ప్రకాశంజిల్లాలోని దర్శి నియోజకవర్గం తెలుగుదేశంపార్టీలో ఆయోమయం నెలకొంది. నియోజకవర్గంలో టిడిపికి ఇంచార్టి లేకపోవడంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. గత ఎన్నికల ముందు వరకు నియోజకవర్గంలో బలంగా వున్న తెలుగుదేశంపార్టీ ప్రస్తుతం చుక్కానిలేని నావలా తయారైంది. నియోజకవర్గ ఇంచార్జ్ లేకపోవడంతో క్యాడర్ సతమతమవుతోంది. 2014 ఎన్నికల్లో దర్శి ఎమ్మెల్యేగా తెలుగుదేశంపార్టీ నుంచి శిద్దా రాఘవరావు గెలిచారు. బాబు తన మంత్రి వర్గంలో శిద్దా రాఘవరావుకు మంత్రి పదవి ఇచ్చారు.
తన హయాంలో శిద్దా రాఘవరావు నియోజకవర్గ అభివృద్దికి కృషి చేశారు. అయితే 2019 ఎన్నికల్లో జరిగిన రాజకీయ మార్పులతో తెలుగుదేశం పార్టీ నుంచి ఒంగోలు ఎంపి అభ్యర్ధిగా శిద్దా రాఘవరావు పోటీ చేయాల్సి రావడంతో, కనిగిరి ఎమ్ఎల్ఎగా వున్న కదిరి బాబురావుకు దర్శి టిక్కెట్టు కేటాయించారు. దీంతో తనకు దర్శి టిక్కెట్టు కేటాయించడంపై కదిరి బాబురావు అప్పటిలో అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. దర్శిలో తాను ఓడిపోతానని తెలిసినా, అధిష్టాన నిర్ణయం ప్రకారం తప్పనిసరి పరిస్ధితుల్లో కదిరి బాబురావు ఎన్నికల బరిలో దిగార.
అయితే ఆఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి మద్దిశెట్టి వేణుగోపాల్ చేతిలో కదిరి బాబురావు ఓడిపోయారు. అప్పటి నుండి పార్టీ అధిష్టానంపై గుర్రుగా వున్న కదిరి .. ఓటమి అనంతరం నియోజకవర్గంలో పార్టీకి దూరంగా వుంటూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరు పై వ్యతిరేకంగా వున్న శిద్దా రాఘవరావు, కదిరిబాబురావులు వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు.అప్పటి నుంచి దర్శి నియోజకవర్గం తెలుగుదేశంపార్టీలో గందరగోళం నెలకొంది. నియోజకవర్గంలో తమను నడిపించే నేత లేకపోవడంతో తెలుగుతమ్ముళ్లలో అయోమయం వ్యక్తమవుతోంది. ఇంచార్జ్ నియామకం విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ క్యాడర్ అధికారపార్టీ వైపుకు వెళ్ళిపోసాగింది.
దీంతో నియోజకవర్గంలో పార్టీని గాడిలో పెట్టేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. పమిడి రమేష్ కు పార్టీ నియోజకవర్గ భాద్యతలు అప్పగించింది. గతంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన రమేష్ ఇంచార్జి భాద్యతలు తీసుకున్న అనంతరం సమర్దవంతంగానే పనిచేశారన్న పేరు తెచ్చుకోగలిగారు. నగర పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో పార్టీ ఓడినా దర్శిలో మాత్రం తెలుగుదేశంపార్టీ ఒన్ సైడ్ విక్టరీని సాధించింది.. అయితే ఈ విజయానికి జిల్లా టీడీపీ శ్రేణులు మొత్తం కదిలి రావటం.. అందరూ కలసి సమిష్టిగా పనిచేసి పార్టీకి విజయాన్ని అందించటంతో కుప్పంలో ఓడినా అక్కడ మాత్రం గెలిచామన్న సంతృష్తిని ఆ పార్టీకి మిగిలింది.
