Homeజాతీయంఆర్థిక వృద్ధి అంటున్నా.. నిత్యావసరాల ధరలు మాత్రం కాక రేపుతున్నాయి.....

ఆర్థిక వృద్ధి అంటున్నా.. నిత్యావసరాల ధరలు మాత్రం కాక రేపుతున్నాయి…..

ఆర్థిక వృద్ధి అంటున్నా.. నిత్యావసరాల ధరలు మాత్రం కాక రేపుతున్నాయి. దీంతో సరుకుల కొనుగోలులోనూ .. వెనుకాడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో చాలా కుటుంబాలు.. కొన్ని నిత్యావసరాల్ని తమ లిస్ట్ లోంచి తీసేసే పరిస్థితి తలెత్తుతోంది.

నిత్యావసరాల ధరలు .. దిగిరాకపోవడంతో, వంటగదిలో చాలా సామాన్లు మాయం అవుతున్నాయి. దొరికిన వాటితోనే పని కానిచ్చేసే పరిస్థితికి వినియోగదారులు వచ్చేశారు. దీనికి ధరాభారమే కారణమని, ఆర్థిక వృద్ధి తమవరకు రావడం లేదని .. వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే కరోనా కారణంగా ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించింది. చేతిలో చిల్లిగవ్వ లేక రెండు పూటలా తిండి దొరకడం కొందరికి కష్టంగా మారింది. అన్ని వస్తువుల ధరలు చుక్కలను అంటడంతో మధ్యతరగతి ప్రజల పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా తయారయ్యింది. వంట గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఒక్కో సిలెండర్‌పై రూ.20పెరగడంతో రూ.980కి చేరింది. స్థానిక ఏజెన్సీ నిర్వాహకులు రవాణా ఖర్చుల కింద రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. ఆరు నెలల కిందట రూ.900 ఉండగా ప్రస్తుతం రూ.100 పెరిగింది. ఇక బండిని ఇంటి నుంచి బయటకు తీయాలంటే కూడా జంకే పరిస్థితి నెలకొంది. లీటరు పెట్రోల్, డీజిల్‌ ధరలు వంద మార్క్ ను దాటేశాయి.

దీంతో ఇంధన ధరలు పెనుభారంగా మారాయి. నిత్యవసరాలకు.. పెరిగిన ఇంధన ధరలు తోడవడంతో చిన్నపాటి వేతన జీవులు వాహనాలకు గుడ్‌బై చెబుతున్నారు. గతంలో రేషన్‌ దుకాణాల్లో చింతపండు, పసుపు, పప్పులు, పామాయిల్‌ నూనె తదితర సరకులు ఇచ్చేవారు. కొంత కాలంగా 14 రకాల సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ధరలు పెరుగుతున్న వేళ పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజల కష్టాలు ఎవరికీ పట్టడం లేదు. గత ఏడాది కాలంగా నిత్యావసర వస్తువుల, ఆహారాల ధరలు రెండింతల మేర పెరిగాయి. ముఖ్యంగా భారీగా పెరిగిన ఆహారం, ఇంధన ధరలు గృహవసరాల బడ్జెట్లను భారీగా ప్రభావితం చేశాయి. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్టానికి చేరినప్పటికీ, అది ప్రజలకు కేవలం స్వల్ప ఊరటను మాత్రమే ఇచ్చింది.

ప్రస్తుతం కుటుంబ నెలవారీ ఆదాయం రూ. 20 వేలుగా ఉన్న వాళ్లు తమ ఖర్చులను పునఃసమీక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వారు తమ ఖర్చులను భారీగా తగ్గించుకోవాలి.

కొన్ని నిత్యావసరాలను కూడా వారు వదులుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఎంత కావాలో అంతే పరిమాణంలో అంటే పరిమిత క్వాంటిటీలో మాత్రమే నసరుకులు కొనుక్కోవాల్సి వస్తోంది. కానీ ప్రతిరోజూ ఉదయాన్నే కొన్నింటిని తప్పించుకోలేపోతున్న పరిస్తితులు నెలకొన్నాయి. పరిమిత ఆదాయంతో జీవనం సాగించే కుటుంబాల్ని కరోనా మహమ్మారి తీవ్ర దెబ్బకొట్టింది. వారి ఆదాయ వనరులను భారీగా ప్రభావితం చేసింది. కరోనా మహమ్మారి, ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, సప్లయి చెయిన్‌లో తలెత్తిన అంతరాయాలు ప్రతి ఒక్కదాన్ని ఖరీదైనవిగా మార్చాయి. ఇవి భారత్‌లో వినియోగ విధానాలను పూర్తిగా మార్చేశాయి. ప్రజలకు నిత్యావసరాలను సైతం భారంగా మార్చాయి.

