Homeఅంతర్జాతీయంట్విట్టర్ లోగో మార్చిన ఎలాన్ మస్క్...

ట్విట్టర్ లోగో మార్చిన ఎలాన్ మస్క్…

స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడైతే ట్విట్టర్ కొనుగోలు చేసారో అప్పటి నుంచి చిత్ర విచిత్రాలను చూపిస్తున్నారు. ప్రతీసారి ఏదో ఒక కొత్త వార్త ట్విట్టర్ నుంచే వస్తోంది. అసలు ఆర్థికమాంద్యం సాకుతో ఉద్యోగులను తొలగించడం ఎలన్ మస్కే మొదలుపెట్టారు. ఇప్పుడు దాని లోగోను మార్చేసి తనకెంతో ఇష్టమైన జపాన్ శునకాన్ని ప్రవేశపెట్టారు. అంటే బ్లూ బర్డ్ స్థానంలో డోజీ మీమ్ ఎంటరైందన్నమాట.. ఓ రిపోర్ట్..

మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ను సొంతం చేసుకున్నప్పటి నుండి మస్క్‌ మార్పులు చేస్తూనే ఉన్నారు.

తాజాగా వినియోగదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ట్విటర్‌ లోగో అయిన ”బ్లూబర్డ్‌” ను మార్చేశారు. దాని స్థానంలో ఇప్పుడు డోజీ కాయిన్‌కు సంబంధించిన ‘ డోజీ మీమ్‌’ కనిపిస్తోంది. మంగళవారం ఉదయం ట్విటర్‌ను చూసిన వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. బ్లూబర్డ్‌ స్థానంలో డోజీ మీమ్‌ కనిపించడంతో అవాక్కయ్యారు. మొదట ట్విటర్ హ్యక్ అయిందేమోనని భావించారు. ఆ లోగోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీనిపై ట్విట్టర్‌ సిఇఒ ఎలన్‌ మస్క్‌ స్పందించారు. ట్విట్టర్‌ లోగోను మార్చేసినట్లు ధ్రువీకరించారు. ఇప్పుడు బ్లూ బర్డ్‌ పాతది అయిపోయిందని.. ఇకపై డోజీ మీమ్‌ ట్విట్టర్‌కు కొత్త లోగో అని వెల్లడించారు. ఈ మేరకు ఫన్నీ మీమ్‌ను ఎలన్‌ మస్క్‌ షేర్‌ చేశారు.

గతంలో ఈయన తన ట్విట్టర్ కంపెనీ సీఈఓగా ‘షిబా ఇనూ’ శునకం ఫోటోకు సూటు బూటు కోటు వేసి చూపించారు. ఇకపై ట్విట్టర్ కంపెనీకి జపాన్ శునకమే సీఈఓ అని ప్రకటించారు. అయితే ఇప్పుడు లోగోను మార్చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ మరో ట్వీట్‌ కూడా చేశారు. 2022 మార్చిలో మస్క్‌ ఒక ట్వీట్‌ చేశారు. ”భావప్రకటనా స్వేచ్ఛ సూత్రాలకు కట్టుబడి ఉండటంలో ట్విటర్‌ విఫలమైందని.. ఇప్పుడు ఏం చేయాలి” అని ప్రశ్నించారు. దీనికి ఒక నెటిజన్‌.. ట్విట్టర్‌ను కొనుగోలు చేసి.. బర్డ్‌ లోగోను డోజీతో రీప్లేస్‌ చేయండి అని సూచించాడు. దానికి సరే అన్నట్టు అప్పట్లో మస్క్‌ స్పందించాడు. తాజాగా ఈ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ షేర్‌ చేసిన మస్క్‌.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ ట్వీట్‌ చేశారు. ‘షిబా ఇనూ’ అనే జపాన్‌ జాతికి చెందిన శునకం బొమ్మనే డోజీగా వ్యవహరిస్తుంటారు.

