Homeతెలంగాణతెలంగాణలో మళ్లీ గవర్నర్ వర్సెస్ సీఎం రచ్చ.!!!

తెలంగాణలో మళ్లీ గవర్నర్ వర్సెస్ సీఎం రచ్చ.!!!

వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం ఎంతమాత్రం అభిలషణీయం కాదు. ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. అయితే, తెలంగాణ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం మర్యాద గీతను దాటేసింది. అటు గవర్నర్, ఇటు ప్రభుత్వం కూడా తగ్గేదేలే అన్నట్లుగా పరస్పర విమర్శలతో బహిరంగ రచ్చకు ఎంత మాత్రం వెనుకాడటం లేదు.

ఈ రచ్చ సాగుతుండగానే, రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ విషయంలో కోర్టు తెలంగాణ సర్కార్ కు అక్షింతలు వేసింది. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య అగాధం.. మరో సారి కోర్టు మెట్లు ఎక్కక తప్పని పరిస్థితి అని కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ .. అత్త మీద కోపం దుత్త మీద చూపిన చందంగా కేంద్రంపై ఉన్న ఆగ్రహాన్ని గవర్నర్ వ్యవస్థపై చూపుతున్నట్లుగా పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించినా..

రాష్ట్ర ప్రభుత్వం ఏం రాసి ఇచ్చిందో అదే నా ప్రభుత్వం అంటూ చదవాలి. కానీ కేసీఆర్ ఆ మాత్రం అవకాశం కూడా గవర్నర్ కు ఇవ్వాలని భావించడంలేదు. అదే సమయంలో గవర్నర్ తమిళిసై కూడా తెగితే ఏం జరుగుతుందో చూద్దాం అన్న ధోరణిలో ముందుకు సాగుతున్నారనిపిస్తోంది. ప్రొటోకాల్ ఇవ్వడం లేదని బహిరంగ విమర్శలకు దిగడమే కాకుండా.. ప్రభుత్వ విధానాలను కూడా తూర్పారపడుతున్నారు. అందుకు ఆమె మీడియా సమావేశాలనే ఉపయోగించుకుంటున్నారు.

గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలు కొత్త కాదు కానీ.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తేంతగా ముదిరిపోవడం మాత్రం దేశంలో బహుశా ఇదే తొలిసారేమోనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. వచ్చే నెల 3న బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ ఆమోదం తప్పని సరి.. కానీ ఇప్పటి వరకూ గవర్నర్
నుంచి అటువంటి ఆమోదం లభించలేదు. దీంతో ప్రభుత్వం దిక్కు తోచని స్థితిలో పడింది.

కోర్టు కెక్కి అనుమతి తెచ్చుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వ నిర్ణయం .. సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటివరకు మాటల యుద్ధం సాగగా, ఇప్పుడు కోర్టు బాట పట్టడం చర్చను రేకెత్తిస్తోంది. గత కొంత కాలంగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు తమిళిసై ఆమోదం తెలపకుండా, తిరస్కరించకుండా జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం గవర్నర్ పై విమర్శలకు అదో ఆయుధంగా భావించిందే తప్ప సీరియస్ గా తీసుకోలేదు. అయితే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి గవర్నర్ నుంచి ఆమోదం రాకపోవడాన్ని అలా వదిలేసే పరిస్థితి ప్రభుత్వానికి లేదు.

ఈ నెల 21న గవర్నర్ కు ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఫైల్ ను ప్రభుత్వం పంపింది. కానీ గవర్నర్ ఆమోదించలేదు. వరుసగా రెండోసారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్కు ఎట్లా ఆమోదం తెలపాలని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్ను ఎందుకు నిర్వహించడం లేదని ఆమె నిలదీస్తున్నారు. దీంతో ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. లంచ్ మోషన్ పిటిషన్ వేసి బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపేలా ఆదేశించాలని కోరనుంది.

ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. గత ఏడాది కూడా ఇదే తరహాలో గవర్నర్ స్పీచ్ లేకుండానే ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు పెడితే గవర్నర్ అప్పుడు బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తన ప్రసంగం లేకుండా చేయడాన్ని గవర్నర్ బాహాటంగానే తప్పుపడుతున్నారు. అయితే ఈ పరిస్థితికి తెలంగాణ స్వయంకృతమే కారణమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. ఇన్నాళ్లూ గవర్నర్‌కు కనీస మర్యాద ఇవ్వకుండా, ప్రొటోకాల్‌ పాటించకుండా, కేవలం రాజ్‌భవన్‌కు మాత్రమే పరిమితం చేస్తూ వచ్చింది తెలంగాణ సర్కార్‌.

