Homeఅంతర్జాతీయం2022లో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలివే!

2022లో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలివే!

మరో మూడు రోజులలో ఈ సంవత్సరం పూర్తియ్యేందుకు సిద్ధమవుతోంది. మరో కొత్త సంవత్సరం మన ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇండెప్త్ మీకు ఈ సంవత్సరం జరిగిన అనేక అంశాలను ఇయర్ రౌండప్ గా సమర్పిస్తోంది. రామాయణం గురించి కట్టె కొట్టె తెచ్చే అన్న చందంగా ఒక్క లైనులో ఈ సంవత్సరం గురించి చెప్పవచ్చు. అదెలా అంటే.. ఒక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తే, ఒక వైరస్‌ ప్రపంచదేశాల వెన్నులో ఇంకా వణుకు పుట్టిస్తూనే ఉంది.

ఒక అమాయకురాలి మరణంతో ఈ హిజాబ్‌ మాకొద్దు అంటూ ఇరాన్‌ నవతరం నినదిస్తే, ఒక రాణి మహాభినిష్క్రమణంతో ఇంగ్లండ్‌లో ఒక శకం ముగిసిపోయింది. అంతే కాదు..మరెన్నో కూడా జరిగాయి. వాటిని స్రుశించడం ద్వారా వచ్చే సంవత్సరం అవి మన దరి చేరకుండా చూసుకోవచ్చు.. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటన్‌ పాలనా పగ్గాలను ఇప్పుడు భారతీయ మూలాలున్న వ్యక్తి తీసుకోవడం చూస్తే భూమి గుండ్రంగానే ఉంటుందన్న మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి.

ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోవడం ఒక మైలురాయి అయితే, వాతావరణ మార్పులతో అగ్రరాజ్యాలు కూడా హిమయుగంలో మాదిరిగా గడ్డ కట్టుకుపోవడం మన కళ్ల ముందే కనిపిస్తున్న కఠిన సత్యం. మొత్తంగా చూస్తే 2022 ప్రపంచదేశాలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను, కొన్ని తీపి గురుతుల్ని మిగిల్చి వెళ్లిపోతోంది. మొదట వార్తల్లో వ్యక్తులను చూద్దాం.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్‌ జెలెన్‌స్కీ నిజానికి ఓ కమెడియన్ యాక్టర్.. రష్యా దండయాత్రను సమర్థంగా ఎదుర్కొని ఈ ఏడాదిలో హీరోగా మారారు.

పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ యుద్ధానికి దిగితే ధైర్య సాహసాలతో ఎదుర్కొన్నారు. వారంలో ముగిసిపోతుందనుకున్న పుతిన్‌ అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంకా కదనరంగంలో పోరాడుతున్నారు. జెలెన్‌స్క్‌లో ఈ పోరాట స్ఫూర్తిని గుర్తించిన టైమ్‌ మ్యాగజైన్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా కవర్‌ పేజీ ప్రచురించింది.

పైగా తానో మంచి మార్కెటర్ అన్న విషయం కూడా చెప్పకనే చెప్పారు. ఎక్కడ ఎంత మాట్లాడాలో ఎక్కడ ఏ దుస్తులు ధరించాలో ఎక్కడి నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రజలను కలవడం సాధ్యమో తెలిసినవాడు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని చవకగా పనులు కానివ్వడం జెలెన్సీకే చెల్లింది. ఇకపోతే రిషి సునాక్‌.. ఒకప్పుడు భారత దేశాన్ని దాస్యశృంఖలాల్లో బంధించి ఏళ్ల తరబడి పరిపాలించిన బ్రిటన్‌ దేశాన్ని ప్రధానిగా పాలిస్తున్నాడు. భారతీయ మూలాలున్న రిషి సునాక్‌ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.

