బడ్జెట్ వేళ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ టూర్ లో జగన్ ఏ ఏ అంశాలపై చర్చించనున్నారన్న చర్చ ఏపీవ్యాప్తంగా వెల్లువెత్తుతోంది. సడన్ టూర్ పై టీడీపీ సైతం కామెంట్స్ చేయడం .. మరింత హీట్ ను పెంచింది. ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీంతో.. బడ్జెట్ పై అసెంబ్లీ వేదికగా వాడీ వేడీ చర్చ ఉంటుంది. ఇలా ఒకపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే, ఉన్నఫళంగా జగన్ ఢిల్లీకి వెళ్ళారు. దీంతో ఇంత టైట్ షెడ్యూల్ లో సడన్ గా జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారబ్బా? అంటూ సెటైర్లు మొదలుపెట్టేసింది టీడీపీ.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అమిత్ షాతో కూడా సీఎం జగన్ భేటీ కానున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చర్చలు జరపనున్నారని అంటున్నారు. అయితే సీఎం జగన్ సడన్‌గా ఢిల్లీ టూర్‌కు వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న వైసీపీ
ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో జగన్ పర్యటన రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.
అయితే సీఎం జగన్.. ఢిల్లీ టూర్ వెనక కారణాలు తెలియాల్సి ఉంది. సీఎం జగన్ పర్యటనలో రాజకీయ అంశాలేవీ లేవని చెబుతున్నా… తెరవెనక ఈ చర్చ కూడా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో అటు టీడీపీ, ఇటు జనసేన దేనికవే పోటాపోటీ ప్రచారాలు సాగిస్తూ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలకూ తెరవెనక ఒప్పందం ఉందని వైసీపీ అంటోంది. అటు రాష్ట్ర బీజేపీ.. జనసేనతో కలిసి తమ ప్రయాణం సాగుతుందని చెబుతోంది. వైసీపీ మాత్రం ఒంటరిగానే పోరాడతామంటోంది. ఈ రాజకీయాలపై జగన్ చర్చిస్తారా..చర్చిస్తే మోదీ ఎలా స్పందిస్తారు వంటి అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఈసారి కూడా రాష్ట్ర సమస్యలు, పెండింగ్ బకాయిలపై సీఎం జగన్ ప్రధాని మోదీ, అమిత్ షా కి వినతిపత్రాలు ఇచ్చేందుకు వెళ్తున్నారని అంటున్నారు. ఇప్పుడు కొత్తగా విశాఖ పాలన అనే అంశం జత చేరింది. విశాఖనుంచి పాలన మొదలు పెడతామనే విషయాన్ని జగన్, మోదీకి వివరిస్తారని అంటున్నారు. సడన్ గా ప్రోగ్రామ్ ఫిక్స్ కావడం మాత్రం ఏపీ రాజకీయా వర్గాల్లో చర్చకు తావిచ్చింది. వినతి పత్రాలు ఇచ్చేందుకే అయితే ఢిల్లీలో వైసీపీ ఎంపీలు చాలామందే ఉన్నారు. పోనీ ప్రతిసారీ ఏపీనుంచి వస్తున్న వినతులని క్రమం తప్పకుండా కేంద్రం కనికరిస్తుందా అంటే అదీ లేదు. ప్రభుత్వాలు మారినా ఏపీ విషయంలో, విభజన చట్టంలోని హామీల విషయంలో కేంద్రం మొండి వైఖరితోనే ఉంది.
- జగన్ ఢిల్లీ టూర్ ఖరారైందో లేదో అప్పుడే టీడీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి..
దీంతో జగన్ ఢిల్లీ టూర్ ఖరారైందో లేదో అప్పుడే టీడీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ నేతలపై సీబీఐ విచారణ జరుపుతోంది. జగన్ పర్యటనకు, ఈ కేసు విచారణకు లింకు పెడుతూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. అటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకుని లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ఏపీలో పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా జగన్ అకస్మాత్తుగా ఢిల్లీకి బయల్దేరి వెళ్లడం మీద సర్వత్రా చర్చ సాగుతోంది. ఎందుకు హస్తినకు ఇలా అనూహ్యంగా సీఎం పయనం అని అంతా ఆలోచిస్తున్నారు.
అయితే హస్తిన గడ్డ మీద తేల్చుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయని అంటున్న వారు ఉన్నారు. జగన్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు అని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన అనేక కీలక విషయాలను చర్చిస్తారు అని అంటున్నారు. ఈ సమావేశాలలోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడదామని అనుకున్నారు. కానీ సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో ఉండడం వల్ల వీలుపడలేదు. ఇక ఈ కేసు విచారణ సాగి తుది తీర్పు ఎపుడు వస్తుందో తెలియదు. దాంతో ఈ ఉగాదికి జగన్ విశాఖకు షిఫ్ట్ కావాలనుకున్నా కూడా అది వీలుపడడంలేదు. కొత్త గవర్నర్ నజీర్ వచ్చి ఉన్నారు.
