Homeఅంతర్జాతీయంనేటికి ఆ భయంకర యుధ్దానికి సంవత్సరం పూర్తయింది.

నేటికి ఆ భయంకర యుధ్దానికి సంవత్సరం పూర్తయింది.

మరి ఈ రోజుతో దానికి సంవత్సరీకం పెట్టి ఇక చాలనుకుంటారో లేక దీర్ఘకాలపు యుధ్దం వైపు లాక్కెళతారో అన్నది మనం చూడాల్సి ఉంటుంది. నిజానికి ప్రపంచం అంతా ఆ యుధ్దం గురించి చాలా తక్కువగా తప్పుగా అంచనాలు వేసింది.. కేవలం మూడు రోజుల్లో ఉక్రెయిన్ ను భస్మీపటలం చేసేస్తుంది రష్యా అనుకున్నారు. లేదా రష్యా ధాటికి ఉక్రెయిన్ సాగిలపడుతుందని అనుకున్నారు. కానీ చూస్తుండగానే 365 రోజులు దాటిపోనుంది. దీనిని ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ అనాలో.. లేక తమ సార్వభౌమత్వాన్ని నాటో అమెరికా దేశాల నుంచి కాపాడుకోవడం అనాలో.. కానీ రష్యా చేసిన పనిని ప్రపంచం అంతా విమర్షించింది. ఈ ఏడాది కాలంలో ఎన్నో వేల ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. అయితే నాయకుల మాటలు, పరిస్థితులను చూస్తే ఇది ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్‌ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెనక్కి తగ్గబోడని.. అవసరమైతే మరో ఏడాదిపాటు కొనసాగిస్తాడని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా బ్రిటన్‌ రక్షణ కార్యదర్శి బెన్‌ వాలెస్‌.. ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాలపై స్పందించారు.

రష్యా, ఉక్రెయిన్ ప్రజల జీవితాల పట్ల మాత్రమే కాకుండా.. తన సొంత సైనికుల పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపిందని ఆయన ఆరోపించారు. మేం ఏడాది కాలంగా ఇక్కడి పరిస్థితులను చూస్తున్నాం. లక్షా 88 వేలమంది రష్యా సైనికులు మరణించారు, మరెన్నో వేల మంది గాయపడ్డారు. దీనికి పుతిన్‌ దూకుడే కారణం అని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యాకు సంబంధించి 97 శాతం సైన్యం ఉక్రెయిన్‌ యుద్ధంలోనే లీనమైంది. అలా ఏడాది కాలం పూర్తయింది. యుధ్దంలో రష్యా ప్రధాన ఆయుధాలు నష్టపోయింది. యుద్ధ ట్యాంకర్లలో మూడింట రెండోవంతు పూర్తిగా నాశనం అయిపోయాయి. అయినా కూడా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవడంలో పుతిన్‌ ఘోరంగా విఫలమయ్యాడని తెలిపారు బెన్‌ వాలెస్‌.

అయినా పుతిన్‌ దురాక్రమణపై వెనక్కి తగ్గబోడని అంచనా వేశారు. నరమేధం కొనసాగినా.. అంతర్జాతీయ సమాజం నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా పుతిన్‌ తన వైఖరి మార్చుకోకపోవచ్చనే ఆయన అంటున్నారు. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా దురాక్రమణకు పుతిన్‌ రష్యా బలగాలను ముందుకు పంపారు. ఆ సమయంలో పుతిన్‌ లక్ష్యం ఒక్కటే. మూడు వారాల్లో ఉక్రెయిన్‌లో ఉన్న అన్ని ప్రధాన నగరాలను ఆక్రమించేసుకోవాలి. పైగా మూడే రోజుల్లో రాజధాని కీవ్‌ నగరాన్ని హస్తగతం చేసుకోవాలనుకున్నారు. తద్వారా యుద్ధం ముగుస్తుందని భావించారు. కానీ, సీన్‌ రివర్స్‌ అయ్యింది. యుద్ధం 365 రోజులు ఆగకుండా కొనసాగింది. పుతిన్ తాను అనుకున్నవాటిల్లో ఒక్కటి కూడా సాధించలేకపోయాడని వాలెస్‌ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నివేదిక ప్రకారం.. ఈ ఏడాది కాలంలో ఎనిమిది వేల మంది సాధారణ పౌరులు మరణించినట్లు, 14 వేలమంది దాకా గాయపడినట్లు నివేదిక వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు ఏడాది పూర్తవుతున్న సందర్భంలో.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ సోషల్‌ మీడియా ద్వారా ఓ వీడియో పోస్ట్‌ చేశాడు.ఉక్రెయిన్ విజయం తధ్యమని మరోసారి ధీమా వ్యక్తం చేశారు. మేము విచ్ఛిన్నం కాలేదు.