42 ఏళ్ల వయసుకే ప్రధాని పీఠమెక్కి బ్రిటన్‌ చరిత్రలో పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్‌ను గట్టెక్కించడంలో లిజ్‌ ట్రస్‌ విఫలం కావడంతో టోరీ ఎంపీల మద్దతుతో ఇన్ఫోసిస్‌ చైర్మన్‌ నారాయణమూర్తి అల్లుడైన రిషి.. బ్రిటన్‌ ప్రధానిగా అక్టోబర్‌ 25న పదవీ ప్రమాణం చేశారు. అయితే ప్రస్తుతం తనను కూడా అసమ్మతి వెంటాడుతున్నట్టు సమాచారం. మానవాళిని మరో గ్రహానికి చేర్చాలని కలలు గన్న ప్రపంచ కుభేరుడు ఎలాన్‌ మస్క్‌. నెంబర్ స్థానంలో నిత్యం సంచలనాలు స్రుష్టిస్టూ వ్యాపార దిగ్గజంగా ఎదిగాడు. సమస్యలతో చెలగాటమాడడాన్ని అమితంగా ఇష్టపడే ఎలాన్‌ మస్క్‌ ఓ దిక్కుమాలిన పనిచేసి ఈ ఏడాది వార్తల్లో నిలిచారు.

సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ని అక్టోబర్‌ 27న కొనుగోలు చేశారు. ఆ తర్వాత సంస్థలో ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్క్‌ వంటి వివాదాలకు తెరలేపారు. చివరికి తాను ట్విట్టర్‌ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న పోల్‌ నిర్వహిస్తే 57.5% మంది ఆయన పదవికి రాజీనామా చేయాలని తీర్పునివ్వడం జరిగింది. అయితే మళ్లీ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇంకా తేలాల్సి ఉంది. ట్విట్టర్ కొనుగోలుతో తన సంపద కూడా హరించుకుపోయినా లెక్క చేయకుండా తాను బట్టిన కుందేలుకు మూడే కాళ్లంటూ ముందుకు పోతూనే ఉన్నాడు.

పెద్ద మనిషి బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ తన 96 ఏళ్ల వయసులో కన్నుమూసారు.చివరి దాకా సంపూర్ణ ఆరోగ్య జీవితాన్ని గడిపి వయోభారంతో సెప్టెంబర్‌ 8న కన్నుమూశారు. 70 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా బ్రిటన్‌ సింహాసనాన్ని ఏలిన ఆమె మరణంతో బ్రిటన్‌లో ఒక శకం ముగిసిపోయింది. దేశానికి మహరాణి అయినప్పటికీ ఆ అధికారం ఎప్పుడూ ప్రదర్శించకపోవడంతో ఆమె అందరి మన్ననలు పొందారు.

అది ఈ సంవత్సరం జరిగిన విషాధాలలో ఒకటి. ఇకపోతే సోవియెట్‌ యూనియన్‌ చిట్టచివరి అధ్యక్షుడు మిఖాయిల్‌ గోర్బచెవ్‌ కూడా తన 91 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో కన్ను మూసారు. సోనియెట్‌ యూనియన్‌లో ఆర్థిక సంస్కరణలకు తెరతీసి ప్రపంచ గతినే మార్చిన గొప్ప దార్శనికుడు గోరబచేవ్. సోవియెట్‌ యూనియన్‌ విచ్ఛిన్నానికి సారథ్యం వహించి ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికారు.

అందుకే నోబెల్‌ శాంతి బహుమానం ఆయనను వరించింది. కానీ పుతిన్ కు గొర్బచెవ్ అంటే నచ్చడు..అందుకే ఆయన అంత్యక్రియలకు హాజరు కాలేదు. మరో గొప్ప రాజీకీయవేత్త జపాన్ మాజీ ప్రధాని షింజో అబె..హత్యకు గురై మరణించారు. నరా నగరంలో జూలై 8న డెమొక్రాటిక్‌ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి పాయింట్ బ్లాంక్ లో గన్ పేల్చి చంపేసాడు. తూటాలు నేరుగా ఆయన ఛాతీలోకి వెళ్లడంతో షింజో అబే తుది శ్వాస విడిచారు. ఆయనకు భారతదేశం అంటే చాలా ఇష్టం..మన ప్రధాని మోదీకి మంచి స్నేహితుడిగా చెబుతుంటారు.

