Homeఅంతర్జాతీయంరాబోయే ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని దిగ్గజ కంపెనీలపై పడుతోంది.

రాబోయే ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం అన్ని దిగ్గజ కంపెనీలపై పడుతోంది.

ఒక్కటొక్కటిగా కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా మరో దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా పది వేలకు పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్పులు ఇవ్వబోతోంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఉద్యోగాల కోత అని ప్రకటించింది.. ఓ రిపోర్ట్..

ప్రపంచాన్ని నెట్ వర్కింగ్ రంగంలో శాసించే టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లోనూ ఉద్యోగాల కోత తప్పడం లేదు. తాజాగా తమ కంపెనీలో 10 వేల ఉద్యోగాల కోత ప్రకటించింది. ఈ ప్రభావం ఇతర టాప్ టెక్ కంపెనీల మీద ఉంటుందా? అన్న అనుమానాలు ఉద్యోగులను వేదిస్తున్నాయి. తన ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా మైక్రోసాఫ్ట్ 10 వేల ఉద్యోగాల కోత తప్పడం లేదని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్యనాదేళ్ల ఓ ప్రకటనతో తెలిపారు. ఈ తాజా నిర్ణయం మొత్తంగా టెక్ పరిశ్రమ మీద తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిపై ఈ కోత ప్రభావం ఉండనుంది. ఉద్యోగుల తొలగింపు, పునర్వ్యవస్థీకరణల కోసం ఈసంస్థ 120 కోట్ల డాలర్లను ఖర్చు పెట్టనుంది.

కరోనా సమయంలో వినియోగదారుల ఖర్చులు బాగా పెరిగాయని, అయితే ప్రజలు కొనుగోళ్ళ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల అన్నారు. అయితే, కీలక రంగాల్లో మాత్రం ఉద్యోగ నియామకాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.ఉద్యోగాల కోత గురించి సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించిన సత్య నాదెళ్ల, ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలు ప్రస్తుతం మాంద్యంలో లేదా మాంద్యం అంచున ఉన్నాయన్నారు. ఇదే సమయంలో, ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్ వృద్ధి చెందడంతో కొత్త తరం కంప్యూటింగ్ వ్యవస్థలు వేగంగా ముందుకు వస్తున్నాయని నాదెళ్ళ వివరించారు. వాటితో మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలకు కూడా ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు. బహుషా ఆయన చాట్ జీపీటీ ఉద్రుతిని ద్రుష్టిలో ఉంచుకుని ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా భావిస్తున్నారు.

చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన కృత్రిమ మేధ సంస్థ ‘ఓపెన్ఏఐ’లో వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోందని ఫైనాన్సియల్ టైమ్స్ ఒక కథనంలో తెలిపింది.

2023 ప్రారంభంలోనే వేలాది మంది ఉద్యోగులు కంపెనీ నుంచి బయటికి వెళ్లాల్సి వస్తుంది. టెక్ రంగంలోని అమెజాన్, ఇన్‌స్టాగ్రామ్ పేరెంట్ సంస్థ మెటా వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇప్పటికే వేల సంఖ్యలో లేఆఫ్స్‌ను ప్రకటించాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే అమెజాన్ 18 వేలకు పైగా ఉద్యోగాలను తీసేస్తున్నట్టు ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితికర పరిస్థితులు, కరోనా సమయంలో పెద్ద ఎత్తున చేపట్టిన నియామకాలతో తాజాగా ఈ ఉద్యోగాల కోతను చేపడుతున్నట్లు అమెజాన్ తెలిపింది. మెటా కంపెనీ కూడా నవంబర్‌లో తన ఉద్యోగుల్లో 13 శాతం మందిని తొలగించింది.

అంటే మొత్తంగా 11 వేల మంది ఉద్యోగులను తీసేయనున్నట్టు మెటా ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీల్లో ఉద్యోగాల కోతను అనాలసిస్ చేసిన కన్సల్టెంట్స్ గార్ట్నర్ టెక్ ఇండస్ట్రీ నిపుణుడు జాన్సన్ వాంగ్, పూర్తిగా అడ్వర్‌టైజింగ్‌ రెవెన్యూలపై ఆధారపడ్డ ట్విటర్ కంపెనీ దాని నుంచి బయటికి వచ్చేస్తోందని అన్నారు. అలాగే, ఫేస్‌బుక్ సంస్థ మెటావర్స్‌లో మునిగి తేలుతుందన్నారు. అయితే కరోనా సమయంలో అన్ని వ్యాపారాలు పడిపోతే ఐటీ సంస్థలు మాత్రం ఊహించనంత వేగంతో పుంజుకున్నాయి. ఇతర టెక్ సంస్థల మాదిరిగానే మైక్రోసాఫ్ట్ వ్యాపారాలు కూడా మహమ్మారి సమయంలో దూసుకుపోయాయి. రిమోట్ వర్క్ పెరగడం, ఇతర ఆన్‌లైన్ కార్యకలాపాలు ఈ కంపెనీ వృద్ధికి సహకరించాయి. అప్పుడు ఉద్యోగులు కూడా కంపెనీకి బాగా సహకరించారు.

జూన్ 2021 నుంచి జూన్ 2022 మధ్య కాలంలో ఈ కంపెనీ 40 వేల మంది ఉద్యోగులను పెంచుకుంది.

దీంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 2 లక్షలా 21 వేలకు చేరుకున్నట్లు ఆ సమయంలో మైక్రోసాఫ్ట్ తెలిపింది. వారిలో 99 వేల మంది అమెరికా వెలుపల ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్నారని చెప్పింది. గత ఏడాది నుంచి కంపెనీకి వ్యాపారాలు నెమ్మదించాయి. దీంతో, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉద్యోగాల కోతలు ప్రకటిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికం ముగిసేనాటికల్లా 10 వేల మంది ఉద్యోగులను తీసేస్తామని తెలిపింది. కొందరు ఉద్యోగులకు మాత్రం ఈ లేఆఫ్ వెంటనే వర్తిస్తుందని మెమోలో పేర్కొంది. అయితే ‘మేము మా ఉద్యోగులకు గౌరవ మర్యాదలు ఇస్తాం. పారదర్శకంగా వ్యవహరిస్తాం” అని నాదెళ్ల హామీ ఇచ్చారు.

Must Read

spot_img