HomePoliticsఫ్యాక్షన్ గడ్డపై వారసుల రాజకీయ క్రీడ..!

ఫ్యాక్షన్ గడ్డపై వారసుల రాజకీయ క్రీడ..!

ఒకప్పుడు నెత్తురు పారిన నేల అది.. ఫ్యాక్షన్ అంటే ఏంటో అక్కడి జనం కళ్లారా చూశారు.. బాంబుల శబ్ధం విన్నారు.. కానీ ఇదంతా రెండు దశాబ్ధాల క్రితం. ఇప్పుడు ప్రశాంతతకు మారుపేరుగా ఉంది. కానీ ఆ నాడు తండ్రులు ఆధిపత్యం చేసిన చోటు ఇప్పుడు కుమారులు రాజ్యం కోసం పోరాడుతున్నారు. శాంతియుత మార్గంలో నడిచిన వారి వారసులు.. ఇప్పుడు మళ్లీ ఆధిపత్యం కోసం కత్తులు నూరుతున్నారు. మాటల యుద్ధంతో మరోసారి అగ్గి రాజేస్తున్నారు.. ఒకప్పటి ఫ్యాక్షన్ గడ్డపై వారసుల రాజకీయ క్రీడ.

ధర్మవరం… ఇది ఒకప్పటి ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతం. ఇక్కడ నేతల ఆధిపత్యం కోసం నెత్తురు చిందిన నేల. ఎన్నో ప్రాణాలు బలిగొన్న క్రీడ ఇక్కడ జరిగింది. అయితే రెండు దశాబ్ధాల నుంచి అలాంటివి ఇక్కడ కనిపించలేదు. జనంలో మార్పు.. పోలీసులు తీసుకుంటున్న చర్యలు.. నేతల్లో వచ్చిన పరిణితి ఇవన్నీ కొంత ఈ ప్రాంతాన్ని ప్రశాంతంగా మార్చేశాయి. గత రెండు దశాబ్ధాలుగా ఎలాంటి అలజడులు ఇక్కడ కనిపించలేదు.

రాజకీయాలు మాత్రమే కొనసాగుతున్నాయి. నేతల మధ్య ఆధిపత్యం ఉంది. కానీ ఎక్కడ హత్యా రాజకీయాలు లేవు. అయితే గత ఏడాది కాలంగా ధర్మవరంలో పరిస్థితులు చూస్తుంటే.. పాత రోజులు గుర్తుకొస్తున్నాయని ఆనాటి ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దీనికి పెద్ద కారణమే ఉందని విశ్లేషకులు సైతం అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నేతల మధ్య మాటలు హద్దులు మీరుతున్నాయి. కొందరు రాజకీయాల కోసం చేస్తున్న పనులు ఆవేశాన్ని రాజేస్తున్నాయి.

మాటలు కాస్తా .. మరణాయుధాలు చేత పట్టేవరకు వెళ్లే పరిస్థితి వచ్చింది. నేతలు నేరుగా కొడతాం.. చంపుతాం అనే వరకు వెళ్తున్నారు. దీంతో కొన్నేళ్లుగా ప్రశాంతతకు నిలయంగా మారిన ధర్మవరం.. మళ్లీ రాజుకుంటోందని, నివురు గప్పిన నిప్పులా మారుతోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ధర్మవరంలో ఎందుకీ అలజడి అంటే.. ఇక్కడి నేతల వ్యవహారశైలేనని చెప్పాలి.

ధర్మవరంలో ఎమ్మెల్యేగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఇన్ ఛార్జిగా పరిటాల శ్రీరామ్ ఉన్నారు. ఇటు టీడీపీ నుంచి బీజేపీలోకి వలస వెళ్లిన సూర్యనారాయణ కూడా లీడర్ గా ఉన్నారు. ఇక జనసేన నుంచి చిలకం మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఈ నలుగురు నేతల్లో ఒక కామన్ పాయింట్ ఉంది. వీరందరూ ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు, నేపథ్యం నుంచి వచ్చిన వారేనని తెలుస్తోంది. ఒకప్పుడు వీరి కుటుంబాలు ఫ్యాక్షన్ వల్ల చాలా నష్టపోయాయి.

