Homeఅంతర్జాతీయంఉక్రెయిన్,రష్యాలు నువ్వా నేనా అంటూ…

ఉక్రెయిన్,రష్యాలు నువ్వా నేనా అంటూ…

ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ఏడాదికి పైగా కొనసాగుతోంది.. ఉక్రెయిన్ లో ఎక్కడ చూసినా శిథిలాలు, ధ్వంసమైన ప్రాంతాలే కనిపిస్తున్నాయి.. మరోవైపు.. రష్యా సైతం అనేక మంది సైనికులను కోల్పోయింది.. ఉక్రెయిన్,రష్యాలు నువ్వా నేనా అంటూ భీకరంగా పోరాడుతున్నాయి..

ఉక్రెయిన్, రష్యా యుద్దంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.. మరెన్నో నగరాలు శిథిలాలుగా మారాయి.. లక్షలాది మంది ప్రజలను నిరాశ్రయులయ్యారు.. కాల్పుల మోతలు, బాంబు దాడులతో ఇరుదేశాలు కోట్లలో నష్టపోయాయి.. ఇంతకూ ఈ యుద్దం ముగిసే అవకాశం ఉందా..? లేదా..?

డో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి మీద అమెరికా అణుబాంబులు వేసింది. ఇప్పటికీ అక్కడ పచ్చగడ్డి కూడా మొలవడం లేదు. ఇరాన్‌, ఇరాక్‌లపై అమెరికా యుద్ధం చేస్తే.. ఇప్పటికీ అక్కడ శిథిలాలు తప్ప మరేవీ కన్పించడం లేదు. బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌ అన్నట్టు ‘మంచి యుద్ధం.. చెడ్డ శాంతి ఉండవు..’ దేశాధినేతలు ఇవి గుర్తెరగకపోవడం వల్లే యుద్ధాలు జరుగుతున్నాయి. చివరకు కన్నీళ్లు కూడా మిగలడం లేదు. బాంబుల ధాటికి అభివృద్ధి ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా నిర్మించిన భవనాలు, ఇళ్లు, ఇలా ఒక్కటేమిటీ అన్నీ భస్మీపటలమవుతున్నాయి. సామ్రాజ్యవాదం,
రాజ్య విస్తరణ కాంక్ష, నిలువెత్తు అహంభావం, దోచుకోవాలనే తాపత్రయం, ప్రపంచాన్ని శాసించాలనే కుటిల బుద్ధి వంటి కారణాలు యుద్ధానికి దారి తీస్తున్నాయి. నాటి నాజీల నుంచి నేటి ఫుతిన్‌ వరకు ఇదే జరుగుతోంది.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టి ఏడాది దాటింది. ఇప్పటి వరకూ ఎవరు గెలిచారు…? ఎవరు ఓడిపోయారు అనే ప్రశ్నకు సమాధానం లేదు. పోనీ ఈ యుద్ధం వల్ల అటు రష్యా ఏం సాధించింది అనేప్రశ్నకు జవాబు లేదు. ఇటు నాటో దేశాలు ఉక్రెయిన్‌ కు ఏ విధంగా తోడ్పడ్డాయి అనే ప్రశ్నకూ సమాధానం లేదు. ఎటొచ్చీ అటు రష్యా తన ప్రతాపం చూపింది. ఇప్పటికీ చూపుతోంది. కానీ వేలాది కోట్లను యుద్ధం కోసం మంచినీళ్లలా ఖర్చు చేస్తోంది. ఈ ఖర్చును భర్తీ చేసుకునేందుకు ప్రజల పై పన్నుల భారాన్ని మోపుతోంది. అక్కడి దాకా ఎందుకు తన దేశంలో వెలికి తీసే ముడి చమురును భారత్‌
లాంటి దేశాలకు రూపాయల్లో విక్రయిస్తోంది. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉక్రెయిన్‌ కూడా యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోతోంది. కీవ్‌, మరియా పోల్‌ వంటి నగరాలు ధ్వంసం కావడంతో ఆ దేశం గుండె కాయలను కోల్పోయినట్టయింది. అటు నాటో దేశాల సహకారం లేకపోవడంతో ఉక్రెయిన్‌ చిగురుటాకులా వణుకుతోంది.

