తెలంగాణ కాంగ్రెస్ వార్ రూంపై పోలీసుల దాడి .. మరో రచ్చకు దారితీస్తోందా..? కాంగ్రెస్ వ్యూహాల కోసమే .. దాడికి పాల్పడిందా..? సైబర్ క్రైం పేరిట ఓ పార్టీపై దాడి .. చర్చనీయాంశంగా మారుతోందా..?

కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు జరిగే వార్ రూమ్ లో పోలీసులు సోదాలు చేయడాన్ని నిరసిస్తూ టిపిసిసి తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన బాట పట్టింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వార్ రూం పైన దాడిని ఖండిస్తూ అన్ని మండల కేంద్రాల్లో నిరసన చేపట్టాల్సిందిగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో కాంగ్రెస్పా ర్టీ చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్టు చేస్తున్నారు. కాంగ్రెస్ వ్యూహకర్త కార్యాలయం పై పోలీసుల దాడి, సీజ్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో కాంగ్రెస్ వ్యవహారాలు జరుగుతాయి, ఇక్కడ పోలీసుల పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తుంటే పోలీసులు ఇలా వ్యవహరించడం దారుణం అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ వ్యవహారాల్లో పోలీసులు తల దూరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నిర్బంధం ఇలాగే కొనసాగితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పై పోలీసుల దాడికి నిరసనగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద నిరసన వ్యక్తం చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసనలు, సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మల్లు రవి, రోహిణ్ రెడ్డి, హరివర్ధన్ రెడ్డి, మల్ రెడ్డి రాంరెడ్డి తదితరులను గృహ నిర్బంధం చేశారు.
ఈ ఘటనపై టీ కాంగ్రెస్ ఇన్చార్జి మణిక్కం ఠాగూర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన ఆయన తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేయడం, 50 కంప్యూటర్లను స్వాధీనం చేసుకోవడం పూర్తిగా హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రొసీజర్ లేకుండా తమ సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు వారెంటే ఇవ్వకుండా 41a crpc నోటీసులు ఇవ్వకుండా పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ అక్రమాలకు మంత్రి కేటీఆర్, సి పి సీవీ ఆనంద్ బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. తాను కూడా ప్రస్తుతం అదే పోస్ట్ చేస్తానని దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలతోనే సతమతమవుతున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయంపై సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేయడం సంచలనం కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేకపోయినా అనవసర సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించినట్లు వాదనలు వినవస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ పై మంగళవారం రాత్రి సైబర్ క్రైం పోలీసులు అకస్మాత్తుగా వెళ్లి సోదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారనే నెపంతో దాడులు నిర్వహించారు. కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు సీజ్ చేశారు. కాంగ్రెస్ వార్ రూం నుంచి ఎలాంటి అసత్య ప్రచారాలు లేకపోయినా సైబర్ క్రైమ్ పోలీసులు దాడులకు పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది. కంప్యూటర్, ల్యాప్ టాప్ లు సీజ్ చేయడంతో కాంగ్రెస్ కు ఇబ్బందులు ఏర్పడనున్నాయి.
అందులో ఉండే సమాచారం పోలీసుల వద్దకు చేరే ప్రమాదం ఉంది. ప్రతి పార్టీ తమ వ్యూహాలను అమలు చేసేందుకు ఏవో మార్గాలు సన్నద్ధం
చేసుకుంటాయి. దీంతో ఇప్పుడు సైబర్ క్రైం పోలీసుల తీరుతో కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి బీఆర్ఎస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపిస్తున్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుకు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దురుద్దేశంతోనే పార్టీ సామగ్రిని తీసుకెళ్లిందని నిరసన తెలుపుతున్నారు.
కాంగ్రెస్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునిల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు దాడి చేయడాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. దీనికి నిరసనగా రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే పోలీస్ కమిషనరేట్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై పోలీసులు దాడి చేసి కంప్యూటర్లు, సమాచారాన్ని ప్రభుత్వం దొంగిలించిందని, కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు ప్రణాళికను దొంగిలించారని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు.
రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్పార్టీ కి ప్రజలు అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ ఏ రకమైన వ్యూహంతో ఉందొ, ఎలాంటి పథకాలు అమలు చేయాలని చూస్తుందో తెలుసుకొని వాటికి కొల్లగొట్టేందుకు ప్రభుత్వం ఒక కుట్ర పూరితంగా వ్యవహరించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ప్రణాళికలకు ప్రత్యామ్నాయంగా వ్యవస్థ రూపొందించేందుకు బిఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఇది ప్రభుత్వం చేసిన సైబర్ క్రైమ్ అని దీనిని ప్రజలు గమనించాలని అన్నారు. దొంగతనం చేసిన ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాల పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
ప్రతిపక్షాల మీద దాడి ద్వారా తమ అధికారాన్ని పదిలం చేసుకోవడానికి రాజకీయ దాడి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం వందలాది మంది పోలీసులతో కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో వార్ రూంలో ఫర్నిచర్ధ్వం సం చేసి, సిబ్బందిపై దాడి చేశారని, షబ్బీర్ అలీ, మల్లు రవి వంటి చాలా మంది నాయకులపై మఫ్టీలో దాడి చేశారని అన్నారు. వచ్చిన ఫిర్యాదు, వారంట్ ఏమీ చూపించకుండా దాడి చేశారని, పోలీసుల ముసుగులో రౌడీలతో దాడులు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన డాటాను మొత్తం చోరీ చేశారని, గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ కార్యకర్తల డాటా అందులో ఉందని అన్నారు. రాష్ట్ర పోలీస్ అధికారులకు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదని, పార్లమెంటు సభ్యుడిగా ఫోన్
చేస్తే కనీసం లిఫ్ట్ చేయరని అన్నారు. రాష్ట్ర పోలీసులు పోలీసులులా లేకపోతే దొంగలా అని ప్రశ్నించారు. పోలీసులు కిరాయి గుండాలు లాగా వ్యవహరిస్తున్నారని, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని అన్నారు. పాదయాత్రలో ఆయన లేవనెత్తుతున్న అంశాలు నచ్చకనే నరేంద్ర మోడీకి , కేసీఆర్ కి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కాంగ్రెస్ స్ట్రాటజీ టీం పై దాడి చేశారంటే.. రాహుల్ గాంధీ పాదయాత్రలో ఏం మాట్లాడాలో ఈ స్ట్రాటజీ టీం చెప్తుందని అన్నారు.
యూజ్ హైదరాబాద్క మిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఈ అంశంపై పార్లమెంట్లో మాట్లాడుతాం.. ఈ అంశాన్ని జాతీయస్థాయిలో చర్చ జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర పోలీసులు ఉల్లంఘించారని, కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో ఇన్వాల్వ్ ఉందని దేశవ్యాప్తంగా అందరికీ తెలుసని అన్నారు.
కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉందని ఒక ఫేస్బుక్ పోస్టు పెట్టామని, ఆ ఫేస్బుక్ పోస్టు వల్ల రాష్ట్ర పోలీసులకు ఏమి ఇబ్బంది కరం అని ఆయన ప్రశ్నించారు. ఈ దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ .. రాష్ట్ర్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఈ దాడుల వెనుక ఉద్దేశ్యమేదైనా.. కాంగ్రెస్ కు మరో ఛాన్స్ లభించిందన్న వాదనలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. వీటిపై వ్యూహాత్మకంగా ప్రచారం చేయగలిగితే, మళ్లీ కాంగ్రెస్ కు జోష్ రావడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు .. ఈ దాడులకు కారణమేంటన్న చర్చ సైతం రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోంది. దీనిపై విస్తృత ప్రచారం చేయగలిగితే, కాంగ్రెస్ పుంజుకునే అవకాశముందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.
మరి కాంగ్రెస్ ఈ దాడులపై ఏం చేయనుందన్నదే చర్చనీయాంశంగా మారింది.