HomePoliticsటీడీపీ VS వైసీపీ..

టీడీపీ VS వైసీపీ..

  • ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియా .. కీలకంగా మారుతోందా..?
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ లు .. సోషల్ మీడియా వార్ కు తెర లేపుతున్నాయా..?
  • తాజాగా ఈ రెండు పార్టీలు .. ఈ విభాగ బలోపేతంపై దృష్టి సారిస్తున్నాయా..?

రాజకీయాలు రోజురోజుకు రంగులు మార్చుకుంటున్నాయి. జీవనశైలిలో వేగం పెరుగుతున్న కొద్దీ ఏది నిజమైన వార్త, ఏది అబద్ధపు వార్త అని తెలుసుకోవడానికి ప్రజలు కూడా ఆసక్తి చూపడంలేదు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకొని ఫేక్ ప్రచారం చేసే సంస్థలు పుట్టుకొచ్చాయి. ”నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధంప్రపంచాన్ని చుట్టి వస్తుందన్నది” సామెత. సరిగ్గా ఈ సామెతనే నిజం చేస్తున్నాయి నేటి సామాజిక మాధ్యమాలు.

పార్టీలకు అనుబంధ విభాగాలు సోషల్ మీడియాలు రాజకీయ పార్టీలకు అనుబంధ విభాగాలు ఉండటం సహజం. చివరకు సోషల్ మీడియా అంటూ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. వాటిద్వారా ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేయడం, విమర్శలను ఖండించడంతోపాటు తాము చేసే పనులను సమర్థించుకుంటూ పుంఖానుపుంఖాలుగా వార్తలను పోస్ట్ చేస్తారు. ప్రతి పార్టీ ఇదే పద్ధతిని ఫాలో అవుతోంది.

దీంతో ఏది అసలు, ఏది నకిలీ వార్త అనే విషయంలో ప్రజలు కొంత అయోమయానికి గురవుతున్నారు. దీంతో రాజకీయం అంటేనే సోషల్ మీడియా వార్ గా మారిపోయింది. అబద్ధపు ప్రచారాలు, ఖండనలు.. ఒకటేమిటి.. ఏది అసలో? ఏది నకిలీయో తెలియనంతగా ఇవి ప్రజల జీవనంలో ముడిపడిపోతున్నాయి. రాజకీయం నుంచి సోషల్ మీడియాను వేరుచేసి చూడలేని స్థితి.

ఒకరకంగా సోషల్ మీడియానే రాజకీయాన్ని నడిపిస్తోందనుకోవాలి. ఇందులో పైచేయిగా సాధించడానికి ఏపీలోని తెలుగుదేశం, వైసీపీ హోరాహోరీగా పోరు సలుపుతున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిపాలు కావడంలో వైసీపీ సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. ఈసారి అటువంటి పొరపాటు జరగకూడదనే ఉద్దేశంతో చంద్రబాబునాయుడు కూడా తమ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు.

చివరకు ఈ రెండు పార్టీలకు అధికారం దక్కాలన్నా.. చేజారాలన్నా సోషల్ మీడియానే ప్రధాన పాత్ర వహించనుంది. అడ్డా ఏదైనా.. పొలిటికల్ యుద్ధంలో తగ్గేదేలే అంటున్నాయి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పార్టీలు. అధికారం కోసం నువ్వా నేనా సై అంటూ దుమ్మురేపుతున్నాయి. రాజకీయంగా ప్రత్యక్ష రణ క్షేత్రంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతుంటే.. సెకన్ల వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టేసే సోషల్ మీడియా వేదికగా వీడియోల యుద్ధం చేస్తున్నాయి.

తాజాగా సోషల్ మీడియా వేదికగా టీడీపీ-వైసీపీ మధ్య పోరు పీక్స్‌క్ చేరింది. ఒకరిపై ఒకరు సెటైర్లు, విమర్శలు చేసుకుంటూ కామెంట్స్, ఫోటోలు, వీడియోలు పోస్ట్
చేస్తున్నారు రెండు పార్టీలకు చెందిన నేతలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు ఏపీ రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నాయి.

తాజాగా ట్విట్టర్‌లో అధికార వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఓ వీడియో షేర్ చేసింది. అందులో ‘సైకోపోవాలి.. సైకిల్ రావాలి.. ఇదే ప్రజా తీర్పు కావాలి.’ అంటూ పాటను క్రియేట్ చేసి వీడియోను పోస్ట్ చేసింది టీడీపీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా.. వెంటనే రియాక్ట్ అయ్యింది అధికార వైసీపీ. తమ పార్టీకి చెందిన వీడియోను కాపీ కొట్టి ‘కాపీ క్యాట్స్’అంటూ సెటైర్లు వేసింది. ‘చీప్, ఫేక్, కాపీ క్యాట్స్’అని విమర్శిస్తూ ఒరిజినల్ వీడియోను షేర్ చేసింది వైసీపీ. ‘బైబై బాబు.. బైబై బాబు.. బైబై పప్పు.. ఇదే ప్రజా తీర్పు కావాలి’అంటూ పాటతో ఉన్న వీడియోను షేర్ చేసింది వైసీపీ.

