భారత సరిహద్దుల వెంట చైనా తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడటం కొత్తేమీ కాదు. ఇటీవల తవాంగ్ సెక్టార్ లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు ఇరుదేశాలు అంగీకరించాయి.. ఇంతకూ ఈ ఘర్షణకు కారణం ఏంటి..?

భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నిస్తోన్న చైనా బలగాలకు భారత్ సమాధానం చెప్పగలదా..? తవాంగ్ సెక్టార్ ఘర్షణ తర్వాత గొడవలు మరింత తీవ్రరూపం దాల్చుతాయా..? చైనా కుట్ర కోణం భారత్ కు కళ్లెం వేయడమేనా..? ఈ గొడవ వెనక చైనా వ్యూహం ఏంటి..?
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ లో భారత్ – చైనా సైన్యాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు రెండు దేశాలు అంగీకరించాయి.
తమ భూభాగంలోకి పొరుగు దేశం సైన్యం చొరబడుతోందని ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
తవాంగ్ సెక్టార్ యాంగ్జే ప్రాంతంలోని వాస్తవాధీన రేఖను ఆక్రమించడం ద్వారా సరిహద్దుల్లోని యథాతథ స్థితిని మార్చేందుకు చైనా సైన్యం
ప్రయత్నించిందని పార్లమెంట్ లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు..
ఈ ఘర్షణలో భారత సైనికులు ఎవరూ చనిపోలేదని, ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని ఆయన వెల్లడించారు. ఇరు దేశాలకు చెందిన సైనికులూ గాయపడ్డారని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు స్పష్టంగా లేదు. ఈ అస్పష్టతే చాలా ప్రాంతాల్లో వివాదాలకు కారణం అవుతోంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో 90,000 చ.కి.మీ. భూమి తమదేనని చైనా అంటుండగా.. పశ్చిమాన అక్సాయ్ చిన్‌లో 38,000 చ.కి.మీ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని భారత్ చెబుతోంది.
భారత్ – చైనా బలగాల మధ్య తాజా ఘర్షణ డిసెంబర్ 9న జరిగింది. డిసెంబర్ 12న భారత మీడియాలో దీని గురించి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డిసెంబర్ 13న రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంట్‌లో దీనిపై ప్రకటన చేశారు.
చైనా విదేశాంగ మంత్రి దీని గురించి మాట్లాడుతూ పరిస్థితి అదుపులో ఉందని, ఇరు దేశాల మధ్య సరిహద్దు ఒప్పందాలను పాటించాలని భారత్‌ను చైనా అభ్యర్థిస్తోందని అన్నారు. అదే సమయంలో పీఎల్‌ఏ వెస్ట్రన్ థియేటర్ కమాండ్, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా భూభాగంలో సాధారణ పెట్రోలింగ్ చేస్తోంది. అప్పుడే భారత సైనికులు, చైనా భాగంలోకి ప్రవేశించి చైనా దళాలను ఆపడానికి ప్రయత్నించారు’’ అన్నారు చైనా సైన్యం అధికార ప్రతినిధి…
ఈ ఘటన జరిగిన నాలుగో రోజున చైనా స్పందించింది. గల్వాన్‌లో భారత్-చైనాల మధ్య ఘర్షణ జరిగినప్పుడు కూడా భారత్ నుంచి
ప్రకటన వచ్చేంత వరకు చైనా ఏమీ మాట్లాడలేదు.
ఈ ఘటన గురించి చైనా ఆలస్యంగా ప్రకటన చేయడానికి గల కారణాన్ని లండన్ వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, చైనా వ్యవహారాల నిపుణుడు దివ్యేశ్ ఆనంద్ వివరించారు.‘‘చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీకి మీడియాపై కఠినమైన నియంత్రణ ఉంది. వారు సున్నితమైన అంశాలుగా పరిగణించే సమస్యలపై వెంటనే వార్తలు ఇవ్వరు. ఏదైనా ఒక అంశంపై మొదట పార్టీ అభిప్రాయం స్పష్టంగా తెలిసినప్పుడు, ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత అక్కడి మీడియా దాని గురించి చెబుతుంది. చైనాలోని మీడియా మొత్తం ఆ అంశంపై ఒకే విధంగా మట్లాడుతుంది.. సరిహద్దుల్లో జరిగిన ఈ ఘర్షణ గురించి భారత
పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ప్రభుత్వంపై విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. మీడియాలో కూడా ఈ విషయాన్ని ప్రధానంగా ప్రచురించారు.
