Homeఅంతర్జాతీయంఅమెరికాలోని భారతీయుల్లో టెన్షన్ టెన్షన్

అమెరికాలోని భారతీయుల్లో టెన్షన్ టెన్షన్

ఉద్యోగాల కోతతో అల్లాడుతోన్న భారత టెక్కీలకు .. తోటివారే .. కొండంత అండగా నిలబడుతున్నారు. జాబ్ రిఫరెన్స్ లతో, ఇంటర్వ్యూలతో మద్ధతు
పలుకుతున్నారు. సోషల్ మీడియాలో గ్రూపుల ద్వారా .. సహకారం అందిస్తున్నారు

ఉద్యోగం లేకుంటే, 60 రోజుల్లో స్వదేశానికి తిరుగుప్రయాణం అవ్వాలి.. ఇదే ఇప్పుడు .. అమెరికాలోని భారతీయుల్లో టెన్షన్ పెడుతోంది. ఈ సమయంలో మేమున్నామంటూ .. తోటి భారతీయులు .. ఉద్యోగార్థులకు సహాయం చేస్తున్నారు.

అమెరికాలో ఉద్యోగం లేకుంటే, 60 రోజుల్లో స్వదేశానికి తిరుగుప్రయాణం అవ్వాలి

అమెరికాలో తాత్కాలిక వీసాలపై పనిచేస్తూ ఇటీవల ఉద్యోగాలను కోల్పోయిన వేలాది మంది భారతీయులకు తమ సహోద్యోగులు అండగా నిలుస్తున్నారు. మరో ఉద్యోగాన్ని వెదుక్కోవడంలో, అమెరికాలోనే కొనసాగే విషయంలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులకు అక్కడివారు సహకారం అందిస్తున్నారు. ఉద్యోగ కోతల్లో ఉద్యోగం పోయిన తమ తోటి వారికి మంచి జాబ్ కోసం రిఫరెన్స్ లు అందిస్తున్నారు.

ఉద్యోగాలు కోల్పోయిన టెక్కీలు కొత్త ఉద్యోగాన్ని సాధించడంలో అక్కడివారు తమ నెట్‌వర్క్‌లను ఉపయోగించి సాయపడుతున్నారు. లింక్డిన్‌లో ఉన్న ఇప్పటివరకు తమకు తెలియని హైరింగ్ మేనేజర్లు, ఇంజనీర్లకు ప్రొఫైల్ పంపడంతో కొన్ని ఇంటర్వ్యూ అవకాశాలు లభిస్తున్నాయని బాధిత టెక్కీలు చెబుతున్నారు. అమెరికాలోని టెక్ సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగించాయి.

ఇలాంటి వారికి సహాయం చేయడం కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో పుట్టుకొచ్చిన గ్రూపుల ద్వారా ప్రయోజనం లభిస్తోంది. ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో గత రెండు నెలల్లో మెటా, ట్విటర్, ఆమెజాన్ వంటి సంస్థలు వేలాది మంది సిబ్బందిని తొలగించాయి. ఈ తొలగింపుల ప్రభావం హెచ్1బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయులపై పడింది. విదేశీయులు ఆరేళ్ల వరకు యూఎస్ కంపెనీల్లో ఉద్యోగాల్లో పనిచేయడానికి ఈ వీసా అనుమతిస్తుంది.

ఈ వీసా తీసుకొని అమెరికా వెళ్లి ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన వారు 60 రోజుల్లోనే మరో ఉద్యోగంలో చేరాలి లేదా అమెరికా నుంచి వచ్చేయాల్సి ఉంటుంది. భారతీయులు ఎదుర్కొంటున్న ఈ అనిశ్చితిని అర్థం చేసుకున్న అమెరికాలోని సహోద్యోగులు, గడువు లోగా భారత టెక్కీలు మరో ఉద్యోగంలో చేరేలా సహకారం అందిస్తున్నారు. సహ ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన సందేశాలను పంపుతున్నారు. ఉద్యోగ అవకాశాలను పోస్టు చేస్తున్నారు.