ఇలా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు సోషల్ మీడియా వేదికగా యుద్ధం సాగిస్తున్నాయి. జనాలను అట్రాక్ట్ చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర అనే సంగతి తెలిసిందే. మరి ఇంత తెలిసిన రాజకీయ పార్టీలు కొంచెమైనా సందు దొరకనిస్తాయా? ఛాన్సే లేదు. మొత్తానికి ఈ రెండు పార్టీలు తమ తమ స్టైల్లో వీడియోలు ఎడిట్ చేసి పొలిటికల్ వార్ చేస్తున్నాయి.

మరి జనాలు వీటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు? వారి రియాక్షన్స్ ఏంటి అనేది ఎన్నికల ఫలితాలు చెబుతాయి. ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్‌గా మారిపోయాయనేది ప్రతి రోజు మాట్లాడుకునే మాటలు. కానీ వాస్తవంలోకి వెళితే మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఏ ఇద్దరు కలిసిన సరే .. ఇంత చెత్త రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎంతో మంది రాజకీయాలు చేసినప్పటికీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

నిజమే ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. రాజకీయంగా విమర్శలు చేసుకునే స్థాయి నుంచి వ్యక్తిగత విమర్శల స్థాయికి ప్రస్తుత రాజకీయాలు దిగజారి పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు రోజులుగా టీడీపీ, వైసీపీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ప్రతి చిన్న విషయంపై రెండు పార్టీల నేతలు ప్రత్యక్ష ఆరోపణల కంటే కూడా సోషల్ మీడియా ద్వారా మాట్లాడుకోవడమే ఎక్కువైంది.

అయితే రాజకీయ విమర్శలు కాస్తా ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి చేరుకున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో వైసీపీని టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. హూ కిల్డ్ బాబాయ్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. ఇక పార్టీ అధికార పత్రిక, యూ ట్యూబ్ ఛానల్ లో సైతం ఇదే విషయంపై జగన్ ఫోటోలతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనికి గతంలో ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వీడియో క్లిప్పింగ్ లను యాడ్ చేస్తున్నారు.

  • ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడంటూ వైశ్రాయి హోటల్ ఉదంతాన్ని తెరపైకి తీసుకువచ్చారు..

ఇది వైసీపీ నేతలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసింది. దీనిపై ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. కొద్ది రోజులు మాత్రం ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడంటూ వైశ్రాయి హోటల్ ఉదంతాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దీనికి సమాధానం చెప్పు బాబు అంటూ తెగ హల్ చల్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం మరో అడుగు ముందుకు వేశారు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యపై అనుమానాలున్నాయంటూ దాడి మొదలుపెట్టారు.

హూ కిల్డ్ పిన్ని అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య సమయంలో గుండెపోటుతో మొదలైన మాటలు .. గొడ్డలి వేటు వరకు సాగాయి. చివరికి వైసీపీ నేతలు ఇది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయించారంటూ నారా సుర చరిత్ర అంటూ ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు సీబీఐ విచారణలో తేలాల్సి ఉంది. దీనికి కౌంటర్ గా హూ కిల్డ్ బాబాయ్ అంటూ టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇది టీడీపీకి కలిసి రానప్పటికీ, వైసీపీ నేతలు మాత్రం దీనికి సమాధానం చెప్పలేని పరిస్థితి కల్పించింది. అయితే ఇప్పుడు ఉమామహేశ్వరి మృతిని వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. హూ కిల్డ్ పిన్ని అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. భూ తగాదాలు, హెరిటెజ్ సంస్థలో పెట్టుబడుల కారణంగానే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారని .. ఇది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.

తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ సోష‌ల్ మీడియాను బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించింది. ఈ మేర‌కు కొన్ని మార్పులు చేర్పులు చేసిన‌ట్టు తెలిసింది. టీడీపీ సోష‌ల్ మీడియా నూత‌న సార‌థిగా జీవీ రెడ్డి నియ‌మితులైన‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ప్ర‌స్తుతం ఇత‌ను ఆ పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధిగా కొన‌సాగుతున్నారు. జీవీరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వ‌డాన్ని చూస్తే, టీడీపీ రెడ్ల సామాజిక వ‌ర్గాన్ని మ‌రింత ద‌గ్గ‌రికి తీసుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది.

సోష‌ల్ మీడియాలో టీడీపీ మొద‌టి నుంచి బ‌లంగా వుంది. అయితే ప్ర‌త్య‌ర్థులు కూడా బ‌లంగా వున్న నేప‌థ్యంలో కొత్త ర‌క్తాన్ని ఎక్కించేందుకు టీడీపీ స‌న్న‌ద్ధ‌మైంది. మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు త‌న‌యుడు చింత‌కాయ‌ల విజ‌య్‌తో క‌లిసి జీవీ కీలకంగా పని చేయనున్నారు. మరోవైపు వైసీపీ సోష‌ల్ మీడియా సార‌థిగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి త‌న‌యుడు భార్గ‌వ్ నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే.

మరి ఈ సోషల్ మీడియా వార్ .. లో ఎవరు విజయం సాధిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.

Must Read

spot_img