దీంతోపాటు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడవంటూ పమిడి రమేష్ ను పార్టీ అధిష్టానం అభినందించింది. ఒంగోలులో జరిగిన మహానాడులో కూడా చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు.ఇంత వరకూ అంతా బాగానే ఉన్నా మహానాడు అనంతరం దర్శి నియోజకవర్గంలో గందరగోళ పరిస్దితులు ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో దర్శి టిక్కెట్టు ఆశించి పనిచేసుకుంటున్న పమిడి రమేష్ కు పార్టీ నుంచి ఎలాంటి హమీ లభించకపోవడంతో పాటు దుబాయ్ లో ఉంటున్న సుబ్బారావు అనే వ్యక్తి సినీనటుడు బాలకృష్ణతో కలసి చంద్రబాబును కలవటం.. అవకాశం ఇస్తే దర్శి నుండి పోటీ చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ముందు చెప్పటం …
దర్శి ఇంచార్జ్ గా దుబాయ్ సుబ్బారావును నియమించనున్నారన్న ప్రచారంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది.దర్శి విషయంలో పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై పమిడి రమేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్దికి ఎంత చేస్తున్నా పార్టీ అధిష్టానం తనను గుర్తించడం లేదని సన్నిహితుల వద్ద వాపోయారు. పార్టీ అధినేత సైతం తనను పట్టించు కోకపోవడంతో బాధ్యతల నుంచి తప్పుకుంటునట్లు బహిరంగంగానే చెప్పారు. అంతేకాకుండా నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేశారు.
పమిడి రమేష్ రాజీనామాతో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మరో కొన్ని నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ బాధ్యతలు మోసేవారు కరువవడం పట్ల క్యాడర్ వేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం దర్శినియోజకవర్గ ఇంచార్జ్ విషయంలో ఏదో అధిష్టానం నిర్ణయం వెల్లడించాలని కార్యకర్తలతో పాటు జిల్లా నేతలు కోరుతున్నారు. వీటన్నింటికీ తోడు టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరితే జనసేనకు దర్శి టికెట్ కేటాయించవచ్చన్న ప్రచారం కూడా ఊపందుకుంది.
దీంతో ఈ వ్యవహారం టిడిపి శ్రేణుల్లో మరింత అయోమయానికి గురిచేస్తోంది. అయితే మరెంతకాలం ఈ ప్రతిష్టంబన అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది. ఇలాగే కొనసాగితే పార్టీకి ఇబ్బందులు తప్పవని.. ప్రత్యర్దులు రంగంలోకి దిగితే లెక్కలు మారిపోతాయని క్యాడర్ బాహటంగానే చర్చించుకుంటుంది. ఇంత జరుగుతున్నా టిడిపి అధిష్టానం నోరు మొదపక పోవటం కేడర్ ను మరింత అయోమయానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే, దర్శి నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అలాంటి కోటలో జెండా ఎగరేసింది తెలుగుదేశం పార్టీ.
1955 నుంచి 2019 మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగితే.. టీడీపీ నాలుగుసార్లు, వైసీపీ ఒకసారి, మిగతా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 2014లో శిద్ధా రాఘవరావు టీడీపీ నుంచి గెలుపొంది, మంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో సైలెంట్ అయ్యారు. దీంతో 2019 ఎన్నికల్లో కదిరి బాబురావుకు.. చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. అప్పటినుంచి పమిడి రమేష్ బాధ్యతలు తీసుకున్నారు. కానీ.. ఆయన కూడా ఇంఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. గత రెండేళ్ల నుంచి పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని.. ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి అంటూ వీడియోను విడుదల చేశారు.
దర్శిలో టీడీపీ విజయం కోసం నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పని చేశానని.. రాబోయే రోజుల్లో ఇతర నాయకులతో పాటు తాను కూడా నియోజకవర్గంలో టీడీపీ గెలుపునే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. తనకు ఇంతకాలం సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ.. రమేష్ ఇంఛార్జ్ బాధ్యతలకు రాంరాం చెప్పారు. ఈ నేపథ్యంలో.. దర్శి నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్ రావొచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.. దర్శిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు చాలామంది మాత్రం.. మళ్లీ పమిడి రమేష్‌కే బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నారు.
పమిడి రమేష్ పదవిలో ఉన్న సమయంలోనే.. దర్శి మునిసిపల్ ఎలక్షన్‌లో టీడీపీ విజయం సాధించిందని గుర్తు చేస్తున్నారు. ఆయన ఎప్పుడూ పార్టీ కోసం పని చేశారని అంటున్నారు. నియోజకవర్గంలో పార్టీకి తిరుగులేదనుకునే సమయంలో.. ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు. అటు పమిడి రమేష్ కూడా మళ్లీ బాధ్యతలు తీసుకోవడానికి సుముఖంగానే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కానీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తనకే టికెట్ ఇస్తానని చంద్రబాబు హామీఇస్తే.. బాధ్యతలు తీసుకుంటానని పమిడి రమేష్ తన సన్నిహితులతో అన్నట్టు తెలిసింది. బాబు .. రమేష్‌కు హామీ ఇస్తే.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. దర్శిలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.