అనేక పరీక్షలను అధిగమించాము. మేం గెలిచి తీరతాం అని అన్నారు. యుద్ధమనే చెడును మా దేశానికి తెచ్చిన వాళ్లను నిలువరించిన తీరతామని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే అటు రష్యా అధ్యక్షుడు కూడా ఏడాది పూర్తి సందర్భంగా పార్లమెంటును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. అమెరికాతో ఉన్న నూతన వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం ‘స్టార్ట్‌’ నుంచి తాత్కాలికంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 1991లో కుదిరిన స్టార్ట్‌ ఒకటవ ఒప్పందం ప్రకారం రెండు దేశాల దగ్గరా ఆరు వేల చొప్పున అణ్వాయుధాలు, పదహారు వందల ఖండాంతర క్షిపణులు, బాంబర్లకు మించి ఉండరాదు.

దీని గడువు 2009లో ముగిసింది. తరువాత 2010లో కుదిరిన రెండవ ఒప్పందం ప్రకారం 2026 నాటికి రెండు దేశాలూ వాటిని ఇంకా తగ్గించాల్సి ఉంది.

పుతిన్‌ ప్రకటన మీద అమెరికా స్పందన వెల్లడి కావాల్సి ఉంది. ఉక్రెయిన్‌ వివాదాన్ని పశ్చిమ దేశాలే ప్రారంభించాయని దాన్ని ముగించేందుకు రష్యా తన బలాన్ని వినియోగిస్తున్నదని పుతిన్‌ పార్లమెంటు సమావేశంలో చెప్పారు. ఇప్పటికీ సంప్రదింపులకు ద్వారాలు తెరిచే ఉంచామని పరస్పర సమానత్వం, భద్రత ప్రాతిపదికన అవి ఉండాలని అన్నారు. నాటో విస్తరణ గురించి నిజాయితీలేని సమాధానాలు చెబుతున్నారని అన్నారు. స్థానిక వివాదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయేందుకు అమెరికా చూస్తున్నదని, ఉక్రెయిన్‌ పౌరులు తమ పశ్చిమ దేశాల యజమానుల చేతిలో బందీలుగా మారారని పుతిన్‌ అన్నారు. మీకు రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంతో ప్రపంచానికి ఎంత నష్టం జరిగిందో తెలుసా..? సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటికే కోవిడ్ 19 కొట్టిన దెబ్బతో విలవిల్లాడుతున్న పేద దేశాలు మరింత చితికిపోయాయి. జర్మన్‌ ఎకనమిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘ఐడ్ల్యూ’ అధ్యయనం మేరకు 2022లో దాదాపు 1.6 ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టం జరిగింది.

