Homeతెలంగాణప్రభుత్వంపై అసంతృప్తి, మరోవైపు ఆ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు..

ప్రభుత్వంపై అసంతృప్తి, మరోవైపు ఆ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు..

ఓ వైపు ప్రభుత్వంపై అసంతృప్తి, మరోవైపు ఆ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు.. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం తనకు టికెట్ ఇవ్వట్లేదంటూ ఊహాగానాలు… అన్నీ కలిసి ఆ జనరల్ సిట్టింగ్ స్థానంలో కొత్త నినాదం వినిపిస్తోందట. ఇంతకీ ఏంటా నినాదం…. ఎక్కడా ఆ అసెంబ్లీ సెగ్మెంట్….

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలయ్యింది. హ్యాట్రిక్ కోసం అధికార బీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తుంటే, ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ పావులు కదుపుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక రెండు సార్లు బీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టినప్పటికీ, ఈసారి బీఆర్ఎస్ గెలుపు అంత ఈజీ కాదన్నది రాజకీయ వర్గాల టాక్. అధికార పార్టీ పై ప్రజల్లో అసంతృప్తి పెరగడం, స్థానిక నేతలపై అవినీతి ఆరోపణలు వస్తుండడంతో అభ్యర్థుల మార్పుతోనే ఓటమి నుండి బయటడగలమని అధిష్టానం భావిస్తోందని ప్రచారం సాగుతోంది. అందుకే సిట్టింగ్ లకే టికెట్లు అని ప్రకటించినప్పటికీ, సర్వే రిపోర్ట్ ల ఆధారంగా కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చనున్నారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది.

ఇక ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ వ్యవహారం పార్టీలో రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వట్లేదంటూ నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. అధికార పార్టీపై ఉన్న అసంతృప్తి కారణంగా రాబోయే ఎన్నికల్లో అన్నిచోట్ల హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి తోడుగా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఉన్న అవినీతి ఆరోపణల కారణంగా ఈసారి జనగామ సీటు గోవిందా అంటూ బీఆర్ఎస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్రాఫ్ రోజు రోజుకు డౌన్ ఫాల్ అవుతుండడంతో, వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ను మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.

గతంలోనూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై అనేక భూకబ్జాలు, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. తాజా పరిణామాలతోపాటు గతంలో వచ్చిన ఆరోపణలను బీఆర్ఎస్‌ పరిగణనలోకి తీసుకుంటోంది. దానికి తగ్గట్లే.. జనగామలో మరో ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని జనగామ నుంచి రంగంలోకి దించాలని గులాబీ పార్టీ భావిస్తోంది. పోచంపల్లిని బరిలో దింపితే.. ముత్తిరెడ్డిపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టినట్టు అవుతుంది. ముత్తిరెడ్డిపై ఉన్న వ్యతిరేకతను కూడా కట్టడి చేయోచ్చని బీఆర్ఎస్‌ పెద్దలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. పోచంపల్లి కూడా జనగామ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్టు టాక్‌ నడుస్తోంది.

జనగామ బీఆర్ఎస్ శ్రేణులు బీసీ నినాదం ఎత్తుకోవడంతో ఇప్పటికే కొంతమంది బీసీ నేతలు నియోజకవర్గంలో తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారట. అందులో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజంలింగం కుమారుడు, నాగపురి కిరణ్ కుమార్, సెవెళ్లి సంపత్ తో పాటు మరికొందరు బీసీ ఉద్యమకారులు సైతం తమ ప్రయత్నాల్లో మునిగిపోయారని తెలుస్తోంది. అందులో తొలి స్థానంలో మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం కుమారుడు, నాగపురి కిరణ్ కుమార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 2009 నుండి రాజకీయాల్లో ఉన్న కిరణ్ కుమార్ 2014 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసారు. 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ లో చేరినప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ లోని బచ్చన్నపేట, నర్మెట, చేర్యాల మండలాల్లోని బీ ఆర్ ఎస్ శ్రేణులతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నాగపురి కిరణ్ కుమార్, ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల్లో ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

బలమైన బీసీ నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం చరిష్మా తనకు పనికి వస్తుందని అభ్యర్థిగా కిరణ్ కుమార్ ను ప్రకటిస్తే గెలుపు కూడా ఈజీ అవుతుందని నియోజకవర్గంలోనీ బీసీ నేతలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా జనగామ అసెంబ్లీ సెగ్మెంట్లో నాగపురి కిరణ్ ఆక్టివ్ గా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక కొమురెల్లి దేవస్థాన చైర్మన్ గా పనిచేసిన యువజన రాష్ట్ర నాయకుడు సెవెళ్లి సంపత్ సైతం ఆశావహుల జాబితాలో ఉన్నారు. జనగామ సెగ్మెంట్ లో కురుమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండడంతో అదే సామజిక వర్గానికి చెందిన సంపత్ కు టికెట్ ఇస్తే కలిసి వస్తుందని మరికొంతమంది నేతలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా జనగామ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పై ఉన్న ఆరోపణలను, అసమ్మతిని దాటి గెలుపు దిశగా వెళ్లాలంటే బీసీ నినాదమే ఏకైక మార్గమని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో జనగామ టిక్కెట్ ఎవరిదన్న వాదన హాట్ టాపిక్ గా మారింది. ఈ టిక్కెట్ ను .. అధిష్టానం పోచంపల్లికే కేటాయించాలని భావిస్తోన్న తరుణంలో .. ఆశావహులు పట్టు బిగిస్తుండడంతో సెగ్మెంట్లో రాజకీయాలు సైతం వేడెక్కుతున్నాయి. దీంతో ఈ సీట్ ఎవరిది .. అన్నదే ఆసక్తికరంగా మారింది.

అవినీతి ఆరోపణలతో డౌన్ ఫాల్ అయిన ఎమ్మెల్యేలను మారుస్తారని ఊహగానాలు వెలవడుతున్న నేపథ్యంలో, అధిష్టానం జనగామ స్థానానికి బీసీ నేత డిమాండ్ ను పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

Must Read

spot_img