Homeఅంతర్జాతీయంట్విట్టర్ కు షాక్ మీద షాక్... కోర్టులో దావా...

ట్విట్టర్ కు షాక్ మీద షాక్… కోర్టులో దావా…

ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ ను చిక్కులు వీడట్లేదు. ఒక వివాదం ముగిసేలోపే మరొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా.. ఆఫీసు అద్దె కట్టట్లేదంటూ ఆ కంపెనీపై అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కొలంబియా రెయిత్ కంపెనీ ట్విట్టర్ పై కోర్టు కెక్కింది.

ట్విట్టర్ కంపెనీ 1.36 లక్షల డాలర్ల అద్దె బకాయిపడిందని ఆరోపిస్తోంది. ట్విట్టర్ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలోని హార్ట్ ఫోర్డ్ బిల్డింగ్ లో 30 వ అంతస్థులో ఉంది. ఈ బిల్డింగ్ సొంతదారు కొలంబియా రెయిత్ నుంచి ట్విట్టర్ అద్దెకు తీసుకుంది. అయితే, ఇటీవల కొన్ని వారాల నుంచి ట్విట్టర్ అద్దె చెల్లించట్లేదని కొలంబియా రెయిత్ ఆరోపించింది. దీనిపై గత నెల 16న ట్విట్టర్ కు నోటీసులు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. అయినా కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో ట్విట్టర్ పై కోర్టులో దావా వేసినట్లు ఓ ప్రకటనలో వివరించింది.

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విటర్‌ భవిష్యత్‌ గందర గోళంలో పడింది. ఏ ముహూర్తాన ఎలాన్ మస్క్ ట్విట్టర్ బాస్ అయ్యాడో గానీ.. వరుస బెట్టి చిక్కుల్లో పడుతున్నాడు. లీగల్ ట్రబుల్స్ పెరుగుతున్నాయి. తాను కొనుగోలు చేసిన ధ‌ర‌కే ట్విటర్‌ను అమ్మేస్తానంటూ ఎల‌న్ మస్క్ సంచలన ప్రకటన చేశారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ సంస్థలో ఏం జరుగుతుందో అర్ధం గాక ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. 2022 అక్టోబర్‌లో బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లను పెట్టుబడి పెట్టి ట్విటర్‌ను సొంతం చేసుకున్నారు. కొనుగోలు అనంతరం బాస్‌ అవతారమెత్తిన మస్క్‌ ఆ సంస్థలో సమూల మార్పులు చేశారు. వాటిలో ఉద్యోగుల తొలగింపు, పెయిడ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని వినియోగం లోకి తేవడం వంటి కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంతో ఆ సంస్థ భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.

ఈ నేపథ్యంలో తానెంతకైతే కొనుగోలు చేశానో .. మీరు కూడా అంతే మొత్తం చెల్లించి ట్విటర్‌ను సొంతం చేసుకోండి అంటూ పెట్టుబడి దారులకు మస్క్‌ ఆఫర్‌ చేసినట్లు ఇటివల వార్తలు బయటకు వచ్చాయి. అయితే నివేదికలపై ట్విటర్‌ ప్రతినిధులు స్పందించలేదు. సీన్ కట్ చేస్తే… ఇప్పుడు ట్విట్టర్ బిల్డింగ్ అద్దె పంచయతీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శాన్ ఫ్రాన్సిస్కో లోని తన కంపెనీ ఆఫీసుకు అద్దె కట్టనందుకు ఈ స్థల యజమాని ఆయనపై కోర్టుకెక్కాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న కార్యాలయానికి 1లక్షల 36వేల 250 డాలర్ల అద్దె చెల్లించడంలో విఫలమవడంతో పరిస్థితి విషయం కోర్టు కేసు దాకా వెళ్లింది. హార్ట్‌ఫోర్డ్‌ బిల్డింగ్‌లో 30వ అంతస్తులో ఉన్న కార్యాలయానికి బకాయి ఉన్న అద్దెను ఐదు రోజుల్లోగా చెల్లించాలంటూ గత డిసెంబర్‌ 16న యాజమాన్య సంస్థ కొలంబియా రీట్‌ తాఖీదులిచ్చింది.

అయితే ఇన్నాళ్లయినా అద్దె చెల్లించలేకపోయేసరికి కొలంబియా రీట్ అనే ఓనర్ కి చిరాకెత్తింది. నాకు రెంట్ చెల్లించలేక చేతులెత్తేశాడంటూ మస్క్ మీద గత నెల 29 న శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశాడు. ఇక లీజు రద్దు చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రధాన కార్యాలయానికే కాదు. ప్రపంచ వ్యాప్తంగా గల ఇతర ట్విట్టర్ ఆఫీసులకు కూడా మస్క్ వారాల తరబడి అద్దె చెల్లించలేదన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సంస్థపై ఓ ఓనరు కోర్టుకెక్కడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా రెండు చార్టర్ విమానాలకు ఈ కంపెనీ అద్దె నిరాకరించడంతో వాటి యజమానులు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారట. ఈ సంస్థను తాను 44 బిలియన్ డాలర్లకు కొన్న తరువాత మస్క్ అద్దె చెల్లించడం ఆపేశాడని న్యూయార్క్ టైమ్స్ ఓ వార్తను ప్రచురించింది.

