Homeజాతీయంఅమెరికాలో శీతాకాలపు తుఫాను ప్రజలను గజగజ వణికిస్తోంది..!

అమెరికాలో శీతాకాలపు తుఫాను ప్రజలను గజగజ వణికిస్తోంది..!

అమెరికాలో హిమోత్పాతం ప్రజలను గజగజ వణికిస్తోంది. మంచు తుపానులో చిక్కుకొని ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు.. పశ్చిమ న్యూయార్క్‌లో కొన్ని ప్రాంతాలు 8 అడుగుల మేర మంచులో కూరుకుపోయాయి. విపరీతంగా కురుస్తున్న మంచుతో పాటు చలిగాలులు అమెరికా, కెనడా ప్రజలను విలవిలలాడేలా చేస్తోంది..

మంచు తుఫాన్ భీభత్సంతో అగ్రరాజ్యం అమెరికా అల్లకల్లోలం అవుతోంది.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారంటేనే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో మంచు తుఫాన్ భీభత్సానికి కారణం ఏంటి..?

అమెరికాలో హిమోత్పాతం ప్రజలను వణికిస్తోంది.. అత్యంత చలి కారణంగా అమెరికా, కెనడాలలో కనీసం 48 మంది మరణించినట్లు తెలుస్తోంది.. గత కొద్ది రోజులుగా విపరీతంగా కురుస్తున్న మంచుతో పాటు చలిగాలులకు ఈ రెండు దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి.

ఒక్క అమెరికాలోనే 34 మంది మరణించారని అధికారులు తెలిపారు. న్యూయార్క్ రాష్ట్రంలోని బఫెలో నగరం అత్యంత ప్రభావిత ప్రాంతంగా మారింది.. కెనడాలోని బ్రిటీష్ కొలంబియా రాష్ట్రానికి చెందిన మెరిట్ పట్టణానికి సమీపంలో మంచుతో నిండిన రహదారిపై బస్సు బోల్తా పడడంతో నలుగురు మరణించారు.

గత కొద్దిరోజులుగా తీవ్రంగా ఉన్న చలి, మంచు కారణంగా విద్యుత్ సంక్షోభం కూడా ఏర్పడింది. అయితే, ఇప్పుడిప్పుడే విద్యుత్‌ ను పునరుద్ధరిస్తున్నారు. అమెరికాలో కనీసం 2 లక్షల మంది విద్యుత్ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని, అయితే అంతకు ముందున్న 17లక్షల నుంచి తగ్గి ఈ స్థాయికి చేరుకుందని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది.

మంచు తీవ్రత కారణంగా వేలాది విమానాలను రద్దు చేశారు. క్రిస్మస్ వేడుకలకు చాలా మంది ఇళ్లకు చేరుకోలేకపోయారు. గత ఆదివారం నాటికి సుమారు అయిదున్నర కోట్లమంది అమెరికన్లు తీవ్ర చలి హెచ్చరికలను ఎదుర్కోవాల్సి వచ్చింది… మంచు తుఫాను కారణంగా ఏర్పడిన పరిస్థితులు కనివిని ఎరుగని రీతిలో ఉన్నాయని, ఇవి కెనడా నుంచి దక్షిణాన ఉన్న టెక్సాస్ వరకు విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు.

“బాంబు సైక్లోన్”గా చెబుతున్న ఈ శీతాకాలపు తుఫాను- వాతావరణంలో పీడనం తగ్గడం వల్ల ఏర్పడుతుంది. దీని కారణంగా భారీ మంచు కురవడంతో పాటు, చలి గాలులు వీస్తాయి. ఈ బాంబ్ సైక్లోన్ కారణంగా అమెరికా వ్యాప్తంగా ప్రయాణాలకు తీవ్ర అంతరాయం కలిగింది. ‘‘ఈ తుఫాన్ బఫెలో నగరానికి అత్యంత వినాశకరంగా మారింది. ఏకధాటిగా మంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రోడ్లపైకి రావడం అసాధ్యంగా మారిందని… ఇది చరిత్రలో నిలిచిపోతుంది’’ అని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాథీ హోచుల్ తెలిపారు.. ఈ ప్రాంతంలో చనిపోయిన ఏడుగురిలో కొందరు కార్లలో, మరికొందరు మంచు తిన్నెల్లో కనిపించినట్లు ఎరీ కౌంటీ ఎగ్జిక్యూటివ్ మార్క్ పోలోన్‌కార్జ్ తెలిపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.

ఇంకా కార్లలో చిక్కుకున్న అనేక మందిని సిబ్బంది రక్షించినట్లు కూడా పేర్కొంది. దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో చికాగో, డెన్వర్, డెట్రాయిట్, న్యూయార్క్, అట్లాంటా విమానాశ్రయాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొలరాడో, కన్సాస్, కెంటకీ, మిస్సోరీ, ఓహియోలో ప్రాణనష్టం అధికంగా ఉంది.