కానీ, చైనాలో ఎటువంటి హడావిడి లేదు. చైనా మీడియాలో కూడా దీనిగురించి పెద్దగా ప్రస్తావన లేదు. అసలు చైనాలో విపక్షమే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితే లేదు. ‘చైనా భౌగోళిక, రాజకీయ సమీకరణాల్లో భారత్ కు అంతగా ప్రాధాన్యం లేదు.
భారత సరిహద్దుల్లో చైనా ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలను ప్రోత్సహిస్తోందని భారత రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కానీ… భారత్ కు అలా కాదు. చైనాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఇలాంటి ఘటన గురించి భారత్ లో వచ్చినంత స్పందన చైనాలో రాదు.
భారత సరిహద్దుల్లో చైనా ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలను ప్రోత్సహిస్తోందని భారత రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
‘‘తవాంగ్ కు ఉత్తరాన 25 కి.మీ దూరంలో11-12 వేల అడుగుల ఎత్తున యాంగ్జే ఉంటుంది. ఇది ఒక పాత వివాదాస్పద ప్రాంతం. 1990వ దశకంలో భారత్, చైనా అధికారుల మధ్య చర్చలు ప్రారంభమైనప్పుడు కూడా… ఈ ప్రాంతాన్ని వివాదాస్పదంగానే భావించేవారు.
1999 జులై నెలలో కూడా చైనా ఈ ప్రాంతంలోకి చొరబడేందుకు ప్రయత్నించింది. అప్పుడు చైనాతో భారత సైనికులు పోరాడటంతో వారు వెనక్కి వెళ్లిపోయారు.
కానీ, ఇప్పుడు గల్వాన్ ఘటన జరిగిన రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ ఇక్కడ ఈ ఘర్షణ తలెత్తింది. ఇరు దేశాల మధ్య దౌత్యస్థాయిలో, సైన్యాల స్థాయిలో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ ఘర్షణ జరిగింది.
దీన్నిబట్టి చూస్తే చైనా తన వైఖరిని మార్చుకోలేదని, సరిహద్దులో తన తెలివితేటల్ని చూపిస్తుందని తెలుస్తోంది.
ఇప్పటికీ… భారత్ తమవేనని భావించే కొన్ని ప్రాంతాలని చైనా ఆక్రమించుకోవాలని అనుకుంటోంది.
గల్వాన్ ఘటన తర్వాత భారత్, చైనా రెండు దేశాలూ సరిహద్దుల్లో భద్రతా బలగాలను పెంచాయి. చైనా రాబోయే కాలంలో కూడా భారత్ పై మరింత ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది.

చైనా నుంచి ఇలాంటి కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. భారత్ వీటికి తగు విధంగా స్పందించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే, ఇలాంటి చిన్న చిన్న ఘటనలు కూడా తీవ్ర రూపం దాల్చవచ్చు. భారత్ దీనికి సిద్ధంగా ఉండాలి.. సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాలనే లక్ష్యంతో భారత్,
చైనా మధ్య రెండు ప్రత్యేక ఒప్పందాలు ఉన్నాయి.. వాటి ఉద్దేశం సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పడం. అయినప్పటికీ అక్కడ శాంతి స్థాపన జరగలేదు.
గల్వాన్ ఘటన జరిగింది. దీనికంటే ముందు డోక్లామ్, ఇప్పుడు తవాంగ్ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీనికి కారణం ఏంటంటే చైనా.. భారత్‌ను బలహీనదేశంగా పరిగణిస్తోంది. తన ఇష్టానుసారం సరిహద్దులను నిర్ణయించాలని భావిస్తుంది.
కానీ, ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు చైనా ముందు భారత్ తలవంచదు..
భారత్, చైనాలు పరస్పరం శత్రువులుగా భావిస్తాయి. అదే భావనతో ఒకరికొకరు పోటీ పడుతుంటాయి. కానీ చైనా, భారత్ ను తనకు సరైన ప్రత్యర్థిగా భావించదు. తమతో పోటీ పడేంత శక్తి భారత్‌కు లేదని చైనా అనుకుంటుంది. ‘అయితే తాము శక్తిమంతులం, దక్షిణాసియాలో తమను ప్రధాన శక్తిగా పరిగణించాలనేది భారత్ వాదన.’
