Homeజాతీయంఆఫ్గనిస్తాన్ లో మహిళల పరిస్థితి మరింతగా దిగజారింది.

ఆఫ్గనిస్తాన్ లో మహిళల పరిస్థితి మరింతగా దిగజారింది.

అఫ్గానిస్తాన్ ను స్వాధీనం చేసుకున్న తరువాత తాలిబన్లు వారి అరచకాలను మెల్లిమెల్లిగా కొనసాగిస్తున్నారు.

ఒకేసారి ప్రతాపం చూపిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురౌతుందని భయపడిన తాలిబన్లు ఇప్పుడు మహిళలపై తమ పైశాచికం ప్రదర్శించడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. మరోసారి మహిళల మీద తాలిబన్లు పంజా విసిరారు. మేము చెప్పిందే వేదం, మేము చెప్పినట్లు వినాలి అంటూ తాలిబన్లు ఆదేశంలోని మహిళలకు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు కాలేజీలకు వెళ్లకుండా నిషేధించారు.

అఫ్గానిస్తాన్ స్వాధీనం చేసుకున్న తరువాత ఆదేశంలోని మహిళలను ఉక్కుపాదంతో తొక్కేయాలని తాలిబన్లు డిసైడ్ అయ్యారు. మహిళలు ఉన్నత చదవులు చదవడానికి వీలు లేదని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఇక ముందు ఉన్నత చదువులు చదవడానికి అక్కడి విద్యాసంస్థలు యువతులకు అవకాశం ఇవ్వకూడదని హుకుం జారీ చేశారు.

మహిళలు ఉన్నత చదువులు ఎందుకు చదవాలి, మహిళలు అసలు చదువుకునేందుకు మేము అంగీకరించమని గతంలోనే తాలిబన్లు స్పష్టం చేసారు. తాజా తాలిబన్ ప్రభుత్వ నిర్ణయంతో ఆదేశంలోని మహిళలు ఇక ముందు ఉన్నత విద్యాభ్యాసం చెయ్యడానికి అవకాశం లేకుండా పోయింది.

ఈ మేరకు ప్రభుత్వ తక్షణ నిర్ణయంగా ఉత్తర్వులను జారీ చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి నిర్ణయం పట్ల విద్యావేత్తలు, సాధారణ పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సహావిద్య విధానాన్ని తాలిబన్లు నిషేధించారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చదువుకోవడం ఇకపై కుదరదని తేల్చిచెప్పారు.

దాంతో కొంతమేర వారు విద్యకు దూరం అయ్యారు. ఆ తర్వాత ఆడపిల్లలకు చదువు చెప్పడానికి పురుషులను అనుమతి రద్దు చేసారు.

అమ్మాయిలు విద్యా, ఉద్యోగాలు, క్రీడారంగానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు.

దేశంలో అన్ని విద్యా కార్యకలాపాలు షరియా చట్టం ప్రకారం జరుగుతాయని తేల్చిచెప్పారు.అయితే అదే సమయంలో తాలిబన్‌ నేతలు మాత్రం వాళ్ల పిల్లలను విదేశాల్లో చదివిస్తూ స్వేచ్ఛగా ఉండనిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబన్‌ కేబినెట్‌లో 25 మంది దాకా తమ పిల్లలను పొరుగున ఉన్న పాక్‌లోని పెషావర్‌, కరాచీలో.. ఇంకొందరు దోహాలోని స్కూల్స్‌లో పిల్లలను చదివించుకుంటున్నారు.

వాళ్లలో ఆరోగ్య మంత్రి ఖ్వాలందర్‌ ఎబాద్‌, విదేశాంగ ఉపముఖ్యమంత్రి షేర్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్టానిక్‌జాయ్‌, తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహెయిల్‌ షాహీన్‌లు పిల్లలు కూడా ఉన్నారు. వారి పిల్లలకు ఒక న్యాయం, సాధారణ పిల్లలకు ఒక న్యాయమా అంటూ అంతా తాలిబన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.

పురుషులు వెంట లేకుండా మహిళలు ఇళ్ల నుండి బయటకు రావడానికి వీల్లేదని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదంటూ మరో వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు ఒక మాజీ ప్రభుత్వ అధికారి తన చెల్లెలి గురించి ఒక ఆసక్తికర పోస్ట్ చేశాడు. తన చెల్లి కెరీర్ గురించి మాట్లాడుతూ తాలిబన్ల నిర్ణయం వల్ల ఆమె భవిష్యత్తు పరిస్థితి, వారి కుటుంబ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న అనంతరం చట్టబద్ధంగా శాంతియుత పాలనను అందిస్తామని వాగ్దానం చేసినప్పటికీ మహిళలపై ఆంక్షలను కఠినతరం చేస్తోంది తాలిబన్ ప్రభుత్వం. మహిళలకు విద్యాబోధనను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేదా మహమ్మద్‌ నదీమ్‌ లేఖ రాశారు. విద్యా మంత్రిత్వ శాఖ ప్రతినిధి జియావుల్లా హషిమి ఈ లేఖను ధృవీకరించారు.

తాలిబన్ల నిర్ణయాన్ని అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు ఖండించాయి. మహిళలు, బాలికలపై ఆంక్షలు విధించడం వారి హక్కులు, స్వేచ్ఛను హరించడమేనని అమెరికా హోం శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అందరి హక్కులను గౌరవించే వరకు తాలిబన్‌ అంతర్జాతీయ సమాజంలో చట్టబద్ధమైన సభ్యునిగా గుర్తింపు పొందుతుందని ఆశించలేమని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

దేశ జనాభాలో సగభాగం వెనక్కి వెళ్లడంతో ఏ దేశం కూడా అభివృద్ధి చెందదని అన్నారు. మహిళల హక్కులను ఇది కాలరాయడమేనని ఐక్యరాజ్య సమితిలో బ్రిటన్‌ రాయబారి బార్బరా వుడ్‌ వార్డ్‌ అన్నారు. నిషేధం పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ తీవ్ర ఆదోళన వ్యక్తం చేశారు. మహిళలకు విద్యపై నిషేధం వల్ల దేశ భవిష్యత్తుపై వినాశకరమైన ప్రభావం చూపుతుందని ఆయన పునరుద్ఘాటించారు.

Must Read

spot_img