వెర్మోంట్, ఒహియో, మిస్సోరీ, విస్కాన్సిన్, కాన్సాస్, కొలరాడోలలో కూడా తుఫాను సంబంధిత మరణాలు నమోదయ్యాయి. అమెరికా పశ్చిమ రాష్ట్రమైన మోంటానాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు -50Fకి పడిపోయాయి. కెనడాలో, ఒంటారియో, క్యూబెక్ రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

క్యూబెక్‌ స్టేట్‌లో దాదాపు 1 లక్షా 20 వేలమంది కరెంటు లేకుండా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణకు కొన్ని రోజులు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. న్యూయార్క్‌లో భారీ స్థాయి మంచు తుఫానులు కొన్నిరోజులపాటు కొనసాగే పరిస్థితితులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అల్పపీడనం ఉదృతి వల్ల కెనడా నుంచి టెక్సస్, మెక్సికో సరిహద్దుల వరకూ బలమైన గాలులు, మంచు, హిమం, గడ్డకట్టించే పరిస్థితులు ఉంటాయి.

క్రిస్మస్ వస్తే అమెరికా మొత్తం సంబరాలు అంబరాన్ని అంటుతాయి..

సాధారణంగా క్రిస్మస్ వస్తే అమెరికా మొత్తం సంబరాలు అంబరాన్ని అంటుతాయి.. కానీ.. ఈసారి 60 శాతం మంది ప్రజలు ఇళ్ళకే పరిమితమయ్యారు. కరెంటు లేదు.. తాగేందుకు నీరు లేదు.. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. మొత్తానికి ప్రజలు నరకం చూస్తున్నారు.. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో 13 రాష్ట్రాలు అతలాకుతులమవుతున్నాయి.. మోంటానాలో -45.6 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయంటే అక్కడ మంచు తుఫాన్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..

ముఖ్యంగా ‘రాఖీ_ అపలిచియాన్’ పర్వత శ్రేణిలో మంచు తీవ్రంగా కురుస్తోంది.. దీని దెబ్బకు మూడు లక్షల ఇళ్లల్లో చీకట్లు అలముకున్నాయి. ప్రజలు ఇల్లు కదిలి బయటకు రావద్దని ఎన్‌డబ్ల్యూఎస్‌ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో తూర్పు రాష్ట్రాలన్నీ డీప్‌ ఫ్రిజ్‌లో పెట్టినట్టుగా ఉన్నాయని అమెరికా నేషనల్‌ వెదర్‌ సర్వీసెస్‌ తెలిపింది. అమెరికాలోని 48 రాష్ట్రాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మంచు తుఫాన్‌ హెచ్చరికలు జారీ అయిన ప్రాంతాల్లో కోటి మంది వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోని బఫెల్లో ప్రాంతంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

అగ్రరాజ్యం అమెరికాపై బాంబు మంచు తుఫాను పంజా విసురుతున్నది. హరి కేన్ లను తలపించే విధంగా ఈదురుగాలు వీస్తుండడంతో ప్రజలు నరకం చూస్తున్నారు.. ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని 13 రాష్ట్రాలపై మంచు తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. విద్యుత్ సరఫరాలో అంతరాయం వల్ల చాలా రాష్ట్రాల్లో అంధకారం అలముకున్నది.. తీవ్రస్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతల కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 48 మంది మృతి చెందారు.. ఇక మెక్సికోలోని శిబిరాల్లో శరణార్థులు మంచుకు గజగజ వణికి పోతున్నారు..

ఉత్తర అమెరికాలోని మోంటానా, వ్యోమింగ్ నగరాల్లో -45.6 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బోస్టన్, లింకన్, న్యూ యార్క్, చికాగో, మిషిగాన్ ప్రాంతాల్లో మైనస్ పది డిగ్రీల కంటే తక్కువలో ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్టు వాతావరణ శాఖ చెబుతోంది.. కార్లలో ప్రయాణిస్తున్న వారిపై విపరీతంగా మంచుకురవడం వల్ల ఆ వాహనంలో మంచులో కూరుకుపోయి మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

దీంతో ప్రజలు బయటకి రావడంపై ఆ ప్రాంతంలో నిషేధం విధించారు. విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు 18 అడుగుల మంచులో కూరుకుపోవడంతో ఎప్పటికి కరెంట్‌ వస్తుందో తెలీని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్కిటిక్‌ బ్లాస్ట్‌తో అమెరికా ఈ శీతాకాలంలో గడ్డకట్టుకుపోయింది.

మూడు లక్షల ఇళ్ళు, వ్యాపార సంస్థలకు విద్యుత్ సరఫరా లేక అంధకారం అలముకున్నది.. 60% జనాభా మంచు వల్ల తీవ్రంగా ప్రభావితమవుతోంది.

ఇళ్లలోనే చలిమంటలు వేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది.. చలి, మంచు కారణంగా అమెరికా వ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో 5,400 దేశీయ, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. రోడ్లపై ముఖ్యంగా హైవేలపై పేరుకుపోయిన మంచు కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి.. ఇక జపాన్ లోనూ మంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మృతి చెందారు.. మంది గాయపడ్డారు..

జపాన్ లోని హోక్వయిడో కురుస్తున్న మంచు వల్ల చలిగాలులు వీస్తున్నాయి. 1.2 మీటర్ల ఎత్తులో మంచి పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. యమగాట, ఒగుని, గిపూ లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. పలుచోట్ల అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. కార్యాలయాలు తెరుచుకునే వీలు లేకపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

అమెరికాలో మంచు తుఫాన్ పంజాతో ప్రజలు విలవిలలాడుతున్నారు.. హరికేన్ లను తలపించే విధంగా ఈదురుగాలులు వీస్తుండటం, మైనస్ డిగ్రీలలో ఉష్ణోగ్రతలతో చలిని తట్టుకోలేకపోతున్నారు.. ఈ మంచు తుఫాన్ నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ.. ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు..

Must Read

spot_img