Homeజాతీయంఒక నేరానికి రెండు తీర్పులు ..

ఒక నేరానికి రెండు తీర్పులు ..

మనదేశంలో ప్రభుత్వాలకు అనుగుణంగా వ్యవహరించే విషయంలో పోలీసులు ముందు వరుసలో ఉంటారు. ఆపై బ్యూరోక్రాట్స్ మేమున్నామంటూ ముందుకు వస్తారు. లంచగొండులుగా మారే అధికారులు లాలూచి ప్రభుత్వాలతో చేతులు కలిపితే సదరు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుంది. వారికి తోడుగా పోలీసులుంటే ఇక ప్రభుత్వాన్ని నడిపించాల్సిన పాలకులు నియంతలుగా మారతారు. అప్పుడు వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొంత కాలం సాగిపోతూంటుంది. అయితే ఇటువంటి వారికి చెంపపెట్టులాంటిది అక్కడి న్యాయవ్యవస్థ అని చెప్పుకోవచ్చు. సదరు న్యాయవ్యవస్థ ఒక్కసారి జూలు విదిలించిందంటే ఎవరినీ ఖాతరు చేయదు. అలాంటిదే ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. అయితే అది మూడు దశాబ్దాల నాడు జరిగిన ఓ ఫేక్ ఎన్ కౌంటర్ కు సంబంధించిన కేసు. దానిపేరు ఫిలబిత్ ఎన్ కౌంటర్ కేసు..అయితే కొన్ని సందర్భాలలో కోర్టు తీర్పుల విషయాలను పరిశీలించి చూస్తే భిన్నమైన ఆలోచనలు వస్తాయి.

రెండు కోర్టులు ఒకే నేరానికి రెండు రకాలైన తీర్పుల వెలువరిస్తూ ఆశ్చర్యంలో ముంచేస్తాయి. అలాంటిదే ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఫిలిబిత్ ఎన్ కౌంటర్ విషయంలో జరిగింది. అక్కడ జరిగిన ఒక నేరానికి రెండు తీర్పులు ఇచ్చారు.

ముప్పైసంవత్సరాల క్రితం దేశాన్ని ఫిలిబిత్ ఎన్ కౌంటర్ కేసు కుదిపేసిందంటే అతిశయోక్తి కాదు. మీకు తెలుసా ఆ కేసులో పాల్గొన్న 43మంది ఉత్తర్ ప్రదేశ్ పోలీసులకు అలహాబాద్ కోర్టు ఏడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించింది. ఖలిస్తానీ ఉగ్రవాదుల పేరిట పదిమంది సామాన్య సిక్కులను కాల్చిచంపిన ఈ కేసులో, సీబీఐ కోర్టు 2016లో నేరాన్ని హత్యగా పరిగణించి, నిందితులకు యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తే, హైకోర్టు ఇప్పుడు దానిని హత్యకిందకు రాని నరవధగా పరిగణిస్తూ శిక్షను మార్చింది. ఒక ప్రభుత్వోద్యోగి తాను చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నానని నమ్ముతూ మరొకరి మరణానికి కారకుడైనప్పుడు, దానిని హత్య అనకూడదని చట్టం చెబుతోంది

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 300లోని మినహాయింపును హైకోర్టు ఈ కేసులో వర్తింపచేసింది. ఘటన జరిగిన ముప్పయ్యేళ్ళ తరువాత ఈ తీర్పుతో నిందితులకు ఒరిగేదేమిటన్నది అటుంచితే, ఈ రెండు తీర్పుల్లోనూ నిందితులను చూసే కోణంలో చాలా తేడా ఉంది. తీర్థయాత్ర ముగించుకొని కొందరు సిక్కులు బస్సులో వెనక్కు వస్తుండగా 1991 జులైలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ కు చెందిన ఉగ్రవాదులు ఈ బస్సులో ఉన్నారని అనుమానించిన పోలీసులు, ఒకరిద్దరు వృద్ధులను, స్త్రీలను బస్సులోనే వదిలి, ఓ పదిమందిని తమ వ్యానులో ఎక్కించుకొని గంటల పాటు తిప్పారు. ఆ తరువాత బస్సును ఒక గురుద్వారా వద్ద వదిలి, యువకులను తీసుకుపోయి మూడుచోట్ల ఎన్ కౌంటర్ చేశారు. ఆ మర్నాడు పోలీసు ఉన్నతాధికారులు పదిమంది కరడుగట్టిన ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ప్రకటించారు.