బ్లూంబర్గ్‌ నివేదిక ప్రకారం అటు ఉక్రెయిన్‌ కోలుకునేందుకు దశాబ్దాలు పడుతుందని తెలుస్తోంది. రష్యా పరిస్థితి కూడా దారుణంగా మారింది..

కత్తి పట్టి యుద్ధం చేసేది వినాశానానికి కాదు.. కొత్త చరిత్ర లిఖించేందుకు అంటాడు కేజీఎఫ్‌-2లో అధీర. కానీ కత్తి వల్ల జరిగిన యుద్ధాలు, బాంబుల వల్ల జరిగిన యుద్ధాలు వినాశనాన్ని తప్ప కొత్త చరిత్ర లిఖించిన దాఖలాలు ఈ భూమండలం మీద లేవు. రగిలే కాంక్ష, చెలరేగే కత్తి, రివ్వును దూసుకొచ్చే బాంబు, చిందే నెత్తురు సువర్ణాధ్యాయాలను లిఖించిన దాఖలాలు ఇప్పటి వరకూ లేవు. ఇక ఉక్రెయిన్‌ పై రష్యా భీకరమైన దాడులు చేసింది. చేస్తోంది కూడా. తాజాగా రష్యా చేసిన యుద్ధకాండ వల్ల ఉక్రెయిన్‌ ఎంత నష్టపోయిందో తెలిపే చిత్రాలు ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి.

ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ డ్రోన్‌ ద్వారా డోనెట్స్క్‌లోని మరింక ప్రాంతాన్ని చిత్రించింది. ఈ ప్రాంతంలో 10,000 మంది నివసించేవారు. కానీ రష్యా యుద్ధం చేయడం వల్ల అక్కడ కనుచూపు మేరలో ఏమీ కన్పించడం లేదు. రష్యా బాంబు దాడులు చేయని ప్రాంతమంటూ లేకపోవడంతో అది మరుభూమిగా కన్పిస్తోంది. గతంలో ఈప్రాంతంపై డాన్‌ బాస్‌ వేర్పాటువాదులు తొలిసారి దాడులు చేశారు.
తర్వాత ఉక్రెయిన్‌ ప్రతిఘటించి…తిరిగి స్వాధీనం చేసుకుంది. పదివేల మంది ఉన్న నగరంలోని భవనాలే ఇలా నేలమట్టమైతే.. వాటి కింద పడి ఎంత మంది చనిపోయారో ఊహాకే అందడం లేదని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ చెప్పడం భీతావహ పరిస్థితికి అద్దం పడుతోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఈ ఫిబ్రవరి 24 వరకే ఏడాది పూర్తయింది. ఈ యుద్ధం 2022 ఫిబ్రవరి 24 న ఉత్తర, తూర్పు-దక్షిణ ప్రాంతాల నుంచి రష్యా ఉక్రెయిన్ ను ఆక్రమించడంతో ప్రారంభమైంది.

ఆ తర్వాతి రెండు రోజుల్లో కైవ్, ఖార్కివ్ అనే రెండు పెద్ద నగరాల‌పై తీవ్ర‌మైన షెల్లింగ్, క్షిపణి దాడులు జరిగాయి. ఉక్రెయ‌న్-ర‌ష్యా యుద్ధం ఆ రెండు దేశాల‌పైన మాత్ర‌మే కాకుండా యావ‌త్ప్ర‌ పంచంపై ప్ర‌భావం చూపుతోంది. ఏడాది పూర్త‌యిన‌ప్పటికీ ఇంకా యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌పంచంలోని ప‌లు దేశాలు ఇరు దేశాల‌కు త‌మ మ‌ద్ద‌తును ప్ర‌క‌టించాయి. ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో ప్ర‌త్య‌క్షం కావ‌డం యుద్ధ వాతావ‌ర‌ణంలో మ‌రింత హీటును పెంచాయి.ఐక్యరాజ్యసమితి మానవహక్కుల గణాంకాల ప్రకారం 8,006 మంది పౌరులు మరణించగా, 13,287 మంది గాయపడ్డారు.

