ఆగస్టు 15 వేడుకల్లో ఢిల్లీలో ప్రధాని, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు కాబట్టి ఢిల్లీలో రాష్ట్రపతి, రాష్ట్రాల్లో గవర్నర్లు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆగస్టు 15 లాగే .. జనవరి 26ను కూడా ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తాయి. కానీ తెలంగాణలో మాత్రం ఆగస్టు పదిహేను ఘనంగా నిర్వహిస్తున్నారు. రిపబ్లిక్ డే ను మాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి కారణం గవర్నర్ జెండా ఎగరేసి.. ప్రసంగించాల్సి ఉండటమే.
గత ఏడాది ఈ వ్యవహారం సంచలనం అయితే.. ఈ సారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తమిళిసై గవర్నర్ గా వచ్చిన రెండేళ్లు పబ్లిక్ గార్డెన్స్ లో ఘనంగా రిపబ్లిక్డే నిర్వహించారు. కేసీఆర్ హాజరయ్యారు. కానీ తర్వాత విభేదాలు వచ్చాయి. గత ఏడాది ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రాజ్ భవన్ లోనే గవర్నర్ పతాకావిష్కణ చేశారు. కేసీఆర్ ప్రగతి భవన్‌లోనే జెండా ఎగురవేశారు. ఈ ఏడాది కూడా అంతే. ఈ సారి కూడా రాజ్ భవన్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు.
గణతంత్ర వేడుకలపై ఇప్పటివరకు రాజ్‌భవన్‌కు ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. రాజ్‌భవన్‌లోనే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం జెండా ఆవిష్కరణ, సాయంత్రం ఎట్ హోమ్ నిర్వహిస్తారు. సాధారణంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేళాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. గతేడాది బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత సెప్టెంబర్లో వారం పాటు సమావేశాలు, ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
కాగా ఫిబ్రవరి 3న మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తో ప్రమేయం లేకుండా అసెంబ్లీ జరుగుతోంది. నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. కానీ తమిళిసై గవర్నర్ గా వచ్చిన తర్వాత గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత పెంచుకుంది. వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చు. కానీ, వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం మాత్రం ఎంత మాత్రం అభిలషణీయం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. అయితే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం మర్యాద గీతను దాటేసిందనే అభిప్రాయం ప్రముఖంగా వినిపిస్తోంది.
గత మూడున్నరేళ్లుగా గవర్నర్, కేసీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయి. రోజు రోజుకూ రాజుకుంటూనే ఉన్నాయి. గత మూడున్నరేళ్లుగా ఇరువురూ అనివార్యమైన ఒకటి రెండు సందర్భాల్లోనైనా ముఖాముఖీ భేటీ అయిన దాఖలాలు లేవు. ఈ ఇరువురి మధ్యా విభేదాల ప్రభావం జాతీయ పండుగలపైనా పడుతోంది. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవం ఈసారి రాజ్ భవన్ కు పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సైతం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే అవకాశం కూడా కనిపించడం లేదు.
అదలా ఉంటే, తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న తమిళిసై సౌందర్ రాజన్ మూడేళ్లుగా తను ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వివరించారు. ఎట్ హోంకు వస్తానని చెప్పిన సీఎం రాలేదని ఆమె అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఇలా వివక్ష చూపడం సరైంది కాదని గవర్నర్ హితవు పలికారు. ప్రజలను కలవాలని అనుకున్న ప్రతిసారి తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.
గతంలో మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని తమిళిసై వివరించారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించానని, తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, ఇంకా చాలా విషయాలు ఉన్నా.. కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని మౌనంగా ఉంటున్నట్లు తమిళిసై చెప్పారు. తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోనని.. కానీ రాజ్‌భవన్‌నుగౌరవించాలని
అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ను అవమానిస్తోంది. రిపబ్లిక్ డే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీరే చూస్తారుగా.. అంటూ వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో గవర్నర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆమె చెప్పినట్లుగానే ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రమేయం లేకుండానే ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్ ఉనికిని గుర్తించడానికి కేసీఆర్ సర్కార్ ఏ మాత్రం సిద్ధంగా లేదన్నది తేటతెల్లమౌతోంది.
రిపబ్లిక్ డే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండింటిలోనూ గవర్నర్ ప్రమేయం లేకుండానే ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. దీంతో ప్రభుత్వం గవర్నర్ విషయంలో ఏ మాత్రం మరో అబిప్రాయానికి రావడం లేదని.. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్ ఉనికిని గుర్తించడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదని టాక్ వినిపిస్తోంది. గవర్నర్ తమిళిసై రాజకీయం చేస్తున్నారని.. తెలంగాణ సర్కార్ ఆగ్రహంతో ఉంది.
గవర్నర్ పదవి ఉనికిని గుర్తించడం లేదు. ప్రోటోకాల్ అసలు పాటించడం లేదు.దీనిపై తమిళిసై చాలా సార్లు ఆరోపణలు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. కొన్నిసందర్భాల్లో కేసీఆర్, తమిళిసై కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓసారి హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవంలో.. మరోసారి రాష్ట్రపతికి ఆహ్వానం పలికే కార్యక్రమాల్లో కలసి పాల్గొన్నారు. అయితే కేసీఆర్ చీఫ్ జస్టిస్, రాష్ట్రపతిలకు గౌరవం ఇవ్వాలనే పాల్గొన్నారు కానీ.. గవర్నర్ తో కలిసి పాల్గొనాలని కాదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఎలాంటి పొరపొచ్చాలు రాలేదు. కానీ తమిళిసై గవర్నర్ గా వచ్చిన తర్వాత గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత పెంచుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈసారైనా రాజ్ భవన్ లో జరిగే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా గతేడాదిలాగే ఈసారి ప్రగతిభవన్ లో జరిగే కార్యక్రమాలకే పరిమితం అవుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.2019లో తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై పబ్లిక్ గార్డెన్ లో జరిగిన 2020, 2021 గణతంత్ర
వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కరోనా కారణంగా 2022లో మాత్రం గణతంత్ర వేడుకలు పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించడం లేదని ప్రభుత్వం గవర్నర్ కార్యాలయం రాజ్ భవన్ కు సమాచారం ఇచ్చింది.
అయితే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. అప్పటి నుంచి పెండింగ్ బిల్లులు సహా ఇతర అంశాలపై గవర్నర్ పై కేసీఆర్ అసహనంతో ఉన్నారు. దీనితో అటు గవర్నర్ కు ఇటు కేసీఆర్ కు మధ్య దూరం బాగా పెరిగింది. ఇక ఫిబ్రవరి 3 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండకపోవచ్చని సమాచారం. గతేడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిన విషయం తెలిసిందే.