తమ వ్యక్తిగత నెట్‌వర్క్‌లలో ఉన్న ఇమ్మిగ్రేషన్ లాయర్లను తోటి వారి కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన టెకీలు సహాయం కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మద్దతు గ్రూపులను ఆశ్రయిస్తున్నారు. ఉద్యోగార్థులను కంపెనీల యజమానులతో కనెక్ట్ చేయడానికి విధి అగర్వాల్, శ్రుతి ఆనంద్‌ కలిసి ఒక డేటాబేస్ రూపొందించారు.

వీరిద్దరూ కూడా హెచ్1బీ వీసాపై ఒక టెక్ కంపెనీలో పని చేస్తున్నారు. బాధిత టెక్కీల రెజ్యూమ్‌లు పరిశీలిస్తే వారు బాగా చదువుకున్నవారు, మంచి నైపుణ్యాలు ఉన్న టెక్కీలు, రూ. 2కోట్ల వేతనం అందుకునేవారని అర్థమైంది. అందుబాటులో ఉన్న టాలెంట్ నుంచి మా కంపెనీతో పాటు ఇతర కంపెనీలు కూడా ఉద్యోగులను చేర్చుకునే అవకాశముంది. అందుకే రిఫరల్స్, ఇంటర్వ్యూలు త్వరగా పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే, హెచ్1బీ వీసా హోల్డర్ల సమయం చాలా తక్కువ ఉంది. ఈ పరిమితి గురించి హైరింగ్ మేనేజర్లు అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది ఇంటర్వ్యూలు వేగంగా జరుగుతున్నాయి.

వీరి ప్రయత్నాల వల్ల ఉద్యోగార్థులకు మంచి జాబ్ కోసం రిఫరెన్స్ లభిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తోటి ఉద్యోగుల నుంచి అందుతున్న మద్దతుతో చాలా ధైర్యంగా ఉందని బాధిత టెక్కీలు అంటున్నారు. అంతేగాక మరికొందరు .. ఉద్యోగాలు కోల్పోయిన వారికి సాయం చేయడానికి ఈవెంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తర కాలిఫోర్నియాలో ‘ఆస్క్ మి ఎనీథింగ్’ కార్యక్రమాన్ని ఐఐటీ బే ఏరియా పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహించింది.

ఇందులో వీసా విధానాలు, ఉద్యోగి హక్కులు, ఇతర సమస్యల గురించి ఉద్యోగులకు అవగాహన కలిగించారు. హెచ్1బీ వీసాలు ఉన్న ఉద్యోగులు వాట్సాప్ గ్రూప్‌లో ఇలాంటి సందేహాలు అడగడంతో ఆయన ఈ ఈవెంట్‌ ఏర్పాటుచేశారు.

అమెరికాలో టెక్ ఆధారిత కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

అమెరికాలో తాత్కాలికంగా ఉండటానికి అనుమతించే విజిటర్స్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, హెచ్1బీ వీసాదారులు మరికొంతకాలం ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వీలు కలుగుతుంది. సామూహిక తొలగింపుల తర్వాత అందుబాటులోకి వచ్చిన విదేశీ ప్రతిభను ఆకర్షించడానికి కొన్ని అమెరికా నగరాలు ఆసక్తిగా ఉన్నాయి. ఉద్యోగార్థులను, కంపెనీలతో అనుసంధానించే ప్లాట్‌ఫారమ్ అయిన జెనోను ప్రారంభించారు. విదేశీ ప్రతిభను
ఆకర్షించడం ద్వారా పలు కంపెనీలు ఉద్యోగవకాశాల్ని అందిస్తున్నాయి.

కొన్నిపెద్ద టెక్ కంపెనీలు భారీ లే-ఆఫ్‌లను ప్రకటించిన తర్వాత టెక్ఉ ద్యోగుల పరిస్థితిని, వారి ఆసక్తిని గమనించి వెంటనే జెనోను ప్రారంభించారు. తొలిగింపుల తర్వాత ఆర్థిక నిర్వహణ క్లిష్టంగా మారినందున వినియోగదారులకు నగదు ఆదా చేయడంలో సహాయపడటానికి ఇటీవల ప్లాట్‌ఫాంకు కొన్ని కొత్త టూల్స్ అందుబాటులోకి తెచ్చారు. వారికి ప్లాట్ఫాం లో ఉన్న జెనో “డూ-ఇట్-యువర్ సెల్ఫ్ ప్లస్ ఎక్స్‌పర్ట్ సపోర్ట్ సిస్టమ్” సాయం చేస్తుంది. వరుసగా అమెరికాలో టెక్ ఆధారిత కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