యుధ్దం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది మరో ట్రిలియన్‌ డాలర్ల మేర నష్టం ఉంటుందని కూడా అంచనా వేసింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రధానంగా పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్త ఉత్పత్తులలో మూడింట రెండొంతులు కోల్పోయాయని తెలిపింది. ఇంధనం, ఇతర ముడిసరుకుల సరఫరాలో నెలకొన్న సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెంచాయని ఐడ్ల్యూ నిపుణుడు అధ్యయనకర్త మైఖెల్‌ గ్రోమ్లింగ్‌ అన్నారు. నిజానికి ఈ సంస్థ చేసింది ఉజ్జాయింపు అంచనా మాత్రమే.. అయితే ఏడాది కాలంలో ఉక్రెయిన్‌ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కచ్చితంగా ఎంత నష్టం కలిగించిందన్నది ఎవరూ చెప్పలేని స్థితి.

ప్రపంచ ఆర్థిక వేదిక ప్రపంచంలోని 87.4 శాతం జనాభా ఉన్న 116 దేశాలలో ఇంథన ధరల పెరుగుదల గురించి సర్వే జరిపింది.

ప్రత్యక్ష, పరోక్ష కారణాలతో ఒక్కో కుటుంబంపై 63 నుంచి 113 శాతం వరకు అదనంగా భారం పడింది. అనేక దేశాల్లో చలి కాచుకొనేందుకు అవసరమైన ఇంధనాన్ని కొనుగోలు చేయలేని కారణంగా ఇంధన దారిద్య్రంలో మునిగిపోయారు. జీవన వ్యయం పెరుగుదల కారణంగా ప్రపంచబ్యాంకు దారిద్య్ర రేఖకు దిగువకు వెళ్లిన వారు 7.8 నుంచి 14.1 కోట్ల మంది వరకు ఉంటారని తెలిపింది. అమెరికా అంచనా ప్రకారం నలభైవేల మంది ఉక్రెయిన్‌ పౌరులు, రెండు దేశాలకు చెందిన సైనికులు కలిపి లక్ష మంది చొప్పున మరణించి ఉంటారు. మరి కొందరు చెప్పినదాని ప్రకారం రెండు లక్షల మంది పుతిన్‌ సైనికులు మరణించడమో, గాయపడడమో జరిగి వుంటుందని అంటున్నారు.కానీ వీటిని ఎవరూ నిర్ధారించలేకపోతున్నారు. ఎందుకంటే యుధ్దం ఇంకా ముగిసిపోలేదు. ఇంకా కొనసాగుతూనే ఉంది. అంచనా వేయడానికి ప్రత్యక్షంగా ఆ ప్రాంతాలను విజిట్ చేయడం అవసరం..అలాంటిది ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పటికిప్పుడు ఎంత నష్టం అన్నది అనూహ్యమనే చెప్పాలి. యుధ్దం రెండవ ఏడాదిలో ప్రవేశించడానికి కొన్ని రోజుల ముందు దాన్ని మరింతగా రెచ్చగొట్టేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను అందిస్తామని అమెరికా ప్రకటించింది.

జెలెన్‌స్కీ కోరుతున్న విమానాలు తప్ప ట్యాంకులతో సహా ఉక్రెయిన్‌ పౌరులను రక్షించేందుకు అన్ని రకాల ఆయుధాలను మరింతగా సరఫరా చేస్తామని, రష్యా మీద మరిన్ని ఆంక్షలను అమలు చేస్తామని జో బైడెన్‌ హామీ ఇచ్చారు. ఒకవైపు ఇలాంటి ప్రకటనలు చేస్తున్న పశ్చిమ దేశాల నాటో కూటమి మరోవైపు శాంతికోసం పుతిన్‌ వైపు నుంచి ఎలాంటి సూచనలు లేవంటూ ప్రచారదాడి చేస్తోంది. ఇప్పటి వరకు పది దఫాలుగా రష్యా మీద ఆంక్షలను తీవ్రతరం చేశారు. మరో దఫాను ప్రతిపాదించారు. నాటో కూటమి ప్రకటనలను చూస్తుంటే మరో యుద్ధ రంగాన్ని తెరిచేందుకు సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు రక్షణ రంగ నిపుణులు.

Must Read

spot_img