Homeఅంతర్జాతీయంపులుల తగ్గుదలకు స్వయంకృతాపరాథమే కారణమా..?

పులుల తగ్గుదలకు స్వయంకృతాపరాథమే కారణమా..?

దేశంలో గతేడాది పులుల సంఖ్య ఎందుకు తగ్గిపోయింది.. అన్నది చర్చనీయాంశంగా మారింది. పులుల సంరక్షణలో ముందంజలో ఉన్నా, గతేడాది ఎందుకు తగ్గిందన్నది ప్రశ్నార్థకమవుతోంది. అయితే దీనికి అభయారణ్యాల తగ్గుదలతో పాటు అంతర్గతంగా యథేచ్ఛగా సాగుతోన్న వేట కారణమని నిపుణులు చెబుతున్నారు. చేజేతులారా అటవీ విస్తీర్ణాన్ని తగ్గించుకోవడం ఓ కారణం కాగా, మనిషి ఆవాసాల్లోకి వస్తోన్న పులులు వేటగాళ్ల చేతిలో బలవుతున్నాయా.. ? దీనిపై నిపుణులు ఏమంటున్నారు..? దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి..? అన్నదే కీలకాంశంగా మారింది.

పర్యావరణ వ్యవస్థలో ఆహార గొలుసులో పులుల స్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆహార గొలుసులో సమతుల్యతను స్థిరంగా ఉంచుతూ వాతావరణ పరిరక్షణలో పులులు కీలక పాత్ర పోషిస్తాయి. పులుల సంఖ్య తగ్గితే శాకాహార జంతువులు పెరిగి అవన్నీ చెట్లను అతిగా మేయవచ్చు. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే పులులను సంరక్షించడం అత్యావశ్యకం. అయితే పులుల సంరక్షణలో భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ముందంజలో ఉంది. ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 75 శాతం భారత్‌లోనే ఉన్నాయి.

భారత సంరక్షణ చర్యలతో దశాబ్దకాలంగా పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. అయితే 2021లో మాత్రం పులుల సంఖ్య దారుణంగా పడిపోయింది. వేటగాళ్లు, ప్రమాదాలు, మానవులు-పులుల మధ్య ఏర్పడుతోన్న సంఘర్షణ వల్ల 120 కంటే ఎక్కువ పెద్ద పులులు చనిపోయాయని తాజా గణాంకాలు చాటుతున్నాయి. ఈ తరుణంలో ఏడాది కాలంలోనే అధిక సంఖ్యలో పులుల సంఖ్య ఎందుకు తగ్గింది? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకారం, 2018లో చేసిన లెక్కింపు ప్రకారం పులుల సంఖ్య 2,967గా ఉంది. 2014లో దేశంలో 2,226 పులులు ఉండగా ఇప్పుడవి పెరిగాయి. 19 రాష్ట్రాల్లో 51 టైగర్ రిజర్వ్‌ల ఉండగా అవన్నీ ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు పొందాయి. ఈ టైగర్రి జర్వ్‌లు భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో 2.24 శాతం విస్తరించి ఉన్నాయి. పులుల సంఖ్యలో అన్ని రాష్ట్రాల కంటే మధ్యప్రదేశ్ ముందుంది.2018 గణాంకాల ప్రకారం మధ్యప్రదేశ్ భూభాగంలో 526 పులులు ఉన్నాయి. కర్ణాటక 524 పులులతో రెండో స్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్ 444 పులులతో మూడో స్థానంలో నిలిచింది.

పులులు అత్యధికంగా ఉండే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది కాలంగా పెద్ద సంఖ్యలో ఈ అటవీ మృగాలు మరణించినట్టు తెలిసింది. మధ్య ప్రదేశ్
అటవీ విభాగపు గణాంకాల సమాచారం మేరకు గత ఏడాది కాలంలో 38 పులులు మరణించాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మధ్య ప్రదేశ్‌లోనే వీటి మరణాలు అత్యధికంగా ఉన్నాయి. కేవలం పులులు మాత్రమే కాదు, చిరుతలు కూడా ఎక్కువగా చనిపోయినట్లు మధ్య ప్రదేశ్ అటవీ విభాగపు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సమయంలో గరిష్టంగా 87 చిరుతలు చనిపోయినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పులులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ టైగర్’కి 50 ఏళ్లు పూర్తి కావొస్తున్నాయి. 2018లో చేపట్టిన
అటవీ జంతువుల గణనలో మధ్య ప్రదేశ్‌లో 526 పులులు ఉన్నట్లు తేలింది. 2022లో కూడా ఈ గణన చేపట్టారు, కానీ దీని రిపోర్టును ఇంకా విడుదల చేయలేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద ‘జాతీయ పులుల పరిరక్షణ సంస్థ’, ‘ప్రాజెక్టు టైగర్’ కలిసి ఈ గణనను చేపట్టాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 3,000 పులులు ఉన్నాయి. మధ్య ప్రదేశ్‌లోని అడవుల్లో పెద్ద మొత్తంలో పులులు మరణించడంపై అటవీ జంతువులపరిరక్షణ కోసం పనిచేస్తున్న నిపుణులు, ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఈ మరణాలపై పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. మధ్యప్రదేశ్ లో ముఖ్యంగా ఆరు పులుల అభయారణ్యాలు ఉన్నాయని, అవి పెంచ్, బాందవ్‌గఢ్, కన్హా, పన్నా, సంజయ్, సాత్పురా కాగా, పులుల మరణాల రెండు రకాలుగా ఉన్నాయని,కొన్ని సహజంగా మరణిస్తుండగా, మరికొన్ని సహజరహితంగా మరణిస్తున్నాయి.