అప్పట్లో కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి, పరిటాల రవి, సూర్యనారాయణ తండ్రి, అలాగే మధుసూదన్ రెడ్డి తండ్రి ఇలా అందరూ ఫ్యాక్షన్ నేపథ్యంలోనే ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ధర్మవరం పై పట్టు సాధించాలనుకుంటున్న ఈ నలుగురు నేతలూ తండ్రులనే కోల్పోయారు. అలాంటి నేపథ్యం వచ్చిన వీరంతా ధర్మవరంలో పైచేయి కోసం చేస్తున్న చర్యలు ఇప్పుడు మళ్లీ అగ్గి రాజేస్తున్నాయి. అయితే వీరంతా ఫ్యాక్షన్ నుంచి వచ్చినా.. ఆ వాసనలో వీరిలో ఎక్కడా కనిపించలేదు. కానీ గత కొన్ని రోజులు వీరు చేసుకుంటున్న కామెంట్స్ చూస్తే పాత రోజులను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి.

వీరంతా ధర్మవరంలో పైచేయి సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇవే దారితప్పి, మళ్లీ అలనాటి పరిస్థితుల్ని తీసుకువస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.
ముఖ్యంగా ఇందులో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి గురించి చెప్పాలి. కేతిరెడ్డి గురించి దాదాపు తెలియని వారు ఎవరూ ఉండరు. గుడ్ మార్నింగ్ అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త ఒరవడి సృష్టించారు. జనంలోకి వెళ్లే నేతలు ఎవరున్నారంటే.. రెండు రాష్ట్రాల్లో ముందు కేతిరెడ్డి పేరు చెప్పాలి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఆయన రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక ఆయనలో మరో కోణంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి.

జిల్లాలో అత్యధికంగా భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు చేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో కేతిరెడ్డి టాప్ 2లో ఉంటారు. ఎందుకంటే ధర్మవరంలో ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటనలు ఆయన్ని పూర్తిగా మైనస్ లోకి నెడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జనంలో ఉన్న నేతగా గుర్తింపు పొందిన ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఇలాంటి భూ ఆక్రమణదారుడు, దౌర్జన్య పరుడు అనే మకిలి అంటుకుంటోంది.

సాధారణంగా ఇలాంటివి ప్రచారం చేసేది.. ప్రతిపక్ష నేతలే. ఇటు పరిటాల శ్రీరామ్ కానీ, సూర్యనారాయణ కానీ, మధుసూదన్ రెడ్డి వీరంతా కేతిరెడ్డిని టార్గెట్ చేశారు. అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన చేస్తున్న కొన్నింటినీ టార్గెట్ చేస్తూ విమర్శల దాడి చేస్తున్నారు. ప్రధానంగా సోలార్ ప్రాజెక్టు భూముల కొనుగోలు, చెరువు వద్ద కొండపై నిర్మించుకున్న కోటలు, ఆయన విలాసాలు, ఇంకా ధర్మవరంలో వైసీపీ నేతల మీద వస్తున్న భూ ఆక్రణల్లో కేతిరెడ్డి టార్గెట్ అవుతున్నారు.

దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న.. కేతిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నా అనుచరులు ఎక్కడైనా భూ కబ్జాలు చేసినా.. దౌర్జన్యాలు చేసినా చెప్పుతో కొట్టండి.. పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకెళ్లండంటూ వ్యాఖ్యలు చేశారు. మీరు వాటిని నిరూపించకపోతే మిమ్మల్ని దేంతో కొట్టాలంటూ ప్రశ్నించారు. అలాగే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ .. ఎమ్మెల్యేను ధర్మవరం దావూద్ అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి.