ఇదిలా ఉంటే ..ఎలన్ మస్క్ చర్యలతో ట్విట్టర్ ఉద్యోగులు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వేల సంఖ్యలో సిబ్బంది ఉద్యోగం కోల్పోగా, ఉన్నవాళ్లు కూడా సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికాలోని అనేక ట్విట్టర్ కార్యాలయాల్లో ఉద్యోగులకు కనీస వసతులు కూడా అందడం లేదు. చివరికి టాయిలెట్ పేపర్స్ కూడా ఉండటం లేదు. దీంతో ఉద్యోగులు తమ ఇంటి నుంచే టాయిలెట్ పేపర్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ కంపెనీ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీనిలో భాగంగా ఉద్యోగుల్ని తీసేశాడు. పలు ఆఫీసుల్ని మూసేశాడు. ఉద్యోగులకు ఇచ్చే అనేక సౌకర్యాల్లోనూ కోత పెట్టాడు. కొన్ని కార్యాలయాల్లో సెక్యూరిటీ స్టాఫ్, శానిటేషన్ స్టాఫ్‌ను కూడా తొలగించాడు. దీంతో ఆఫీసుల్ని శుభ్రం చేసే వాళ్లు కూడా లేకుండాపోయారు. టాయిలెట్లలో పేపర్స్ మార్చే వాళ్లు కూడా లేరు. దీంతో చాలా మంది ఉద్యోగులు తమ టాయిలెట్ పేపర్స్ తామే వెంట తెచ్చుకుంటున్నారు. న్యూయార్క్ నగరంలోని ఆఫీసులోనే ఇలా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

శాన్‌ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంలో కూడా పరిస్థితి ఇలాగే ఉందట. మరోవైపు శానిటేషన్ సిబ్బంది తమ జీతాల పెంపు కోరుతూ నిరసనకు దిగారు. దీంతో మస్క్ వాళ్లందరినీ తొలగించాడు. పారిశుధ్య సిబ్బంది లేకపోవడంతో అక్కడి వాష్ రూమ్స్ కంపుకొడుతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే..అనేక మంది రకరకాల అంశాల్లో ప్రతిభ చూపుతూ ఘనతవహిస్తూ ఉంటారు. కానీ ఎలన్ మస్క్ మాత్రం సంపదను పోగొట్టుకోవడంలో రికార్డు సృష్టించారు. నికర సంపద విలువలో 200 బిలియన్ డాలర్లను కోల్పోయారు. ఇది మానవ చరిత్రలోనే ఓ రికార్డు. 2021 జనవరిలో వెల్లడైన సమాచారం ప్రకారం, 200 బిలియన్ డాలర్లకుపైగా వ్యక్తిగత సంపదగల మొదటి వ్యక్తి జెఫ్ బెజోస్ కాగా, రెండో వ్యక్తిగా ఎలన్ మస్క్. ఈ వివరాలను బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.

ఎలన్ మస్క్ సంపద ఆవిరైపోవడానికి కారణం ఏమిటంటే, ఇటీవలి వారాల్లో టెస్లా షేర్లు క్షీణించడం, అంతేకాకుండా డిసెంబరు 27న టెస్లా షేర్లు 11 శాతం పతనమవడం. దీంతో ఆయన సంపద 137 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. టెస్లా అమెరికన్ కస్టమర్లకు సంవత్సరం చివరినాటికి తన రెండు హయ్యెస్ట్ వాల్యూమ్ మోడల్స్‌కు 7వేల 500 డాలర్ల డిస్కౌంట్ ప్రకటించింది. తన షాంఘై ప్లాంట్‌లో ఉత్పత్తిని కూడా తగ్గించేసినట్లు తెలుస్తోంది. 2021 నవంబరులో మస్క్ సంపద విలువ 340 బిలియన్ డాలర్లు ఉండేది. ఆయన దాదాపు ఓ సంవత్సరంపాటు ప్రపంచ సంపన్నుల్లో ప్రథమ స్థానంలో ఉండేవారు. డిసెంబర్ లో ఆయనను బెర్నార్డ్ ఆర్నాల్ట్ అధిగమించారు. బెర్నార్డ్ ఫ్రెంచ్ బిజినెస్ మేగ్నెట్, లగ్జరీ గూడ్స్ పవర్‌హౌస్ ఎల్‌వీఎంహెచ్ సహ వ్యవస్థాపకుడు.

మస్క్ అక్టోబరులో ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు. దీనికోసం ఆయన ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే తన కంపెనీ టెస్లాలో తన వాటాల్లో అత్యధిక భాగం అమ్మేశారు. ఇంత డబ్బు పోసి ట్విట్టర్ ని కొన్న తనకు ఆదాయం మాత్రం భారీగా తగ్గిపోయిందని మస్క్ వాపోయినట్టు తెలిసింది. తమ సంస్థకు యాడ్ లు ఇచ్చేవారిపై కొన్ని యాక్టివిస్ట్ గ్రూపులు ఒత్తిడి తేవడం వల్లే తన రెవెన్యూ తగ్గిపోయిందని ఆయన బేర్ మంటున్నాడు. మరి తాజా లీగల్ ట్రబుల్ నుంచి మస్క్ గట్టెక్కుతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Must Read

spot_img