ముఖ్యంగా మధ్య, దిగువ ఆదాయ కుటుంబాలు బాగా ప్రభావితమయ్యాయి. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో రెండు కోణాలు కనిపిస్తున్నాయనడంలో వాస్తవం లేకపోలేదు. స్టాక్ మార్కెట్లో కొనుగోళ్లు, పెద్ద కంపెనీల బలమైన త్రైమాసికపు ఫలితాలు ఓవైపు దేశ ఆర్థిక వృద్ధి మళ్లీ పుంజుకుంటుందన్న విషయాన్ని తెలియజేస్తుంటే, మరోవైపు ఆర్థిక అంతరాలు కూడా వెలుగు చూస్తున్నాయి. చాలా వినియోగదారుల ఉత్పత్తుల కంపెనీలకు అమ్మకాలు పడిపోయాయి. ఫుట్‌వేర్ నుంచి మొబైల్ ఫోన్లు, బిస్కెట్ల వరకు ప్రతి ఎంట్రీ లెవల్ వస్తువు అమ్మకాలు తగ్గిపోయాయి. ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఉత్పత్తులతో పోలిస్తే ఖరీదైన బ్రాండ్ల అమ్మకాలు మాత్రమే కాస్త మెరుగ్గా ఉన్నాయి.

వినియోగ ఉత్పత్తుల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదైన సెప్టెంబర్, అక్టోబర్ పండగ సీజన్‌లో కూడా హై ఎండ్ ప్రొడక్టులు మాత్రమే మెరుగైన ప్రదర్శన
కనబర్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఎంట్రీ లెవల్ ప్రొడక్టులకు చెందిన అన్ని కేటగిరీల ఉత్పత్తుల అమ్మకాలు 10 శాతం వరకు తగ్గిపోయాయి.

పండగ సీజన్‌ అమ్మకాలు బలంగా కనిపిస్తున్నా ఒక్కో వినియోగదారు సగటు వ్యయం మాత్రం స్తబ్దుగా నమోదైందని రెడ్‌సీర్ నివేదిక తెలిపింది.

సెప్టెంబర్, అక్టోబర్ నెలలో భారత ఈ-కామర్స్ మార్కెట్ రూ. 755 వందల కోట్ల అమ్మకాలతో పండగ సీజన్‌ బలంగా ఉందని తెలిపింది. అయితే, ఒక్కో వినియోగదారు సగటు వ్యయం మాత్రం స్తబ్దుగా నమోదైందని ఈ నివేదికలో వెల్లడైంది. కరోనాతో రెండేళ్ల పాటు పండగ కాలమంతా పూర్తిగా లాక్‌డౌన్లతో ముగిసిపోయిన తర్వాత, భారతీయులు ఇప్పుడే పూర్తి తరహాలో పండగలను సెలబ్రేట్ చేసుకున్నారు.

వీధులన్నీ కాంతి దీపాలతో వెలిగిపోయాయి. ప్రజలు తమ ఇళ్లను ఎలక్ట్రిక్ విద్యుత్ కాంతులతో, దీపాలతో అలంకరించుకున్నారు. కానీ,
చాలా మంది ఇళ్లలో మునుపటి ఏళ్లతో పోలిస్తే సెలబ్రేషన్స్ కాస్త భిన్నంగా సాగాయి. ధరలు భారీగా పెరగటం వల్ల కొందరు కన్జూమర్లు మాత్రమే పండగలను సెలబ్రేట్చేసుకున్నారు. పెరిగిన జీవన వ్యయాల ప్రభావం దేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివాసముండే గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. గత ఏడాది కాలంగా ఫుడ్ బిల్లులు సుమారు రెండింతలు పెరిగాయి. వంటనూనెల నుంచి గోధుమలు, చిరుధాన్యాలు, కూరగాయల వరకు ప్రతిదీ 30 శాతం నుంచి 50 శాతం వరకు ఖరీదైనవిగా మారాయి.

