Homeజాతీయంఅమర్నాథ్ యాత్రికులకు కేంద్రం శుభవార్త

అమర్నాథ్ యాత్రికులకు కేంద్రం శుభవార్త

శేష్ నాగ్ టన్నెల్ .. నిర్మాణం .. అమర్ నాథ్ యాత్రీకులకు సులువైన ప్రయాణాన్ని అందించనుందా..? గతంలో కాశీ యాత్ర లా మారిన నేటి అమర్
నాథ్ యాత్ర .. ఇక ఈజీ కానుందా..? అమర్ నాథ్ యాత్ర.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని అనుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెబుతోంది.. అతి త్వరలో యాత్ర కష్టాల్ని తీర్చేలా రహదారి నిర్మాణాన్ని చేపట్టనుంది.

ఎటుచూసినా మ‌ల్లెపువ్వులా మెరిసిపోయే హిమ‌సోయ‌గాలు.. క‌నుచూపుమేర ప‌రుచుకున్న మంచు.. అటు, ఇటు మంచుకొండ‌లు, లోయ‌లు, ఎత్తైన కొండ‌ల‌పై ప్ర‌యాణం.. పైకి వెళ్లిన కొద్ది ఊపిరి ఆడ‌కుండా ఉన్నా.. శివ‌నామ స్మ‌ర‌ణ‌తో అదోలోకంలో తేలిపోతూ ఉంటారు. అయితే.. ఇదో సాహ‌స యాత్ర అనే చెబుతుంటారు చాలామంది. అయినా ఆ భోళాశంక‌రుడిని, హిమలింగాన్ని క‌నులారా చూసి, త‌రించిపోవాల‌ని చాలామంది తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.

ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పుణ్యక్షేత్రానికి సులువుగా చేరుకునేందుకు వీలుగా ఒక రహదారిని నిర్మించాలని నిర్ణయించింది. దీనికోసం చందన్‌వాడీ, సంగం మధ్య 22 కి.మీ. మేర రహదారిని నిర్మించాలని కేంద్రం ప్లాన్‌ చేసిందని తెలుస్తోంది. దీనిలో 11 కి.మీ. పొడవైన సొరంగ మార్గం కూడా ఉందని పేర్కొంది. ఈ రహదారి నిర్మాణాన్ని ఐదేళ్లలో పూర్తిచేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. అలాగే ఈ రహదారి శ్రీనగర్‌ పట్టణాన్ని దాటి లద్దాక్‌, జమ్మూ మధ్య ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా అందిస్తుందని వివరించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారి 501లోని ఖానాబల్‌-బాల్తాల్‌ విభాగంలో శేష్‌నాగ్‌ టన్నెల్‌ నిర్మాణాన్ని నేషనల్‌ హైవేస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు కేటాయించినట్టు తెలిపింది.

జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా ఎగువ ప్రాంతంలో సముద్రమట్టానికి 13వేల కి.మీ. ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రానికి చేరుకోవాలంటే.. లిడ్డర్‌ లోయ అంచున ఇరుకైన నడక మార్గంలో ప్రయాణించాలి. పుణ్యక్షేత్రానికి సులువుగా ప్రయాణించేందుకు అనువైన రహదారిని నిర్మించడమే తమ అంతిమ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చెబుతోంది.

ఇదిలా ఉంటే, శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలోని పహల్గాం నుంచి అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం అవుతుంది. అమర్‌నాథ్‌ యాత్ర బేస్‌ క్యాంప్‌ పహల్గాంలో ఉంటుంది. ఇక్కడి నుంచి అమర్‌నాథ్‌కు 45 కిలోమీటర్లు. బేస్‌క్యాంప్‌ నుంచి బృందాలుగా అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్తారు. పహల్గాంకు శ్రీనగర్‌ నుంచి రోడ్డు మార్గాన చేరుకోవచ్చు. అక్కడి నుంచి చందన్‌వాడీ వెళతారు.

చందన్ వాడీ నుంచి యాత్ర కష్టంగా మారుతుంది. చందన్‌వాడీ నుంచి గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. మూడున్నర అడుగులు ఉండే దారిలో కొండ అంచుల వెంట కర్ర చేత పట్టుకునినడుస్తుంటారు.చందన్‌వాడీ నుంచి 11 కిలోమీటర్ల దూరం వెళ్లాక శేష్‌నాగ్‌ వస్తుంది. ఇక్కడ ఐదు కొండలు పాము పడగల్లా కనిపిస్తాయి. శేష్‌నాగ్‌నుంచి 18 కిలోమీటర్ల దూరంలో అమర్‌నాథ్‌ వస్తుంది. పహల్గాం, చందన్‌వాడీ నుంచి అమర్‌నాథ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లడానికి కూడా అవకాశం ఉంటుంది. అమర్ నాథ్ ను మిగతా ప్రపంచంతో కలిపే మార్గాలు రోడ్డు, రైలు, విమానం. విమానం అయితే జమ్ము లేదా శ్రీనగర్ వరకు ఉంటాయి. రైళ్లు జమ్ము వరకు వెళ్తాయి. బస్సు మార్గం అయితే జమ్ము, శ్రీనగర్ వరకు ఉంటాయి. జమ్ము- పహల్గామ్ – చందన్ వాడి – పిస్సుటాప్ – శేష్ నాగ్ – సంగమ్ – పంచతరణి – గుహాలయం వరకు ఓ రహదారి ఉంటుంది.

