ఈ ఏడాది చలికాలం తోందరగానే ముగిసింది. చలి తీవ్రత కూడా పెద్దగా అనిపించలేదు. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ ఏడాది ఎండలు బాగానే ఉండబోతున్నట్లు అంచనాలు వేస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలో కొద్దిరోజులుగా ఎండలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో వడగాలులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో పాటు సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉందంటున్న వైధ్యులు.
ఫిబ్రవరిలోనే వేసవిని తలపిస్తున్నాయి ఎండలు. సమ్మర్ అంటే చాలు.. జనాలకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తున్నాయ్. నిప్పులు కురిపిస్తుండటంతో రానున్న వేసవిని తలుచుకుని వణికిపోతున్నారు. మాడు పగిలిపోయే ఎండలు జనాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు మూడ్రోజులుగా ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరిగాయ్! సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు ! ఎండవేడికి జనాలు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. స్టార్టింగ్ లోనే ఈ రేంజ్‌లో సూర్యుడు మండిపోతున్నాడంటే, ముందు ముందు మంటలు పుట్టిస్తాడని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఉన్నట్టుండి పెరుగుతున్న ఉష్ణోగ్రత
ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఎటు చూసినా వైరల్ జ్వరాల బాధితులు కనిపిస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి ఫీవర్ బాగా వస్తుందని వైధ్యులు అంటున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవచ్చని పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత వరకు పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది వడదెబ్బకి గురై వాంతులు, విరోచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నాట్లు తెలుస్తుంది.
జ్వరాల బారీన పడుతున్న ప్రజలు
ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలను తాకుతుండటంతో.. వేడిజ్వరాలతో ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య కూడా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. చాలా మందికి ఎక్కువగా కండరాలు పట్టేయడం, సొమ్మసిల్లడం, నీరసించిపోవడం, చెమటలు పట్టడం, నాలుక తడారిపోవడం, వాంతులు, నీళ్ల విరేచనాలు, కళ్లు తిరగడం, తలనొప్పి తదితర లక్షణాలు ప్రధానంగా ఉంటాయని డాక్టర్లు అంటున్నారు. ఇప్పటికి జ్వరాలతో హస్పిటల్స్ కు వచ్చే వారికి ఈ రకమైన లక్షణాలే ఎక్కువగా కనబడుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ఎండలో ఎక్కువగా తిరిగేవారు ఎక్కువగా ఈ జ్వరాల బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
వాహనదారులు జర ఫైలం
ద్విచక్రవాహనాలపై తిరిగే వారు వేసవి జ్వరాల బారిన పడే ముప్పు పొంచి ఉన్నందున వారు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. తరుచు మజ్జిగా, నిమ్మనీరు, కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని సూచిస్తున్నారు. ప్రదానంగా ఈ వేసవిలో బయట నీటిని ఎక్కువగా తీసుకోవద్దని సూచిస్తున్నారు. చాలా వరకు వేసవిలో భూగర్బ జలాలు ఇంకిపోయి కలుషితం అవుతుందని వీలైనంత వరకు ఇంటి వద్ద నుంచే మంచి నీటిని తీసుకెళ్లాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రేకుల ఇళ్లు, మేడల్లో బాగా పై అంతస్థుల్లో ఉండేవారు, బస్సుల్లో తిరిగే వారు కూడా వేసవి ప్రభావానికి గురవుతారు. ప్రధానంగా హోటళ్లు, ఛాట్ దుకాణాలు, బస్సు స్టేషన్లు, రేల్వే స్టేషన్ల వద్ద ఏ నీరు పడితే అది తాగడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆహారం విషయంలోనూ కేవలం ఆరోగ్యకరమైన పదార్థాల్ని మాత్రమే తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
పరిశుభ్రమైన మంచినీరు తాగాలి..
