Homeతెలంగాణతెలంగాణ అంటేనే నేతల రచ్చ..!

తెలంగాణ అంటేనే నేతల రచ్చ..!

తెలంగాణ కాంగ్రెస్ .. ఈ పేరు వినగానే .. నేతల వ్యాఖ్యల రచ్చనే తెరపైకి వస్తోంది. నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదని ఆర్డర్ వేస్తున్నా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారంతా .. ఎవరి గోల వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారా..మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం.. నేతలకు స్వేచ్ఛ ఎక్కువ అని కాంగ్రెస్ నేతలు ఘనంగా చెప్పుకుంటారు. మిగతా పార్టీలో అది లేదని విమర్శిస్తుంటారు. కానీ పరిమితికి మించిన ఆ స్వేచ్ఛే.. ఇప్పుడు కాంగ్రెస్ పాలిట శాపంగా మారుతోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటోన్న హస్తం పార్టీకి సీనియర్ నేతల కామెంట్స్ ఆటంకాలు సృష్టిస్తున్నాయి.

తాజాగా.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్.. కాంగ్రెస్ లో మరోసారి గందరగోళాన్ని రేపాయి. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి.. మూడు అడుగులు ముందుకి..
ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ప్రజల మనసుల్లో స్థానం ఉన్నా, ఆ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో.. హస్తం పార్టీ వరుసగా వైఫల్యం చెందుతూ వచ్చింది. ఇక ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కంటున్న ఆ పార్టీకి సీనియర్ నేతల మాటలే, అనేక ఆటంకాలు సృష్టిస్తున్నాయి.

మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.. నేతలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చు అని ఆ పార్టీ సారథులు తరచూ చెబుతుంటారు. ఇప్పుడు అదే స్వేచ్ఛ.. రాజకీయ రణ క్షేత్రంలో పార్టీని పలచన చేస్తోంది. పార్టీకి నష్టం చేకూర్చేలా.. నేతలెవరు మాట్లాడినా.. వారు ఎంత స్థాయి వారైనా..
ఉపేక్షించేది లేదని అగ్రనేత రాహుల్ గాంధీ.. వరంగల్ సభ వేదికగా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు గురించి ఎవరు మాట్లాడినా, కేసీఆర్ పార్టీతో అంట కాగినా, వేటు తప్పదన్న వార్నింగ్ జారీ చేశారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ కి ఎలాంటి పొత్తు ఉండదని రాహుల్ స్పష్టం చేశారు.

అయితే… ఆయన మాటల్ని టీ కాంగ్రెస్ సీనియర్లు అంత సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించడం లేదు. తాజాగా సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. రాహుల్ హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నట్లుగానే ఉన్నాయి. తెలంగాణలో హంగ్ ప్రభుత్వం రాబోతుందని జోష్యం చెప్పిన ఆయన .. హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్‌తో కలవాల్సిందేనన్నారు.

రేవంత్ రెడ్డి ఒక్కడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానంటే తామంతా ఇంట్లో కూర్చుంటామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి రాదని… పార్టీలో సీనియర్ నేతలు అంతా కలిస్తే 40 నుంచి 50 సీట్లే వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలు… కలకలం సృష్టిస్తున్నాయి. దీంతో.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కస్సుమంటున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని… ఇలాంటి సమయంలో శ్రేణులు, కార్యకర్తలు, ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా మాట్లాడొద్దని హితవు పలుకుతున్నారు.

కొంత మంది మాత్రం…. బీజేపీ అధిష్టానం గైడెన్స్ లోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని… పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం చేసే చర్యలకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో మరో నాలుగైదు నెలల తర్వాత ఎన్నికల ఫీవర్ తారాస్థాయికి చేరుతుంది. షెడ్యూల్ ప్రకారం అయితే డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే.. సీఎం కేసీఆర్ ముందస్తుకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. అలా జరిగినా, జరగపోయినా.. వచ్చే ఎన్నికల్లో గెలవాలనుకునే పార్టీలు… ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పోరాడాల్సి ఉంటుంది.

పూర్తి స్థాయిలో సన్నద్ధమై.. నేతలంతా ఐక్యంగా కదిలి సాగాల్సిన సమయం ఇప్పటికే ఆసన్నమైంది. ఈ క్రమంలోనే… టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి..
హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పునర్వైభవం కోసం ప్రయత్నిస్తున్నారు. రేవంత్ పాదయాత్రకు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కలిసి వస్తోన్న కొద్ది మంది నేతలతో.. రేవంత్ ముందుకు సాగుతున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు సాగిన యాత్రకు మంచి ఆదరణ దక్కిందని, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అంటున్నారు.

