HomePoliticsతెలంగాణ కాంగ్రెస్..నానాటికీ తీసికట్టుగా మారిపోతోంది.

తెలంగాణ కాంగ్రెస్..నానాటికీ తీసికట్టుగా మారిపోతోంది.

దీనికి నేతల తీరే కారణమని కళ్లముందు కనిపిస్తున్నా, అటు నేతలు గానీ, ఇటు అధిష్టానం గానీ పట్టించుకోవడం లేదన్న టాక్ వెల్లువెత్తుతోంది. తాజాగా సూపర్ పీసీసీ అంటూ ఖర్గే చేస్తోన్న సూచన ఏమేరకు పార్టీని గట్టెక్కిస్తుందో వేచి చూడాల్సిందే.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ అధికారం దక్కింది తెలంగాణ రాష్ట్ర సమితికి. రాష్ట్రం ఇచ్చిన సానుభూతిని ఓట్ల రూపంలో మలుచుకోలేని దౌర్భాగ్యం ఇక్కడి కాంగ్రెస్ నేతలది. అందులో ఎవరు పార్టీకి విధేయులో, ఎవరు కెసిఆర్ కోవర్టులో అర్థం కాని పరిస్థితి. పార్టీకి అధ్యక్షుడిని నియమించేందుకు సమయం తీసుకున్న అధిష్టానానికి జరుగుతున్న కుమ్ములాటలను పరిష్కరించేందుకు సమయం దొరకడం లేదు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి ఉద్యమాలు చేస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఒక్క నాయకుడు కూడా గట్టిగా ప్రచారం చేయలేదు.. పైగా తమ పార్టీ ఓట్లను ఎటువంటి భేషజం లేకుండా టిఆర్ఎస్ పార్టీకి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో విజేత గా నిలిచిన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోవడం ఆ పార్టీ నేతల పనితీరుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులైన తర్వాత అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.. పార్టీ లోపేతానికి కృషి చేశారు. కృషి చేస్తూనే ఉన్నారు.. రేవంత్ రెడ్డి కాళ్ళల్లో కట్టెలు పెట్టే నాయకులు ఎంతోమంది. ఇటీవల మధిరలో పాదయాత్ర నిర్వహించిన భట్టి విక్రమార్క అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టలేదు. భట్టి లాంటి నాయకుడే రేవంత్ రెడ్డిని గుర్తించకపోతే, ఇక ప్రజలు ఎలా గుర్తు పెట్టుకుంటారు? నేతల మధ్య సమన్వయం లేదు అనడానికి ఈ చిన్ని ఉదాహరణ మాత్రమే.

హుజురాబాద్ ఎన్నికలకు ముందు టిఆర్ఎస్ పార్టీ దళిత బంధు అనే కార్యక్రమాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న కేసీఆర్… పిల్వగానే భట్టి విక్రమార్క నేరుగా ప్రగతి భవన్ వెళ్ళిపోయారు. ప్రభుత్వాన్ని పొగిడారు. ఇలాంటివారు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తప్పిదాలను ఎలా వివరిస్తారు? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మంచిదే. కానీ అందులో ఉన్న నేతలే పక్కా కమర్షియల్. సొంత లాభం కోసం ఏమైనా చేస్తారు. ఎంతకైనా తెగిస్తారు. అందుకే పార్టీ నానాటికీ భ్రష్టు పట్టి పోతుంది. రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఇలాంటి స్థితిలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎలా ఊహించుకుంటారనేది ఆ పార్టీ నాయకులు మాత్రం గుర్తించడం లేదు. సొంత లాభం కోసం పార్టీని నాశనం చేస్తున్నారని ఇప్పటికే పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.దీంతో కాంగ్రెస్ ను ఎవరూ ఓడించక్కరలేదని, సొంత నేతలే ఓడిస్తారని కేసీఆర్ చేసిన వ్యాఖ్య నిజమేనన్న అభిప్రాయం నేతల తీరు చూస్తేనే, అర్థం అవుతోంది..

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కారణంగా ఏపీలో పార్టీ ఇబ్బందులుపడినా.

తెలంగాణలో మాత్రం తప్పకుండా అధికారంలోకి వస్తుందని అధిష్టానం అంచనా వేసింది. కానీ అంచనాలన్నీ తలక్రిందులై.. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో పార్టీ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోతోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటైన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ప్రొజెక్ట్ చేయడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. 2018లో కాస్తో కూస్తో సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ తర్వాత డిపాజిట్లు కూడా దక్కించుకోలేని దీన స్థితికి దిగజారింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సీనియర్లు కలవలేకపోతున్నారు. ఇప్పటికే కీలక నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించేస్తోంది…

అయినా సరే రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇంకా పాత కాంగ్రెస్ పోకడలతోనే ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంపై జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే దృష్టి పెట్టారు. ఇటీవల పలువురు తెలంగాణ నేతలు ఖర్గేను కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్‌తో కలిసి పార్టీని చిన్నాభిన్నం చేస్తున్నారంటూ రేవంత్‌పై గట్టిగానే ఆరోపణలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే అధిష్టానం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిని మార్చే ఆలోచన చేస్తోంది.

