- తెలంగాణలో కాంగ్రెస్ ఛిన్నాభిన్నంగా మారింది.
- దీన్ని బతికించుకోవాల్సిన నేతలు .. ఇంకా నాశనం చేసే దిశగానే వ్యవహరిస్తున్నారు.
- తాజాగా జనగాం టిక్కెట్ పై ఇద్దరు నేతల రచ్చ చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో అధికారం కోసం రెండు సార్లు కొట్లాడి ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు ఇంకా సోయి రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారం కోసం ప్రజల్లోకి వెళ్లి కష్టపడాల్సింది పోయి టికెట్ల కోసం కొట్టుకుంటున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్తితిని మార్చకుండా.. నేతలు ఇప్పటి నుంచే టికెట్ల లొల్లి షురూ చేయడం విస్తుగొలుపుతోంది.

తాజాగా జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పొన్నాల లక్ష్మయ్యపై సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు తనకే కావాలని ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో జనగామ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే టికెట్ల కోసం ముష్టి యుద్ధాలు మొదలైనట్లు చర్చ సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జి మారినా, కాంగ్రెస్ పరిస్థితి మాత్రం మారేలా కనిపించడం లేదు.
సీనియర్లు జూనియర్లు కలిసిపోయిన దాఖలాలు లేవు. సమష్టిగా ఉంటామని కొత్త ఇన్ చార్జి థాక్రేకు నేతల హామీలు కేవలం ఉత్తుత్తి ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. లోలోపల నాయకుల మధ్య విభేదాలు మీటింగ్ నుంచి బయటకు రాగానే బయటపడుతున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రపై అనుమానాలు నెలకొంటున్నాయి. పార్టీ కోసం సమష్టిగా పనిచేస్తామని థాక్రేకు కాంగ్రెస్ నేతలు వాగ్ధానం చేశారట.
ప్రస్తుతమున్న టీపీసీసీ కమిటీలను సీనియర్లు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కస్టపడే కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. పార్టీ బలోపేతం కోసం తాము కృషి చేస్తుంటే కీలక పోస్టుల్లో ఉన్న వ్యక్తులు మాత్రం నిత్యం విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నారు.
ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. ఒకరినొకరు తిట్టిపోసుకోవడం.. చిన్న విషయాలకు రచ్చ చేసుకోవడం అలవాటుగా మారింది. తాజాగా జనగామ టికెట్ తనకే కావాలని ఆ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవారెడ్డి అసమ్మతి రాజేశారు. కాంగ్రెస్ టికెట్ విషయంలో పొన్నాల లక్ష్మయ్య డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. ఒక కార్యకర్తతో టికెట్ తనకే అంటూ పొన్నాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జంగా రాఘవరెడ్డి ఆడియో వైరల్ అవుతోంది.
అందులో పొన్నాలపై సంచలన ఆరోపణలు చేశారు. పొన్నాల మంత్రిగా ఉన్న సమయంలో తాను 10 కోట్ల కమిషన్ ఇప్పించానని రాఘవరెడ్డి ఆ ఆడియోలో సంచలన ఆరోపణలు చేశారు.
- పొన్నాల ఎవరినీ స్థానికంగా ఎదగనివ్వరని, ఆయన కొడుకు కోడలు సైతం ఆయనతో లేరని ఆరోపించారు.
పొన్నాల సొంతూరు ఖిలాషాపూర్ గ్రామానికి రోడ్డును కూడా తానే మంజూరు చేయించానని రాఘవరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలని.. ఇవ్వకుంటే పార్టీకి, జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు రాఘవరెడ్డి తెలిపారు. ఇందులోనూ పొన్నాల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అయితే ఈ ఆడియో ఒరిజినలా? లేక ఫేక్ యేనా? అన్నది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జనగామ టికెట్ కోసం కోల్డ్ వార్ మొదలైనట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకి దిగజారి పోతుంటే, పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంటే పార్టీలో నేతలు మాత్రం ఇప్పటినుంచే టికెట్ల కోసం తగవులు ఆడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రోజు రోజుకు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది.
అటువంటి చోట కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు తీసుకు వెళ్లాల్సిన నేతలు ఆ పని చేయకపోగా, సొంత పార్టీలోని నేతలపై రాజకీయాలు చేస్తున్నారు. 24 గంటలు కాంగ్రెస్ పార్టీలోని నేతలకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరినొకరు తిట్టిపోసుకోవడం, చిన్న చిన్న విషయాలకు రచ్చ చేసుకోవడం అలవాటుగా మారింది.
