Homeఅంతర్జాతీయంతవాంగ్ లో ఎదురుదెబ్బతో చైనా దూకుడు ప్రదర్శిస్తోందా..?

తవాంగ్ లో ఎదురుదెబ్బతో చైనా దూకుడు ప్రదర్శిస్తోందా..?

తాజాగా వెలువడిన శాటిలైట్ చిత్రాలు ఈ అంశాల్ని బహిర్గతం చేస్తున్నాయా..?

భారత్‌-చైనా సరిహద్దులో సంక్షోభ వాతావరణం నెలకొంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల బలగాల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. భారత్‌ మీద దాడులు చేయడానికేనా అన్నట్టు చైనా యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుకు సమీపంలో ఉన్న టిబెట్‌లోని పలు ఎయిర్‌బేస్‌లలో అత్యాధునిక డ్రోన్లు, జెట్‌ విమానాలను మోహరించింది. దీనికి సంబంధించిన స్పష్టమైన ఉపగ్రహ చిత్రాలను మాక్సర్‌ టెక్నాలజీస్‌ సంస్థ బయటపెట్టింది.

సరిహద్దు నుంచి 150-260 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్‌బేస్‌లలో పదుల సంఖ్యలో అత్యాధునిక డ్రోన్లు, జెట్‌ విమానాలు ఉంచినట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అత్యాధునిక డబ్ల్యూజెడ్‌-7 సోరింగ్‌ డ్రాగన్‌ డ్రోన్లు, ఫ్లాంకర్‌ టైప్‌కి చెందిన సుఖోయ్‌-30ఎంకేఐ, జే10, కేజే-500 ఫైటర్‌ జెట్స్‌ను డ్రాగన్‌ సిద్ధం చేసింది. మాక్సర్‌ ఈ చిత్రాలను గత నెల 27 నుంచి ఈ నెల 14 తేదీల మధ్య తీసింది. అటు.. అరుణాచల్‌ సరిహద్దులో చైనా కదలికలు పెరగటంతో భారత నేవీ కూడా యుద్ధ విమానాలతో పెట్రోలింగ్‌ నిర్వహించింది.

అరుణాచల్ ప్రదేశ్ టార్గెట్ గా సరిహద్దుల్లో ఫైటర్ జెట్లను, డ్రోన్లను మోహరించిందా..?

ఈశాన్య భూభాగమే లక్ష్యంగా సరిహద్దులకు సమీపంగా చైనా ఈ యుద్ధ విమానాలను మోహరించినట్టు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. ముఖ్యంగా అరుణాచల్‌ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బాంగ్డా ఎయిర్‌బేస్‌, సిక్కిం సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న షిగాట్సే ఎయిర్‌బేస్‌తో పాటు సరిహద్దుకు 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాసా ఎయిర్‌బేస్‌లో చైనా పదుల సంఖ్యలో ఫైటర్‌ జెట్లు, డ్రోన్లను మోహరించింది. లాసాలో రెండో రన్‌వేను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాంతాల నుంచి యుద్ధ విమానాలను ప్రయోగిస్తే ఈశాన్య భూభాగాన్ని పూర్తిగా కవర్‌ చేయవచ్చని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు.

ఈశాన్య ప్రాంతం వెంబడి ఉన్న మెక్‌మోహన్‌ రేఖ అలాగే, అక్సాయి చిన్‌పై ఆధిపత్యం కోసం ఉద్దేశించిన మిషన్లను మరింత ముందుకు తీసుకెళ్లడానికే చైనా సరిహద్దుల్లో ఈ విధంగా యుద్ధ విమానాలను, డ్రోన్లను మోహరిస్తోందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. వివాదాస్పద ప్రాంతాల్లో భారత సైన్యం కదలికలను పసిగట్టేందుకే చైనా ఈ స్థాయిలో డ్రోన్లను మోహరించినట్టు కనిపిస్తోంది. అరుణాచల్​ ప్రదేశ్​ లోని తవాంగ్​ సెక్టార్​ వద్ద డిసెంబరు 9న భారత బలగాలతో ఘర్షణ జరిగిన నేపథ్యంలో బార్డర్​ లో చైనా దూకుడు పెంచింది. భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండే వైమానిక స్థావరాలను యాక్టివేట్​ చేసింది. ఇది వాస్తవమేనంటూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ఇటీవల కాలంలో అరుణాచల్​ ప్రదేశ్​ లోని భారత గగన తలంలో చైనా విమానాలు చక్కర్లు కొడుతూ రెండుసార్లు భారత సైన్యం కంటపడ్డాయి. ఈ తరుణంలో టిబెట్​ లోని ఎయిర్​ బేస్​ లలో చైనా ఆయుధ సంపత్తి మోహరించిందనే వార్తలు బయటికి రావడం కలకలం సృష్టిస్తోంది. బాంగ్డా, లాసా, షిగాత్సే వైమానిక స్థావరాలలో చైనా సిద్ధంగా ఉంచిన డ్రోన్ల జాబితాలో WZ-7 సోరింగ్​ డ్రాగన్​ అనే అత్యాధునిక డ్రోన్లు కూడా ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. నిర్విరామంగా గగనతలంలో 10 గంటల పాటు పహారా కాస్తూ ఎగరగల సామర్థ్యం WZ-7 సోరింగ్​ డ్రాగన్​ కు ఉంది. ఈ డ్రోన్​ నిర్దేశిత ప్రదేశాల గగన తలంలో తిరుగుతూ అక్కడి మ్యాపింగ్​, ఇమేజెస్​ ను సైనిక స్థావరానికి చేరవేస్తుంది. ఇది పంపించే మ్యాపింగ్​, ఇమేజెస్​ ఆధారంగా.. లక్ష్యం ఎంత దూరంలో ఉందనే దానిపై ఒక స్పష్టతతో సైన్యం క్షిపణులను ప్రయోగిస్తుంది. ఇక బార్డర్​ లో చైనా మోహరించిన సుఖోయ్​ ఎస్​యూ 27 యుద్ధ విమానాల డిజైనింగ్​ కు మూలం రష్యాకు చెందిన సుఖోయ్​ 30ఎంకేఐ ఫైటర్​ జెట్​.