ఇన్నాళ్లూ కేసీఆర్‌ టైం నడిచింది. ఇక ఇప్పుడు గవర్నర్‌ వంతు వచ్చింది. 2023–24 బడ్జెట్‌కు గవర్నర్‌ ఆమోదం తప్పనసరి. ఆమోదం కోసం పంపించి మూడు రోజులైనా గవర్నర్‌ ఆమోదం తెలుపకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో తెలంగాణ సర్కార్‌లో టెన్షన్‌ మొదలైంది. ఏం జరుగబోతోంది అన్న టెన్షన్‌ సర్కార్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తెలంగాణలో గవర్నర్, ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదం పీక్‌ స్టేజ్‌ కి చేరింది. ఇప్పటికే రాజ్‌ భవన్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలు నిర్వహించడం, ఆ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం, హైకోర్టు ఆదేశాల మేరకు అధికారులు రిపబ్లిక్‌ డే వేడుకలు నిర్వహించడం, గవర్నర్‌ తన ప్రసంగంలోనూ కేసీఆర్‌ టార్గెట్‌గా విమర్శలు చేశారు.

ఫామ్‌ హౌస్‌ కట్టడాలు, బిల్డింగులు కట్టడం అభివృద్ధి కాదంటూ గవర్నర్‌ మాట్లాడారు. తెలంగాణలో రోజుకు 22 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. గవర్నర్‌ ప్రసంగం పై బీఆర్‌ఎస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు.మరోవైపు ఫిబ్రవరి 3న తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజున అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టనున్నారు.అయితే అంతకుముందు గవర్నర్‌ ఆమోదం తప్పనసరి.

అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత కూడా ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. రెండు దశల్లో గవర్నర్‌ ఆమోదం తప్పనిసరి. మొదటి దశ ఆమోదం కోసం మూడు రోజుల క్రితమే బడ్జెట్‌ ప్రతిపాదనలు రాజ్‌ భవన్‌కు ప్రభుత్వం పంపింది. అయితే, ఇప్పటివరకు గవర్నర్‌ ఆమోదం తెలుపలేదు. 2వ తేదీ వరకు గవర్నర్‌ ఆమోదం తెలిపేందుకు సమయం ఉంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్‌ ప్రతిపాదనలకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం తెలపకపోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో న్యాయ పోరాటానికి సర్కార్‌ సిద్ధమైంది.

బడ్జెట్‌కు గవర్నర్‌ ఆమోదం కోసం హైకోర్టు మెట్లు ఎక్కనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ లాయరక దుశ్యంత్‌ దవే వాదనలు వినిపించనున్నారు. బడ్జెట్‌కు గవర్నర్‌ ఆమోదించని ఈ వివాదంపై కోర్టు ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. అయితే దేశ చరిత్రలోనే సీఎం .. గవర్నర్ పై కోర్టుకు ఎక్కిన సంఘటన జరగలేదని, తొలిసారిగా కేసీఆర్ నిర్ణయం పెను సంచలనానికి దారితీస్తోంది. దేశంలో రాజ్యాంగ వ్యవస్థ, శాసన వ్యవస్థ రెండు కూడా జోడు గుర్రాలు.. ఇవి సక్రమంగా పనిచేస్తేనే వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్టు లెక్క.. దేశం అభివృద్ధి పథంలో సాగుతున్నట్టు లెక్క..

అయితే వీటికి అపరిమితమైన అధికారాలు ఉండటంవల్ల ఒక్కోసారి ఆహాలు దెబ్బతింటాయి.. అవే పలు కీలక పరిణామాలకు నాంది పలుకుతాయి.. ఇక గత కొద్దికాలంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య పొసగడం లేదు. వాస్తవానికి టెక్నికల్ గా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి గవర్నరే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధమ వ్యక్తిగా గవర్నర్ కు ప్రత్యేక గుర్తింపు కూడా ఉంటుంది.. ఇలాంటి సందర్భంలో గవర్నర్ ఏం చేయగలరు? గవర్నర్ కు కోపం వస్తే నష్టం ఏమిటి? అడుగడుగునా అవమానిస్తే మాత్రం చేయగలిగేది ఏముంటుంది? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

టెక్నికల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి అధిపతి కాబట్టి, ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కు ఆమోదం తప్పనిసరి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తిపోతోంది.. ఏకంగా హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. అయితే అసలు గవర్నర్ల విధుల్లో హైకోర్టు జోక్యం చేసుకోగలదా? అది తన అధికార పరిధిలోకి వస్తుందా? ఇది కేసీఆర్ ప్రభుత్వ ముఖ్యులకు తెలియదా? ఒకవేళ నిజంగానే హై కోర్టు అలా ఆదేశిస్తే, గవర్నర్ పట్టించుకోకపోతే హై కోర్టు చేయగలిగేది ఏముంది? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Must Read

spot_img