పొన్నాల లక్ష్మయ్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జంగా రాఘవరెడ్డి జనగామ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ కోసం పొన్నాల లక్ష్మయ్య డ్రామా ఆడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా తనకే టికెట్ ఇవ్వాలని, పార్టీ టికెట్ తనకు ఇవ్వకుంటే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని తాను అధిష్టానానికి తేల్చి చెప్పానని జంగా రాఘవరెడ్డి వెల్లడించారు.
జిల్లా అధ్యక్ష పదవి విషయంలోను పొన్నాల లక్ష్మయ్య రాజకీయం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు జంగా రాఘవరెడ్డి. దీంతో వచ్చే ఎన్నికల టికెట్ కోసం జంగా వర్సెస్ పొన్నాల లక్ష్మయ్య అన్నట్టు కాంగ్రెస్ రాజకీయం సాగుతోంది. ప్రజాస్వామ్యం పేరుతో పార్టీలో నేతలు నిత్యం కొట్టుకు చస్తున్నారు. పార్టీ పరువు మంటగలుపుతున్నారు. ఇక తెలంగాణలో అయితే కాంగ్రెస్‌ను చిలవలు పలువలు చేయడానికి సీనియర్లు వీలైనంతవరకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా టీకాంగ్రెస్‌లో రోజుకో కొట్లాట కొనసాగుతోంది. వీటికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా మరో లొల్లి మొదలైంది.
- పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వర్గీయుల మధ్య గ్రూపు విభేదాలు నెలకొన్నాయి..
మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, అతని అనుచరులకు ఘోర పరాభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జనగామలోని 30 వార్డులకు గానూ పొన్నాల అనుచరులకు ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఇవ్వకపోవడం గమనార్హం. జిల్లా కాంగ్రెస్‌పై జంగా పూర్తి పట్టు సాధించేందుకు యత్నిస్తున్నారు. దీంతో పొన్నాలను కాంగ్రెస్ నుంచి పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలెప్పుడు వచ్చినా సిద్దమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ సై అంటోంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయంపాలైంది. రెండు టర్మ్ లలో 17మంది కాంగ్రెస్ లో గెలిచి అధికారపార్టీలో చేరారు. గత ఏనిమిదేళ్లుగా ఎన్నిక అది ఉపఎన్నిక అయినా.. మున్సిపల్ పంచాయితీ కార్పోరేషన్ ఏవైనా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపిందిలేదు. పొన్నాల లక్ష్మయ్య, ఉత్తం కుమార్ రెడ్డి పీసీసీ ఛీఫ్ లుగా పనిచేశారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి పీసీసీ ఛీఫ్ గా ఉన్నారు. రేవంత్ పీసీసీ అయ్యాక కాంగ్రేస్ లో జోష్ వచ్చిందన్న ప్రచారం ఎలా ఉన్నా.. ఎన్నికల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. హుజూరాబాద్ లో డిపాజిట్ కోల్పోయింది. నాగార్జున సాగర్ లో రెండోస్తానం, మునుగోడులో మూడోస్థానంతో సరిపెట్టుకొంది. అటు సీనియర్ వర్సెస్ వలస నేతలంటూ కాంగ్రెస్ లో రేవంత్ టార్గెట్ గా రాజకీయం నడుస్తోంది.
ఈ పరిస్ధితుల్లో కాంగ్రెస్ లో టిక్కెట్ల లొల్లి షురూ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే జనగామ సెగ్మెంట్లో జంగా ఆడియో వైరల్ కావడంతో బయటపడిందని, అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని సెగ్మెంట్లలోనూ సీనియర్లు, జూనియర్ల మధ్య టిక్కెట్ వార్ ఓ రేంజ్ లో సాగుతోందని టాక్ వినిపిస్తోంది.
తాజా పరిణామాలతో .. ఈ రచ్చపై హైకమాండ్ ముఖ్యంగా నూతన ఇంఛార్జి ఠాక్రే ఏం చేస్తారోనన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో కునారిల్లుతోందని, ఇటువంటి వర్గపోరు .. మరింత చేటు తెస్తుందని కేడర్ డీలా పడుతోంది. పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన నేతలు .. ఒకరిపై ఒకరు విమర్శలతో పార్టీని నాశనం చేస్తున్నారని విమర్శకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ ఛీఫ్ రేవంత్ ఏం చేయనున్నారన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. దీంతో జనగామలో వర్గపోరుపై ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే చర్చనీయాంశంగా మారింది.
మరి జంగా వర్సెస్ పొన్నాల ఎపిసోడ్ నెక్ట్స్ స్టెప్ ఏమిటన్నదే హాట్ టాపిక్ గా మారింది.