ఆయన మనసు మూడు రాజధానుల మీద ఎలా ఉందో తెలియదు. దాంతో గవర్నర్ ప్రసంగంలో సైతం మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావించలేదు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జూలైకి విశాఖకు రాజధాని షిఫ్టింగ్ వాయిదా పడింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ క్యాబినేట్ మీటింగులో మంత్రులకు స్పష్టత ఇచ్చారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే అసలు మూడు రాజధానుల మీద కేంద్రం వైఖరి ఎలా ఉందో ఎవరికీ తెలియడం లేదు. అమరావతి రాజధాని మీద హై కోర్టులో విచారణ జరిగినపుడు రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రాల ఇష్టమని అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం అదే సుప్రీం కోర్టులో ఇదే కేసు విచారణ దశలో ఉండగా విభజన చట్టం ప్రకారం అమారవతినే రాజధానిగా గుర్తించినట్లుగా పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసిందని అంటున్నారు.
అంటే కేంద్రం వైఖరిలో దీని మీద మార్పు వచ్చిందా అన్న డౌట్లు అందరికీ వచ్చాయి. ఇంకో వైపు చూస్తే మూడు రాజధానుల మీదనే వచ్చే ఎన్నికల్లో తేల్చుకోవాలని వైసీపీ పట్టుబట్టి ఉంది. అదే విధంగా చూస్తే విశాఖను రాజధాని చేయడం ద్వారా ఏపీలోని విపక్షాల మీద తనదే పై చేయి అనిపించుకోవాలని వైసీపీ చూస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్రం మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే జగన్ అర్జంటుగా ఢిల్లీ టూర్ పెట్టుకున్నారని అంటున్నారు. ఈ విషయంలో కనుక ఒక సానుకూల అభిప్రాయం వస్తే ఏపీ అసెంబ్లీలోనే విశాఖ రాజధానిగా తాము ప్రతిపాదిస్తున్నామని జగన్ ఈ బడ్జెట్ సెషన్ లోనే చెబుతారని కీలకమైన ప్రకటన చేస్తారని అంటున్నారు. మరో వైపు చూస్తే మార్చి అంతానికి పాత ఆర్ధిక సంవత్సరం ముగుస్తోంది.
కొత్త ఆర్ధిక సంవత్సరం ముందున నిలుచుని ఉన్నా ఏపీ అన్ని రకాలైన అప్పులతో సతమతం అవుతోంది. ఏపీకి అప్పులు ఇచ్చే సీన్ కనిపించడంలేదు. దాంతో కేంద్రం మనోగతాన్ని ఈ విషయంలో కూడా తెలుసుకుంటారని అంటున్నారు. అలాగే కేంద్రం వద్ద పెండింగులో ఉన్న నిధులు రావాల్సిన నిధుల గురించి కూడా చర్చించి ఎంతో కొంత తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. ఇక చివరాఖరుగా మరో కీలక మైన విషయంలో కేంద్రం నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కోసం జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. అదేంటి అంటే ముందస్తు ఎన్నికలు. ఏపీలో ఈసారి బడ్జెట్ సెషన్ తోనే అసెంబ్లీని ముగించి ఆ మీదట మంచి ముహూర్తం చూసుకుని రద్దు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందని చాలా కాలంగా వినిపిస్తోంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మేలో జరగనున్నాయి. ఆనాటికి ఏపీలో కూడా ఎన్నికలు పెట్టుకుంటే మరోసారి వైసీపీకి విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఏపీలో పవన్ ఇంకా వారాహి రధమెక్కలేదు. పొత్తుల సంగతి కూడా ఎంటూ తేలలేదు. ఈ గందరగోళం మధ్య ఎన్నికలకు వెళ్తే పూర్తి ప్రయోజనం ఉంటుందని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా తెలంగాణా ఎన్నికలు జరిగి వాటి ఫలితాలు వస్తే ఆ ప్రభావం ఏపీ మీద పడవచ్చునని, అలాగే బీయారెస్ కి ఏపీ దోవ చూపించినట్లుగా ఉంటుందన్న చర్చ ఉంది.
అందుకే ఎవరికీ అవకాశం ఇవ్వకుండా నాలుగేళ్ళకే ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తే ఎన్నికలు ముందస్తుంగా పెట్టి తామే మరోసారి అధికారంలోకి రావాలని జగన్ కి ఉందని అంటున్నారు. ఒక వైపు ఆర్ధిక ఇబ్బందులు రెండవ వైపు సీబీఐ కేసులు ఇలా అన్ని వైపుల నుంచి సమస్యలు ఉన్న నేపధ్యంలో ముందస్తు దానికి సరైన జవాబు అని భావిస్తున్నారు అని అంటున్నారు. దీనికి కేంద్ర పెద్దలు ఓకే అంటే మాత్రం జగన్ ఢిల్లీ టూర్ సక్సెస్ అయినట్లే అంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
- మరి జగన్ టూర్ కథేంటో తేలాలంటే, వేచి చూడాల్సిందే..