కానీ, చైనా దీన్ని అంగీకరించదు. తాము ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి అమెరికాతో పోటీ పడుతున్నామని చైనా భావించుకుంటుంది. అలాంటప్పుడు భారత్‌తో తాము పోటీ పడటం ఎలా సాధ్యమవుతుందని అనుకుంటుంది. ఇదే కారణంతో చైనా తమని తాము భారత్ కంటే గొప్ప దేశంగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది.. భారత్ – చైనాల మధ్య ఈ గొడవ అకస్మాత్తుగా జరగలేదని, దీని వెనుక చైనా వ్యూహం ఏదైనా ఉండవచ్చని భారతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
‘‘చైనా ఉద్దేశపూర్వకంగా, బాగా ఆలోచించే ఈ పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యే వరకు ఇది కొనసాగుతుంది. చైనా వాస్తవాధీన రేఖను మ్యాప్‌లో గుర్తించడానికి ఇష్టపడదు. వాస్తవాధీన రేఖను చైనా అంగీకరించేంత వరకు ఈ ఘర్షణలు కొనసాగే అవకాశం ఉంది.
ఇది చైనా ప్రణాళికలో భాగం. చైనా ప్రణాళిక లేకుండా ఏమీ చేయదు. చైనా విధానం పూర్తి సన్నద్ధతతో ప్రత్యర్థి మీదకు వెళ్లడం చైనా విధానం. కోపంతో లేదా ఆక్రోశంతో చైనా ఎలాంటి పనులు చేయదు. బాగా ఆలోచించే చైనా ఏ పనులైనా చేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. చైనాలో జీరో కోవిడ్ విధానం కారణంగా అధ్యక్షుడు షి జిన్‌పింగ్వ్య తిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయాల్లో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తితే వాటి ఉద్దేశం, దేశంలోని అంతర్గత వ్యవహారాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడమే అని అందరూ భావిస్తారు.
అయితే ఈ వాదనను విశ్లేషకులు తోసిపుచ్చుతున్నారు. ‘‘జీరో కోవిడ్ విధానం కారణంగా తనపై వచ్చిన వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ ఘర్షణలు తలెత్తాయనే సరళమైన ముగింపును దీనికి ఇవ్వకూడదు. సరిహద్దు సైనికీకరణ వంటివి మరింత సరైన కారణం కావొచ్చు..
సరిహద్దు వెంబడి భారత్ భద్రతా బలగాల సంఖ్యను పెంచింది. భద్రతా మౌలిక సదుపాయాలను పటిష్టం చేసింది. నిఘాను కఠినతరం చేసింది. ఇప్పుడు సరిహద్దుల్లో పరిస్థితులు మారిపోయాయని, చైనా వ్యూహానికి భారత సైన్యం దీటైన బదులు ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటన అకస్మాత్తుగా జరగలేదు. దీని వెనుక ఒక ప్రణాళిక ఉంది. ప్రణాళిక, అంచనా వేసిన తర్వాతే చైనా ఇలా చేస్తుంది.
భారత్ బలహీనంగా కనిపించిన చోట భూభాగాన్ని ఆక్రమించడానికి చైనా ప్రయత్నిస్తుంది. చైనా నెమ్మది నెమ్మదిగా ముందుకు సాగుతోంది..
కానీ, ఇప్పుడు కాలం మారింది. భారత్ వద్ద నిఘా సాంకేతికత, ఉపగ్రహ చిత్రాలు ఉన్నాయి. వీటి ద్వారా చైనా కదలికలు భారత్ దృష్టిలోకి వస్తాయి. ఇప్పుడు చైనా ఉన్నపళంగా తవాంగ్‌లోకి చొరబడలేదు. అలాంటి ప్రయత్నం చేస్తే భారత్ నుంచి దీటుగా స్పందిస్తుంది. భారత సైన్యం, రాజకీయ నాయకత్వం, పోరాడగల సామర్థ్యం ఇలా చాలా రంగాల్లో భారత్ ఇప్పుడు బలంగా తయారైంది.
చైనా కచ్చితంగా ప్రణాళికతోనే ఈ ఘర్షణకు దిగింది. భారత్ తగు సమాధానం చెప్పడంతోనే చైనా సైనికులకు నష్టం జరిగింది.
భారత్-చైనాల మధ్య ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా చైనాకు భారత్ దీటుగా బదులిచ్చిందని భారత మీడియాలో ప్రచారం జరుగుతుంది. భారత్‌కు
పెరుగుతున్న శక్తిని చూసి చైనా భయపడుతోందని వార్తలు వస్తున్నాయి.
