Homeఅంతర్జాతీయంత్వరలో డిజిటల్ కాపీగా మారనున్న తువాలు ఐలాండ్ ...

త్వరలో డిజిటల్ కాపీగా మారనున్న తువాలు ఐలాండ్ …

ఇన్నాళ్లూ ఊహా జనితంగా సమావేశాల గురించి విన్నాం.. వర్చువల్ గా అవతలి వ్యక్తి ఎదురుగా ఉన్నట్టే చేయగల మేటావర్స్ టెక్నాలజీలను చూసాం.. కానీ ఇప్పుడు వర్చువల్ గా ఓ దేశాన్నే చూడబోతున్నాం. త్వరలో సముద్రంలో కలసిపోనున్న తువాలు అనే దేశాన్ని డిజిటలైజ్ చేయడం మొదలుపెట్టింది. ఈ డిజిటల్ కంట్రీని వర్చువల్ గా చూసేందుకు వీలుంటుంది. అంటే నిజంగా లేకపోయినా అంతటి ఫీలింగ్ కలుగజేస్తుందన్నమాట.

భవిష్యత్తులో.. ఇంట్లోనే ఉండి కూడా ఆ దేశానికి కొన్ని క్షణాలలోనే వెళ్లొచ్చు. దేశమంతా కంప్యూటర్ స్క్రీన్ పై కలియతిరగవచ్చు. అసలుకు వస్తే అక్కడ అలాంటి దేశం మనకు కనిపించకపోవచ్చు.. పర్యావరణం గ్లోబల్ వార్మింగ్ కారణంగా అంతరించుకుపోతున్న దేశాలలో తువాలు కూడా ఒకటి. ప్రస్తుతం ఆ దేశాన్ని డిజిటల్ దేశంగా మారుస్తున్నారు. అగ్రదేశాలు పర్యావరణం గురించిన జాగ్రత్తలు తీసుకోని కారణంగా చిన్న దేశాలు అంతరించుకుపోతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు కఠిన చర్యలు చేపడతామని ప్రతి ఏటా ప్రపంచదేశాలు తీర్మానాలు చేస్తున్నాయి. కానీ, అవి కేవలం నీటి మీద రాతలుగానే ఉండిపోతున్నాయి. దీంతో కర్బన ఉద్గారాల కారణంగా నీటి మట్టాలు పెరిగిపోతుండటంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని ద్వీప దేశాల భూభాగాలు సముద్రంలో కలిసిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఓ ద్వీప దేశం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో తమ దేశాన్ని డిజిటల్‌ దేశంగా మారుస్తామని ప్రకటించింది. తువాలు ఐలాండ్‌ అని పిలిచే ఈ దేశం చాలా అందమైన ప్రక్రుతితో అలరారుతుంటుంది. ఇది ఆస్ట్రేలియా, హవాయి దేశాల మధ్య ఉంటుంది. ఇది తొమ్మిది దీవుల సమూహం. ఇక్కడ 12 వేల మంది నివసిస్తున్నారు. ఇప్పటికే తువాలు రాజధాని ప్రాంతం 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరి నాటికి తువాలు పూర్తిగా కనుమరుగైపోవడమే కాకుండా, ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్‌కు బలయ్యే తొలి ద్వీపంగా నమోదు కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే భవిష్యత్తు తరాలకు తువాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకు మెటావర్స్‌లో ఈ దేశాన్ని రూపొందించనున్నారు.

తువాలు దేశ న్యాయ, సమాచార, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సైమన్‌ కోఫే ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా.. మెటావర్స్‌ ద్వారా అక్కడి ప్రకృతి అందాలను, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్చు. ఇక్కడి భూమి, సముద్రం, సంస్కృతి.. తువాలు ప్రజల విశిష్ట సంపద. గత కొన్నేళ్లుగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న పరిస్థితుల కారణంగా సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో మా దేశ భూమిలో కొద్ది కొద్దిగా కనుమరుగైపోతుంది. భవిష్యత్తులో తువాలు ఉనికి ప్రపంచదేశాలకు తెలియాలంటే మా దేశాన్ని పూర్తి డిజిటల్‌ నేషన్‌గా మార్చడం మినహా మరో దారిలేదు. త్వరలోనే తువాలు తొలి వర్చువల్‌ దేశంగా ప్రపంచ ప్రజలకు దర్శనమివ్వబోతుంది” అని సైమన్‌ తెలిపారు.

తువాలును మెటావర్స్‌ దేశంగా మార్చేందుకు ది మంకీస్‌, కొల్లైడర్‌ అనే రెండు సంస్థలు పనిచేస్తున్నాయి. ఇందులో తువాలు చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్‌లు, సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన వివరాలు, కుటుంబ ఫొటోలు, సంప్రదాయ పాటలు వంటి వాటిని నిక్షిప్తం చేయనున్నారు. ఇప్పటికే ఐలాండ్‌ దేశం బార్బడోస్‌, దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లు అడ్మినిస్ట్రేటివ్, కాన్సులేట్ సేవలను మెటావర్స్ ద్వారా అందిస్తామని గత ఏడాది ప్రకటించాయి. కానీ, పూర్తిగా ఒక దేశం మెటావర్స్‌లోకి మారిపోవడం మాత్రం ఇదే తొలిసారి.

అలా తొలి డిజిటల్‌ నేషన్‌గా తువాలు మెటావర్స్‌లో నిలిచిపోతుంది. అయితే ఈ శతాబ్దాంతానికి తువాలు అసలు కనిపించకుండా పోయే అవకాశం ఉందని చెబుతన్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. తువాలు ఒక్కటే కాదు పలు దేశాలకు ఈ పరిస్తితి ఏర్పడనుందని సమాచారం.భూమిపై ఉన్న డజన్ల కొద్దీ ద్వీపాలకు ఈ భయం వెంటాడుతోంది. రాబోయే కాలంలో చాలా దేశాలకు ఈ సమస్య తప్పడం లేదు. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరగడంతో ఇప్పటికే ఈ ద్వీపాలు తమ భూభాగాన్ని కోల్పోతున్నాయి. అంతేకాకుండా ఆయా దేశాలలో నివసించే ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.

అందుకే ప్రతీ కాప్ సమావేశాలలో వీరు అగ్రదేశాలను గ్రీస్ హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవాలని వేడుకుంటున్నారు. కనీసం ఆ దిశగా కృషి చేయాలని ప్రపంచంలో అత్యధిక కాలుష్యానికి కేంద్రాలుగా ఉన్న దేశాలకు విజ్నప్తి చేస్తున్నారు. అయితే అగ్రదేశాలు ఎంత సేపూ తమ స్వార్థం గురించే ఆలోచిస్తున్నారు. బొగ్గు ద్వారా కరెంటు ఉత్పత్తి, శిలాజ ఇంధనాలను ఉపయోగించి వాహనాలు నడపడం వల్లనే గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి.

Must Read

spot_img