భూగోళాన్ని భూకంపాలు వణికిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎరుగని విద్వంసాలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. వచ్చే భూకంపాన్ని ఎలాగూ కనుగొనలేము..దానిని నివారించనూ లేము..కానీ జరిగే నష్టాన్ని కొన్ని పద్దతులను పాటించడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం మాత్రం ఉంటుంది. మీకు తెలుసా చూస్తుండగానే తుర్కియే, సిరియాల్లో భూకంప బాధిత మృతుల సంఖ్య 50 వేలు దాటింది. దాదాపు రెండు వారాల క్రితం నాటి ప్రకృతి విలయంతో రెండు దేశాలూ చితికిపోయాయని చెప్పవచ్చు. ఒక్క తుర్కియేలోనే 44 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.
సిరియాలో ఇప్పటివరకు 5,900కు పైగా పౌరులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల్లో భూకంపం ధాటికి దెబ్బతిన్నవి, కూలిన బహుళ అంతస్తుల భవనాలు 1.60 లక్షలకు పైగా ఉన్నట్లు తేలింది. వీటిలో 5.20 లక్షల నివాసాలున్నట్లు అధికారులు తెలిపారు. తుర్కియేలో దాదాపు 15 లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం గృహాల పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఏడాది లోగా ఇళ్లను తిరిగి నిర్మిస్తామని దేశ అధ్యక్షుడు ఎర్దోగాన్ ఇప్పటికే ప్రకటించారు.
సుమారు1లక్షా 24 వేల కోట్ల వ్యయంతో రెండులక్షల అపార్ట్‌మెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 70 వేల గృహాలు నిర్మించాలనేది తుర్కియే ప్రాథమిక ప్రణాళిక. గృహాల పునర్నిర్మాణానికి, మౌలిక సదుపాయాల కల్పనకు మొత్తం 2 లక్షలా 07 వేల కోట్లు ఖర్చవుతుందని అమెరికన్ బ్యాంకు ‘జేపీ మోర్గాన్’ అంచనా వేసింది. అయితే ఇంత నష్టం కొన్ని నిబంధనలను పక్కాగా అమలు చేయడం వల్ల నివారించుకునేందుకు అవకాశం ఉండేదని అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఎర్డొగన్ ప్రభుత్వం ఎన్నికల లక్ష్యంగా గృహాల పునర్నిర్మాణాల ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

అయితే ఓట్ల కోసమే ఇండ్లను వేగంగా నిర్మించకుండా..భద్రతపై దృష్టి పెట్టాలని అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక నిపుణుల అభిప్రాయాలపై అధికారులు స్పందించారు. ‘ఇప్పటికే అనేక ప్రాజెక్టుల కోసం టెండర్లు, కాంట్రాక్టులు జరిగాయి. వాటి ప్రక్రియ చాలా వేగంగా జరుగుతున్నది. నిర్మాణాల భద్రతపై ఎటువంటి రాజీ ఉండబోదని.. భద్రతతోనే నిర్మాణాలు జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.
పెను భూకంపాలు భూగోళాన్ని చుట్టేస్తోన్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వరుసబెట్టి భూకంపాలు నమోదవుతోన్నాయి..అది కూడా అనూహ్య తీవ్రతతో. టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాల పెను విషాదం మరవక ముందే తాజాగా మరోసారి పెను భూకంపం సంభవించింది. జపాన్ లోని హొక్కాయిడాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా రికార్డయింది. జపాన్ ఉత్తర ప్రాంతంలోని హొక్కాయిడోలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:27 నిమిషాలకు ఈ భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఈ భూకంప తీవ్రత తీర ప్రాంత నగరాలైన ఒబిహిరో, టొయొకొరొ, టైకీ, ఇకెడపై పడింది. ఆయా ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపం వల్ల నెమురో, ఒబిహిరొ, టొయొకొరొ వంటి చోట్ల కొన్ని భవనాలు బీటలు వారినట్లు చెబుతున్నారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు నమోదు కావడం వల్ల స్థానికులు ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. రోడ్ల మీదే జాగారం చేస్తోన్నారు. భూకంపం సంభవించిన వెంటనే రోడ్ల మీదికి ఉరుకులు పరుగులు పెట్టారు. సైరన్ మోతలతో పరిసరాలన్నీ మారుమోగిపోయాయి.
జపాన్ లోనే కాదు..అటు తుర్కియే సిరియాలోనూ ఇంకా ప్రకంపనలు వస్తూనే ఉన్నాయి. అవి కూడా మామూలుగా లేవు చాలా భీకరంగా ఉంటున్నాయి. మీకు తెలుసా.. గత 66 గంటల్లో 37 భూకంపాలు నమోదయ్యాయి. దీంతో నిరాశ్రయులైన టర్కీ భూకంప బాధితులు గడ్డకట్టించే చలిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిభిరాల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. టర్కీ ప్రాంతంలో భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల యాక్టివిటీ ఫలితంగా భూకంపాలు వస్తున్నాయి. టర్కీ దేశం అనటోలియన్ టెక్టానిక్ ప్లేటుపై ఉంది. దీన్ని క్రమంగా అరేబియన్ టెక్టానిక్ ప్లేట్ నెట్టేస్తోంది. దీని ఫలితంగా తీవ్ర ఒత్తడి భూకంపాల రూపంలో బయటకు వస్తోంది. రానున్న రోజుల్లో కూడా టర్కీలో ఇలాగే భూకంపాలు వచ్చే అవకాశ ఉందని భూకంప నిపుణులు చెబుతున్నారు.
- ప్రపంచవ్యాప్తంగా నితయం ఎక్కడో ఒకచోట భూమి కంపిస్తూనే ఉంటుంది..