అయితే.. భారత్‌ను చూసి చైనా భయపడుతుందనే వాదన సరైనది కాదనేది విశ్లేషకుల అభిప్రాయం.. అమెరికాపై భరోసాతో భారత్, చైనాకు సవాలు విసురుతోంది. కానీ, ఏదైనా జరిగితే నష్టం జరిగేది భారత్‌కే. ఎందుకంటే, చైనాతో పోటీపడటానికి సరిపడా ఆర్థిక శక్తి, సాంకేతికత, సైనిక శక్తి భారత్ వద్ద లేదు. సాంకేతికత, సైనిక శక్తి విషయాల్లో భారత్, ఇతర దేశాలపై ఆధారపడి ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ కూడా చైనా అంత బలంగా లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో భారత్, చైనాకు సవాలు విసిరితే ఉద్రిక్తతలు పెరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.. ఆసియాలో భారత్, చైనాలు ముఖ్యమైన దేశాలు, సైన్యం పరంగా శక్తిమంతమైనవి. దక్షిణాసియాలో ప్రభావం చూపడంపై ఈ రెండు దేశాల మధ్య పోటీ కూడా ఉంది.
రెండు దేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే, ద్వైపాక్షిక సంబంధాలు గాడినపడతాయని భారత అధికారులు చెబుతున్నారు.
అయితే, 2020 జూన్‌లో గల్వాన్ లోయలో రెండు దేశాల మధ్య ఘర్షణతో పరిస్థితులు మరింత దిగజారాయి. రెండు దేశాలు సరిహద్దుల్లో తమ సైనిక శక్తిని పెంచుకుంటున్నాయి.
ఈ పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉంటుందని విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘వ్యూహాత్మకంగా చూస్తే, భారత్-చైనా ముఖాముఖి తలపడుతున్నట్లు కనిపిస్తున్నాయి. నిజానికి భారత్‌పై చైనా అలాంటి పరిస్థితులు సృష్టించి ఒత్తిడి తీసుకువస్తోంది. ఇలాంటి కవ్వింపులు చైనా నుంచి మరిన్ని రావొచ్చు. వీటిపై దీటుగా భారత్ స్పందించాల్సి ఉంటుంది. అయితే, ఒక్కోసారి చిన్నచిన్న ఘటనలే పెద్దపెద్దగా మారిపోతుంటాయి. అన్నింటికీ భారత్ సిద్ధంగా ఉండాలి..
ఇటు భారత్, అటు చైనా రెండు దేశాల్లోనూ జాతీయవాదం మరింత వెళ్లూనుకుంటోంది..
ఇరు దేశాల్లోని అంతర్గత పరిస్థితులు కూడా సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణం అవుతున్నాయి. అయితే, పరిస్థితులు సద్దుమణిగేలా చేసేందుకు రెండు దేశాలు కృషిచేయడం లేదని కొందరు నిపుణులు అంటున్నారు.
‘‘పరిస్థితులను సద్దుమణిగేలా చేసేందుకు రెండు దేశాలు నిబద్ధతతో పనిచేయడం లేదు. నిజాయతీతో పనిచేస్తేనే సరిహద్దుల్లో శాంతి నెలకొంటుంది…
సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే రెండు దేశాల మధ్య సంబంధాలు గాడినపడతాయని ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్
వ్యాఖ్యలు చేశారు… గల్వాన్ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నట్లు ఇప్పుడు జరగకపోవచ్చు. ఎందుకంటే గల్వాన్‌లో భారత భూమిని ఆక్రమించారు. కానీ తవాంగ్‌లో అలా జరగలేదు.
గస్తీ కాస్తున్నప్పుడు ఇలాంటి ఘర్షణలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత శాంతి నెలకొంటుంది. ఇక్కడ ఇక్కడ తవాంగ్ లో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.. చైనాను ఇబ్బంది పెట్టే దిశగా భారత్ ఇటీవల కాలంలో చాలా చర్యలు తీసుకుందని, కొన్ని అంశాల్లో చైనాను విమర్శిస్తూ భారత నాయకులు వ్యాఖ్యలు చేశారని విదేశాంగ నిపుణులు అంటున్నారు.
‘‘భారత్ లేదా మరికొన్ని దేశాల విషయంలో చైనా కొన్ని రెడ్ లైన్‌లను పెట్టుకుంది. దీనిలోనే వన్ చైనా పాలసీ కూడా ఒకటి. టిబెట్, తైవాన్‌లను తమ భూభాగంలో అంతర్భాగంగా చైనా పరిగణిస్తుంది. ఈ విధానాన్ని భారత్ గౌరవించాలని చైనా అధికారులు మీడియా ముందు ప్రకటనలు కూడా చేశారు. కానీ, భారత్ ఆ ఒత్తిళ్లకు తలొగ్గదు. క్వాడ్ కూటమిలో భాగంగా భారత్ సైనిక విన్యాసాలు కూడా చేపడుతోంది. అయితే, తమకు వ్యతిరేకంగానే ఇవి నిర్వహిస్తున్నారని చైనా భావిస్తోంది.
