ఉన్నట్టుండి రష్యా నుంచి నెలలు నిండిన గర్భినీ స్త్రీలు దేశం వీడి ఇతర దేశాలకు తరలిపోతున్నారు. ఎందుకు ఇంత సడన్ గా ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ఆరా తీస్తే రష్యా ఉక్రెయిన్ యుధ్దమే అందుకు కారణమని తేలింది. ఈ యుధ్దానికి సంవత్సరం పూర్తవుతుండటంతో రష్యా మరింత విజ్రుంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతోంది. ఇది ఎటు తిరిగి ఎటు పరిణమిస్తుందోనని గర్భంతో ఉన్న మహిళలు దేశం వీడుతున్నారు..
- గర్భిణీ స్త్రీలు హెల్త్ చెకప్ కోసం చికిత్సల కోసం దేశం వీడి పక్క దేశాలకు వెళుతుంటే పురుషులకు ఆ అవకాశం లేకపోవడంతో రష్యాలోనే ఉండిపోతున్నారు..
ఇప్పటికి వేలాదిగా గర్భిణీలు రష్యా నుంచి తరలిపోయారన్న సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రష్యాకు చెందిన గర్భిణీ స్త్రీలు దేశం విడిచి.. ముఖ్యంగా అర్జెంటీనాకు వలస వెళుతున్నారు. గత కొన్ని నెలల నుంచి మొదలైన ఈ వలసల్లో భాగంగా ఇప్పటివరకూ 5 వేల మంది గర్భిణీ మహిళలు అర్జెంటీనా పౌరసత్వం పొందారు. వీళ్లందరూ ఇలా రష్యా విడిచి అర్జెంటీనాకు వెళ్లడానికి కారణం.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధమే.. ఈ యుద్ధం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న భయంతో.. అర్జెంటీనాకు తరలి వెళుతున్నారు. ఇటీవల కాలంలో అర్జెంటీనకు వెళ్తున్న రష్యా మహిళల సంఖ్య మరింత పెరిగింది.
ఒక్క గురువారంనాడే 33 మంది మహిళలు అర్జెంటీనా వెళ్లారని తేలింది. మొదట మెడికల్ టూరిస్టుగా అక్కడ పాదం మోపి.. ఆ తర్వాత అర్జెంటీనా పౌరసత్వం పొందుతున్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. రష్యాలో కంటే అర్జెంటీనాలోనే ఎక్కువ స్వేచ్ఛ ఉండటంతో, తమ పిల్లలకు అర్జెంటీనా పౌరసత్వం ఉండాలని రష్యా గర్భిణీలు కోరుకుంటున్నారు.
అర్జెంటీనా వీసాతో కలిగే ఓ గొప్ప ప్రయోజనం ఏమిటంటే.. అర్జెంటీనా వీసా హోల్డర్స్ 171 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. కానీ.. రష్యా వీసా కలిగిన వాళ్లు 87 దేశాలు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించడానికి అనుమతి ఉంది. మరోవైపు.. రష్యా నుంచి గర్భిణీలు ఇలా తరలివెళ్తున్న తరుణంలో, ఓ రష్యన్ వెబ్‌సైట్ అర్జెంటీనా దేశంపై అక్కసు వెళ్లగక్కింది.
- అర్జెంటీనాలో ప్రసవించే గర్భిణీలకు అక్కడి ప్రభుత్వం వివిధ ప్యాకేజీలు అందిస్తోందని, ఇదొక మిలియన్ డాలర్ల అక్రమ వ్యాపారమని ఆరోపించింది..
అంతేకాదు.. రష్యన్ మహిళలకు, వారి భాగస్వామ్యులకు అర్జెంటీనాలోనే స్థిరపడేలా నకిలీ పత్రాలను జారీ చేస్తోందని రాసుకొచ్చింది. ఇంకా చాలా రకాలుగా అవాకులు చవాకులు చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా పచ్చి అబద్ధమని అర్జెంటీనా అధికారులు స్పష్టం చేశారు. అలా ఏం జరగడం లేదని ఖండించారు. ఇదిలావుండగా.. గురువారంనాడు అర్జెంటీనాకు తరలివెళ్లిన 33 మంది మహిళల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడం వల్లే అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఆ ముగ్గురి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తప్పుడు పర్యాటకులన్న అనుమానంతో వారిని అరెస్ట్ చేసినట్లు తెలియజేసారు.
ఇదిలా ఉంటే అటు ఉక్రెయిన్ లోనూ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దండయాత్రకు ఆ దేశం చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడ చూసినా మరణించిన సైనికుల మ్రుతదేహాలు అలాగే పడిఉంటున్నాయి. తెగిపడిన శరీరభాగాలు, శిథిల భవనాలతో ఉక్రెయిన్ మరుభూమిలా మారిపోయింది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ దేశవాసులు యూరప్ సహా పొరుగు దేశాలకు వలసపోతున్నారు.
కన్నవారినీ ఉన్న గ్రామాన్ని అయినవారందరినీ విడిచిపెట్టి పరాయిదేశానికి తరలిపోతున్నారు. బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చని ఎలాగోలా దేశం వీడి పోతున్నారు. అటు యుధ్దం కారణంగా అతలాకుతలమైన ఉక్రెయిన్ ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం, పలు స్వచ్చందసంస్థలు ఆపన్న హస్తాన్ని అందిస్తున్నాయి.
ఇదిలా ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరికొన్నేళ్లు సాగే అవకాశాలున్నాయని ప్రైవేట్ మిలటరీ కాంట్రాక్టర్, వాగ్నర్ గ్రూప్ యజమాని యెవ్‌గెనీ ప్రిగోజిన్ అంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రిగోజిన్‌కు చెందిన ప్రైవేట్ సైన్యం రష్యా మిలటరీతో కలిసి ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తోంది. శుక్రవారం ఓ వీడియో ఇంటర్వ్యూలో ప్రిగోజిన్.. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్‌బాస్‌పై పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించేందుకు రష్యాకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు పట్టొచ్చని అంచనా వేశారు. నీపర్ నదికి తూర్పు వైపునున్న విస్తార ప్రాంతంపై పట్టు సాధించాలంటే మాత్రం రష్యాకు మూడేళ్ల వరకు సమయం తీసుకుంటుందని అన్నారు. కంచుకోటలాంటి డొనెట్‌స్క్‌లోని బఖ్ముత్‌లో ఉక్రెయిన్ దళాలతో తమ గ్రూప్ శ్రేణులు భీకర పోరాటం సాగిస్తున్నాయని చెప్పారు.