అటు పపువా న్యూగినియాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. న్యూగినియాలోని కండ్రియాన్‌లో శనివారం రాత్రి 9.24 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 6.2గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూఅంతర్భాగంలో 38.2 కిలోమీటర్ల లోతులు కంపించిందని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదు. అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 2.14 గంటలకు ఫైజాబాద్ సమీపంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఫైజాబాద్‌కు 273 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. ఇక శనివారం ఉత్తర జపాన్ లోని హొక్కయిడోలో భారీ భూకంపం సంభవించిన విషయం చెప్పుకున్నాం.. నిజానికి ప్రపంచవ్యాప్తంగా నితయం ఎక్కడో ఒకచోట భూమి కంపిస్తూనే ఉంటుంది. వాటిలో కొన్నింటిని మనం గుర్తించలేనివిగా ఉంటున్నాయి. మరికొన్ని భారీగా ప్రాణ ఆస్థి నష్టాలను కలుగజేస్తున్నాయి. అసలు ఈ భూకంపాలు కొన్ని ప్రాంతాలలోనే తరచూ ఎందుకు వస్తున్నాయి..ఇది భూమి అంతానికి సూచనా లేక ఆ ప్రాంతాలు లోపభూయిష్టంగా ఉన్న చోట ఉన్నాయా అన్నదానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఈ పరిశోధనలు ఇప్పుడే కాదు ఎప్పుడో చేసారు. అప్పటి నుంచి వాటిని అన్ని దేశాలకు తెలియజేసారు.

ప్రాంతాలను బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయాలను బట్టి మనం నివసించే ఖండాలు మహా సముద్రాలు అన్నీ భూఫలకాలపై ఉన్నాయి. ఇవి భూగ్రహంలోని మధ్య పొరపై కదులుతూ ఉంటాయి. ఈ ఫలకాలు మొత్తం 17 అని గుర్తించారు. వీటిలో ఏడు ఫలకాలు పెద్దవి కాగా, పది ఫలకాలు చిన్నవిగా ఉంటాయి. ఇవి కాకుండా వాటి మధ్య ఎక్కడికక్కడ మరింత చిన్నపాటి ఫలకాలు కూడా ఉంటాయి. పెద్ద ఫలకాలు దాదాపు 95శాతం భూమిని ఆక్రమించి శిలావరణంగా ఏర్పడ్డాయి. భూఫలకాల కదలికలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు.
కొన్నిసార్లు ఒక భూఫలకం ఒత్తిడికి మరో ఫలకం వేగంగా కదలడమో, లేక దిశను మార్చుకోవడమో లేదా రెండూ నేరుగా ఢఈ కొనడమో జరుగుతుంటుంది. ఇలా ఒకదానిపైకి మరొకరటి చేరడమో జరుగుతుంటాయి. ఆ సమయంలో అణుబాంబులు పెలినప్పటి శక్తి కన్నా వందల రెట్ల శక్తి ఉద్భవిస్తుంటుంది. విపరీతమైన శక్తి విడుదలై ప్రకంపనాల రూపంలో బయటపడి విధ్వంసానికి కారణమవుతుంది. ఇవి భూమిపై ఏర్పడితే భూకంపాలనీ, సముద్రాలలో ఏర్పడితే సునామీలను పిలుస్తున్నారు. భూ ఫలకాల కదలికల కారణంగా తుర్కియేలో పెను భూకంపం చోటు చేసుకుంది.
అక్కడ తరచూ ఈ తరహా విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడి అరేబియన్ ఆఫ్రికన్ భూఫలకాల మధ్య అనటోలియన్ గా పిలిచే చిన్నపాట ఫలక ఉంది. దీనికి ఉత్తరం వైపు ఘర్షణ మండలం ఉంటుంది. దీనినే ఫాల్ట్ జోన్ అని అంటున్నారు. ఇస్తాంబుల్ దక్షిణ భాగం నుంచి ఈశాన్య తుర్కియే వరకు విస్తరించిన ఈ జోన్ లో భూకంప విపత్తుల ముప్పు అధికంగా ఉంటోంది. దక్షిణం వైపున ఉన్న అరేబియన్ భూఫలక నిత్యం ఉత్తరం దిశగా యూరప్ వైపు కదులుతోంది.
ఈ కదలిక వల్ల అనటోలియన్ భూఫలక పశ్చిమ దిశగా జరుగుతుండటమే కాకుండా దాని సహజవేగం, ఘర్షణమండలపై ఒత్తిడి పెరుగుతున్నాయి. దాంతో ఒక్కోసారి అకస్మాత్తుగా విపరీతమైన శక్తి విడుదలై భూమి కంపిస్తోంది. భూఫలకాల కదలికల వల్ల చోటు చేసుకున్న మార్పులకు భూమిలోని పొరలు సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ సర్దుబాటులో భాగంగా తక్కువ తీవ్రత ఉండే భూకంపాలు వస్తుంటాయి. ఇది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. సాధారణంగా భూకంప కేంద్రం లోతు తక్కువగా ఉంటే నష్టం కూడా స్వల్పంగానే ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇటువంటి చోట్ల భవన నిర్మాణాలు అందుకనుగుణంగా నిర్మించడం జరగాలి. లేదంటే లెక్కలేనన్ని భవనాలు కుప్పకూలి తుర్కియేలో జరిగినట్టు భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో భూకంపాల కారణంగా వాటిల్లే నష్టలను తగ్గించుకోవడంపై ప్రభుత్వాలు ద్రుష్టి సారించాలి. ముఖ్యంగా భూకంప నిరోధక సాంకేతికతతో కూడిన నిర్మాణాలను చేపట్టాలి. ఆ దిశగా చట్టాలను రూపొందించి ప్రజల సహకారంతో అమలు చేయాలి. అంతకు మించి మరో మార్గం లేదు.