తెలుగు సినీమా ఖ్యాతి ఖండాలు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అవార్డుల పంట కురిపిస్తుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాను ఇప్పుడు మరో 5 అంతర్జాతీయ అవార్డులు వరించాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఐదు కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా అవార్డులు గెలుచుకుంది. ఒకేసారి 5 అవార్డులు అందుకున్న తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది.
ఇక ఈ సినిమాకు ‘బెస్ట్ స్టంట్స్’,‘బెస్ట్ యాక్షన్ మూవీ’,‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’(నాటు నాటు), ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ ఇలా పలు విభాగాల్లో ‘బ్లాక్ పాంథర్’,‘ది వుమెన్ కింగ్’,‘ది బ్యాట్ మ్యాన్’వంటి విదేశీ చిత్రాలను వెనక్కి నెట్టి మన సినిమా విజయాన్ని అందుకుంది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా పేరు సొంతం చేసుకుని ‘హెచ్‌సీఏ స్పాట్‌లైట్’ అవార్డును సైతం ఇది దక్కించుకుని భారతీయ సినిమా ఖ్యాతిని మరింత పెంచింది ట్రిపుల్ ఆర్ మూవీ.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి జనాల మన్నన పొందుతూనే ఉంది. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ కోసం తారక్, చెర్రీ వేసిన స్టెప్పులు భారతీయులతో పాటు విదేశీయులను కూడా ఆకట్టుకున్నాయి. అందుకే ఈ పాటకు పలు అవార్డులు వరించాయి. ముందుగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది. అదే ఊపుతో ఆస్కార్ కోసం ఫైనల్ నామినేషన్స్‌కు ఎంపికైంది. త్వరలో ఈ సాంగ్‌కు ఆస్కార్ వస్తుందని ఎదురుచూస్తున్న తరుణంలో హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ అవార్డు కూడా రావడం ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించాడు.
ఆర్ఆర్ఆర్ సినిమా బెస్ట్ స్టంట్స్ అవార్డును అందించిన హెచ్ సీఏ సభ్యులందరికీ రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. ఎంతో శ్రమించి ఇందులో స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన సాల్మన్, క్లైమాక్స్ లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు కంపోజ్ చేసిన జూజీతోపాటు.. మా సినిమా కోసం భారత్ కు వచ్చి.. మా విజన్ అర్ధం చేసుకుని మాకు అనుగుణంగా మారి కష్టపడి పనిచేసిన ఇతర స్టంట్ మాస్టర్స్ అందరికీ రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. 320 రోజులు కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించాం. చాలా వరకు ఇందులో స్టంట్స్ ఉంటాయి.
ఈ గుర్తింపు నాకు మాత్రమే కాదు.. నా దేశానికి.. అలాగే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కూడా. ఈ అవార్డ్ మమ్మల్ని మరింత ప్రొత్సహిస్తుంది.
దాదాపు 600 మంది బృందంతో కొన్నిసార్లు 2000 కంటే ఎక్కువమంది ఆర్టిస్టులతో ఈ సినిమాను రూపొందించాం. వారందరికీ ధన్యవాదాలు ” అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి. సినిమాలోని రెండు, మూడు షార్ట్స్ లో మాత్రమే డూప్స్ ను ఉపయోగించామని.. మిగతావన్ని ఎన్టీఆర్, రామ్ చరణ్ స్వయంగా చేశారని రాజమౌళి వెల్లడించారు. ఈ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణితో పాటు ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం పాల్గొన్నారు.