Homeజాతీయంటీ కాంగ్రెస్ కు ప్రియాంక లాభమా.. నష్టమా ..

టీ కాంగ్రెస్ కు ప్రియాంక లాభమా.. నష్టమా ..

ఒక్క గెలుపు మళ్లీ కాంగ్రెస్‌ కి ఊపిరిపోసింది. హిమాచల్‌ ప్రదేశ్‌ ని కైవసం చేసుకున్న హస్తం పార్టీ ఇప్పుడు అదే గెలుపు వ్యూహాన్ని తెలుగురాష్ట్రాలకు అమలు చేయబోతోందా ? ఇందిరాగాంధీ వారసురాలిగా పేరందుకున్న ప్రియాంక గాంధీ తెలుగు నేలపై కాలు పెట్టనుందా? సోదరుడు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర వచ్చే నెలతో ముగియనుంది. ఈ పాదయాత్ర దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌ లో పార్టీ గెలవడం కాస్తంత ఊరటనిచ్చింది. ఈ ఊపుని కంటిన్యూ చేసేలా మరో పాదయాత్రకి సిద్ధమవుతోంది కాంగ్రెస్‌ పార్టీ.

త్వరలో ప్రియాంక గాంధీ తెలుగునేలపై పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సౌత్‌ లో ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్‌ కి పట్టు ఉండేది. కానీ అంతర్గత కుమ్ములాటలు, అధికారంలో లేకపోవడం వంటి పలు కారణాలతో సీనియర్లంతా పార్టీకి గుడ్‌ బై చెప్పేశారు. ఉన్న ఒకరిద్దరు సీనియర్లు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పరిస్థితి ఘోరంగా ఉంది. ఎంత మంది ఇంఛార్జ్‌ లను పెట్టినా తెలంగాణ, ఏపీల్లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మారలేదు. అధ్యక్షులను పెట్టినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అధిష్టానం తెలుగురాష్ట్రాలపై ఇప్పుడు దృష్టి పెట్టింది.

సౌత్‌ లో కర్నాటకతో పాటు తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కర్నాటక వాసి కావడంతో ఆయన ఆ రాష్ట్ర ఎన్నికలపై దృష్టిపెట్టారు. పార్టీని బలోపేతం చేసే ప్రక్రియని మొదలెట్టారు. ఇక తెలుగురాష్ట్రాలపై ప్రియాంక గాంధీ ఫోకస్‌ పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను ఇక ప్రియాంక గాంధీ చూస్తారన్న న్యూస్‌ బయటకు వచ్చింది.

ఇదిలా ఉంటే, హిమాచల్‌ ప్రదేశ్‌ లో ప్రియాంక గాంధీ ప్రతీ నియోజకవర్గం నేతలతో, కార్యకర్తలతో భేటీ కావడమే కాదు ప్రతీ వీధి , ప్రతీ ఇల్లు తిరిగి పార్టీని గెలిపించాలని కోరారు. స్థానిక సమస్యలతో పాటు వివిధ వర్గాల సమస్యలను తెలుసుకున్నారు. వాటిపై ఫోకస్‌ చేసి ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారు. ఫలితంగా తిరుగులేని మెజార్టీతో హిమాచల్‌ ప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని అందుకుంది. ఇప్పుడదే ఫార్ములాని ప్రియాంక గాంధీ తెలంగాణలో అమలు చేయనున్నారట. మహిళా మోర్చా ర్యాలీలతో ప్రతీ ఇల్లు, ప్రతీ గల్లీ తిరిగి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరనున్నారట.

అయితే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నా నేతల పనితీరు వల్లే పార్టీ బలోపేతం కావడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా తెలంగాణ లో నేతల మద్య విభేదాల కారణంగానే ఆ పార్టీ ప్రజల్లో మన్ననలు పొందలేకపోతుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్న కీలక ఆయుధాల్లో ప్రియాంక గాంధీ ఒకరు. అందుకే ఆమెను ఎంతో కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రంగంలోకి దింపారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రియాంక ఫలితాలను రాబట్టలేదు. ఈ నేపథ్యంలో ప్రియాంకకు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి.

అయితే.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపని ప్రియాంక ఇక్కడ రాణిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. అందుకే ప్రియాంక గాంధీ రంగంలోకి దిగితే.. ప్రభావం ఎంత అనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో ప్రియాంక పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తారా అని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.

