సాధించలేదు. తూర్పున ఉన్న లుహాన్స్క్, డొనెట్స్క్ లేదా దక్షిణాన ఖెర్సన్, జాపోరోజీలను రష్యన్ సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకోనేలేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా అధ్యక్షుడు పుతిన్ రష్యాలో నిర్బంధ సైనిక నియామకాలను నిర్వహించవలసి వచ్చింది. అయితే ఈ రిక్రూట్‌మెంట్ పాక్షికం మాత్రమే.

దీని ద్వారా నియామకమయ్యేది మూడు లక్షల రిజర్వ్ సైనికులు మాత్రమే. యుద్ధంలో భాగంగా రష్యా సుమారు 850 కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్లింది. వీటిలో చిన్న, అరుదైన విజయాలు మాత్రమే రష్యా సాధించింది. చిన్న సైనిక చర్యగా మొదలై, నేడు సుదీర్ఘ యుద్ధంగా మారింది. యుక్రెయిన్‌ గెలవాలని పశ్చిమ దేశాలు అభిప్రాయానికొచ్చాయి. యుక్రెయిన్ తటస్థంగా ఉండటానికి నిజమైన అవకాశాలు చాలా కాలం క్రితం ముగిశాయి. గతేడాది డిసెంబరులో అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ‘సుదీర్ఘమైన ప్రక్రియ’ అని హెచ్చరించారు.

ఈ యుద్ధం నుంచి పుతిన్ క్లెయిమ్ చేసుకోగల అతి పెద్ద విజయం ఏమిటంటే, క్రిమియా నుంచి రష్యా సరిహద్దు వరకు ల్యాండ్ కారిడార్‌ను నెలకొల్పడం. రష్యా 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకుంది. ఈ ల్యాండ్ కారిడార్ తర్వాత రష్యా క్రిమియా చేరుకోవడానికి కెర్చ్ జలసంధిపై ఉన్న వంతెనపై ఆధారపడాల్సిన పరిస్థితి తప్పింది. పుతిన్ కూడా ఈ ప్రాంతం ఆక్రమణ గురించి ఒక ప్రకటన చేశారు. మారియుపోల్, మెలిటోపోల్ వంటి నగరాల స్వాధీనం ‘రష్యాకు ముఖ్యమైన పరిణామాలు’ అని అభిప్రాయపడ్డారు. కెర్చ్ జలసంధిలోని అజోవ్ సముద్రం ఇప్పుడు రష్యా ‘అంతర్గత సముద్రం’గా మారింది. దీనిపై పుతిన్ ప్రకటన జారీ చేస్తూ రష్యాకు చెందిన జార్ పీటర్ కూడా విజయం సాధించలేకపోయారని అన్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు ఇది రష్యా సైన్యం క్రూరత్వం, అసమర్థత చూపించుకోవడం తప్ప ఎక్కువగా సాధించిందేమీ లేదనే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.

Must Read

spot_img