Homeజాతీయంభారత్-పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని, ద్వేషాన్ని యుఏఈ తగ్గించగలదా?

భారత్-పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని, ద్వేషాన్ని యుఏఈ తగ్గించగలదా?

పాకిస్తాన్ భారత్ దేశాల మధ్య వివాదాన్ని యూఏఈనే తీర్చాలని విజ్నప్తి చేసారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇది స్వయంగా ఆయన చేసిన ప్రకటన..ఒకవైపు భారత్ తో చర్చలు, నిజాయితీగా మాట్లాడుకుందాం.. వివాదాలు తీర్చుకుందాం అంటూ మొదలుపెట్టారు షరీఫ్.. భారత్ ఏ విధంగానూ ఇప్పటిదాకా స్పంధించనేలేదు. అయినా అక్కడ నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితి, ఏ దేశం నుంచీ పాకిస్తాన్ కు అప్పు పుట్టకపోవడం, సాయానికి ఎవరూ ముందుకు రాకపోతుండటంతో పాలకులు తల్లడిల్లుతున్నారు.

దాంతో ఎటూ పాలుబోక భారత్ తో సంబంధాలను గుర్తు చేసుకుని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ తో అర్జంటుగా చర్చలు జరపాల్సిన అవసరం భారతదేశానికి ఎంత మాత్రం లేదు. పైగా పాకిస్తాన్ తో స్నేహ సంబంధాలు పునరుద్దరించుకోవడం వల్ల రూపాయి లాభం కూడా లేదు. పైగా పాకిస్తాన్ నుంచి భారత సరిహద్దుల్లో దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ చేతికి అంటిన రక్తపు మరకలు ఆరకముందే స్నేహం అంటూ ముందుకు రావడాన్ని భారతదేశం ఎంత మాత్రం దరి చేరనీయదు. నేరుగా భారత్ తో స్నేహం అంటూ ఓ ప్రకటన చేసి ఆపై కశ్మీరు వివాదపు మెలిక పెట్టడం పాకిస్తాన్ కు ఓ ఆటగా మారిపోయింది.

అందుకే పాకిస్తాన్ కుయుక్తుల్ని భారత్ గంభీరంగా ఆలకిస్తోంది. ఇక తన పప్పులు ఉడకవని గమనించిన ప్రధాని షెహబాజ్ షరీఫ్ యూ ఏ ఈని మధ్యలోకి దూరుస్తున్నారు. తోటి ఇస్లాం దేశం కదా అని యూఏఈ..తన వద్దకు మరో అప్పు కోసం వచ్చిన పాక్ ప్రధానికి ఓ ఉచిత సలహా ఇచ్చింది. ముందు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు పెంచుకుంటే చాలా సమస్యలు తీరిపోతాయని తెలిపింది. దాంతో ఇక షెహబాజ్ షరీప్ యూఏఈ వెంట పడ్డారు..ఆ పనేదో మీరే చేసి పెట్టమని విజ్నప్తి చేసారు. అయితే భారత్-పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని, ద్వేషాన్ని యుఏఈ తగ్గించగలదా? అన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారింది.

ఎందుకంటే ఈ రెండు దేశాల గతం చాలా దారుణమైన అనుభవాలతో గడచిపోయింది. 2019 ఫిబ్రవరి 14. భారత సైనికులతో కూడిన బస్సు కశ్మీర్ గుండా వెళుతోంది. పుల్వామా నగరంలో పేలుడు పదార్థాలు నింపుకున్న ఒక కారు బస్సుపైకి దూసుకెళ్లింది. ఈ ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అది తమ ఘనతేనని అప్పటి పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరీ నేషనల్ అసెంబ్లీలోనే ప్రకటించి గల్లా ఎగరేసారు. తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గొప్పదనమే అంటూ ప్రకటన చేసారు. దాంతో భారత్ ఊరుకోలేదు.

కేవలం 12 రోజుల్లోనే..అంటే 2019 ఫిబ్రవరి 26 పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్ చేసింది. అలా చేసిన విషయం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్ పగ తీర్చుకుందని, ఇంట్లోకి చొచ్చుకెళ్లి మరీ దెబ్బకొట్టిందని న్యూస్ చానల్స్ వార్తలను ప్రసారం చేశాయి. 2019 ఆగస్టు 5. అంతకు కొద్ది రోజుల క్రితం, కశ్మీర్ సందర్శనకు, అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారు వెనక్కి తిరిగి వచ్చేయాలని, సొంతూళ్లకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు. మెల్లగా కశ్మీర్‌ వాతావరణంలో నిశ్శబ్దం అలుముకుంది. భారీగా సైనికులను మోహరించారు.

ఆగస్టు 5న మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇవీ గత కొన్నేళ్లుగా భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య దూరాన్ని, ద్వేషాన్ని పెంచిన మూడు ఘటనలు. ఏడాదిన్నర తరువాత 2021లో అకస్మాత్తుగా భారత్, పాకిస్తాన్ సైనిక అధికారుల సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో “శాంతియుతంగా చర్చలు సాగాయని” అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా ప్రకటన చేసారు, పత్తి, చక్కెర వంటి దిగుమతులపై నిషేధాన్ని తొలగించాలన్న అంశాలు కూడా ఆ సమావేశం తరువాత తెరపైకి వచ్చాయి. దాంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ దారిలోకి వస్తున్నాయని చాలామంది భావించారు. దీనంతటికి కారణం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ‘యూఏఈ’ తీసుకున్న చొరవ అని చెప్పవచ్చు.