గత ఏడాది కాలంగా కుటుంబ ఖర్చులు రెండింతలయ్యాయి. ఖర్చులు పెరిగినంత స్థాయిలో కుటుంబ ఆదాయం పెరగలేదు. అంతేకాక, అకాల వర్షాలతో వారి వ్యవసాయ పంటలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ప్రతి కుటుంబమూ నిత్యావసరాలకే ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. జీవితంలో జరిగే చిన్న చిన్న వేడుకలను సైతం ఎంజాయ్ చేయలేకపోయినప్పుడు చాలా బాధపడాల్సి వస్తోందని, ఇది కేవలం తమ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడం కారణంగానేనని చిరు కుటుంబాలు తీరని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయాలు ప్రజలను భారీగా దెబ్బకొడుతున్నాయి.

ఈ వ్యయ భారాలు తమకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకపోతుండటంతో.. భవిష్యత్‌లో కూడా మధ్యతరగతి ప్రజలు కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు చిన్న కుటుంబాలను ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీశాయి. ధరలతో పాటు అద్దెలు పెరగడం కూడా వీరిపై భారంగా మారింది. పనులు దొరక్క పేదలు, మధ్యతరగతి వారు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతుంటే, ఈ సమయంలో నిత్యావసర సరుకులపై అధిక ధరలు పెంచడం వలన పేదలపై మరింత భారం పడింది. క‌రోనా సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డినా ధ‌ర‌ల సంక్షోంభం నుంచి బ‌య‌టప‌డ‌లేక పోతున్నారు. లాక్ డౌన్ ఆర్థిక సంక్షోభం పేరుతో ఇష్టానుసారంగా అన్నింటి ధ‌ర‌లు పెంచటంతో సామాన్యుడు కుదేలువుతున్నాడు.

ప్ర‌పంచ దేశాల యుద్ధాలు, జీడీపీ, త‌ల‌స‌రి ఆదాయం పేరుతో పెట్రోల్, డీజీల్ ధ‌ర‌లు పెంచ‌టంతో ర‌వాణ వ్య‌వ‌స్థపై భారం పెరిగింది.

దీంతో ట్రాన్స్‌పోర్ట్ యాజ‌మాన్య‌లు డీజీల్ ధ‌ర‌లకు అనుగుణంగా ర‌వాణా చార్జిలు పెంచ‌టంతో దీని ప్ర‌భావం అన్నింటిపై ప‌డింది. ఫ‌లితంగా సామాన్యుడి స‌గ‌టు ఆదాయం ఖ‌ర్చులకు మిక్కిలి అయ్యింది. చ‌మురు, నిత్య‌వ‌స‌రాలు, క‌రెంటు, ఎరువులు, విత్త‌నాలు ఇలా అన్నింటి ధ‌ర‌లు పెంచుతూ తీసుకున్న నిర్ణ‌యంతో దేశంలో పేద, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, రైతులు ధ‌ర‌ల సుడిగుండంలో చిక్కుకుని అప్పుల పాల‌వుతున్నారు. దేశంలో ఆర్థిక వృద్ధి ఉందన్న అంచనాలు వినిపిస్తున్నా, ఆ వృద్ధి పేదలకు మాత్రం అందడం లేదు. కనీసం నిత్యావసరాల ధరలు తగ్గిస్తేనైనా, తమకు కాస్తంత ఊరట లభిస్తుందని చిరు కుటుంబాలు కోరుతున్నాయి. అయితే పెంచిన ధరలు .. తగ్గించే పరిస్థితి లేకపోవడంతో, ధరాభారం నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అత్యవసరమైతే, తప్ప కొనలేకపోతున్నామని వీరంతా వాపోతున్నారు.

సామాన్యుడికి అవసరమైన వస్తువులు .. కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. దేశంలో ఆర్థిక వృద్ధి అంచనాల నేపథ్యంలో ధరాభారం తగ్గించాలన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Must Read

spot_img