ఒక పులి సగటు వయసు 12 ఏళ్లు. ఒకవేళ రాష్ట్రంలో పులుల సంఖ్య 526గా ఉంటే, దీని బట్టి చూస్తే ఇంత పెద్ద సంఖ్యలో మరణించడం సమస్యేమీ కాదని, కానీ అటవీ విభాగం సహజరహితంగా మరణిస్తున్న పులుల సంఖ్య పెరుగుతుందని నివేదించిందని, ఇదే ఆందోళనకర విషయమని పేర్కొన్నారు. గత ఏడాది మరణించిన మొత్తం 38 పులుల్లో ఎనిమిది అసహజంగానే మృతి చెందింది. దీనికి చాలా కారణాలుంటాయి.వీటిల్లో ప్రధాన కారణం ఎలక్ట్రిక్ షాక్‌తో చనిపోవడం. కొన్ని సంఘటనలలో పాయిజన్‌కి చెందిన సాక్ష్యాధారాలను కూడా కనుకొన్నారు.

కొన్ని కేసుల్లో పులుల మధ్య వాటి నివాసానికి సంబంధించి జరిగిన పోట్లాటలో ప్రాణాలు విడుస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నెల ప్రారంభంలో సియోని జిల్లాలో ఒక పులి విద్యుదాఘతంతో మరణించింది. అడవికి ఆనుకుని ఉన్న బక్రంపత్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. గ్రామంలోకి వెళ్లే 11 కేవీ ఎలక్ట్రిక్ వైర్
గ్రిప్‌ను తగలడం వల్ల ప్రాణాలు కోల్పోయిందని అటవీ విభాగం విచారణలో తెలిసింది. పన్నా టైగర్ రిజర్వులో ఒక చెట్టు వద్ద తగిలించి ఉన్న పులి అవశేషాలను కూడా గుర్తించారు.

జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న ట్రాప్‌లో ఈ పులి చిక్కుకుని చనిపోయిందని విచారణలో తేలినట్టు చౌహాన్ చెప్పారు. మధ్య ప్రదేశ్‌లోని అటవీ విభాగం విడుదల చేసిన రిపోర్టులో గత ఐదేళ్లలో రాష్ట్రంలో 171 పులులు, 310 చిరుతలు చనిపోయినట్లు పేర్కొంది. అత్యధికంగా 2021లో 45 పులులు చనిపోయాయని, గత ఏడాది 87 చిరుతలు మధ్య ప్రదేశ్అడవుల్లో మరణించినట్టు తెలిపింది. పులులతో పోలిస్తే చిరుతలు విశాలమైన ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

అయితే పులుల మరణంపై మధ్య ప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆదేశించడంతో, రాష్ట్రంలోని అడవుల్లో జంతువులను వేటాడి చంపడం పెద్ద ఎత్తునే
సాగుతున్నట్టు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 7 పులుల వరకు మరణానికి కారణం వేటాడమేనని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పులుల మెడల్లో ‘శాటిలైట్ కాలర్స్’ పెట్టినప్పటికీ, అవి వేటగాళ్లకు చిక్కడం లేదా వలల్లో చిక్కుకోవడం ద్వారా మృత్యువాత పడుతున్నాయి. దీంతో మధ్య ప్రదేశ్‌లో పులుల మరణాలకు గల కారణాలు సాధారణంగా లేవని, అనుమానించదగ్గవిగా ఉన్నాయని తెలుస్తోంది.

పులుల కోసం ఏర్పాటు చేసే బఫర్ జోన్‌ను పర్యటకం కోసం తెరుస్తుండటంతో, వన్యప్రాణులపై ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు. కర్నాటకలో కూడా పులుల సంఖ్య 500 కంటే ఎక్కువగా ఉందని, కానీ మధ్య ప్రదేశ్‌తో పోలిస్తే ఇక్కడ వీటి మరణాల సంఖ్య తక్కువగా ఉంది. కర్నాటకలో 500 కంటే
ఎక్కువగా పులులు ఉన్నప్పుడు, సహజ మరణాలు కూడా అక్కడ సగటున ఒకే స్థాయిలో ఉండాలి. ప్రతేడాది సుమారు 30గా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే, కచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది.

పులుల సంరక్షణకు సంబంధించిన సమాచారం విషయంలోనైనా లేదా వాటి మరణాలలోనైనా అక్కడి అటవీ విభాగం సమాచారం పొందడం లేదు. ఒకవేళ పులుల మృతదేహాలను అక్కడి అటవీ విభాగం రికవరీ చేసుకోకపోతే, వాటి గురించి ఎలా తెలుస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. పులుల మరణాల సంఖ్య పెరిగేందుకు అడవులు తగ్గిపోవడం కూడా ప్రధాన కారణాల్లో ఒకటని నిపుణులు అంటున్నారు. అడవుల చుట్టూ స్థలం ఎక్కువగా ఉండాలని వన్యప్రాణుల నిపుణులంటున్నారు. వాటిని పులుల సంరక్షణకు, సురక్షితకు వాడాలని నిపుణులు పేర్కొంటున్నారు.

Must Read

spot_img