ఉక్రెయిన్ రష్యా మధ్య పదినెలలుగా జరుగుతున్న యుధ్దానికి ఎండ్ కార్డ్ పడింది..రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ యుధ్ధానికి ముగింపు పలకాలనే కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రపంచం మొత్తం తమపై వేలెత్తి చూపిస్తున్న వేళ పుతిన్ నిర్ణయాన్ని అంతా స్వాగతిస్తున్నారు. దైత్యపరమైన చర్చల ద్వారా రెండు దేశాల మధ్య యుద్దాన్ని ముగించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అయితే అందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ మాత్రం రెడీగా లేరు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడనుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య పదినెలలుగా యుద్ధం నడుస్తోంది. రష్యా దాడులకి ఉక్రెయిన్ దేశం భారీగా నష్టపోయింది. దాదాపు తుడిచిపెట్టుకు పోయిందని చెప్పుకోవాలి. అంతలా నష్టం జరిగినా ఆ చిన్న దేశం రష్యాతో పోరాడడంలో తగ్గేదేలే అంటోంది.
ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచం మొత్తం రష్యాపై వేలెత్తి చూపిస్తున్న వేళ పుతిన్ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. తాజాగా పుతిన్ మాట్లాడుతూ.. దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
శత్రుత్వం తీవ్రత భరించలేని నష్టాలకు దారితీస్తుందని తాను ఇప్పటికే పలుమార్లు చెప్పినట్టు పుతిన్ గుర్తు చేశారు. అన్ని సాయుధ ఘర్షణలు దౌత్య మార్గంలో ఏదో ఒకరమైన చర్చల ద్వారానో, లేదంటే మరోలానో ముగుస్తాయని పుతిన్ అన్నారు.
మరోవైపు, తాము చర్చలకు రెడీగా ఉన్నట్లు చెబుతున్నప్పటికీ ఉక్రెయిన్ మాత్రం వ్యతిరేకిస్తోందని పుతిన్ అంటున్నారు. ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ వాదన మరోలా ఉంది. చర్చలు జరగాలంటే మొదట ప్రస్తుతం ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులు ఆపి, తమ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని తిరిగి అప్పగిస్తే అప్పుడు చూద్దామని ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంటున్నారు. అంతకన్నా ముందు రష్యా అధ్యక్షుడిగా కొత్త వ్యక్తి ఎంపిక తరువాతే చర్చలు అంటూ మెలికపెట్టారు.
అయితే ప్రస్తుతం జెలెన్ స్కీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఉక్రెయిన్ గెలుపు కోసం రష్యాను ఓడించడం కోసం సహాయం అర్థించేందుకు ఆయన అమరికా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టమైన హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాతి రోజునే పుతిన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారిగా ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా యూఎస్ కాంగ్రెస్ ఉభయ సభల్లో జెలెన్ స్కీ కీలక ప్రసంగం చేశారు.
రష్యాను ఢీకొట్టేందుకు తమ దేశ సైనికులు వీరోచిత పోరాటం చేస్తున్నారనీ అలాంటి పరిస్థితుల్లో తమకు అండగా అమెరికా నిలబడడం నిజంగా గర్వించదగ్గ విషయమన్నారు.
ప్రపంచ శాంతి కోసం తాము రష్యాతో పోరాడుతున్నామని ఈ యుద్ధం వెంటనే ఆగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో తమ భూభాగాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని జెలెన్ స్కీ తేల్చిచెప్పారు. మరోవైపు అమెరికాలో పర్యటిస్తున్న జెలెన్ స్కీ అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయి కీలక చర్చలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి భారీ సహాయ ప్యాకేజీని ప్రకటించింది.
180 కోట్ల డాలర్ల విలువైన సైనిక సాయం అందజేయనుంది. ఇందులో ఒక బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, 800 మిలియన్ డాలర్ల నిధులున్నాయి. పేట్రియాట్ క్షిపణులు, ఉక్రెయిన్ యుద్ధ విమానాల కోసం అత్యంత కచ్చితత్వంతో కూడిన గైడెడ్ బాంబులను తొలిసారిగా ఉక్రెయిన్‌కు ఇస్తోంది.
ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడులు ముమ్మరం చేసిన నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలను అందించాలని అమెరికా నిర్ణయించింది. అయితే ఉక్రెయిన్ కు అమెరికా అందజేసే నిధులు ఆయుధాలు.. విరాళాలు కాదని.. అవి పెట్టుబడితో సమానమని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. అమెరికా కాంగ్రెస్లో ఆయనప్రసంగిస్తూ.. “మీ డబ్బు విరాళం కాదు.. ప్రపంచ భద్రత ప్రజాస్వామ్యాలకు పెట్టుబడి. నేను ఇక్కడ ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చిన ఉక్రెయిన్ కుప్పకూలదు. సజీవంగానే ఉండి పోరాడుతుంది. ప్రపంచం దృష్టిలో మేము రష్యాను ఓడించాము. శాంతి కోసం మేము చేస్తున్న ప్రయత్నాలకు బైడెన్ సహకరించారు. ఆయనకు ధన్యవాదాలు.
అమెరికా బలంగా.. సమష్టిగా ఉందని చెప్పేందుకు ప్రతి ఒక్క సభ్యుడు సహకరించాలి” అని జెలెన్స్కీ అభ్యర్థించారు.