Homeజాతీయంయూరప్ దేశాలకు చలికాలం ముప్పు ముంచుకు వస్తోంది..!

యూరప్ దేశాలకు చలికాలం ముప్పు ముంచుకు వస్తోంది..!

యూరప్ దేశాలకు చలికాలం ముప్పు ముంచుకు వస్తోంది. అసలు చలికాలం అంటేనే వ్యాధులను వెంటేసుకు వచ్చే కాలం. అలాంటిది ఈసారి అమెరికా సహా నాటో దేశాల కారణంగా ఆ దేశప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. రష్యాతో వ్యతిరేక వైఖరి కారణంగా సరిపడా చమురు, గ్యాస్ లేకుండా పోయింది.

ఉక్రెయిన్ యుధ్దం కారణంగా ఆర్థికంగా విపరీతమైన నష్టాలు ఎదుర్కుంటున్నారు. అదే సమయంలో ఇప్పుడు తాజాగా అక్కడ మెడిసిన్స్ కూడా దొరకడం లేదన్న షాకింగ్ వార్త సర్కులేట్ అవుతోంది. మీకు తెలుసా..అక్కడ కనీసం ఏడెనిమిది మెడికల్ షాపులు తిరిగితే కానీ ఆమోక్సిసిలిన్, పారాసిటమాల్ మందు బిళ్ల దొరకడం లేదు. అంతగా అక్కడ వాటికి షార్టేజ్ కొనసాగుతోంది. అసలే కరోనా మహమ్మారి కరాళ న్యుత్యం చేసిన యూకే ఫ్రాన్స్ దేశాలలో ఈ శీతాకాలంలో అవసరమైన అత్యంత కీలకమైన గొంతు ఇన్ఫెక్షన్ మందులైన ఆంటీబయాటిక్స్ దొరకడం లేదు.

నిజానికి ఈ సమయంలో ఇక్కడ ఈ మందులు అత్యవసరంగా చెబుతారు. అడ్డదిడ్డంగా మంచుకురిసే శీతాకాలంలోనే ఇన్ఫెక్షన్స్ చెలరేగిపోతాయి. ఈ సమయంలో యూరప్ వ్యాప్తంగా మందుల కొరత కొనసాగుతోంది. ఓవైపు అమెరికా కెనడా ట్రైడెమిక్ పేరుతో మూడు వ్యాధులతో కూడిన వైరస్ విజ్రుంభిస్తోంది. చిన్నపిల్లలే లక్ష్యంగా జరుగుతున్న దాడిలో ఇప్పటికే పదుల సంఖ్యలో పిల్లలు చనిపోయారు. అక్కడ కూడా మందులు దొరకడం లేదు.

ఈ పరిస్తితి ఇటలీ సహా అనేక యురోపియన్ దేశాలలో కొనసాగుతోంది. అయితే ఈ షార్టేజీలకు మూల కారణం ఏంటన్న విషయానికొస్తే.. ఇక్కడ ఇలా కొంత కాలంగా మందుల కొరత కొత్త కాదంటున్నారు ప్రజలు. కోవిడ్19 తరువాత మందుల కొరత సమస్య అన్ని దేశాలలో ఉంది.

దానికి ఇప్పుడు ఉక్రెయిన్ యుధ్దం ఆజ్యం పోసింది. ఇప్పుడు అన్ని రకాల మందులకు కొరత వేదిస్తోంది. ఇది గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం డ్రగ్స్ సరఫరా విషయంలో గ్లోబలైజేషన్ అని చెబుతున్నారు.

నిజానికి ప్రపంచవ్యాప్తంగా మెడిసిన్ తయారీ అన్నది ఒక్క ప్రదేశంలో కేంద్రీక్రుతమై లేదు. ఒక్కో మందు తయారీకి కావలసిన పదార్థాల తయారీ వివిధ దేశాలలో ఉండటం వలన ఏ దేశంలో అయినా అక్కడ స్థానిక ఇబ్బందులు వస్తే దాని ప్రభావం మొత్తం ప్రపంచదేశాలపై పడుతోంది. ఉదాహరణకు ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే మెడిసిన్ లలో 60 నుంచి 80 శాతం దాకా కేవలం చైనా, భారతదేశాలలోనే తయారవుతున్నాయి.

ఈ రెండు దేశాల కంపెనీలలో ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ ప్రభావం మొత్తం ప్రపంచం అంతా పడుతోంది. ఏ ఉత్పత్తిపైన ఐనా పెద్దగా లాభం లేదని సదరు కంపెనీ యజమాని అనుకుంటే దానిని తయారుచేయడం ఆపేస్తుంటారు. దాంతో అది అత్యవసరమైన దేశాలలో కష్టాలు మొదలవుతుంటాయి. ఇప్పుడయితే మరీ దారుణంగా ఉంది. ఉక్రెయిన్ యుధ్దం కారణంగా ఫార్మా వ్యాపారాలకు అనేక ఇబ్బందులు మొదలయ్యాయి.

అన్ని ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. యుద్ధం కారణంగా ఇంధనం, మందులు తయారు చేసేందుకు ఉపయోగించే రా మెటీరియల్ రేట్లు అపారంగా పెరిగిపోయాయి. అంతే కాదు అప్పట్లో వచ్చిపడ్డ లాక్డౌన్ల కారణంగా కూడా ఫార్మా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు చైనాలో కొనసాగుతున్న కోవిడ్19 వల్ల ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతిన్నదంటే అతిశయోక్తి కాదు. ఎక్కడా పనులు జరగడం లేదు. ఎక్కడ చూసినా జీరో కోవిడ్ పాలసీ గురించి కార్మికులను క్వారంటైన్ చేయడం పైనే చైనా ప్రభుత్వం ద్రుష్టిపెడుతోంది. దాంతో ఈ ప్రభావం అల్టిమేట్ గా యూరప్ దేశాలపై పడుతోంది.