రష్యా – ఉక్రెయిన్ వార్ మొదలైన నాటి నుంచి పోరు భీకరంగా సాగుతోంది. తొలుత రష్యా దూకుడు ప్రదర్శించిన చిన్న దేశమైన ఉక్రెయిన్ రష్యాకు ధీటుగా పోరాడుతోంది. యుద్ధం ప్రారంభమయిన తొలి నాళ్లలో భారత దేశానికి చెందిన పౌరులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలించారు. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు సుమారు 7,199 ఉక్రెయిన్ పౌరులు మృతి చెందగా… 11,756 మంది గాయపడినట్లు ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది.

రష్యాకు చెందిన 1,44,440 మంది సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ అంచనా వేసింది. యుద్ధంలో 1,00,000 మంది ఉక్రెయిన్ సైనికులు
మరణించినట్లు నార్వే అంచనా వేసింది. రష్యా దాడుల కారణంగా 8వేల కిలో మీటర్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. యుద్ధం కారణంగా 400 వంతెనలు ఉక్రెయిన్ లో నేలమట్టం అయ్యాయి. ఉక్రెయిన్‌కు 70 వేలకోట్ల డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కాస్తా నాటో – రష్యా యుద్ధంలా రూపాంతరం చెందుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించారు. దీంతో అమెరికా ఉక్రెయిన్ వెనక ఉండి సహకారం అందిస్తుందనే వాదనకు బలం చేకూరింది. దీంతో పాటు రష్యాకు వ్యతిరేకంగా ఉన్న అనేక దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికాతో పాటు బ్రిటన్, ఐరోపా యూనియన్, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఉక్రెయిన్‌కు బాసటగా నిలిచాయి.

అయితే ఉక్రెయిన్‌పై సైనిక చర్య త్వరగానే ముగుస్తుందని పుతిన్ భావించిన ఉక్రెయిన్ నుంచి ఊహించని విధంగా ప్రతిఘటన ఎదురైంది. దీంతో రష్యా మరో 3లక్షల మంది రిజర్వ్ సైనికులతో పాటు, అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలున్నాయి. ఉక్రెయిన్‌కు సైతం పశ్చిమ దేశాల నుంచి యుద్ధ ట్యాంకులు, దీర్ఘ శ్రేణి క్షిపణులు అందుతున్నాయి. యుద్ధంపై శాంతి చర్యలు ముందుకు సాగకపోవడం.. రెండు దేశాలు తమ తమ ఎత్తులతో ముందుకెళ్లడం చూస్తుంటే యుద్ధం మాత్రం ఇప్పట్లో ముగిసేలా లేదు. ప్రధాని మోడీ మాత్రం రష్యా అధ్యక్షుడితో గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన భేటీలో ఇది యుద్ధాల యుగం కాదని చర్చించుకుని సమస్యకు పరిష్కారాన్ని వెతకాలని పుతిన్‌కు సూచించారు. మరి రానున్న కాలంలో యుద్ధం ఎటు దారితీస్తుందో చూడాలి..

ఏడాదికి పైగా కొనసాగుతున్న యుద్దంలో రష్యా కారణంగా ఉక్రెయిన్ నగరాలు శిథిలాల గుట్టలుగా మారిపోయాయి.. ఉక్రెయిన్ లోని ప్రాంతాలు నివాస యోగ్యంగా మారాలంటే.. కొన్ని శతాబ్దాలు పట్టే అవకాశం ఉంది.. మరోవైపు.. రష్యా సైతం ఈ యుద్దంలో తీవ్ర నష్టాన్ని చవిచూసింది.. అయినప్పటికీ.. యుద్దాన్ని మాత్రం ఆపడం లేదు.. ఈ యుద్దం ఇంకెంతకాలం కొనసాగుతుందో చూడాలి.

Must Read

spot_img