తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారంతో పాదయాత్రల సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరుతో పలు విడతలుగా కొన్ని నెలల నుండి ప్రజల్లోనే ఉంటున్నారు. ఇక త్వరలోనే బస్సు యాత్ర కూడా చేయనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పేరుతో 3000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకోగా బీఆర్ఎస్ కార్యకర్తల దాడి, షర్మిల అరెస్టుతో పాదయాత్ర నిలిచిపోయింది. ఇక సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదంటూనే వరుస జాబ్ నోటిఫికేషన్లు వేస్తున్నారు. నిరుద్యోగుల వ్యతిరేకత ప్రతిపక్షాలకు ఆయుధంగా మారకుండా కేసీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.
ఇక కాంగ్రెస్ కూడా ఎన్నికలే టార్గెట్ గా పాదయాత్రపై ఫోకస్ పెట్టింది. అయితే రేవంత్ పాదయాత్ర కాంగ్రెస్ లో దుమారం రేపింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు AICC పర్మిషన్ ఇవ్వలేదని కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 26 నుండి చేపట్టాలనుకున్న హాత్ సే హాత్ జోడో యాత్రకు హైకమాండ్ అనుమతి ఇవ్వలేదని మహేశ్వర్ రెడ్డి అన్నారు. AICC ఇచ్చిన సర్క్యులర్ లో 2 నెలల పాదయాత్ర ఉందని, కానీ జనవరి 26 నుండి 5 నెలల పాటు పాదయాత్ర అని అన్నారన్నారు. అయితే ఎవరి నియోజకవర్గంలో వారే పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. ఈ పాదయాత్రలో ఒకరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా యాత్ర పేరుతో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఇటీవలముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వేడి చల్లారకుండా.. ఆ యాత్రకు కొనసాగింపుగా కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జ్‌లు ఈ యాత్ర చేపట్టాలని ఏఐసీసీ ఇప్పటికే ఆదేశించింది. ఈ క్రమంలో మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో పాదయాత్ర జరుగుతుందో.. లేదో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్న సీనియర్లు నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. బోయిన్ పల్లి ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ శిక్షణా తరగతులు జరగనున్నాయి. వీటికి హాజరుకావాలని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అసమ్మతి నేతలకు ఫోన్ చేశారు. దీంతో సీనియర్ నేతలు మీటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడే నేరుగా ఫోన్ చేసి అడిగినందున వెళ్లకపోతే బాగుండదన్న అభిప్రాయంతో వారు ఉన్నారు.
వారం రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు ఫోన్‌లో హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ వర్గం నాయకులతో పాటు సీనియర్లతో వరుస భేటీలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే పార్టీలోనే చర్చించుకోవాలని, బహిరంగ విమర్శలు, కామెంట్స్ చేయొద్దని అన్నారు. అయితే రాష్ట్రంలో డిగ్గీ టూర్ తర్వాత కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. డిసెంబర్ లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు కూడా సీనియర్లెవరూ అటెండ్ కాలేదు.
పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించాలి?
దిగ్విజయ్ సింగ్ ఓ నివేదికను పార్టీ హైకమాండ్ కు ఇచ్చారని చెబుతున్నారు. ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటారని సీనియర్లు కూడా ఎదురు చూస్తున్నారు. టీ పీసీసీ అధ్యక్షుడ్ని లేదా .. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిగం ఠాగూర్‌ను తొలగించాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని కూడా అంటున్నారు. అందరూ కలిసి పాదయాత్ర చేయాలని.. ఒక్క రేవంత్ మాత్రమే చేయకూడదని వారి వాదన. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రను ఇప్పటికే ప్రకటించారు. హాత్ సే హాత్ జోడో యాత్రగా దీనికి నామకరణం చేయగా..జనవరి 26 నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. అయితే ఏయే ప్రాంతాల గుండా వెళ్లాలి. ఎక్కడ మీటింగ్ లు జరపాలి. ఎక్కడ ముగింపు సభ ఏర్పాటు చేయాలనే అంశాలపై టీపీసీసీ కసరత్తులు చేస్తుంది. టీపీసీసీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలం నుండి ప్రారంభించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభతో ముగించాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే అసంతృప్త సీనియర్ నేతలు మాత్రం రేవంత్ పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. హత్ సే హత్ జోడోలో బ్లాకుల వారీగా పాదయాత్ర నిర్వహిస్తామని సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అభియాన్ ముగింపులో భాగంగా హైదరాబాద్‌లో జరిగే సభకు రాహుల్ గాంధీ వస్తారని ఆయన తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన సర్క్యూలర్‌లో 2 నెలల పాదయాత్ర అని వుందని.. కానీ జనవరి 26 నుంచి 5 నెలల పాటు పాదయాత్ర అన్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని ఏఐసీసీ వెల్లడించిందని చెబుతున్నారు.
ఏది నిజమో కానీ.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు మరోసారి గందరగోళంలో పడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతున్న విషయం తెలిసిందే. బలంగా ఉన్న పార్టీ కాస్త అంతర్గత విభేదాలు వల్ల దెబ్బతింది. ఇటీవల పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లు పోరు నడిచింది. పార్టీ పదవుల పంపకాల విషయంలో రచ్చ నడిచింది. దీంతో దిగ్విజయ్ సింగ్ వచ్చి పార్టీలోని విభేదాలని తగ్గించడానికి చూశారు. దిగ్విజయ్ వచ్చాక .. కాస్త పార్టీలో పరిస్తితులు సద్దుమణిగాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు.
ఈ పాదయాత్రతో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే దాని బట్టి పాదయాత్రలో మార్పులు ఉండవచ్చు. షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటివరకు రేవంత్ పాదయాత్ర చేయాలని చూస్తున్నారు గాని .. సీనియర్లు ఏదొక రూపంలో అడ్డంకి పెట్టారనే ప్రచారం ఉంది. రాహుల్ పాదయాత్ర తెలంగాణలో జరిగింది. పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది గాని..దాన్ని కాంగ్రెస్ నేతలు యూజ్ చేసుకోలేదు. ఏ అంతర్గత విభేదాలతో ఇంకా నష్టం చేశారు. మరి ఇప్పుడు రేవంత్ పాదయాత్రకు బ్రేక్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలతో కాంగ్రెస్ కు పాదయాత్ర మరింత ఊపిరిని అందిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ అంశంపై రేవంత్ ఏం చేస్తారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వెల్లువెత్తుతోంది.