2013లో తొలిసారి డోజీకాయిన్‌ క్రిప్టోకరెన్సీకి, దానికి వెనక ఉండే బ్లాక్‌చైన్‌ సాంకేతికతను జోడిస్తూ ఈ డోజీని లోగోగా క్రియేట్‌ చేశారు.

అప్పటి నుండి ఈ డోజీ అలాగే కొనసాగుతోంది. మస్క్‌ మొదటి నుండి డోజీకాయిన్‌కు మద్దతుగా నిలిచారు. గతంలో డోజీ కాయిన్‌ను ట్విటర్‌లో ప్రమోట్‌ చేసిన మస్క్‌ ఇప్పుడు ఏకంగా ట్విటర్‌ లోగోకి కూడా దానినే వినియోగించారు. దీంతో ఈ కాయిన్‌ విలువ ఒక్కసారిగా 22 శాతం పెరగిపోయింది. మొత్తానికి అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌లో పలు మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. వాటికి అంతనేదే ఉండడం లేదు. ట్విట్టర్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలను స్వీకరించిన తొలి రోజు నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టిన ఎలాన్ మస్క్.. అందులో పెను సంస్కరణలకు తెర తీశారు. ఆ పరంపరను ఇంకా కొనసాగిస్తోన్నారు.

యూజర్లు తమ ట్విట్టర్ అకౌంట్‌ను ఓపెన్ చేసి, రీఫ్రెష్ చేయగానే ‘షిబా ఇనూ’ కొత్త లోగో దర్శనం ఇస్తోంది. ప్రస్తుతానికి వెబ్‌వర్షన్‌కు మాత్రమే ట్విట్టర్ లోగో ఛేంజ్ అయింది. దశలవారీగా అన్ని వర్షన్‌లకూ ఇది అమలు కానుంది. డోజ్ కాయిన్ లోగోగా షిబా ఇను అనే శునకాన్ని 2013 నుంచీ లోగోగా మార్చుకున్నారు. షిబా ఇను అనేది హంటింగ్ బ్రీడ్‌. జపాన్‌కు చెందిన జాగిలం ఇది. నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లకు.. ఈ షిబా ఇను జాగిలం మీమ్స్ చిరపరిచితమే. అది నచ్చడం వల్లే తాను కూడా ట్విట్టర్ బ్లూబర్డ్ లోగోకు బదులుగా డోజ్ కాయిన్ షిబా ఇను డాగ్ ఫొటోను వాడినట్లు ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. ఇదివరకు కూడా ఇదే డోజ్ కాయిన్ డాగ్ లోగోను ఒకట్రెండు సందర్భాల్లో ఎలాన్ మస్క్ వినియోగించారు.

ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తరువాత అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు ఎలాన్ మస్క్.

ట్విట్టర్ కొత్త పాలసీని ప్రకటించారు. ట్విట్టర్ వినియోగదారులకు వాక్ స్వాతంత్ర్యం ఉందని, ఎలాంటి పోస్టులనైనా పెట్టొచ్చని పేర్కొన్న ఆయన నెగెటివ్ పోస్టులకు మాత్రం రీచ్ ఉండబోదని తేల్చి చెప్పారు. నెగెటివిటీ/హేట్ స్పీచ్ వంటి పోస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోట్ చేయబోమని స్పష్టం చేశారు. నెగెటివిటీని విస్తరింపజేసే పోస్టులను గుర్తించడానికి ప్రత్యేక వ్యవస్థ ఉందని చెప్పారు. నిజానికి ట్విట్టర్‌ అంటే అందరికీ బ్లూకలర్‌లో ఉండే బుల్లిపిట్ట గుర్తుకు వస్తుంది. నీలిరంగులో ఉండే ఆ పిట్ట బొమ్మ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఇకపై సదరు ట్విట్టరు పిట్ట మనకు కనిపించకపోవచ్చు.

Must Read

spot_img