యూరప్ దేశాలలో ఫార్మా పరిశ్రమలు లేవా అంటే..ఉన్నాయి..కానీ.. చైనా నుంచి అతి తక్కువ ధరల్లో మెడిసిన్ సప్లై జరుగుతున్న కాలంలో వాటి ఏర్పాటు అనవసరపు ప్రక్రియగా అవి భావించాయి. పైగా మందుల తయారీలో ఉపయోగించే రామెటీరియల్ అన్ని చోట్లా దొరకదు మళ్లీ దాని కోసం చైనా భారత్ లపైనే ఆధారపడాలి. అందుకే ఫార్మా పరిశ్రమలు ఈ రెండు దేశాలలోనే ఎక్కువగా స్థిరపడ్డాయి.

చైనాలోని అన్ని నగరాలలో పట్టణాలలో కోవిడ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి..!

ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. మొన్న జీరో కోవిడ్ ఎత్తి వేసిన తరువాత చైనాలోని అన్ని నగరాలలో పట్టణాలలో కోవిడ్ కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి. ఎక్కడ ఎన్ని కేసులు నమోదవుతున్నాయో లెక్కలు కట్టలేక ఆ వివరాలను కూడా బయటపెట్టని పరిస్థితిలో చేతులెత్తేసింది చైనా. నిజానిక కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే కఠినమైన లాక్ డౌన్ లను విధించాల్సిందే..కానీ ప్రజల నుంచి ఎదురైన తీవ్ర వ్యతిరేకత వల్ల చైనా జీరో కోవిడ్ పాలసీని పక్కన పెట్టేసింది. లాక్డౌన్లను ఎత్తివేసింది. దాంతో ఒక్కసారిగా కోవిడ్ మళ్లీ విజ్రుంభించింది.

చాలా వరకు పరిశ్రమలు పనిచేయడం లేదు. వాటిలో భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. దాంతో తమ సొంత అవసరాల కోసం మెడిసిన్ ఎగుమతలుపైన నియంత్రణ విధించింది చైనా. దాదాపు అన్ని మందుల తయారీలో ఉపయోగించే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్ ఏపీఐ ఎక్కువగా చైనా, భారత్ దేశాలలోనే దొరుకుతుంది. దానిని ఇప్పుడు ఈ రెండు దేశాలు తమ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నాయి.

అది లేందే మందులు తయారీ సాధ్యం కాదు. ఇంతకీ ఏపీఐ అంటే ఏంటో అది ఎలా తయారవుతుందో ఒకసారి చెప్పుకోవాలి. ఏపీఐ తయారు చేసుకోవడానికి మొక్కజొన్న నుంచి తీసిన పదార్థాన్ని వాడతారు. అయితే రష్యా ఉక్రెయిన్ యుధ్దం కారణంగా మొక్కజొన్న కావాసినంత పరిమాణంలో దొరకడం లేదు.

దాంతో ఏపీఐ తయారీ మీద తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు ఇంధనం కొరతతో యూరప్ దేశాలలో ఫార్మా సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం అదనంగా ప్రభావం చూపించింది. ఇప్పుడు ఏపీఐ కొరతతో మందుల సరఫరా దాదాపు కుంటుపడినట్టేనని చెప్పుకోవాలి.

అయితే మందుల కొరత కేవలం ఆమోక్సిసిలిన్, పారసిటమల్ మందులకే పరిమితం కాలేదు. ప్రస్తుతం ఈ రెండు మందులకు డిమాండ్ ఉండటం వలన వార్తల్లో ఉంటున్నాయి కానీ అన్ని రకాల మందులకు కొరత ఉంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో ఈ శీతాకాలం వెళ్లే వరకు ఒక్కోమనిషికి రెండు పాకెట్ల మందులు మాత్రమే ఇవ్వాలనే రేషన్ విధించాల్సి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. లేకపోతే పరిస్థితి అదుపు తప్పే అవకాశాలున్నాయి.

పైగా యూరప్ కెనడా అమెరికా దేశాల మందుల నాణ్యతా ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. ఒకే మందును వివిధ దేశాలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు యూరప్ దేశాలకు కొన్ని ఫార్మా సంస్థలు ప్రత్యేకంగా వాళ్ల నియమ నిబంధనలకు అనుగుణంగా తయారు చేయాల్సి ఉంటుంది. అలాంటి ఏర్పాట్లున్న సంస్థలు మన దేశంలో ఉన్నాయి. అది కూడా షార్టేజీలకు మరో కారణంగా ఉంది. కేవలం ఒక్క వ్యక్తి ఆలోచనల వల్ల ప్రపంచం మొత్తం బాధ పడుతోంది.

ఆ ఒక్కడు ఎవరన్నది అందరికీ తెలుసు. ఆ ఒక్కడిని సరిచేయడానికి యూరప్ దేశాలకు బలం సరిపోవడం లేదు. ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు. అప్పటిదాకా మరెన్నో విచిత్రాలు చూడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. యుద్దం త్వరగా ముగిసిపోవాలని కోరుకోవడం తప్ప మరో మార్గం లేదు.

Must Read

spot_img