Homeఅంతర్జాతీయంభారీగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల తొలగింపు... 

భారీగా సాఫ్ట్ వేర్ ఉద్యోగుల తొలగింపు… 

అవన్నీ దిగ్గజ టెక్ కంపెనీలే… నష్టాల్లో లేవు. కొన్ని నెలల్లో నష్టపోతాయనే అంచనాలూ లేవు. పైగా గడిచిన కొన్నేళ్లలో భారీ లాభాలను ఆర్జించాయి. ఇప్పుడు కూడా వాటి దగ్గర భారీగానే నగదు నిల్వలు ఉన్నాయి. అయినా సరే, ఉద్యోగుల సంక్షేమం గురించి అస్సలు ఆలోచించడం లేదు.

  • ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందనే భయంతోనే సాఫ్ట్ వేర్ రంగంలో లే ఆఫ్ లు కొనసాగుతున్నాయా…?
  • దిగ్గజ కార్పొరేట్ కంపెనీలన్నీ ఎందుకిలా చేస్తున్నాయి…? ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే వారి పరిస్థితి ఏంటి?

ఆర్థిక మాంద్యం, ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం, సప్లయి చైన్‌ లో సమస్యలు ఇలా రకరకాల కారణాలతో టెక్‌ కంపెనీలు ఉద్యోగులను సందిగ్ధంలో పడేస్తున్నాయి.. వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ, వారి జీవితాలను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి.. ఒకవైపు మూడో త్రైమాసికంలో భారీ లాభాలు ప్రకటించిన కంపెనీలు కూడా ఇలా సాకులతో ఉద్యోగులను తొలగించడం పట్ల తీవ్ర ఆగ్రహం, ఆందోళన, నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

2022లో ప్రారంభమైన ఉద్యోగుల తొలగింపు, 2023లో రెట్టించిన వేగంతో సాగుతోంది. తాజా పరిస్థితుల్లో కాస్త ఆదాయం తగ్గుతుందనే హెచ్చరికలతో.. ఇష్టారీతిన ఉద్యోగులను తొలగించేస్తున్నాయి దిగ్గజ ఐటీ కంపెనీలు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్.. ఇలా ఒక్కటేమిటి.. చాలా టెక్ దిగ్గజాలన్నీ ఎంతో సింపుల్ గా ఓ మెయిల్ పంపి మీ సేవలు చాలు అనేస్తున్నాయి.

క్షణాల్లో సెటిల్ మెంట్లు చేసేసి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నాయి. జనవరిలో ఇప్పటి వరకు 166 చిన్నా పెద్ద కంపెనీలు కలిసి 65 వేల మంది ఉద్యోగులపై వేటు వేశాయి. 2022లో వెయ్యి కంపెనీలు 1,54,336 మందిని తొలగించాయని లేఆఫ్స్‌ ను ట్రాక్‌ చేస్తున్న వెబ్‌సైట్‌ లేఆఫ్స్‌ డాట్‌ ఎఫ్‌వైఐ తెలిపింది.

ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీల్లో ఇండియాకు చెందిన పెద్ద కంపెనీలు, స్టార్టప్‌లు కూడా ఉన్నాయి. కొత్త సంవత్సరంలో రోజుకు సగటున 3వేలకు పైగా ఉద్యోగులపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థలుగా ఉన్న మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి.

లేఆఫ్‌లపై గూగుల్‌ ఉద్యోగుల ఆందోళనకు కారణమైంది…గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో 6 శాతం. దీనిపై అల్ఫాబెట్‌ వర్కర్స్‌ యూనియన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ నిర్ణయం కంపెనీ సామర్ధ్యంపై ప్రభావం చూపుతుందని, ఇన్నోవేటీవ్‌ కార్యక్రమాలకు ఇబ్బందులు వస్తాయని హెచ్చరించింది. ఉద్యోగుల తొలగింపుపై ఈ యూనియన్‌ తొలిసారి గట్టిగానే తన గళం విప్పుతోంది.

  • లేఆఫ్‌ల మూలంగా కింది స్థాయి ఉద్యోగులపైనే ఎక్కువ ప్రభావం ఉందని, మేనేజర్లు, ఆ పై స్థాయి అధికారులపై ఎలాంటి ప్రభావం లేదని వర్కర్స్‌ యూనియన్‌ స్పష్టం చేసింది.

ఈ త్రైమాసికంలోనే 17 బిలియన్‌ డాలర్ల లాభాలు గడించిన అల్ఫాబెట్‌ 12 వేల మందికి ఉపాధి లేకుండా చేయడం ఎంత మాత్రం అంగీకారయోగ్యం కాదని వర్కర్స్‌ యూనియన్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. లేఆఫ్‌ల విషయంలో కంపెనీ పారదర్శకత పాటించలేదని కూడా యూనియన్‌ విమర్శించింది. ఇది కంపెనీ ప్రతిష్టకు భంగం కలిస్తుందని, ఉద్యోగం నుంచి తొలగించిన వారి జీవితాల్లో అనేక మార్పులకు కంపెనీదే బాధ్యత అని స్పష్టం చేసింది. కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ సమాధానం చెప్పాలని యూనియన్‌ డిమాండ్‌ చేసింది.