తెలంగాణలో పార్టీ ఎలాగోలా నడుస్తోంది. అదే ఏపీలో అయితే ఊసులోనే లేదు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మల్లిఖార్జున్ ఖర్గే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సరికొత్త వ్యూహం అనుసరిస్తున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల వ్యవహారాలు తెలిసిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని ఖర్గే భావిస్తున్నారు.

సూపర్ పీసీసీని ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని ఒక బాధ్యుడిని నియమిస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పీసీసీ అధ్యక్షులను కొనసాగిస్తూనే.. సూపర్ పీసీసీని ఏర్పాటు చేయాలనేది ఖర్గే వ్యూహంగా చెబుతున్నారు. మరో ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అ తర్వాత ఆరు నెలలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి. అందుకే ఈ సూపర్ పీసీసీ వ్యూహాన్ని తెరపైకి తీసుకొస్తున్నట్లు తెస్తోంది. మరోవైపు రెండు రాష్ట్రాలకు కలిపి ఒకరికే బాధ్యతలు ఇస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయంపై పార్టీలో కూడా చర్చ జరుగుతోంది.

తెలంగాణలో పార్టీ బలంగానే ఉందని.. ఏపీలోనే తిరిగి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని సీనియర్లు అంటున్నారు.

ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీకి వెళ్లిపోయిందని, కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదని చెబుతున్నారు. సూపర్ పీసీసీ ఏర్పాటు వల్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని కొందరు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నా.. ఆ మేరకు కాంగ్రెస్ పుంజుకోవాల్సి ఉన్నా.. ఆ పరిస్థితికనిపించడం లేదు.. సరికదా ఉన్న పట్టును కూడా కోల్పోయి రోజు రోజుకూ మరింత బలహీనమౌతోంది. పార్టీ నాయకులు ఒక్కరొక్కరుగా దూరమౌతున్నారు. ఉన్న వారు కూడా క్రియాశీలంగా వ్యవహరించకుండా ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు అవకాశాలున్నప్పటికీ, పరిస్థితులు కూడా కలిసివచ్చేలా ఉన్నా, నాయకత్వంలో ఐక్యతా లోపం ఆ అవకాశాలను వినియోగించు కోలేక పోవడమే కాకుండా చేజార్చుకుని రోజు రోజుకూ బలహీనమైపోతోంది.

ఇక ఇప్పటి దాకా గట్టి పట్టు ఉందని అంతా భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. గ్రేటర్ నాయకులు ఒక్కరొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారు. అలా దూరం కావడమే కాదు.. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామని చెప్పుకుంటున్న కమలం గూటికి చేరుతున్నారు. అసలు గ్రేటర్ కాంగ్రెస్ అనగానే గుర్తుకు వచ్చేది పిజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి వీరిద్దరికీ అప్పట్లో హైదరాబాద్ బ్రదర్స్ గా విశేష గుర్తింపు ఉండేది. సరే పీజేఆర్ ఇప్పుడు లేరు. కానీ ఉన్న మర్రి శశిధర్ రెడ్డి కూడా నిన్న కాక మొన్న కాంగ్రెస్ ను వీడి కమలం గూటికి చేరిపోయారు. ఇప్పుడు దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డి కూడా తన తండ్రికి స్నేహితుడైన మర్రి శశిథర్ రెడ్డి వెంటే కమలం గూటికి చేరనున్నారా అన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కూడా మర్రిశశిథర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆయన తన దారి చూసుకున్నారు.

అదే విధంగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పగ్గాలు అందుకున్న తరువాత పార్టీలో ముఖ్యంగా గ్రేటర్ పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గిందన్న భావన అందరిలోనూ ఉంది. అన్నిటికీ మించి తన సోదరి విజయారెడ్డిని తన అభీష్ఠానికి వ్యతిరేకంగా, కనీసం తనను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై విష్ణువర్ధన్ రెడ్డి అప్పట్లోనే తన ఆగ్రహాన్ని, వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆయనలో అదే అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలోనే పీజేఆర్ వారసుడిగా ఆయనను తమ గూటికి చేర్చుకునేందుకు కమలం పార్టీ పావులు కదుపుతోందంటున్నారు. మర్రి శశిధర్ రెడ్డి ద్వారానే ఆయనతో సంప్రదింపులు కూడా జరుపుతోందంటున్నారు. ఈ నేపథ్యంలోనే విష్ణువర్ధన్ రెడ్డి కమలం గూటికి చేరనున్నారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. దీంతో అతి త్వరలోనే ఆయన కూడా కాషాయ కండువా కప్పుకుంటారన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

మరి కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Must Read

spot_img