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు దగ్గరగా చైనా ఎయిర్ బేస్ లలో భారీ మోహరింపులు సాగుతున్నాయా..?

దీనిలో పలు మార్పులు, చేర్పులు చేసి చైనా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన యుద్ధ విమానమే సుఖోయ్​ ఎస్​యూ 27. ఈ ప్రాంతంలో చైనా సమీకరించుకుని ఉన్న డ్రోన్లు అత్యంత శక్తివంతమైనవని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. చైనా వాయు సైన్యాన్ని సరైన విధంగా భారత భూభాగ స్థావరాలపైకి దాడికి పాల్పడేలా చేయడం, టార్గెట్‌లను వారు ఎంచుకునేలా చేయడం దెబ్బతీసేలా చేయడానికి ఈ డ్రోన్లు కీలకమైనవని వెల్లడైంది. సమయం చూసుకుని సుదూర, సమీప ప్రాంతాలపైకి దాడికి దిగగలిగేలా టార్గెట్లు ఎంచుకునేందుకు ఈ డ్రోన్లు అందించే డాటా ఆ తరువాత దాడికి ఆయువుపట్టు అవుతాయని నిపుణులు తెలిపారు. ఎంచుకున్న ప్రాంతాలపైకి ఇతర డ్రోన్లు, లేదా ఫైటర్ విమానాలకు సంధించిన క్షిపణులు, ఇతర ఆయుధాలతో దాడికి దిగేందుకు వీలు ఏర్పడుతుందని యుద్ధ క్షేత్ర వ్యవహారాల అనుభవజ్ఞులు స్పష్టం చేశారు. గత నెల 27వ తేదీనే చైనా ఏకంగా 10 ఫ్లాంకెర్ తరహా యుద్ధ విమానాలను షిగాసే ఎయిర్‌పోర్టు వద్ద సిద్ధం చేసుకుని ఉంది. వీటితో కెజె 500 వైమానిక పాటవ వ్యవస్థలు కూడా ఉన్నాయి.

2017 డోక్లామ్ ప్రతిష్టంభన తరువాత టిబెట్ ప్రాంతాన్ని ఎంచుకుని చైనా అత్యధికంగా బలగాలను మొహరించుకుంటూ వస్తోంది. ఇక్కడి ఫ్లాట్‌పాంలో దీర్ఘకాలికంగా బలోపేతం అవుతూ వస్తోన్న విమానబలగాలు ఇతర శక్తిసామర్థాలతో ఖచ్చితంగా భారత వైమానిక దళానికి ప్రధాన సవాలు ఏర్పడుతుందనే ఆందోళనను మిలిటరీ నిపుణులు వ్యక్తం చేశారు. బంగ్డా వద్ద చైనా బలగాల బలోపేతం పరిణామాలను భారతీయ సైనిక వర్గాలు తీవ్రంగానే తీసుకున్నాయి. చైనా ఎప్పటికప్పుడు భారతీయ వైమానిక దళం వ్యూహాలను, రాడార్ వ్యవస్థలను పసికట్టడం, ఎలక్ట్రానిక్ అతిక్రమణలకు పాల్పడుతూనే ఉందని వెల్లడైంది.

Must Read

spot_img