కొద్ది మంది నేతలతోనే ఇంత సాధ్యమైతే… కాంగ్రెస్ ఉద్ధండులంతా ఒక్క తాటిపైకి వచ్చి.. కలిసి సాగితే.. అధికారంలోకి రావాలన్న సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కాంగ్రెస్ కు అంత కష్టమైన పనేమీ కాదని పొలిటికల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ..30, 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేతలు ఉన్న కాంగ్రెస్ లో… ఆ ఐక్యతే లోపిస్తోంది. రేవంత్ కి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పడం ఇష్టం లేక సీనియర్లు అంటీ ముట్టనట్లు ఉంటున్నారన్న వాదన ఉంది. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ కు పీసీసీ పగ్గాలు ఇవ్వడాన్ని కొంత మంది సీనియర్లు తీవ్రంగా తప్పుపడుతున్న విషయం అందరికీ తెలిసిన వాస్తవమే.

మరి.. ఎంతో సీనియర్లు అయిన పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నం
అయ్యాయి కదా ? అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేలా ప్రకటనలు, బహిరంగ వ్యాఖ్యానాలు, అసంతృప్తి మాటలు వ్యక్తం అయ్యాయి కదా ? అనే ప్రశ్నకు ఆయా నేతలు ఏం సమాధానం చెబుతారు ? అన్నది కేడర్ నుంచి వస్తోన్న ప్రశ్న అని విశ్లేషకులు అంటున్నారు. అయినా.. పార్టీకి ఇబ్బంది కలిగేలా మాట్లాడితే ఎవరికి నష్టం ? ఇష్టం వచ్చినట్లు చేసే ప్రకటనలతో.. ప్రజల్లోకి వెళ్లే ప్రతికూల సంకేతాలు పార్టీని నట్టేట ముంచితే.. అందులో పార్టీ నేతలు అందరూ మునగడం ఖాయం.

  • నేతలకు అన్నీ తెలుసు.. కానీ ఎవరి వ్యూహాలకు అనుగుణంగా వారు నడుచుకుంటున్నారు..

మరి ఇంత చిన్న లాజిక్… రాజకీయ ఉద్దండులకి తెలియదా ? అంటే.. నేతలకు అన్నీ తెలుసు.. కానీ ఎవరి వ్యూహాలకు అనుగుణంగా వారు నడుచుకుంటున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఇదిలా ఉంటే, తెలంగాణలో కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ మెదలుపెట్టింది. ఇన్నాళ్లు సీనియర్ల అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్న టీ కాంగ్రెస్ ను చక్కదిద్దాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యరావు థాక్రే రంగంలోకి దిగారు. ఎవరైతే పార్టీలో అసంతృప్తితో ఉన్నారో వారిని బుజ్జగిస్తూ వస్తున్నారు.

గాంధీ భవన్ మెట్లెక్కనని శపథం చేసిన కోమటిరెడ్డితో థాక్రే ప్రత్యేకంగా సమావేశం కావడంతో పట్టు వీడారు. కొన్ని రోజుల కిందట గాంధీ భవన్ కు రావడమే కాకుండా రేవంత్ రెడ్డితో సమావేశం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు జగ్గారెడ్డితోనూ థాక్రే మీటింగ్ అరేంజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే థాక్రే ముందు సరైనని తలుపుతూ ఆ తరువాత రేవంత్ రెడ్డి విషయంలో తీవ్ర విమర్శలు చేయడం కాంగ్రెన్ నేతలకు కామన్ అయిపోయింది.

అందుకు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో రావాలని అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న‘హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమానికి ఫుల్ సపోర్టు ఇస్తోంది. ఈ కార్యక్రమంలో నేతలంతా పాల్గొనాలని ఇప్పటికే సూచించింది.

రేవంత్ రెడ్డి సైతం హాథ్ సే హాథ్ జోడో తో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు తోడుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యరావు థాక్రే సైతం సీరియస్ గా పార్టీ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టారు.

ప్రజల్లో కాంగ్రెస్ కు ఆదరణ ఉందని గట్టిగా ప్రయత్నిస్తే 100 సీట్లు రావడం పెద్ద విషయం కాదని నేతలకు సూచిస్తున్నారు. థాక్రే బుజ్జగింపులకు కొందరు కలిసి వస్తున్నా.. మరికొందరు మాత్రం పెడ చెవిన పెడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇన్ చార్జిగా ఉన్న మాణిక్ ఠాగూర్ చెప్పినప్పుడు ఇలానే అన్నారు.

అయితే ఆయన రేవంత్ రెడ్డికి మాత్రమే మద్దతుగా ఉన్నారని కొందరు నాయకులు ఆరోపించారు. దీంతో ఆయనను మార్చి ఆ ప్లేసులో మాణిక్యరావు థాక్రే ను నియమించారు. దీంతో థాక్రే ఒక్కొక్కరిని ప్రత్యేకంగా కలుస్తూ వస్తున్నారు. పార్టీలో సీనియర్లకు పెద్ పీట వేస్తామని అయితే నాయకులంతా కలిసి పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు. కానీ కొందరు నాయకులు తమ దారి తామే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

Must Read

spot_img