- ఆ నియోజకవర్గంలో హస్తం పార్టీలో గ్రూప్ తగాదాలు మరోసారి రచ్చ కెక్కాయి. ఒకరేమో నియోజకవర్గం మీద గట్టిపట్టున్న సీనియర్ నేత.
- ఇంకొకరు ముచ్చటగా మూడోసారి పోటీ చేసి గెలవాలని పట్టుదలతో ఉన్న యువనేత.
- గత దశాబ్ద కాలంగా.. ఉప్పూ-నిప్పూ లా వ్యవరిస్తూ వచ్చిన నేతల మధ్య వైరం మరోసారి బట్టబయలైంది.
- ఇంతకీ.. సీనియర్, జూనియర్ ల మధ్య వివాదానికి కారణమేంటి..?
సూర్యాపేట జిల్లా పరిధిలోని “తుంగతుర్తి” నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు మరోసారి వీధిన పడ్డాయి. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి “రాంరెడ్డి దామోదర్ రెడ్డి” వర్సెస్ టిపిసిసి కార్యదర్శి “అద్దంకి దయాకర్” అన్నట్లుగా సెగ్మెంట్లో గ్రూపులు కొనసాగుతున్నాయి. గతంలో వరసగా నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలవడమేకాదు.. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు దామోదర్ రెడ్డి అలియాస్ దామన్న.
అనంతరం 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో తుంగతుర్తి నియోజకవర్గం “S.C.” రిజర్వ్డ్ స్థానంగా మారింది. దీంతో.. అప్పటివరకు ఇక్కడ్నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన దామోదర్ రెడ్డి.. తన మకాంను సూర్యాపేటకు మార్చారు. అయినా ఇప్పటికీ తుంగతుర్తిలో తన కంటూ ఓ వర్గాన్ని, వ్యవస్థనూ ఏర్పాటు చేసుకున్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దామన్న సూచించిన వ్యక్తికి కాకుండా టీపీసీసీ లో కార్యదర్శిగా ఉన్న “అద్దంకి దయాకర్” కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చింది. అయితే ఈ రెండు ఎన్నికల్లో..TRS అభ్యర్థి “గాదరి కిషోర్” మీద స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు “అద్దంకి దయాకర్”. ఆయన ఓటమికి దామోదర్ రెడ్డి వర్గం తీరే కారణమని అప్పట్లో వార్తలు వెల్లువెత్తాయి.
తనకు పూర్తిస్థాయిలో సహకారం ఇవ్వలేదని అప్పట్లో అద్దంకి వర్గం సైతం అరోపణలు సైతం చేసింది. కొంతకాలం కిందట.. కాంగ్రెస్ సీనియర్ నాయకులైన దామోదర్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద AICC అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేసీ వేణు గోపాల్, మాణక్కం టాకూర్ లకు అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
ఈ రచ్చ ఇంకా సద్దుమణగకముందే అద్దంకి మరో బాంబ్ పేల్చారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీనుంచి సస్పెండైన వడ్డేపల్లి రవిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు.. మాజీమంత్రి, ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ అద్దంకి ఆరోపించారు.
అయితే సస్పెండైన వ్యక్తిని పార్టీలోకి తీసుకురావాలని దామన్న ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్య హాట్ టాపిక్ గా మారింది. తన ఓటమికి కారణమైన వ్యక్తిని పార్టీలోకి తీసుకొచ్చేలా.. ఏకంగా ముగ్గురు సీనియర్లైన రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు తెరవెనక కుట్రలు చేస్తున్నారంటూ.. AICC అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేసీ వేణు గోపాల్, మాణక్కం ఠాకూర్ లకు ఫిర్యాదు లేఖ పంపారు అద్దంకి.
ఈ లేఖాస్త్ర్రంతో.. తుంగతుర్తి నియోజకవర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నట్లైంది. ఈ రచ్చ తదనంతరం తాజాగా మరోసారి సీనియర్ కాంగ్రెస్ నేత దామోదర్ రెడ్డి, యువ నాయకుడు అద్దంకి దయాకర్ వర్గాల మధ్య ఘర్షణ షురూ అయింది. తిరుమలగిరి సమీపంలో. అద్దంకి దయాకర్ వర్గీయులు తుంగతుర్తి నియోజకవర్గంలో 200 మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే.. సమావేశానికి వచ్చే కార్యకర్తల కోసం టెంట్లు, కుర్చీలు, భోజన వసతి సైతం ఏర్పాటు చేశారు.
విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గీయులు.. అక్కడికి చేరుకొని అద్దంకి వర్గీయుల సమావేశ ఏర్పాట్లను చెల్లా చెదురు చేసి..సమావేశాన్ని భగ్నం చేశారు. ఎన్నికలు వస్తున్నాయనగానే వచ్చే నాయకుడు అద్దంకి దయాకర్.. అంటూ నినాదాలు చేస్తూ.. అద్దంకి వర్గీయులను సమావేశం పెట్టకూడదని అడ్డుకుని హెచ్చరించారట.. ఆఖరికి చేసేది లేక అద్దంకి దయాకర్ వర్గీయులు అన్ని సర్దుకొని వెనుతిరిగి వెళ్లిపోయారు. అయితే.. అద్దంకి దయాకర్ వర్గీయుల సమావేశాన్ని.. దామన్న వర్గీయులు భగ్నం చేసిన ఘటనతో తుంగతుర్తి కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు మరోసారి రోడ్డున పడ్డట్టయ్యింది.
