Homeఅంతర్జాతీయంఉక్రెయిన్ రష్యా యుధ్దం పదకొండు నెలలను కూడా దాటిపోయేలా కనిపిస్తోంది.

ఉక్రెయిన్ రష్యా యుధ్దం పదకొండు నెలలను కూడా దాటిపోయేలా కనిపిస్తోంది.

ఉక్రెయిన్ రష్యా యుధ్దం పదకొండు నెలలను కూడా దాటిపోయేలా కనిపిస్తోంది. ఇది ఇాలాగే కొనసాగి రష్యా చేతులెత్తేసే పరిస్థితి దాపురిస్తే అణుయుధ్ధం తప్పదని మాజీ అధ్యక్షుడు డెమిత్రి మెద్వదేవ్ హెచ్చరించారు. రష్యా ఓడిపోయే పరిస్థితిని తట్టుకోలేదని ఆయన గుర్తు చేసారు. అమెరికా సహా నాటో దేశాల ఆర్థిక ఆయుధ సాయంతో ఉక్రెయిన్ ఇంకా యుధ్దంలో నిలదొక్కుకుని ఉంటోంది. ఓ రిపోర్ట్..

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా విజయం సాధించడం ఖాయమని, అందులో ఎలాంటి అనుమానం లేదని అధ్యక్షుడు పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన దేనిని ద్రుష్టిలో ఉంచుకుని ఈ ప్రకటన చేసారో కానీ..అలా చెబుతూ ఉండగానే యుధ్దం మొదలై పదకొండు నెలలు కూడా దాటింది. దీంతో రాబోయే కొద్ది రోజుల్లో యుధ్దం మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా సహా నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు డాలర్లు అందిస్తూ యుధ్దాన్ని సజీవంగా ఉంచుతున్నాయి. ఒక వేళ యుధ్దంలో రష్యా ఓడిపోయే పరిస్థితి ఏర్పడితే మాత్రం అణుయుధ్ధం తప్పదని అంచనాలున్నాయి. ఈ విషయంపై పుతిన్ మొదటి నుంచీ సూచనలు చేస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే ఇప్పుడు రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ చేసిన అణుయుధ్దం ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

సోవియట్ దళాలు లెనిన్‌గ్రాడ్ ముట్టడిని ఛేదించిన 80వ వార్షికోత్సవం సందర్భంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో కార్మికులను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో కొన్ని సైనిక వైఫల్యాలు ఎదురైనా అంతిమ విజయం మాత్రం రష్యా దేనని, ఇందులో అనుమానమే లేదని స్పష్టం చేశారు. ‘రష్యా ప్రజల ఐక్యత, సంఘీభావం తో పాటు మన యోధుల ధైర్యం, వీరత్వానికి తోడు సాయుధ పరిశ్రమ రంగం పనితీరు ఉక్రెయిన్‌పై విజయాన్ని తెచ్చిపెడుతుంది’ అని అన్నారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెలుపల బ్రోవరీ నగరంలో కిండర్‌గార్టెన్‌ స్కూలుకు సమీపంలో బుధవారం హెలికాప్టర్‌ కూలిపోయి ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఉక్రెయిన్‌ హోం మంత్రి సహా 18మంది మరణించారు.

మంత్రితో పాటు ఆ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు కూడా మృతి చెందిన వారిలో వున్నారని నేషనల్‌ పోలీసు చీఫ్‌ తెలిపారు.

నర్సరీ, నివాస భవనానికి సమీపంలో హెలికాప్టర్‌ కూలడంతో మృతుల్లో ముగ్గురు చిన్నారులు వున్నారని అధికారులు తెలిపారు. గాయపడిన మరో పదిమందిని ఆస్పత్రిలో చేర్చారు. సంఘటనా స్థలం వద్ద విషాదకర దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. యుధ్దంలో ఉక్రెయిన్ ఎక్కడా తగ్గడం లేదు. అన్ని ప్రదేశాలలో రష్యా సేనలను ఎదురొడ్డి పోరాడుతోంది. అన్ని ప్రాంతాలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కీ స్వయంగా వెళ్లి ప్రజలను కలుసుకుంటున్నారు. సైనికుల మనోదైర్యాన్ని నింపుతున్నారు. ఎప్పటికప్పుడు దేశాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.

వచ్చే నెలతో ఈ యుధ్దానికి ఏడాది పూర్తవుతుంది. అయినా కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఇరు పక్షాలు ఎక్కడా తగ్గడం లేదు. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించింది. అయితే సైనికపరంగా శక్తివంతమైన రష్యా ముందు ఉక్రెయిన్ వారం రోజుల్లో లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ.. పాశ్చాత్య దేశాలు, అమెరికా, నాటో కూటమి ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో ఉక్రెయిన్, రష్యాను ఎదురించి పోరాడుతోంది. అందుకే ఈ యుద్ధం అణు యుద్ధంగా మారతుందని ప్రపంచం మొత్తం ఆందోళనలు నెలకొన్నాయి. పలు సందర్భాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణు హెచ్చరికలు చేశారు. ఇప్పుడు రష్యా మాజీ అధ్యక్షుడు, పుతిన్ కు అత్యంత సన్నిహితుడు డెమిత్రి మెద్వదేవ్ కూడా మరోసారి అణు హెచ్చరికలు చేశారు.

ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఓడిపోతే అణుయుద్ధం తప్పదని అన్నారు.

సాంప్రాదాయ యుద్దంలో అణుశక్తిని ఓడిస్తే అణుయుద్ధానికి దారి తీయవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఆయన టెలిగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. ఇటీవల కాలంలో రష్యా, ఉక్రెయిన్ పై దాడిని తీవ్రతరం చేసింది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. గత వారం క్షిపణి దాడిలో ఏకంగా 40 మంది మరణించారు. విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికాలో పర్యటించాడు. అమెరికా నుంచి సైనిక, ఆర్థిక సాయాలను కోరాడు. దీంతో అమెరికా తన పెట్రియాట్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ కు ఇస్తోంది. బ్రిటన్ ఛాలెంజర్ యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ కు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ రెండు ప్రకటనల తర్వాత రష్యా, ఉక్రెయిన్ పై దాడులు మరింత ముమ్మరం చేసింది.

Must Read

spot_img