యూఏఈ మన దేశంతో మంచి సంబంధాలు మెయింటెయిన్ చేస్తోంది. భారత్ తో గౌరవంగా ఉంటోంది. పైగా మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అది కూడా కల్లోలిత కశ్మీరు లోయలోనే వేలాది కోట్లతో అభివ్రుద్ది పనులపై పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. అందుకే యూఏఈ వెంట పడుతోంది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ లో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. సమస్యలన్నీ ఆర్థిక పరిస్థితులకు సంబంధించినవిగా ఉన్నాయి. పాక్ వద్ద రూపాయి లేకుండో పోతోంది.

దేశంలో గోధుమ పిండి కరువైంది. ఉన్న స్టాక్ , వ్యాపారులు అక్రమంగా దాచుకున్న స్టాక్ కూడా అయిపోయింది. దీంతో మీదపడి దోచుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతే కాదు శ్రీలంకలో జనం పార్లమెంటు భవనంపై దాడులు చేసినట్టుగా జనం పాకిస్తాన్ ప్రభుత్వ భవనాలపై దాడులకు సిధ్దపడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ పాలు పోసి పెంచిన ఉగ్రవాద సర్పాలు పాకిస్తాన్ పోలీసులను మిలిటరీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం నిత్య క్రుత్యంగా మారిపోయింది. దీంతో పాకిస్తాన్ కు ప్రస్తుతం ఎటూ పాలు పోవడం లేదు.

భారత్ తో దోస్తీతో అప్పు పుట్టకపోయినా, భారత్ అభ్యంతరాల వల్ల నిలిచిపోతున్న విదేశీ సాయం లభించవచ్చని గుర్తించింది. నిత్యావసరాలు, అత్యవసర మందుల లాంటి కొన్ని సమస్యలు తక్షణం తీరే అవకాశం ఉండటంతో యూఏఈ వెంటపడుతున్నారు షెహబాజ్ షరీఫ్..భారత్, పాకిస్తాన్‌ల మధ్య స్తంభించిన సంబంధాలను యూఏఈ మాత్రమే కదిలించగలదని పాకిస్తాన్ నమ్ముతోంది. మళ్లీ 2023 జనవరిలో యూఏఈ ద్వారా భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు మెరుగుపడతాయనే ఆశలు పాక్ ప్రజలలో మొలకెత్తుతున్నాయి. కానీ భారత ప్రజలు మాత్రం ఈ ప్రతిపాధన పట్ల ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే నిన్న మొన్న కూడా జమ్ములో జరిగిన ఆత్మాహుతి దాడులు జరిగాయి. అందుకే ఇప్పటి వరకు మనదేశం ఏ స్పంధనా కనబరచడం లేదు.

ప్రస్తుతం పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అధికారం చేపట్టిన తరువాత మూడవసారి యూఏఈ పర్యటనకు వెళ్లారు. అక్కడ అల్-అరేబియా న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షరీఫ్ మాట్లాడుతూ, “భారత్, పాకిస్తాన్‌ల మధ్య సయోధ్య తీసుకురావాలని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను కోరాను. ఆయన మాకు మిత్రుడు. భారత్‌తో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య మాటలు మొదలయ్యేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించగలరు. హృదయపూర్వకంగా భారత్‌తో మాట్లాడతామని ఆయనకు మాటిచ్చాను” అని అన్నారు. “గుణపాఠాలు నేర్చుకోవడం”, “శాంతి కోసం సిద్ధంగా ఉండడం” లాంటి కామెడి ప్రకటనలు కూడా షరీఫ్ చేసారు.

అయితే భారత ప్రధాని గానీ, భారత విదేశాంగ శాఖ మంత్రి కూడా ఈ సందర్భంగా నిశ్శబ్దమే పాటించారు. కేవలం భారత విదేశాంగ శాఖ ప్రతినిధి స్థాయి అధికారి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, “ఇలాంటి చర్చలకు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఇదే మా దృక్కోణమని” అని కుండ బద్దలు కొట్టారు.అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా మారిన షరీఫ్ మాత్రం “నేను భారత ప్రధాని మోదీకి ఈ సందేశం అందించాలనుకుంటున్నాను.. రండి, మనం కలిసి కూర్చుని కశ్మీర్ వంటి నిత్యం మండే విషయాలపై సీరియస్‌గా చర్చించుకుందాం” అని పాతపాటే పాడేసారు.

అయితే, యూఏఈ షరీఫ్ రెండు నాలికల దోరణి పాకిస్తాన్ ఉగ్రవాదులను అదుపు చేయగలరా..అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. భారత్, యూఏఈల మధ్య మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. 2022లో మోదీ అబుదాబి వెళ్లినప్పుడు, యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు. అలాగే, పాకిస్తాన్‌కూ యూఏఈతో మంచి సంబంధాలు ఉన్నాయి. 2023 జనవరిలో పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ యూఏఈలో పర్యటించారు. ఆ సందర్భంగా యూఏఈ పాకిస్తాన్‌కు మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే దిశగా యూఏఈ కూడా ప్రయత్నిస్తోందని 2021 ఏప్రిల్‌లో రాయిటర్స్ వార్తా సంస్థ ఒక నివేదికను ప్రచురించింది. ఇదే విషయమై 2021 జనవరిలో దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ అధికారుల మధ్య ‘రహస్య సమావేశం’ కూడా జరిగిందని తెలిపింది. మరి, భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలపై ఉన్న దుమ్మును యూఏఈ దులిపివేయగలదా అన్నది చూడాల్సిన అంశంగా మారింది.

Must Read

spot_img