అగ్రరాజ్యం అమెరికాపై టోర్నడోలు విజృంభిస్తున్నాయి. భీకరమైన సుడిగాలి వచ్చిందంటే పట్టణాలు వణికిపోతాయి. చిన్న చిన్న ఇండ్లు కుప్పకూలిపోతాయి. కొద్ది నిముషాల్లోనే ఆ ప్రాంతమంతా చిందర వందరగా మారిపోతుంది. తీవ్రంగా సుడులు తిరిగే సమయంలో చిక్కుకున్నవారు గాయాల పాలవుతున్నారు. అమెరికాలోని ప్రతీ రాష్ట్రం ప్రతీ ఏటా ఏదో ఒక టోర్నడోను ఎదుర్కున్న సందర్భాలున్నాయి. అసలు టోర్నడోలు ఎందుకు ఏర్పడతాయి. ఒక్క అమెరికాలోనే ఎందుకు ఏర్పడుతున్నాయి..
అమెరికాలో ఏటా దాదాపు 1150 టోర్నడోలు వస్తున్నాయి.
ప్రపంచం మొత్తం మీద ఇన్ని టోర్నడోలు మరే దేశంలో కనిపించవు. కెనడా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఐరోపా దేశాలన్నీ కలిసినా ఈ స్థాయిలో విధ్వంసం చూసి ఉండవు. అమెరికాలోని ప్రతి రాష్ట్రం ఏటా ఒక్క టోర్నడోనైనా ఎదుర్కొంటోంది. కొన్ని రాష్ట్రాలపై డజన్ల కొద్దీ టోర్నడోలు విరుచుకుపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమెరికాలో ఏటా టోర్నడోల కారణంగా సగటున 73 మంది మరణిస్తున్నట్లు సమాచారం. టోర్నడో ఒక భీకరమైన సుడిగాలి అని చెప్పవచ్చు. టోర్నడోలను ట్విస్టర్, సుడిగాలి, తీవ్రమైన గాలి తుపాను అని పిలుస్తుంటారు. ఇవి వివిధ పరిమాణాలు, ఆకారాల్లో.. ఉరుములు, మెరుపులను కలిగించే మేఘాల్లో ఏర్పడుతుంటాయి. ఎక్కువగా గరాటు ఆకారంలో కన్పిస్తూ నేల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది.
క్యుములోనింబస్ మేఘాలు, మేఘాల కింద తిరిగే వ్యర్థాలు, ధూళి కణాలు నుంచి టోర్నడోలు ఉద్భవిస్తాయి.
టోర్నడోలు చాలా వరకు గంటకు 180 కిలోమీటర్ల లోపు గాలులతో.. 250 అడుగుల వరకు వైశాల్యంతో ఉంటాయి. ప్రారంభస్థానం నుంచి కొన్ని కిలోమీటర్ల వరకు ఇవి వేగంగా ప్రయాణిస్తాయి. ఒక్కోసారి అవి గంటకు 480 కిలోమీటర్ల వేగంతోనూ విజృంభించే అవకాశం ఉంటుంది. వైశాల్యం మూడు కిలోమీటర్ల వరకు కూడా ఉండొచ్చు. అలా ఏకబిగిన 100 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తాయి. టోర్నడో ఏనుగు తొండం ఆకారంలా గాలి సుడులు తిరుగుతూ మధ్యలో తక్కువ పీడనం కలిగి ఉంటుంది. ఇది ప్రయాణించిన మార్గం మొత్తం విధ్వంసం సృష్టిస్తుంది. మధ్య అక్షాంశాల వద్ద టోర్నడోలు ఎక్కువగా వస్తుంటాయి.