కాగా ఈ సమావేశాన్ని భగ్నం చేయడం ద్వారా ఇటు అద్దంకి దయాకర్ కు, అటు సూర్యాపేటలో వేలు పెడుతున్న పటేల్ రమేష్ రెడ్డికి హెచ్చరికలు జారీ
చేసినట్లు అయ్యిందని దామన్న వర్గం భావిస్తోందట. అంతేకాదు పీసీసీ చీఫ్ రేవంత్ కు కూడా తన అసమ్మతిని తెలియజేసినట్లు అయ్యిందని అంటుందట. అయితే.. తమ సమావేశాన్ని దామోదర్ రెడ్డి వర్గీయులు భగ్నం చేయడం పట్ల అద్దంకి దయాకర్ తో పాటు.. ఆయన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని సమాచారం. తుంగతుర్తి నియోజకవర్గం ప్రాంతంలోని తన కార్యకర్తలతో పెట్టుకున్న సమావేశాన్ని దామోదర్ రెడ్డి వర్గీయులు భగ్నం చేసిన తీరు వారి దౌర్జన్యానికి నిదర్శనమని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అద్దంకి వర్గీయులు. దళిత నేతను అవమాన పరిచారంటూ దామోదర్ రెడ్డి వర్గంపై విమర్శలు చేస్తున్నారు. అసలు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో.. దామోదర్ రెడ్డి జోక్యం ఏంటని గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
- ఎన్నికల రచ్చ :-
అయితే వీరిద్దరి మధ్య రచ్చ .. 2018 ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించి రాకపోవడంతో టీఆర్ఎస్లో చేరిన వడ్డేపల్లి రవి రీ ఎంట్రీకి ప్రయత్నించడంతో, మరింత ముదిరిందని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న రవి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సపోర్ట్‌తో పార్టీలో చేరతారని టాక్ వెల్లువెత్తింది. దీంతో దీన్ని అడ్డుకునేందుకు .. అద్దంకి దూకుడు ప్రదర్శించి, అధిష్టానానికి లేఖలు రాశారని సమాచారం. 2014లో కాంగ్రెస్, టిఆర్‌ఎస్‌ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది.
ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ఉన్న దామోదర్ వర్గం, అద్దంకికి సపోర్ట్ ఇవ్వకపోవడంతో, స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో దామోదర్ తుంగతుర్తి టిక్కెట్ ను తన అనుచరుడు వడ్డేపల్లి రవికి టికెట్ ఇప్పించుకోవాలని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం అద్దంకికి టికెట్ ఇచ్చింది. దీంతో రవి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి, అద్దంకి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. దీంతో అప్పటినుంచి అద్దంకి .. రవి ఎంట్రీని వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈయన రేవంత్ వర్గంగా పేరు తెచ్చుకోవడంతో, ఈయనకు చెక్ పెట్టేందుకు .. సీనియర్లు దామన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు .. రవి ఎంట్రీకి పావులు కదుపుతున్నారన్న టాక్ వినిపించింది.
దీనిపై అధిష్టానానికి లేఖ రాసినా, స్పందించకపోవడం .. అద్దంకిని తీవ్ర ఆవేదనకు సైతం గురి చేసింది. అయితే ఈ అంశంపై స్పందించని హైకమాండ్ అద్దంకిపై షోకాజ్ నోటీసు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మరోసారి అద్దంకిని అడ్డుకునేందుకు దామన్న వర్గం ప్రయత్నించడం వీరిమధ్య వర్గపోరును మళ్లీ తెరపైకి తెచ్చిందన్న టాక్ వెల్లువెత్తుతోంది. దీంతో తాజా ఘటనతో .. అద్దంకి ఏం చేయనున్నారన్న చర్చ స్థానికంగా వినిపిస్తోంది.
మరోవైపు మరోసారి పోటీ చేసి, తన పట్టు నిరూపించుకోవాలని భావిస్తోన్న అద్దంకికి .. సొంత పార్టీలోనే ముఖ్యంగా సీనియర్ల నుంచి పెద్ద తలనెప్పి ఎదురుకానుందన్న చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అద్దంకి .. ఈ తాజా ఘటనపై ఏవిధంగా స్పందిస్తారన్నదే హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. మొత్తానికీ తుంగతుర్తిలో సీనియర్ పొలిటీషియన్ దామోదర్ రెడ్డి వర్సెస్ యువ నాయకుడు అద్దంకి దయాకర్ అన్నట్లుగా రాజకీయం నడుస్తుందట. ఈసారైనా కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకుని.. అద్దంకి, దామోదర్ రెడ్డిల మధ్య సయోధ్య కుదుర్చుతారో లేదోనన్నది జిల్లావ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తోంది.