మరొకటి .. జమ్ము – బాల్తాల్ – దొమైల్ – బరారి – గుహాలయం వరకు ఉంటుంది. జమ్మునుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు బస్సు, వాహన రవాణా సదుపాయాలు ఉంటాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి రైలు, బస్సు, విమాన సదుపాయాల ద్వారా ఇక్కడకు చేరుకున్నవారిలో ఎవరంతట వారు మార్గాలు వెతుక్కుని వెళ్లేవారు కొందరైతే, ప్రభుత్వ ఆధ్వర్యంలోని బస్సుల ద్వారా పహల్గామ్ లేదా బాల్తాల్ వరకు చేరేవారు కొందరుంటారు.

యాత్రీ నివాస్ నుంచి యాత్రికులను రోజూ తెల్లవారుజామున 5 గంటలకు ప్రత్యేక కాన్వాయ్ ద్వారా బస్సుల్లో ప్రభుత్వం ఇక్కడి నుంచి బాల్తాల్ లేదా పహల్గామ్ కు తరలిస్తుంది. వాహనాల మీద ఎలాంటి దాడులు జరగకుండా బస్సులకు ముందు, వెనుక ప్రభుత్వం సి.ఆర్.పి.ఎఫ్. ద్వారా పహారా ఏర్పాటు చేస్తుంది. యాత్రీ నివాస్ కు చేరుకోగానే పహల్గామ్ లేదా బాల్తాల్ వెళ్లడానికి ఆర్టీసీ బస్సుకు టికెట్ బుక్ చేసుకోవాలి.

అర్ధరాత్రి వరకు టికెట్లు దొరుకుతాయి. బస్సుల కొరత అనే సమస్యే ఉండదు. అమర్ నాథ్ యాత్ర సమయంలో కావలసినన్ని బస్సులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. బస్సులన్నీ తెల్లవారుజామునే బయలుదేరుతాయి. పహల్గామ్ లేదా బాల్తాల్ చేరడానికి జమ్ము నుంచి నేరుగా వెళ్లే బస్సులు ఉండవు. పహల్గామ్ వరకు షేరింగ్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. అనంత్ నాగ్ వరకు షేరింగ్ ట్యాక్సీలు దొరుకుతాయి. అక్కడి నుంచి మరో షేరింగ్ ట్యాక్సీ లేదా బస్సులో వెళ్లొచ్చు. ఎందుకంటే, శ్రీనగర్ నుంచి పహల్గామ్ కు వెళ్లే బస్సులు, ట్యాక్సీలు తప్పనిసరిగా అనంత్ నాగ్ నుంచే వెళ్తుంటాయి కనుక అక్కడి నుంచి రూ. 60- 80 కి షేరింగ్ ట్యాక్సీలో పహల్గామ్ చేరొచ్చు.

జమ్ము నుంచి బాల్తాల్ కు మాత్రం డైరెక్టు ట్యాక్సీలు, బస్సులు దొరకవు. ముందు శ్రీనగర్ వెళ్లి అక్కడి నుంచి బాల్తాల్ చేరాలి. శ్రీనగర్ లోని టూరిజం రిసెప్షన్ సెంటర్ నుంచి షేరింగ్ ట్యాక్సీలు దొరుకుతాయి. బస్సులు కాని, ట్యాక్సీలు కాని బాల్తాల్ కు ఉదయం వేళల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. జమ్ము నుంచి శ్రీనగర్ కు సాధారణ బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సులే కాకుండా శ్రీనగర్ కు వెళ్లడానికి షేరింగ్ ట్యాక్సీలు కూడా ఇక్కడి నుంచి దొరుకుతాయి.

చాలామంది ప్రయాణికులు సాధారణంగా శ్రీనగర్ కు నేరుగా విమానాల్లో వస్తుంటారు. వాళ్లకు అక్కడి నుంచే నేరుగా బాల్తాల్, పహల్గామ్ వెళ్లడానికి బస్సులు, ట్యాక్సీలు దొరుకుతాయి. జమ్ము రావలసిన అవసరం లేదు. శ్రీనగర్ శివారులో 16 కిలోమీటర్ల దూరంలో నవ్ గావ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. అక్కడి నుంచి రైల్లో అనంత్ నాగ్ వరకు వెళ్లొచ్చు. అమర్‌నాథ్‌ గుహ సముద్ర మట్టానికి 12 వేల 756 అడుగుల ఎత్తులో ఉంటుంది.

భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర గురించే చర్చలు సాగుతుంటాయి. అమర్నాథ్ యాత్రలో ప్రయాణికులు సముద్ర మట్టానికి దాదాపు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగాన్ని సందర్శిస్తుంటారు. ప్రపంచంలోని అతి పెద్ద గుహల్లో ఈ అమర్నాథ్ గుహ కూడా ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవుతో ఉన్న ఈ గుహ హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా, సహజసిద్ధంగా ఏర్పడింది. ఏడాదిలో జులై, ఆగస్టు మాసాల్లో మినహా మిగితా సమయం మొత్తం ఈ గుహ పూర్తిగా మంచుతో కప్పుకొని ఉంటుంది. ఆ సమయంలో మైనస్ 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో ఈ గుహను చేరుకోవడం చాలా కష్టం. జులై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం వేడెక్కుతుంది. మంచు కరుగుతుంది. దీంతో గుహ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగానే ఉంటుంది. దాదాపు 45 నుంచి 60 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా కరిగి అంతర్థానమవుతుంది. విచిత్రమేమంటే ఈ శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో అవిర్భవిస్తుంది. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తోందన్న విషయం పై మాత్రం ఇప్పటికీ సమాధానం లేదు.

అమర్ నాథ్ వెళ్లాలంటే, మార్గాలున్నా కష్టాలు మాత్రం తప్పవన్న నానుడిని తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం చెరిపివేయనుందని విశ్లేషకులు
అంటున్నారు.

Must Read

spot_img