మరోవైపు లద్దాఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ.. టిబెట్‌తో సరిహద్దులను భారత్ మరోసారి నొక్కిచెప్పింది. నిజానికి ఈ ప్రాంతంలో సరిహద్దుల విషయంలో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. బ్రిటిష్ కాలంలో ఇక్కడి సరిహద్దులు అస్పష్టంగా ఉండేవి. ఆ తర్వాత కూడా అదే పరిస్థితులు కొనసాగాయి.
అయితే, లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ ఇక్కడి ప్రాంతాలను భారత్ తమలో కలుపుకునే ప్రయత్నం చేస్తోందని చైనా భావిస్తోంది..
దక్షిణాసియాలో పెరుగుతున్న భారత్ ప్రాబల్యానికి కళ్లెం వేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు కూడా తాజా ఘర్షణల వెనుక కారణంగా ఉండొచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
దక్షిణాసియా సహకార సంఘంలో భారత్ ముఖ్యమైన దేశం. అయితే, ఈ కూటమిలో చోటు కోసం చైనా ప్రయత్నిస్తోంది. దీనికి పాకిస్తాన్ సాయం చేస్తోంది.
ప్రస్తుతం సార్క్‌కు భారత్ అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి పెడుతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో భారత్ సంబంధాలు చాలా బావున్నాయి. శ్రీలంకతో సంబంధాలు కూడా బలోపేతం అవుతున్నాయి. మియన్మార్‌తో సంబంధాలను కూడా భారత్ మెరుగుపరచుకుంటోంది. మరోవైపు అఫ్గానిస్తాన్‌లో భారత్ ప్రాబల్యం కూడా పెరుగుతోంది. ఈ ప్రాంతంలోని అన్ని దేశాలతోనూ భారత్ ప్రాబల్యం పెరుగుతోంది.
దీనికి కళ్లెం వేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది.. భారత్ ఏదైనా సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. మధ్యలోకి చైనా వస్తుంది. తన ఆర్థిక, సైనిక శక్తులతో పాటు టెక్నాలజీ ఉపయోగించి పరిస్థితులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ కూడా దీనికి దీటుగా స్పందిస్తోంది.
ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని భారత్ గుర్తించడం లేదు. రెండు దేశాల మధ్య ఘర్షణకు ఇదొక ప్రధాన కారణం. చైనా శక్తిని భారత్ గుర్తిస్తే, రెండు
దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంతవరకు తగ్గొచ్చు.. భారత్, చైనాల సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉండొచ్చు, కానీ, రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇప్పటికీ చాలా వస్తువులను చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది.
2021-2022లో 94.2 బిలియన్ డాలర్ల వస్తువులను చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. వార్షిక దిగుమతుల్లో ఈ వాటా 15 శాతం వరకూ ఉంటోంది.
భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను పరిశీలిస్తే, చైనా దిగుమతులపై భారత్ ఆధారపడటం పెరుగుతోందనేది స్పష్టం అవుతోంది.
భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, రెండు దేశాల మధ్య 2021-22లో 115 బిలియన్ డాలర్ల వాణిజ్యం నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇది 86 బిలియన్ డాలర్లు. రెండు దేశాల మధ్య వివాదం మొదట్నుంచీ ఉంది. అయినప్పటికీ సంబంధాలను సద్దుమణిగించే దిశగా భారత్ చర్యలు తీసుకుంది. శాంతి స్థాపనకు రెండు దేశాలూ ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి.
భారత్, చైనాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం కావడానికి ఇది కూడా ఒక కారణం. కానీ, గల్వాన్ తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. అయినప్పటికీ ఈ మార్పు ఆర్థిక సంబంధాల్లో కనిపించలేదు..
‘‘రెండు దేశాలకూ ఒకరి అవసరం మరొకరికి ఉంది. భవిష్యత్‌లో రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలు లేకపోలేదు..
మరోవైపు సరిహద్దుల్లో పరిణామాలు వాణిజ్యంపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు..
యాంకర్ ఎండ్: దక్షిణాసియాలో పెరుగుతున్న భారత్ ప్రాబల్యానికి కళ్లెం వేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు కూడా తాజా ఘర్షణల వెనుక కారణంగా ఉండొచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. డ్రాగన్ కంట్రీ ప్రయత్నాలకు భారత్ ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే వస్తోంది..