Homeఅంతర్జాతీయంతెలంగాణలో పోస్టర్ రాజకీయాలు ఊపందుకున్నాయా..?

తెలంగాణలో పోస్టర్ రాజకీయాలు ఊపందుకున్నాయా..?

అంబర్‌‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణం ఐదేళ్లైనా ఇంకా పూర్తి కాలేదంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే నగరంలోని ఆ ఫ్లైఓవర్ పిల్లర్లపై ప్రధాని మోడీ పోస్టర్లు వెలువడం కలకలంగా మారాయి. ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎన్ని సంవత్సరాలు కడతారు? అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. 2018, మే 5న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులు ప్రారంభమై.. ఇప్పటికీ ఐదేళ్లు పూర్తయినా 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ ఫ్లైఓవర్ ఇంకా ఎప్పుడు పూర్తి చేస్తారంటూ మోడీని ప్రశ్నిస్తున్నట్లుగా ఈ పోస్టర్లలో వ్యాఖ్యలు ఉన్నాయి. గతంలో ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ హైదరాబాద్‌లో ఆయనకు వ్యతిరేకంగా పలు పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే.

తాజాగా వెలసిన పోస్టర్లను పలువురు బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పంచుకుంటూ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ నేతలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర సర్కారు వ్యవహారం తీరు వల్లే నిర్మాణం ఆలస్యమైందన్నారు. కాగా, అంబర్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మాణంపై మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఐదేళ్లలో తాము 35 ప్రాజెక్టులు పూర్తి చేశామని, కానీ కేంద్ర ప్రభుత్వం రెండు ఫ్లైఓవర్లను కూడా కట్టలేకపోయిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, ఉప్పల్-నారపల్లి మధ్య ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి కాంట్రాక్టరే కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేగాక, పలు చోట్ల జీహెచ్ఎంసీ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని, అది రాకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదని చెబుతున్నాయి.

ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లు ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ దృష్టికి సోషల్ మీడియా వేదికగా తీసుకెళ్లారు. అయితే, ఈ ఫ్లైఓవర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం లేదని.. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోందని.. అందుకే ఆలస్యమవుతోందని కేటీఆర్ జవాబిచ్చారు. ఉప్పల్, అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ల పనులు దురదృష్టవశాత్తూ NHAI ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ భూసేకరణ చేసి ఇచ్చినా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మేం 35 ప్రాజెక్టులు పూర్తిచేశాం. వారు రెండు ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతున్నారు. అదే కేసీఆర్ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి ఉన్న తేడా’ అని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఈ ట్వీట్ ఇప్పుడు బూమరాంగ్ అయిందన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది.

అయితే, కొందరు నెటిజన్లు ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి.. గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు రాసిన లేఖను ఓ నెటిజన్ పోస్టు చేశారు. కిషన్ రెడ్డి అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది అని లేఖను పోస్టు చేశారు. జూన్ 2020లో.. రాసిన ఆ లేఖలో అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ నేషనల్ హైవే 202లో భాగమని, ఈ రోడ్డును త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ కోసం రూ.76 కోట్లను మంజూరు చేసినప్పటికీ.. జీహెచ్ఎంసీ బాధితులకు ఇంతవరకు పరిహారాన్ని అందించకపోవడాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు. బీఆర్ఎస్‌కు ఆత్మీయ మిత్రుడైన, ఒవైసీ సోదరుల నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ కారణంగానే ఈ పనులు ఆలస్యం అవుతున్నాయని మరో నెటిజన్ పోస్టు చేశారు.

ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మరో అబద్ధం ఆడారు. జీహెచ్ఎంసీ వైపునుంచే భూసేకరణ పెండింగ్ లో ఉంది. బీఆర్ఎస్ మిత్రుడైన మజ్లిస్ ఈ ప్రాజెక్టుకు ఆటంకాలు కలిగిస్తోంది. ఈ సమస్యలోని అడ్డంకులు తొలగించాలంటూ కిషన్ రెడ్డి చాలా లేఖలు రాశారు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. మీరు చేసిన తప్పులకు ఇతరులపై నెపం నెట్టొద్దంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఆలస్యానికి కారణం.. విద్యుత్, వాటర్ లైన్లను ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సరైన సమయంలో షిప్ట్ చేయకపోవడం… అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ఆలస్యానికి భూ సేకరణను పూర్తిచేయకపోవడం కారణం. మీరు చేసిన తప్పులకు ఇతరులపై నెపం నెట్టకండి కేటీఆర్ అంటూ ఆ నెటిజన్ వ్యాఖ్యానించారు.

ఉప్పల్‌-నారపల్లి మధ్య కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ళ క్రితం మొదలు పెట్టిన ఫ్లై ఓవర్ పనులు ఇంకా 40 శాతం కూడా పూర్తి కాకపోవడంతో ఆ ప్రాంతంలో రోజూ ప్రయాణించే వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణలో పోస్టర్ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఉప్పల్ లోని మెట్రోపిల్లర్లకు ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు.

కాగా ఈ పోస్టర్లను బీఆర్ఎస్ శ్రేణులే అంటించి ఉంటారని బీజేపీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఇలాగే వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఇక తాజాగా ఏప్రిల్ 8న ప్రధాని హైదరాబాద్ పర్యటనతో మరోసారి పోస్టర్లు వెలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా..సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిర్మించిన కొత్త భవనాలను ప్రారంభించనున్నారు. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ రైలును ఆయన ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో తెలంగాణపై మోదీ వివక్షను ఎండగడుతూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. గతంలో లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ వేళ .. హైదరాబాద్ నగరంలో మోదీ వ్యతిరేక పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ సెటైరికల్ గా పోస్టర్లు రూపొందించారు. ఇందులో అస్సోం, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ లోని నేతల ఫొటోలు ఉంచారు. వాషింగ్ పౌడర్ నిర్మా అంటూ వచ్చే యాడ్ మాదిరిగా… ‘రైడ్’ అనే పేరును ప్రస్తావించారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు దర్యాప్తు సంస్థల రైడ్స్‌ అనంతరం.. కాషాయ రంగు అద్దుకుని బీజేపీలో చేరానని సెటైరికల్‌గా సెట్ చేశారు. ఇందులో కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సొం సీఎం హిమంత బిశ్వశర్మ, ఏపీకి చెందిన సుజనా చౌదరి, బెంగాల్ కు చెందిన నేత సువేంధు అధికారి ఫొటోలు ఇందులో ఉన్నాయి. ఎమ్మెల్సీ కవితకు మాత్రం రైడ్‌కు ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్ లు రూపొందించారు. ఈ పోస్టర్లకు బై బై మోదీ.. అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ పెట్టారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

అయితే వీటిని ఎవరూ ఏర్పాటు చేశారనేది మాత్రం ఇందులో పేర్కొనలేదు. వీటిని బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలే ఏర్పాటు చేశారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ముందు కూడా బైబై మోదీ అంటూ తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఫ్లైఓవర్ నిర్మాణమే టార్గెట్ గా పోస్టర్లు ఏర్పాటు చేయడంతో, మళ్లీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రచ్చ షురూ కానుందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఇరు పార్టీల నేతలు .. పోస్టర్ల రాజకీయంతో తెలంగాణ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నారని విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ రచ్చపై కమలనాథులు ఏం చేస్తారన్నదీ హాట్ టాపిక్ గా మారింది.

Must Read

spot_img