ఉత్తర, దక్షిణార్థ గోళాల్లో ఉరుములతో కూడిన గాలివానలు వచ్చినప్పుడు, వసంత, వేసవి కాలాల్లో టోర్నడోల ప్రభావం ఎక్కువగా కన్పిస్తుంది. ఈ గాలి తుపానులు సంభావ్య, ఉష్ణశక్తిని గతి శక్తిగా మారుస్తాయి. టోర్నడోలు ప్రయాణించే దిశ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కేవలం సెకన్ల వ్యవధిలోనే మారుతుంది. సాధారణంగా అవి నైరుతి నుంచి ఈశాన్యానికి అస్థిరంగా కదులుతుంటాయి. సముద్రంపైన టోర్నడో ఏర్పడితే దాన్ని ‘వాటర్ స్పౌట్’ అని పిలుస్తారు. టోర్నడోలు అసాధారణ స్థాయి వేడి ఉన్నప్పుడు ఏర్పడతాయి. నేలపై ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తేమతో కూడిన గాలి వేడెక్కి పైకి లేస్తుంది. ఇది ఎగువన ఉన్న చల్లటి, పొడి పవనాలను తాకినప్పడు థండర్ క్లౌడ్స్ ఏర్పడుతుంటాయి. దీన్ని ‘వాతావరణ అస్థిరత’గా అభివర్ణిస్తుంటారు శాస్త్రవేత్తలు. అది జరిగినప్పుడు గాలిపైకి కదలడం మొదలుపెడుతుంది.
దీన్ని ‘అప్‌డ్రాఫ్ట్’ అని అంటారు. విభిన్న ఎత్తుల్లో గాలుల వేగం, దిశల్లో మార్పుల కారణంగా ఈ అప్‌డ్రాఫ్ట్ సుడి తిరగడం మొదలవుతుంది. దిగువ వాతావరణంలో కొన్ని వేల అడుగుల పాటు ఈ వైరుధ్యం గణనీయ స్థాయిలో ఉన్నప్పుడు.. టోర్నడోను కలిగించే సూపర్‌సెల్ థండర్ క్లౌడ్స్ ఏర్పడతాయి. శీతాకాలంలో గాలిలో పెద్దగా వేడి, తేమ ఉండదు కాబట్టి టోర్నడోలకు అవసరమైన స్థాయిలో అస్థిరతకు తావుండదు. టెక్సాస్ రాష్ట్రంలో ఏడాదికి సుమారు 140 టోర్నడోలు ఏర్పడుతున్నాయి. కేన్సస్, ఫ్లోరిడా, ఓక్లహామా, నెబ్రాస్కాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అలబామా వంటి రాష్ట్రాల్లో టోర్నడోలు తక్కువగా వచ్చినా మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. అందుకు కారణం సరైన సన్నద్ధత లేకపోవడమేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. టోర్నడో వచ్చే సమయం, ప్రదేశాన్ని బట్టి దాని తీవ్రత మారుతూ ఉంటుంది.
అలబామా రాష్ట్రంలో ఎక్కువగా చెట్లు, కొండలు, పీఠభూములు ఉన్నాయి.
కేన్సాస్, టెక్సాస్, నెబ్రాస్కా రాష్ట్రాలు మైదాన ప్రాంతాలు. దాంతో కొన్ని మైళ్ల దూరం నుంచే టోర్నడో వస్తోందని ఇక్కడి ప్రజలు గుర్తించగలుగుతున్నారు. ఫలితంగా తమను తాము రక్షించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతోంది. దక్షిణాది రాష్ట్రాలైన టెనెసీ, ఆర్కన్సాస్, కెంటకీల్లో టోర్నోడోలు రాత్రి పూట వస్తున్నాయి. వీటిని ‘నొక్టర్నల్ టోర్నడోలు’ అని పిలుస్తారు. చెక్క ఇళ్లు కావడం, రాత్రుళ్లు ప్రజలు నిద్రలో ఉండటం, బయట ఏం జరుగుతుందో తెలియని కారణంగా మరణాల శాతం పెరుగుతోంది. ఇక ఆగ్నేయ ప్రాంతంలో వచ్చే టోర్నడోల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ, భౌగోళిక పరమైన కారణాల వల్ల ఇక్కడ టోర్నడోల విజృంభణ అధికంగా ఉంటోందని సమాచారం.