మైక్రోసాఫ్ట్‌ లో మూడో త్రైమాసికంలో 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఈఓ, ఛైర్మన్‌ సత్య నాదెళ్ల ప్రకటించారు. ఆర్ధిక వ్యయాలను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించక తప్పడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం బాధకరమైనప్పటికీ, తప్పడం లేదన్నారు.

అమెజాన్‌ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 18 వేల మందికి తొలగిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఇందులో భారత్‌ లో పని చేస్తున్న 1000 మంది కూడా ఉన్నారు. ప్రధానంగా కార్పొరేట్‌, టెక్నాలజీ జాబ్స్‌ ఎక్కువగా కోతకు గురయ్యాయి. ఈ సంవత్సరం మరికొన్ని లే ఆఫ్స్‌ ఉంటాయని అమెజాన్‌ సీఈఓ అండీ జెస్సీ తెలిపారు.
వ్యయ నియంత్రణలో భాగంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

భారత దేశానికి చెందిన సోషల్‌ మీడియా సంస్థ షేర్‌ ఛాట్‌ లో మొత్తం ఉద్యోగుల్లో 20 శాతం మందిని తొలగించింది. ఈ నిర్ణయం వల్ల 500 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. డిమాండ్‌ తగ్గడం వల్లే ఉద్యోగులను తొలగించినట్లు షేర్‌ ఛాట్‌ తెలిపింది. ప్రముఖ బీ టూ బీ స్టాఫ్ట్‌వేర్‌ కంపెనీ సేల్స్‌ఫోర్స్‌లో 7 వేల మందిని తొలగిస్తున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్‌ బేనాఫ్‌ జనవరి 4న ప్రకటించారు. మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు బేనాఫ్ తెలిపారు.

ప్రముఖ వీడియో హోస్టింగ్‌ ప్లాట్‌ఫామ్‌ విమ్కో ఈ సంవత్సరంలో 11 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2022 జులైలో ఈ సంస్థ మొదటి విడతలో 6 శాతం మందిని తొలగించింది. సంస్థ ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ఉద్యోగుల తొలగింపు తప్పడంలేదని సంస్థ ఈసీఓ అంజలీ సూద్‌ తెలిపారు. విప్రోలో 400 మంది ఫ్రెషర్స్‌ను తొలగిస్తున్నట్లు కంపెనీ గత శనివారం ప్రకటించింది. వీరి పనితీరు బాగోలేదన్న సాకుతో వీరిని ఉద్యోగం నుంచి తొలగించింది.

ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ 380 మందిని తొలగించింది. కంపెనీ ఆర్ధికంగా నష్టాల్లో ఉన్నందున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఎండ్‌ టూ ఎండ్‌ డిజిటల్‌ హెల్త్‌ కేర్‌ సంస్థ మెడ్‌బుడ్డీ మొత్తం ఉద్యోగుల్లో 8 శాతం, అంటే 200మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థను ఆర్ధికంగా మెరుగైన స్థితిలోకి
తీసుకు వచ్చేందుకు పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది.

  • ఆర్థిక మందగమన పరిస్థితులతో పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలన్నీ తమ వర్క్ ఫోర్స్ ను తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాయి..

ఓలా కంపెనీ 200 మందిని, వాయిస్‌ ఆటోమెటెడ్‌ సంస్థ ఎస్కిట్‌ ఎస్కిట్‌ డాట్‌ ఏఐ కూడా జనవరిలోనే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. హోం డెలివరీ సంస్థ డంజో 3 శాతం ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ సోప్‌వోస్‌ 450 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ గ్లోబల్‌ వర్క్‌ఫోర్స్‌లో ఇది 10 శాతమని సంస్థ తెలిపింది. ఖర్చులు తగ్గించుకుని, లాభాలు పెంచుకునేందుకు ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. 2023 ప్రారంభమే వేలాది ఉద్యోగుల జీవితాల్లో చీకట్లు నింపిందని ట్రేడ్‌ యూనియన్‌ నిపుణులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పెద్ద సంఖ్యలోనే ఉద్యోగులను తొలగించే అవవకాశం ఉందని భావిస్తున్నారు. 2022లో ట్విటర్‌లో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించారు. మొత్తం ఉద్యోగుల్లో ట్విటర్‌ ఇప్పటి వరకు 50 శాతం మందిని తొలగించింది.

ఆర్థిక మందగమన పరిస్థితులతో పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలన్నీ తమ వర్క్ ఫోర్స్ ను తగ్గించుకోవాలని డిసైడ్ అయ్యాయి. అందులో భాగంగానే వేలాది ఉద్యోగాలు తీసేసి.. వారిని ఇంటికి పంపించేస్తున్నాయి. ట్విట్టర్ తో మొదలైన లేఆఫ్స్ నెమ్మదిగా మిగతా కంపెనీలకు విస్తరించింది. ఒక్కొక్కొ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు వేలాది మంది ఉద్యోగుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి.

Must Read

spot_img