దీని వల్ల భారతీయ టెక్కీలు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా H1-B వీసాలను కలిగి ఉన్న ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. తక్కువ సమయంలో మరో ఉద్యోగం ఎతుక్కోవటం కష్టతరంగా తయారైంది. క్రంచ్‌బేస్ అంచనా ప్రకారం 2022లో ఇప్పటి వరకు అమెరికన్ కంపెనీల వల్ల దాదాపు 52 వేల మంది కంటే ఎక్కువ టెక్కీలు ఉద్యోగాలకు దూరమవుతారని పేర్కొంది. ఇందుకు తీవ్రమైన ఆర్థిక మాంద్యమే కారణమని తెలిపింది. ప్రధానంగా ట్విట్టర్, స్ట్రైప్, సేల్స్‌ఫోర్స్, లిఫ్ట్, స్పాటిఫై, పెలోటన్, నెట్‌ఫ్లిక్స్, రాబిన్ హుడ్, ఇన్‌స్టాగ్రామ్, ఉడాసిటీ, బుకింగ్.కామ్, జిల్లో, లూమ్, బియాండ్‌మీట్ వంటి టెక్ కంపెనీల్లో ఈ తొలగింపులు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.

కరోనా మహమ్మారి కారణంగా విజృంభించిన స్టార్టప్‌లు మళ్లీ కోలుకోవడం ప్రారంభించాయి. అయితే మళ్లీ మాంద్యం ప్రభావంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లేందుకు నిధుల సేకరణ వాటికి కష్టతరంగా మారింది. ఇది టెక్ స్టార్టప్ స్టాక్స్ పై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా భారతీయ ఎడ్‌టెక్ స్టార్టప్‌లు భారీగా తొలగింపులు చేస్తున్నాయి. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా 11 వేలమందికి పైగా ఉద్వాసన పలకగా, ఇందులో దాదాపు 1000 మంది భారతీయులు ఉన్నారు. ఇక అమెజాన్ తొలగించే ఉద్యోగుల శాతం లో అధికంగా భారతీయులు ఉన్నారు.

ఈ ఉద్వాసనల ఫలితం భారతీయుల మీదే ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తోంది.. ఆయా కంపెనీల వీసాలపై అమెరికా, ఇతర దేశాలకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అమెరికాలో హెచ్_1 బి వీసా పై ఉద్యోగం చేసే వారిని కంపెనీ తొలగిస్తే వారు 60 రోజుల్లోగా మరో సంస్థలో ఉద్యోగం చూసుకోవాలి.

లేదా స్వదేశానికి వెళ్ళిపోవాలి. ఇక ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగుల్లో 50 శాతం మంది అంటే 3,700 మంది ఉద్యోగులను ఒకేసారి తీసి అవతల పడేసాడు. ఇందులో భారతీయులు గణనీయంగా ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోతున్న టెకీల కుచేయూత అందించేందుకు వందేళ్ల చరిత్ర ఉన్న జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ ముందుకు వచ్చింది. ఇది బ్రిటిష్ ఆటోమేటిక్ సంస్థ అయినప్పటికీ.. దీనిని టాటా కంపెనీలు సొంతం చేసుకున్నాయి.

తాజా సంక్షోభం నేపథ్యంలో.. సెల్ఫ్ డ్రైవింగ్, ఎలక్ట్రిఫికేషన్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ విభాగాలకు చెందిన 800 ఉద్యోగాలు తమ సంస్థలో ఖాళీగా ఉన్నాయని, వాటిని ఉద్యోగాలు కోల్పోయిన టెకీలకు ఇస్తామని ప్రకటించింది. ఇలా కొన్ని కంపెనీలు ముందుకు వస్తే ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుంది.

కన్నవారికి.. పుట్టిన గడ్డకు దూరంగా ఉన్నా.. మనమందరం సహోదరులమేనంటూ .. ఉద్యోగాలు కోల్పోయిన వారికి .. తోటి భారతీయులు అండగా
నిలుస్తున్నారు.

Must Read

spot_img