Homeఅంతర్జాతీయంన్యూజీలాండ్ ప్రధానమంత్రి మేడమ్ జసిండా అర్డెర్న్ ఒక్కసారిగా దేశ ప్రజలకు షాకిచ్చారు.

న్యూజీలాండ్ ప్రధానమంత్రి మేడమ్ జసిండా అర్డెర్న్ ఒక్కసారిగా దేశ ప్రజలకు షాకిచ్చారు.

తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. వచ్చే నెలలో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 2017లో న్యూజిలాండ్ ప్రధానిగా ఎన్నికయిన ఆర్డెర్న్..పట్ల దేశంలో మంచి అభిప్రాయం ఉంది. ఆర్థిక మాంద్యపు సమయంలోనూ, కరోనా కష్టకాలంలోనూ దేశాన్ని బాధ్యతాయుతంగా నడిపించిన ఘనత ఆమె సొంతమని చెబుతున్నారు విశ్లేషకులు.

న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 2017లో న్యూజిలాండ్ ప్రధానిగా ఎన్నికయిన ఆర్డెర్న్..ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న ఎన్నికలలో పోటీ చేయాలని కోరుకోవడం లేదని కూడా ప్రకటించారు. ఈ మేరకు జసిండా ఆర్డెర్న్ గురువారంతన నిర్ణయాన్ని స్వయంగా ప్రకటించారు. అంతేకాక తాను తన బాధ్యతలకు న్యాయం చేయలేనని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కన్నీళ్లను దిగమింగుకుంటూ తన నిర్ణయాన్ని అధికార లేబర్ పార్టీ సభ్యులకు కూడా తెలియజేశారు జసిండా. ప్రధానిగా ఉన్నఈ ఐదున్నరేళ్లు తనకు అత్యంత క్లిష్టమైన సమయం అని చెబుతున్నారు జసిండా.. ‘నా నిర్ణయంపై పెద్ద చర్చ జరుగుతుందని తెలుసు.

అయితే దేశాన్ని నడిపించడం కష్టంగా ఉన్నందుకు నేను రాజీనామా చేసి వెళ్లడం లేదు. అదే కారణం అయి ఉంటే ప్రధాని పదవిని చేజిక్కించుకున్న రెండు నెలల్లోనే తప్పుకునేదాన్ని. ఆరేళ్ల కాలంలో ఎన్నో పెద్ద సవాళ్లను ఎదుర్కొన్న నేను కూడా మనిషినే. రాజకీయ నాయకులు కూడా మనుషులే. మనం పని చేయగలిగినంత కాలమే కొనసాగాలి. ఆ తర్వాత స్వచ్ఛందంగా తప్పుకోవాలి. ఇప్పుడు నాకు సమయం వచ్చింది’ అని అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ ఈ పదవికి సరైన న్యాయం చేసేందుకు కావాల్సిన శక్తి నాలో తగ్గిపోయిందని ఇప్పుడు నాకు అనిపించింది’ అని జెసిండా చెప్పారు. అయితే అక్టోబర్ నెలలో జరగబోయే ఎన్నికల వరకు తాను ఎంపీగా కొనసాగుతానని జసిండా అన్నారు. ఆ తరువాత తాను ఉండబోనని స్పష్టం చేసారు.

ఈ నేపథ్యంలో లేబర్ పార్టీ వచ్చే ఆదివారం భేటీని ఏర్పాటు చేసి కొత్త నేతను ప్రధాని పదవికి ఎన్నుకోనుంది.

ఈ ఏడాది అక్టోబర్ 14 సాధారణ ఎన్నికల వరకు కొత్తగా ఎన్నికయ్యే వ్యక్తి ప్రధాని పదవిలో ఉంటారు. జసిండా ఫిబ్రవరి 7 లోపు పదవి నుంచి తప్పుకుంటారు. కాగా జసిండా అనూహ్య నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దిగ్భ్రాంతికి గురిచేసింది. 42 ఏళ్ల జసిండా- ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్ మహమ్మారి వంటి క్లిష్ట సమయాల్లో దేశాధినేతగా వ్యవహరించిన తీరు దేశ ప్రజలకు చేరువ చేసింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం కారణంగా జెస్సిండా ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోతోందన్న విషయం గ్రహించి తనకు తానుగా గౌరవంగా తప్పుకోవాలని ఆమె భావిస్తున్నట్టుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న జసిండా అనేక క్లిష్టమైన పరిస్థితులను చూసారు. 2019 క్రైస్ట్‌చర్చ్ మసీదు మారణకాండలో 51 మంది ముస్లిం ఆరాధకులు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. ఆ సమయంలో ప్రధాని జెసిండా స్పందించిన తీరుకు అంతర్జాతీయ ప్రశంసలు పొందారు. ఆ తరువాత ప్రాణాంతకమైన వైట్ ఐలాండ్ అగ్నిపర్వతం విస్ఫోటనం సమయంలో వ్యవహరించిన నిర్ణయాత్మక నాయకత్వానికి ప్రశంసలు అందుకున్నారు. ఆమె నిష్క్రమణ లేబర్ పార్టీలో శూన్యతను మిగిల్చిందనడంలో సందేహం లేదు. 1990లో పాకిస్థాన్‌ ప్రధాని బెనజీర్ భుట్టో తరువాత పదవిలో ఉండగానే తప్పుకున్న ప్రపంచంలో రెండవ ప్రధానమంత్రి జెసిండా నిలిచారు.

అయితే పాఠశాల విద్యను అభ్యసించబోతున్న తన కుమార్తె నీవ్‌తో ఎక్కువ సమయం గడపాలని జసిండా కోరుకుంటున్నారు. తన కుటుంబంతో గడిపేందుకు ఆమెకు సమయం దొరకడం లేదన్నవిషయాన్ని చెబుతున్నారు ఆమె సన్నిహితులు. తన జీవిత భాగస్వామి, గేఫోర్డ్‌ను వివాహం చేసుకోవడానికి తాను ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పారు. న్యూజీలాండ్ లోని హామిల్టన్‌లో జన్మించిన జసిండా ఆర్డెర్న్ మురుపరాలో పెరిగారు , అక్కడ ఆమె ఒక పాఠశాలలో చదువుకోగా 2001లో వైకాటో విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయ్యారు. జసిండా ఆర్డెర్న్ మొదట ప్రధాన మంత్రి హెలెన్ క్లార్క్ కార్యాలయంలో పరిశోధకురాలిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె క్యాబినెట్ ఆఫీసులో సలహాదారుగా లండన్‌లో పనిచేశారు. 2008 సాధారణ ఎన్నికల్లో ఆర్డెర్న్ తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు .

Must Read

spot_img