పంజాబ్ లో ఉగ్రవాదం పతాకస్థాయిలో ఉంటూ, ఉత్తర్ ప్రదేశ్ అంచుల్లోనూ ఉగ్రవాదులు చురుకుగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతున్నప్పటి మాట..

అంతేకాదు, ఉగ్రవాదాన్ని నిర్మూలించే పేరిట భారీ కేటాయింపులు జరుగుతూ, పోలీసులకు పురస్కారాలు, ప్రమోషన్లు అందుతున్నాయి. దాంతో పోలీసుల అత్యుత్సాహం అమాయకుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వాలు సైతం అనుమానితుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించేవి. దేశాన్ని కుదిపేసిన ఈ ఘటన మీద కల్యాణ్ సింగ్ ప్రభుత్వం నియమించిన కమిషన్ ఈ పోలీసులకు క్లీన్ చిట్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కేసు మూసివేసింది. అయితే నిజం నిలకడ మీద తెలుస్తుంది.

ఆ తరువాత, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. సరైన కోణంలో దర్యాప్తు చేపట్టి, యాభై ఏడుమంది పోలీసులను నకిలీ ఎన్ కౌంటర్ కు బాధ్యులుగా ప్రకటించింది. పోలీసులు చెప్పినవన్నీ కట్టు కథలేననీ, నిరాయుధులైన వారిని బస్సులో నుంచి దించి ఇతరత్రా ఉద్దేశాలతో కాల్చిచంపేశారని సీబీఐ నిరూపించింది. దీనిని ఘోరాతిఘోరమైన హత్యాకాండగా సీబీఐ కోర్టు నిర్ధారించి నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది.

అయితే ఎన్ కౌంటర్ విషయలో దేశవ్యాప్తంగా పోలీసులు చెప్పే మాట ఒకటే..నిందితులు తమపై తిరగబడి తమ ఆయుధాలను లాక్కునే ప్రయత్నం చేసారనీ, ఆ క్రమంలో వారిని లొంగిపోవాలని కోరామనీ, వారు వినకపోవడంతోపాటు తమపై దాడులకు ప్రయత్నించారనీ..ఆ క్రమంలో ఆత్మరక్షణలో కోసం వారిపై కాల్పులు జరిపడం జరిగిందని అరిగిపోయిన రికార్డు లాగా స్టేట్మెంట్లు చేస్తుంటారు. సరిగ్గా అలాగే ఫిలిబిత్ కేసులోనూ జరిగింది. ఆ పదిమంది సిక్కులూ తమపై కాల్పులు జరిపితే, ఆత్మరక్షణలో భాగంగా తాము ఎన్ కౌంటర్ చేయవలసి వచ్చిందని పోలీసులు నమ్మబలికారు.

కానీ వారి వాదనను ఇప్పుడు కూడా అలహాబాద్ హైకోర్టు విశ్వసించలేదు. అయితే, బస్సులో కొందరు ఉగ్రవాదులున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారాన్ని, వారిలో కొందరిపై గతంలో కేసులున్నాయన్న ప్రభుత్వవాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కోర్టుకు సాక్షాలు కావాలి.. కథనాలు కథలు అక్కడ పనికి రావు..బాధితులను బస్సులో నుంచి దింపి, బలవంతంగా పట్టుకుపోయి వేర్వేరు చోట్ల హత్యచేసినట్టుగా నిర్ధారించగల సాక్ష్యాలు లేనందున నిందితులు ఉమ్మడి లక్ష్యంతో నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని భావించలేమని తేల్చింది. పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేసినమాట నిజమే అయినా, బాధితులకు నిందితులకు మధ్య గతకాలపు వైరాలు వైషమ్యాలు లేవు..