ప్రియాంక గాంధీ నేరుగా రంగంలోకి దిగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇప్పటికీ అనేక గ్రామాల్లో ఇందిరమ్మ పాలన అనే పదం చాలా ఫేమస్. ప్రియాంక కూడా దాదాపు ఇందిరాగాంధీ లాగానే ఉంటారు. దీంతో సాంప్రదాయ కాంగ్రెస్ ఓటు వేరేవైపు వెళ్లకుండా ఉపయోగపడతారు అనే చర్చ నడుస్తోంది. అంతే కాకుండా.. ఇప్పుడు, గతంలో పార్టీ ఇంఛార్జులుగా ఉన్నవారితో సమస్యలు తగ్గకపోగా.. ఎక్కువయ్యాయి. దీంతో నేరుగా ప్రియాంకనే రంగంలోకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న మాణిక్కం ఠాగూర్, గతంలో పనిచేసిన గులాంనబీ ఆజాద్, దగ్విజయ్ సింగ్ పార్టీకి పెద్దగా పనికొచ్చే పనులు చేయకపోగా.. నష్టం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. నేరుగా ప్రియాంక రంగంలోకి దిగడంతో.. పార్టీ నేతలు స్వయంగా అధిష్టానంతో మాట్లాడిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో వర్గపోరుకు చెక్ పెట్టొచ్చనే టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా.. ఉత్తర భారతదేశంతో పోలిస్తే.. గత ఎన్నికల్లో సౌత్ ఇండియా నుంచే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయి. దీంతో సౌత్ ఇండియాపై.. ముఖ్యంగా తెలంగాణపై ఫోకస్ పెట్టాలని అధిష్టానం భావిస్తోంది. అందుకే ప్రియాంకకు తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

తెలంగాణలో ఇప్పటికే యాక్టివ్గా ఉన్న కాంగ్రెస్ కేడర్.. ప్రియాంక ఎంట్రీతో మరింత ఉత్సాహంగా మారుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే సమయంలో నేతల అంతర్గత కుమ్ములాటలకు బ్రేక్ పడుతుందో లేదోనన్న చర్చ కేడర్ లో వినిపిస్తోంది.

ప్రియాంక ఎంట్రీపై పాజిటివ్ కామెంట్స్ ఇలా ఉంటే.. నెగెటివ్ కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ ఇష్యూ తెలంగాణలో రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారే అవకాశం ఉంది. యూపీలో పోటీ ఇవ్వలేని ప్రియాంక.. తెలంగాణ తమకు పోటీ ఇస్తుందా.. అని ఇప్పటికే ఇతర పార్టీల నేతలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రియాంక వస్తే.. లాభం జరుగుతుందా.. నష్టం జరుగుతుందా అని నేతలు చర్చించుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఆ పార్టీ హైకమాండ్‌కు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీ వీడి వెళ్లిపోతున్నారు. వెళ్తూ వెళ్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అందర్నీ కలుపుకుని వెళ్లాలని సలహాలు, సూచనలు మరీ ఇచ్చి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డి.. విఫలమయ్యారు. ఆ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంతకూ గాడిన పడకపోతూండటం… పార్టీ నేతల్ని చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తూండటంతో కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది.

తెలంగాణ బాధ్యతలను ఇక స్వయంగా చూసుకోవాలని ప్రియాంకా గాంధీ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో ఏదైనా తనకే రిపోర్టు చేయాలని ప్రియాంకా గాంధీ పార్టీ నేతలకు సూచించినట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ సారి ఢిల్లీలో తెలంగాణ నేతలతో భేటీ అయ్యారు. అయితే రేవంత్ రెడ్డి పై ఎక్కువ నమ్మకం ఉంచి.. ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకోలేదు. అయితే రేవంత్ ఎంత ప్రయత్నించినా సీనియర్లు ఆయనను అంగీకరించలేకపోతున్నారు. దీంతో కాంగ్రెస్‌కు ఇబ్బందులు తప్పడంలేదు. అందుకే ఇప్పుడు ప్రియాంకా గాంధీ లీడ్ తీసుకుంటున్నారని అంటున్నారు. అయితే ప్రియాంక డైరెక్షన్ లో నేతలు ఎంతమేరకు నడుస్తారన్న చర్చ కూడా కేడర్ లో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికల్లా కాంగ్రెస్ ను ప్రియాంక గాడిలో పెట్టడం ఓ ఎత్తైతే, సీనియర్లకు చెక్ పెట్టడం మరో ఎత్తని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణలో ప్రియాంక ఎంట్రీ ఏ ఏ మార్పులు తీసుకువస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.

అయితే దీని ప్రభావం కాంగ్రెస్ కు లాభిస్తుందా.. లేక అంతర్గత కుమ్ములాటల్లోనే మునిగిపోతుందా.. అన్నది సైతం చర్చనీయాంశమవుతోంది.

Must Read

spot_img