ఆయన చేసిన కొన్నింటిని సీరిస్ లా సూర్యనారయణ బయటపెడుతున్నారు. వీటిపై కేతిరెడ్డికూడా కౌంటర్ ఇస్తున్నారు. ఈసారి కేతిరెడ్డి .. ఎవరైనా నా క్యారెక్టర్ మీద బ్యాడ్ గా మాట్లాడితే నా రియాక్షన్ వేరేలా ఉంటుందని హెచ్చరించారు. దాదాపు అటాక్ ఉంటుందన్న ఇవ్వడం సెగ్మెంట్లోనే కాక జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

  • పట్టపగలు ప్రెస్ క్లబ్ లో సూరి అనుచరులను కేతిరెడ్డి మనుషులు పై అటాక్..!

ఇప్పటికే ధర్మవరంలో సూర్యనారాయణ అనుచరులు ఎమ్మెల్యే కేతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. పట్టపగలు ప్రెస్ క్లబ్ లో సూరి అనుచరులను కేతిరెడ్డి మనుషులు అటాక్ చేయడం హైటెన్షన్ కు దారి తీసింది. ఇప్పుడు కేతిరెడ్డి నేరుగా ఇక చూస్తూ ఊరుకోనని చెప్పడంతో.. సూర్యనారాయణ .. నాకు గాని నా మనుషులకు గాని ఏమైనా జరిగితే కేతిరెడ్డిదే బాధ్యత అంటూ చెబుతున్నారు.

మరోవైపు కేతిరెడ్డి కూడా సూర్యనారాయణను అక్రమాలను త్వరలోనే బయటకు తీస్తానని.. ఇప్పటికే డీజిల్ రవాణాలో దొరికిన దొంగ అంటూ కామెంట్ చేశారు. బ్యాంకులను మోసం చేసిన తీరు, ఆర్థిక నేరాలను వెలుగులోకి తీసుకొస్తానంటూ సవాల్ చేశారు. ఇటు పరిటాల శ్రీరామ్ కూడా కేతిరెడ్డి భూ ఆక్రమణలపై నేరుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు అవసరమోస్తే బాధితుల తరుఫున నీకు ఎదురొడ్డి పోరుడాతామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు.

ఇటీవల ఏ చిన్న సంఘటన జరిగినా శ్రీరామ్ బాధితుల తరుఫున వాయిస్ వినిపించడమే కాకుండా కేతిరెడ్డికి చెక్ పెడుతానంటూ హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ధర్మవరంలో నాయకుల చేస్తున్న వ్యాఖ్యలు వారు వేస్తున్న అడుగులు చూస్తుంటే పాత రోజులు గుర్తుకు తెస్తున్నాయి. కేతిరెడ్డి కూడా చాలాసార్లు ఈ విషయాన్ని చెబుతున్నట్లేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

దీంతో ఇక్కడ మాటలే ఫ్యాక్షన్ రాజేస్తున్నాయని.. అవి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదనే సంకేతాన్ని స్థానికులు ఇస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతల దూకుడు ధర్మవరంలో అలజడి రేపుతోంది. అసలే ముందస్తు టాక్ వేళ .. నేతల వ్యాఖ్యలు ఫ్యాక్షన్ గడ్డపై హీట్ రగుల్చుతున్నాయని చర్చలు సాగుతున్నాయి. దీంతో వీరంతా తమ ధోరణిని మార్చుకోవాలని, అలజడి రేపే వ్యాఖ్యలను వీడి, హుందా రాజకీయాలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇదేసమయంలో రాజకీయ వేడి కాస్తా .. ఫ్యాక్షన్ దిశగా మారడం .. ఏమాత్రం సమర్థనీయం కాదన్న వాదనలు సైతం వెల్లువెత్తుతున్నాయి. దీంతో
నేతలు .. తీరు మార్చుకోవాలని, ధర్మవరంలో రాజకీయాల్లో దూకుడు తగ్గించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

మరి నేతలు తీరు మార్చుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

Must Read

spot_img