కనుక, వారి ఉద్దేశం కూడా ప్రజారక్షణే కనుక దీనిని నేరుగా హత్యగా పరిగణించలేమని భావించింది.. వృత్తిధర్మానికి కట్టుబడిన భావన, సదుద్దేశం ఇలాంటి ప్రాతిపదికల ఆధారంగా, ఐపీసీలో ఇచ్చిన మినహాయింపును నిందితులకు అన్వయింపచేసింది. సీబీఐ కోర్టు విధించిన జీవితకాల ఖైదును ఏడు సంవత్సరాల కఠినకారాగారంగా మార్చింది. న్యాయంలో జాప్యం అన్యాయంతో సమానమంటారు. అయినా, ఈ ఎన్ కౌంటర్ జరిగిన పదిహేనేళ్ళకు సీబీఐ కోర్టు తీర్పు చెప్పినప్పుడు న్యాయం చేకూరిందనే బాధిత కుటుంబీకులు, ప్రజాసంఘాలు సంతోషించాయి.

ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతాలు తీసుకుంటూ ప్రజారక్షణ మాటున పోలీసులు, భద్రతాదళాలు, బ్రూరోక్రాట్స్ చేసే అక్రమాలు నేడు సర్వసాధారణంగా మారాయి. నేతలకు అండగా ఉంటూ వారి కొమ్ము కాస్తూ తమకు యజమానులైన ప్రజలపై జులుం చేస్తున్నారు.

చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ అమాయకులను భక్షిస్తున్నా, శిక్షలకు అతీతమన్న భావనతో నిర్భయంగా ఉండగలుగుతున్నారు. సీబీఐ కోర్టు తన తీర్పుతో మంచి హెచ్చరిక చేసిందని అందరూ భావించారు. అనేక సెక్షన్ల ఆధారంగా పలురకాల అభియోగాలతో పడిన ఆ శిక్షను ఇప్పుడు ఒకటి రెండు సెక్షన్లకు కుదించి అలహాబాద్ హైకోర్టు వారిని ఏడేళ్ల పాటు జైలు శిక్షకు పరిమితం చేస్తూ వెలువరించిన తీర్పు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నదో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇటువంటి ఘటనలే జరుగుతున్నాయి. సామాన్య ప్రజలంటే పోలీసులకు అధికారులకు లెక్కే లేకుండా పోతోంది. ఎంత సేపూ తమ పై బాసుల మెప్పు పొందడం, వారి నుంచి ఇంక్రిమెంట్లు ప్రమోషన్ల కోసం ఎదురుచూడటంతోనే వారి జీవితాలు ముగిసిపోతున్నాయి.

తమకు వచ్చే ప్రయోజనాల కోసం వీరు ఎంతకైనా తెగిస్తున్నారు. చట్టాలను కాపాడాల్సని పోలీసులు చట్టాలను చేతుల్లోకి తీసుకుంటున్నారు. కానీ రేపటి దినం ఫిలిబిత్ లాంటి కేసుల్లో శిక్షలుంటాయని సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పు ఉదాత్తమైనది అంటున్నారు విశ్లేషకులు. పోలీసులకు నిజంగానే యావజ్జీవం పడి ఉండాల్సిందని దేశం మొత్తం భావించింది. అందుకే మన దేశంలో ఏ రెండు కోర్టులూ ఒకలా ఆలోచించడం లేదని అంటున్నారు నిపుణులు. అయితే హైకోర్టు తీర్పు కూడా మామూలు తీర్పేం కాదు..కాకపోతే ఆ మినహయింపును వారికి అన్వయించడం వలన యావజ్జీవం తప్పింది.

Must Read

spot_img