ఈ సంవత్సరం ఓ కొత్త నియంత అవిశ్రుతమయ్యాడు. చైనా అధ్యక్షుడిగా షీ జిన్‌పింగ్‌ అక్టోబర్‌ 23న వరుసగా మూడోసారి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేశాడు. అయితే తన అనుకూల వర్గంతో చేయించుకున్నాడని చెప్పుకోవచ్చు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ 20వ కాంగ్రెస్‌లో తాను పార్టీ ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఎన్నికయ్యాడు. చైనాలో ఈ పదవికి ఎన్నికైన వారే అధ్యక్ష పగ్గాలు చేపడతారు. ముందు ముందు జీవితకాలపు అధ్యక్షుడిగా మిగిలిపోయేందుకు ప్లాన్ చేసాడని సమాచారం.

ఇటు బ్రెజిల్‌లో జరిగిన ఎన్నికల్లో రైట్‌ వింగ్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనోరాను ఓడించిన వామపక్ష వాది లూలా డా సిల్వా అక్టోబర్‌ 30న నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన బ్రెజిల్ లో ఎక్కువమంది ప్రజలు ఇష్టపడే నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆయన గెలుపు నల్లేరు మీది నడకలా సాగిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది మహిళలు నాయకులుగా చూడబడిన సంవత్సరంగా చెప్పుకోవచ్చు.

ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా జార్జియా మెలోని ఎన్నికయ్యారు. బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత మెలోని.. అక్టోబర్‌ 25న దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీలో అతివాద ప్రభుత్వం ఏర్పాటుకావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక..ఇజ్రాయెల్‌లో మూడేళ్ల రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ మరోసారి బెంజిమన్‌ నెతన్యాహూ ప్రధాని పదవి అందుకున్నారు. సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన రికార్డు నెతన్యాహూపై ఉంది. నవంబర్‌ 15న ఆయన మళ్లీ ప్రధాని పగ్గాలు చేపట్టారు. ఈయన కూడా భారతదేశం అంటే మక్కువ చూపిస్తారు.

ప్రధాని మోదీతో అపారమైన స్నేహం ఉంది. నేపాల్‌లో అయిదు పార్టీల సంకీర్ణ కూటమి కుప్పకూలిపోవడంతో మాజీ ప్రధాని, సీసీఎస్‌ మావోయిస్ట్‌ సెంటర్‌ పార్టీ చైర్మన్‌ ప్రచండ ప్రధాని పగ్గాలు చేపట్టారు. సహచర కమ్యూనిస్టు నేత కేపీ శర్మ ఓలి మద్దతుతో డిసెంబర్‌ 26న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కేపీ శర్మ ఓలికి మనదేశం కన్నా చైనా అంటేనే ఎక్కువ ఇష్టం. లేని పోని విషయాలు ప్రస్తావిస్తూ భారత్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఓలికి అలవాటు. అయితే ఓలి మాటల్ని ప్రచండ ఎంత వరకు పాటిస్తాడన్నది చూడాల్సిన విషయం. చివరగా కరోనా ప్రభావంతో ఆర్థికంగా దివాలా తీసిన దేశాల్లో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. 2.2 కోట్ల జనాభా ఉండే దేశంలో ధరాభారాన్ని ప్రజలు మోయలేని స్థితికి వచ్చేశారు.

ఆహార పదార్థాలు కూడా అందరికీ సరిపడా పంపిణీ చేయడంలో విఫలం కావడంతో జూలైలో ప్రజలు భారీగా నిరసనలు చేపట్టారు. జులై 9న ఆందోళనకారులు గొటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించడంతో ఆయన దేశం విడిచివెళ్లిపోయే దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రణిల్‌ విక్రమ్‌సింఘె అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ శ్రీలంక ఇంకా అప్పులకుప్పగానే ఉంది. ఇవీ ఈ సంవత్సరం సంభవించిన కొన్ని ముఖ్య ఘట్టాలు.

Must Read

spot_img