సహజంగా మనిషి రోజుకు 7-8 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. నీరసంగా అనిపిస్తే.. కొబ్బరి నీరు, నిమ్మకాయ నీళ్లు, పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపసమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, మంచినీళ్ల బాటిల్, తలకు క్యాప్ ధరించాలి. రోజు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగిజావా తదితర తీసుకోవడం మంచిది. ఎక్కువగా ఇంట్లో తయారు చేసే పండ్ల రసాలు తీసుకోవాలి. నీరు, గ్లూకోజ్, జావ, బార్లీ, మజ్జిగ, రాగి అంబలి, సగ్గుబియ్యంతో చేసిన పానీయాలు తీసుకోవడం మంచిది. నీటి శాతం కోల్పోతున్న వారు తాగే నీరులో ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి. ఉదయం 8 గంటలకే బయటికి వెళ్లాలి. సాయంత్రం 6 గంటల తరువాత బయటి పనులు పూర్తి చేసుకునేలా చూసుకోవాలి.
నూనె వస్తువుల జోలికి వెళ్లద్దు..
ఎండల్లో తిరిగే వారు తప్పని సరిగ్గా గొడుగులు, టోపీలు ధరించాలి. వాంతులు, విరేచనాలు అవుతున్నప్పటికీ ఎక్కువగా నీరు తాగిస్తూనే ఉండాలి. రోడ్ల పక్కన విక్రయించే ఆహారం తినకూడదు. అపరిశుభ్రమైన నీరు తాగకపోవడం మంచిది. మాంసం, గుడ్లు, నూనె పదార్థాల జోలికి వెళ్లవద్దు. వేడిగా, తాజాగా ఉండే ఆహారం తీసుకోవాలి.
చిన్నారుల ఆరోగ్యంపై..నిర్లక్ష్యం వద్దు..
పిల్లలు వేసవిలో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తరచూ అనారోగ్యం పాలవుతారు. బయట వాతావరణం చాలా వేడిగా ఉండడం, తద్వారా పిల్లల శరీర ఉష్ణోగ్రత పెరగడం, ఎక్కువ చెమటతో వంట్లో నీరు వేగంగా ఆవిరైపోవడం.. ఇవి వడదెబ్బకు దారితీస్తాయి. ఇంట్లో ఉండే చిన్నపిల్లల విషయంలోనూ జాగ్రత్త అవసరం.
చర్మంపై పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చెమట పొక్కులు, ఇన్‌ఫెక్షన్‌తో సెగగడ్డలు వస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే జ్వరం వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకని స్నానం చేశారు కదాని నిర్లక్ష్యం చేయకుండ మొఖం, కాళ్లు, చేతులు చల్లని నీటితో కడుగుతూ ఉండాలి. ఎండాకాలం వచ్చే వ్యాధులు ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తాయి.
ఉదయం, సాయంత్రం ఎండలేని సమయాల్లోనే పిల్లలను బయటికి అనుమతించడం, తీసుకెళ్లడం చేయాలి. ఇంట్లోకి వేడిగాలి నేరుగా చొచ్చుకురాకుండా చుట్టూ మ్యాట్‌లు వేలాడదీయాలి. ఇవి పూర్తిగా తడి ఆరిపోకుండా చూసుకోవడం వల్ల గదులన్నీ చల్లని వాతావరణాన్ని సంతరించుకుంటాయి.
పిల్లలకి రెండు పూటలు తప్పక గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. శరీరంలో ఎక్కువ వేడి ఉన్నట్టయితే తడిబట్టతో తుడుస్తూ మామూలు స్థితికి తీసుకురావాలి.
గాలి ప్రసరణమయ్యే పలుచటి, మెత్తటి కాటన్ దుస్తులు వేయాలి. బయటికి వెళ్లాల్సి స్తే గొడుగు టోపీ, గాగుల్స్ తప్పక వాడాలి.
పిల్లలు ఆటల్లో పడి నీరు తాగడం మర్చిపోవచ్చు. దాహంతో సంబంధం లేకుండా మంచినీరు పట్టిస్తూ ఉండాలి. కొబ్బరినీళ్ళు, బార్లీ, సబ్జా, సగ్గుబియ్యం.. తదితర ద్రవాలు తాగించాలి. సీజనల్ ఫ్రూట్స్, అన్ని రకలా ఆకుకూరలు, కూరగాయలు తినిపించాలి.
సాధ్యమైనంత వరకు నిలువ ఆహారం జోలికి పోకుండా తాజా ఆహారం మాత్రమే పెట్టాలి.